క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
8. సమర్పణ ప్రార్ధనా ప్రసంగము
(ఇది సమర్పణ ప్రసంగము చేయునప్పుడు ఉపయోగముగా నుండును).
సమర్పణ:- శరీరము, ఆత్మ, జీవమును ఇంకను మనకు కలిగియున్నది సమర్పించవలయును. ప్రార్థనమెట్లు:- సేవ, పరిచర్య, సమర్పణ చేయవలెను.
- 1) సమర్పణ అనగా నాకు కలిగియున్న యావత్తు నీ స్వాధీనము చేస్తున్నాను.
- 2) నాకు కలిగియున్నది నా ఇష్టమునుబట్టి వాడుకొనను. నీ ఇష్టమునుబట్టి వాడుకొందును.
- 3) నేను ఈ ప్రకారము చేసేటప్పుడు నాకు ఆటంకములు వచ్చును. ఆటంకములు, ఆపదలు వచ్చినా నీ చిత్త ప్రకారము చేస్తాను.
- (1) ఆపదను బట్టి బాటసారి మంచి సమరయుడు చేసినదానంతటిని సమ్మతించును. గాయముకట్టనిచ్చెను. వాహనముమీద ఎక్కించునప్పుడు ఊరుకొనెను. పూటకూళ్ళవాని కప్పగించినప్పుడు ఊరుకొనెను. అదంతా చేయనిచ్చెను. ఆ విధముగానే మన విషయమై ప్రభువు ఏమి చేసినా ఊరుకొన్న యెడల ఆయన ఎంత ఉపకారమైన చేయును.
- (2) వారు నీ మాట వినరు. అయినప్పటికిని నీవు వెళ్ళి చెప్పవలెను అని దేవుడు యెహెజ్కేలుతో పలికెను. యెహెజ్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినాడు గనుక ఎదురు మాట చెప్పలేదు. వెళ్ళి వారికి బోధించినాడు. వినేవారలారా! మిమ్మును దేవుడు అటువంటి సువార్త అక్కరలేని స్థలమునకు పంపిస్తే వెళ్ళుదురా?
- (3) మీ సహోదరుని మీద నీకెప్పుడైన కష్టముంటే సమాధానపడు, అప్పుడు నీ దేవుని బలి పీఠమునొద్దకు రమ్ము అని ప్రభువు ఉపన్యాసములో సెలవిచ్చెను. ఇది కష్టమైన పని. చందావేయుట సుళువైన పనేగాని సమాధానపడుట సుళువైనపనియా? దేవుని వాక్యమిచ్చే సలహాకు సమర్పణ అయినవారు దేవుని వాక్యములో ఉన్నట్లు చెప్తారు. వారాలాగు చేయగలరా?
- (4) గార్థభమును పేతురు, యోహానులు విప్పి తీసికొనివచ్చిరి. ప్రభువు చెప్పిన పని చేసినారు. "మీరు ఫలాని చోటికి వెళ్ళి పలానా పని చేసిరండి" అని ప్రభువు మీతో తన వాక్యము ద్వారా చెప్పిన యెడల మీరు చేస్తారా?
- (5) ఆయన కోరినట్లు వారు చేసిరి. ప్రభువు యొక్క కోరికకు సమర్పణ అయినవారు తప్పక చేస్తారు.
- (6) 5వేల మందికి ఆహారము పెట్టకముందు శిష్యులు ప్రజలను బారులు తీరి కూర్చుండబెట్టవలసిందని ప్రభువు చెప్పెను. ఆ ప్రకారమే వారు చేసిరి. ఇందరకు సరిపోయే రొట్టెలు లేవు గనుక వచ్చిన తరువాత కూర్చుండబెట్టకూడదా? అని వారు ఎదురు చెప్పలేదు. చెప్పినట్లు చేసారు. అలాగే మీరును చేయగలరా?
- (7) ఒక స్త్రీ తనకున్నది యావత్తు చందా వేసెను. ఇది యూదుల నిబంధనలోని ప్రధమభాగము కంటే ఎక్కువ. అంతా వేయుమని ప్రభువు చెప్పకపోయినను వేసినది. ప్రభువు చెప్పకపోయినను మీ మనస్సాక్షికి తోచిన ఒక మంచి కార్యము మీరు చేయగలరా? చెప్పినదే చేయలేక పోవుచున్నాము. చెప్పనిది ఏ మాత్రము చేయగలమా?
- (8) పేతురు నీటిమీద నడువవలసిందని యేసుప్రభువు చెప్పెను. మునిగిపోవుదుననే భయము లేక పోయెను. ప్రభువు ఇచ్చిన సెలవు ప్రకారము చేయ ప్రయత్నించెను. తాను ప్రభువుయొక్క సమర్పణకు సమర్పణ ఆయెను. అందుచేత కొంతదూరమైన నడువగలిగెను. అసాధ్యమైన పనిని ప్రభువు చెప్పితే చేయ ప్రయత్నించెను. గాని భీతివలన పడిపోయెను. రక్షింపబడినందువలన మరలా ప్రయత్నించెను. ప్రభువు మనకు అసాధ్యమైన పని చెప్పినప్పుడు మనము చేయగలమా?
- (9) ప్రభువు ఒకనిని చూచి నన్ను వెంబడించుమని చెప్పెను. అతని దృష్టి తండ్రి సమాధి చేయుట మీదనున్నది. మన ఇష్టము ఒక అంశముమీద ఉన్నప్పుడును, ప్రభువుమీద నున్నప్పుడును, ప్రభువు వద్దని చెప్పితే ఆ అంశమును మానివేయగలమా?
- (10) ప్రభువు సువార్త పనిమీద 70మందిని పంపెను. ఇది సువార్తలలో ఎందుకు వ్రాయబడెను? మన బోధ నిమిత్తమే గదా! ప్రభువు మనలను పిలిచి, సువార్తకు వెళ్ళండని చెప్పారు. ఒక్కసారే చెప్పివేసెను.
- (11) యెప్తా న్యాయాధిపతి యుద్ధమునకు వెళ్ళి జయము పొంది తిరిగి వచ్చుచుండెను. అప్పుడు తన ఏకైక పుత్రికయగు కన్యక ఎదురు పడెను. అందుచేత తన మొక్కుబడి ప్రకారము ఆమెను దేవునికి సమర్పణ చేయవలసి వచ్చినను సమర్పించి వేసెను. (కుమార్తెకూడా సమ్మతించెను). మీలో ఎవరి బిడ్డనైన దేవుని సేవకు ప్రత్యేకించి సమర్పణ చేయగలరా?
- (12) అబ్రాహాము దైవభయము గలవాడై తన ఏక పుత్రుని తన చేతులతో బలి చేయ నిశ్చయించుకొనెను. ఇది తల్లిదండ్రులైనవారు గ్రహించలేని గొప్ప సమస్య. ఇస్సాకుకూడా సమ్మతించుట ఆశ్చర్యమే.
- (13) యేసుప్రభువు ఒక మాట చెప్పెను. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. ప్రియులారా! దేవుని చిత్తము నెరవేర్చుట మనకు కూడా అన్నము తిన్నట్లుగానే ఉండునా?