గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ఆనంద దేశము
యెరూషలేము
“అది (ఆనందదేశము) దక్షిణముగాను, తూర్పుగాను, ఆనందదేశపు దిక్కుగాను, అత్యధికముగా బలిసెను.” దానియేలు 8:9.
యెరూషలేము సర్వభూమికి ఆనందదేశము. కీర్తన. 48:2 వారు “రమ్యమైన” దేశమును నిరాకరించిరి. కీర్తన. 106:24
నిత్యానంద దేశమునకు ప్రయాణము చేయగోరు విశ్వాసులకు దేవవాక్యము ననుసరించి చెప్పవలసిన పాఠము మోక్షానంద దేశమునకు వెళ్ళవలెనను కోరికగల వారికి చెప్పవలసిన ఉపదేశము: ఆనందదేశము ఎక్కడ నున్నది? ఎందుకు దానికాపేరు కలిగెను? వేటినిబట్టి మనము తీర్మానము చేసికొనవచ్చును? దానియేలు బబులోను దేశమున ఖైదుగానున్నప్పుడు కఠినమైన దర్శనము కలిగెను. అది రెండవ మనిషి విప్పలేడు. దాని వివరము చెప్పుటకు దానియేలే రావలెను. (దాని. 8:9). దర్శనములో చివర ఒక మేకపోతు కొమ్ములలోనుండి చిన్నకొమ్ములేచి “ఆనందదేశపు” తట్టు వ్యాపించినట్లు గలదు అప్పటికి ఆనంద దేశమనగా అర్ధముకాదు. బైబిలు పండితులు ఆలోచింపగా అన్నిదేశములు ప్రపంచ పటములోనున్నవి గాని ఆనందదేశము ఎక్కడనులేదు అనుకొనిరి. గనుక బైబిలులోనున్న (యెరూషలేము అను) ఆనందదేశమునుబట్టి పరిశీలన చేసిరి. ఒకప్పుడు విదేశీ వర్తకులకుకూడ తెలియదు “ఇండియా” దేశమున్నట్లు, అదేవిధంగా ఆనందదేశము కూడ ఉన్నదని గుర్తించి, జ్ఞాపకముంచుకొనవలెను.
కీర్తన. 106:24లో రమ్యమైన దేశమని గలదు. రెండు ఒకటే. ఇంకా చాలపేర్లు దీనికి గలవు. ఆ దేశమునందు ఒక పట్టణమున్నది అందు పర్వతమున్నది. ఈ పట్టణమును పరిశీలించి మీరు మా తరమువారికి చెప్పవలెనని కీర్తన 48:12లో గలదు. అందుచేత బోధకులు ఈ దేశమునుగూర్చి చెప్పుట అవసరమే ఈ ఆనంద దేశమునకు అనేకపేర్లు గలవు.
- (1) రమ్యమైన దేశము
- (2) వాగ్ధానదేశము
- (3) పాలెస్తీనా
- (4) పాలుతేనెలు ప్రవహించు దేశము
- (5) పరిశుద్ధభూమి
- (6) రక్షకుని జన్మభూమి
- (7) ఇశ్రాయేలీయుల దేశము మొదలగునవి దీనికి మారుపేర్లు.
ఆనందదేశము:- ఈ దేశమునకు తూర్పున యోర్దాను నది కలదు. మధ్యన యెరూషలేమున్నది. అది దేవుని పరిశుద్ధ పట్టణము. అందు ప్రసిద్ధి కెక్కిన దేవాలయమున్నది. ఇది సర్వభూమికి ఆనందకరమైయున్నది (కీర్తన 48:2). పట్టణము, పర్వతము, దేవాలయము - ఇవన్ని ఆనందకరమైనవి. దేవుడు సర్వభూమికి దీనిని ఆనందకరముగా నియమించెను. క్రైస్తవులకు మాత్రమేకాదు సమస్తమైన వారికి ఆనందకరమైనది. క్రీస్తుప్రభువు “సర్వలోకమునకు, సర్వసృష్టికి భూదిగంతముల వరకు సువార్త ప్రకటించుడి" అనెను. సర్వ దేశములవారు దీనినిగూర్చి నేర్చుకొనవలెను. ప్రభువు ఇచ్చట పుట్టి, పెరిగి, సంచరించి, అలసట తీర్చుకొని, అద్భుతములుచేసి, సిలువ మరణముపొంది తిరిగిలేచెను గనుక ఇది ఆనందదేశము. దేవుడు తన ప్రజలనుచూచి ఈ దేశమును మీకు ఇస్తానని చెప్పెను. అందుచేత వాగ్ధాన దేశమని పేరు. ఇది దేవుని నోటనుండి బయలుదేరిన మాట
- (1) మీకు
- (2) ఇస్తాను అనెను.
భక్తులు అదే పట్టుకొనిరి. ఆ దేశము దేవుడు వారికి ఇచ్చునని నిరీక్షించిరి. "ఇస్తానన్నాడు" గనుక ఆశ అది మా దేశమే అని సంతోషించేవారు ఆ సంతోషము వారి హృదయములలో నుండెను. గనుక ఆనంద దేశమనే పేరు దానికి సరియైనదే. దేవుడు అబ్రాహాము కాలమందు (ఆది. 15:21)లో అబ్రాహామునకు వాగ్దానము చేసెను. “ఇచ్చెదను” అని ఉండవలెను గాని “ఇచ్చియున్నాను” అని దేవుడు చెప్పెను. ద్వితియోపదేశ కాండములో కూడ దానిని స్వాధీనపరచుకొనండి ఎందుకనగా దానిని మీకిచ్చియున్నానని చెప్పెను. మన భాష ఇస్తానని, గాని, దేవునిభాష “ఇచ్చియున్నాను” అనునది ఇస్తానంటేనే ఆనందము ఇచ్చినాను అన్న మరీ ఆనందము. గనుక “ఆనంద దేశమను” పేరు తగినదే.
- 1. పాలస్తీనా దేశము:- మీరు ఆ దేశమును ఆక్రమించుకొనవలెనని దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పెను. అప్పటికి దేవుని నెరుగని విగ్రహారాధికులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నా (దేవుని) జనులకు కావలెను గనుక వారిని వెళ్ళగొట్టవలెను. ఆ దేశము ఖాళీచేసి మీరు ఆక్రమించుడి అని చెప్పుట వారికి ఆనందకరమైన వృత్తాంతము. గనుక అది ఆనందదేశమే.
-
2. పాలుతేనెలు ప్రవహించు దేశము:- ఆ దేశము సమృద్ధిగల దేశము
- (1) పాలు ప్రవహించు దేశము
- (2) తేనె ప్రవహించు దేశము.
గనుక సమృద్ధి. పాలు ప్రవహించుట ఎప్పుడు చూడక పోవచ్చును. తేనె ప్రవహించుట కొద్దిగా చూడగలము ఆ దేశములో పశువులు, గడ్డి, వర్షము, జలము ఎక్కువ గనుక పాడి ఎక్కువ గనుక ప్రవహించుట లెక్కగట్టిరి. ఎక్కడచూచిన తేనె గలదు. ప్రయాణీకులు తినవచ్చును. దేవుడు వాటితో ఆ దేశమును నింపెను. గనుక ఆనంద దేశము మరియు ఈ దేశములో లోహములున్నవి. గనుక 1914 సం॥ము యుద్ధము దీనికికూడ సంబంధించియున్నది. ఈ దేశము అందుగల మృత సముద్రము బాగగునని ప్రవచనము గలదు. అది బాగుపడుటకు వినియోగించు ఖనిజములు అనేకములుండుటవలన చాల ఉపయోగకరముగా నున్నది. గనుక ఇది ఆనందదేశము.
- 3. పరిశుద్ధభూమి: - ఇవన్నియు శరీర జీవనమునకు మేళ్ళు మరియు ఆత్మీయ జీవితమునకు మేళ్ళు గలవు గనుక అది ఆనందదేశము, ఇవి శరీర జీవితమునకు మేళ్ళు. ఇది ఒక వరుస. మరియొక వరుస ఆత్మీయ మేళ్ళు ఏమితిందుమో అని చింతింపవద్దు అని ప్రభువు చెప్పినమాట గలదు. పాతనిబంధనలో తండ్రి శరీర సదుపాయములు చేసెను. ప్రభువుకూడ అదే కొండ ప్రసంగములో చెప్పెను. దేవుని రాజ్యము వెదకిన అన్నీ దొరుకునని చెప్పెను. ఇన్ని అనుభవించుచు ఆయనను స్తుతించవలెనని కోరెను. విందు అయిన తర్వాత ఇంకా ఏమైన ఉండునని ఆశించినట్లు, ఆత్మీయ మేళ్ళుకూడ ఇచ్చెదనని ఇశ్రాయేలీయులను ఆశపెట్టెను.