గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

కృపాకాలము



వాక్యము:- “కృపమీకు తోడైయుండునుగాక” - కొలస్స. 4:18.


మనము ఇప్పుడు కృపాకాలములో జీవించుచున్నాము. ప్రకటన గ్రంథములో కృపాకాలముయొక్క ముగింపును గురించి వ్రాయబడి యున్నది. లోకము, సంఘము ఇంకను ఈ కాలము అనుభవించుచున్నది. మానవులు బలహీనులని చెప్పి దేవుడు కృపా కాలమును చాల దీర్ఘ కాలముగ చేసియున్నాడు. అందుచేతనే మానవుడు ఈ కాలమును నిర్లక్ష్యము చేయుచున్నాడు. కృపాకాలము మారుమనస్సు పొందుటకు అనుగ్రహింపబడిన కాలము. కాబట్టి సంతోష కాలమైయున్నది. అయినప్పటికిని కృపాకాలములో శిక్షకూడ మిళితమైయున్నదని కనబడుచున్నది. అట్టి శిక్షకూడ కృపయొక్క లెక్కలో చేర్చవలసినదే. గనుక కృపకాలమునువలె, శిక్ష కాలమును కూడ గౌరవము చేయవలెను. లోకమును కలుగజేయకముందు కాలమనునది లేదు. అది అనాదియైయుండెను. దేవుడు లోకమును కలుగజేసినప్పుడు వెలుగు, చెట్టు, జీవరాసులను, మనిషిని వీరితో పాటు కాలమును కూడ కలుగజేసెను. ఒకరు చెప్పినట్లు కాలమనునది నిత్యత్వములోని ఒక రేణువైయున్నది. అట్టి నిత్యత్వములో ప్రవేశించుటకు ముందు, కృపా కాలమును అనుభవించవలెను, లేని యెడల నిత్యజీవము దొరకదు. భూలోక జీవితకాలమును దేవుడు మనకు నియమించుటలో ఆయన యొక్క అపరిమితమైన ప్రేమ కనబడుచున్నది. ఈలోక జీవనము అనవసరమనియు, సంసారమే సాగరమనియు, ఈలోక జీవితమువల్ల పాపాల పాలు కావడము మాత్రమే కాక మరేమియులేదని అనునట్టివారు దేవుని కృపను గ్రహించలేదని మనము తెలిసికొనవలెను.


సృష్టియొక్క మొదటి దినము మొదలు లోకాంతముయొక్క చివరి దినము వరకు ఎన్ని పాపములతో, ఎన్ని శ్రమలతో నిండియున్నను అది కృపకాలము కాకపోదు, ఉపయోగమైన కాలము కాకపోదు. ఒక గొప్ప నదిలో ఒక చీమ పడినంత మాత్రమున ఆ నీరు త్రాగమని ఎవరందురు. ఆలాగే దేవుడు మన నిమిత్తమై దాచి ఉంచిన జీవామృతధారల యెదుట మన కష్టములన్నియు కలిపి చీమంత ఉండును. కృప కాలమును, అందలి శిక్ష కాలమును తృణీకరించువారు కృపకాలమును విడిచిపెట్టువారగుదురు. కృపకాలము లోనికి నడిపించునట్టి శిక్ష కాలమును విడిచిపెట్టుచు నిత్యనాశన కాలములో పడిపోవుదురు. మరియు కృపకాలమును, శిక్ష కాలమును సమానముగా భావించువారు నిత్యజీవకాలమున ప్రవేశింతురు. అప్పుడు శిక్ష కాలముయొక్క ఉపయోగమును తెలిసికొందురు. ఎంత గొప్ప పాపియైనను, ఎంత మారుమనసు లేనివాడైనను, తెలిసియు ఎన్నోమార్లు పాపము చేయువాడైనను, దేవునిని ఏ మాత్రమును నామకార్థముగా నమ్మనివాడైనను, నాకు కృపలేదు అనుటకు వీలులేదు. అతడు సంవత్సరములు లేవు నెలలు లేవు, గంటలు, నిమిషములు లేవు అని అనగలడా? అనలేడు గనుక కృపకూడ లేదని అనలేడు. ఎందుకనగా ఇవన్నియు కృప కాలములై యున్నవి. గనుక ప్రతి నిమిషము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినదే. మనకు శక్తి ఉన్నయెడల అట్లు స్తుతించుట గొప్ప బలమైయుండును.


దేవుని లక్షణములలో ఏది గొప్పదని కొందరు అడుగుచున్నారు. అన్నియు సమానమే. కృపగొప్పదే, శిక్షించే న్యాయము గొప్పదే రెండు అవసరమే. రెండును మన నిమిత్తమే. దేవుని లక్షణముల విషయములోను, ఆయన క్రియల విషయములోను తారతమ్యము (భేదముచేసి) మాట్లాడరాదు నాకు కృప సరిపడలేదు అని ఏ పాపియైనను దేవునిమీద పిర్యాదు చేయుటకు సందు లేదు, అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయిన శిశువు సైతము నాకు కృప చాలలేదు అనుటకు వీలులేదు. ఎందుకనగా ఆ శిశువు జీవించిన ఆ ఒక్క నిమిషమే దేవునియొక్క కృప నిమిషమైయున్నది. కొందరు భూమి మీద ఒక నిమిషమైనను బ్రతుకరు. గర్భమందే మృతులై బయటికి వత్తురు. వారు గర్భములో జీవించినది జీవిత కాలము కాదా? అది కృప కాలము కాదనుటకు ఎవరికి నోరువచ్చును. అది కృపకాలముకాక మరేమైయుండును. సమస్తమును దేవుని స్వాధీనములో నున్నవి. మానవుడు తన నిర్లక్ష్యము వలన కృపా సమయమును పోగొట్టుకొనుచున్నాడు. కృపా కాలమున్నదిగాని మానవుడు గ్రహించుట లేదు. ఎందుకనగా అతడు అనుభవించుట లేదు. 136వ దావీదు కీర్తన చిత్రమైన రచనా కృతమైనది ఈ కీర్తనకు “కృప నిరంతరముండును” అను పేరు పెట్టిన మంచిది. ఇదంతయు కృప కాలమును గురించి అయితే కృప అనగా నేమి? దీనికి క్లుప్తముగా జవాబు చెప్పవలెనన్న దేవునిలో ఏమి ఉన్నవో అవన్ని కలిపి కృపా భాగ్యములైయున్నవి. ఆ భాగ్యములన్నియు దేవుడు మనకిచ్చుటయే కృపయైయున్నది. కృప, కృపా భాగ్యము, కృపకాలము ఈ మూడును జ్ఞాపకముంచుకొనవలెను.


మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక! ఎఫెసీ. 6:24 ఆమేన్.