గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ప్రవక్తయైన ఎలీషా - 1
“అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతనియొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను”. 2రాజులు 13:14
ప్రవక్తయైన ఎలీషా సుమారు 20సం॥లు మిక్కిలి ముమ్మరమైన సేవ చేసియుండెను. అద్భుతములతో కూడిన పని చేసెను. దాదాపు 45సం॥లు సాధారమైన పని, అనగా శిష్యులకు బోధించుట, గ్రామములు దర్శించుట మొదలగు పనులు చేసెను. ఈ 65 సంవత్సరముల తర్వాత మరణకరమైన వ్యాధి ఆయనకు వచ్చెను. వ్యాధులు రెండు రకములు
- (1) వ్యాధి మందులద్వారానో లేక వేరు ఇతర మార్గముల ద్వారానో పోవునవి.
- (2) మరణకరమైన వ్యాధి: ఇది బాగుపడదు.
దీనితో మరణము పొందవలసినదే. ఎలీషా చనిపోయిన వారిని లేపెను. ఇశ్రాయేలు రాజులును అభిషేకించెను. అట్టి భక్తుడు కూడ వ్యాధినొందెను. భక్తులుకూడ వ్యాధిని తప్పించుకొనలేరు. భక్తులు ఎందుకు జబ్బుపడుదురని అవిశ్వాసులు అందురు. పాపము చేయుట, నరకమనుభవించుట ఇవి దేవుని నుండి మానవుని ఎడబాపు చేయునవి. వ్యాధి అయితే ఉపకారము చేయునది, బలపరచునది. క్రమపరచునది. కొందరి వ్యాధి బాధకరముగా నుండదు, పనులు చేయుచునే చనిపోవుదురు. ఎలీషాకు
- 1) వ్యాధి,
- 2) బాధ,
- 3) మరణము గలవు.
ఈ మూడు ఉన్నను ఆయన విశ్వాసము కలిగియుండెను. శ్రమలలో, కష్టములలో విశ్వాసము కలిగియుండవలెను. పౌలు చెప్పినదేమనగా: (రోమా 8:35-39) వ్యాధియైనను.... మరియేదైనను దేవుని ప్రేమనుండి ఎడబాపనేరవు. కాబట్టి వ్యాధి వచ్చినను, బాధ వచ్చినను, మరణము వచ్చినను విశ్వాసి విశ్వాసిగానే ఉండిపోవలెను. వీటిని దేవుడు రానిచ్చుట ఒక క్రమము. యధాప్రకారముగా వచ్చు క్రమము. కష్టము వలన పోవు విశ్వాసము విశ్వాసముకాదు. గాలి వీచి, వర్షము వచ్చి, వరదవచ్చెను గాని కొండ కొట్టుకొనిపోలేదు. కొండ కొండవలె ఉండెను. అట్లే విశ్వాసికి ఎన్ని కష్టములు వచ్చినను విశ్వాసిగానే ఉండును. వరద వచ్చినప్పటికి కొండవలె స్థిరముగా నుండునది విశ్వాసము.
దైవజనుడైన ఎలీషా చివరి గడియలలో కొన్ని మాటలు చెప్పెను. సాధారణముగా మనిషియొక్క చివరి మాటలను గౌరవించెదరు. అందరు చనిపోకముందు ఏమిచెప్పెనని అడుగుదురు. ఎలీషా 60 సం॥లు పనిచేసి ఈ మాటలు చెప్పుచున్నాడు. ఈయన వరపుత్రుడు, ప్రవక్తల పాఠశాలకు అధ్యక్షుడు. కాబట్టి విలువైన మాటలు చివరగా చెప్పెను. ఎలీషా షోమ్రోనులో నున్నాడు. అచ్చటనే ఇశ్రాయేలు రాజుకూడ ఉన్నాడు. రాజు దైవజనుని దగ్గరకు వచ్చి చూచి కన్నీరు కార్చినాడు. ఎందుకనగా ఇశ్రాయేలీయులకు గొప్ప మేలు చేసిన ప్రవక్త కాబట్టి విశ్వాసులకు చింత. అవిశ్వాసులుకూడ చింతించి యుందురు. రాజునకు మరి విచారము. రాజు ప్రవక్త సలహాను బట్టీ నడువవలెను. ఎలీషా సంఘనాయకుడు. రాజు రాజ్యము నడుపువాడు. అందువలన రాజు ఏడ్చి 'నాయనా' అన్నాడు. ఎలీషా రాజువైపు చూచినాడు, ఆ చూపులో అర్ధమున్నది. "నేను వెళ్ళిపోవుచున్నాను, నీవు ఏలాగుంటావు” అని అర్ధము. రాజు చెప్పినదేమనగా నీవు జనమునకు “రథము, రౌతువంటివాదవు”,
రథము: రథమనగా యోధులను కూర్చుండబెట్టుకొని ఒక స్థలమునుండి మరియొక స్థలమునకు తీసికొని వెళ్లు సాధనము. రధములో నున్నవారికి భయము లేదు. ఏ కీడు కలుగదు. ఆలాగే క్రీస్తు ప్రభువులో నున్నవారికి ఏ కీడు కలుగదు. ఆయన మనలను ఎట్టి అపాయకరమైన స్థలమునకైనను తీసికొని వెళ్ళగలడు. అయినను ఆయన మనతో ఉన్నందున అపాయమేమియు హానిచేయదు. మంచి స్థలమునకును ఆయన తీసికొని వెళ్ళును. "క్రీస్తు ప్రభువు అనే రధము క్షేమకరమైన నివాస స్థానము". ఈలోకములో విశ్వాస ప్రయాణికులు నివసించునట్టి స్థలము. "నాయందు నిలిచియుండుడి" అని క్రీస్తు ప్రభువు బోధించెను. ఇది జ్ఞాపకము. తెచ్చుకొనవలెను. ఆయనతో నుండి దిగకుండ ఉన్నంతకాలము మనకు క్షేమము. రథము నడిచే యిల్లు. తుదకు ఈ రధము మోక్షములోనికి కూడ తీసికొని ఆయన వస్తేకాని మనము వెళ్ళలేము, మిమ్ములను తీసికొని వెళ్ళుటకు తిరిగి వస్తానని ప్రభువు చెప్పెను.
రౌతు: యుద్ధమునకు వెళ్ళువారికి ముందుగా నడుచు వ్యక్తి ఈ లోకములో సైతానుతోను, అతని బలమంతటితోను యుద్ధము చేయు బయలుదేరు మనకు ముందుగా నడచు రౌతు యేసుప్రభువు. మార్గదర్శి యేసుప్రభువు. నేనే మార్గమునైయున్నానని యేసుప్రభువు చెప్పెను. ఇశ్రాయేలీయులు పాలెస్తేనా దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లునప్పుడు యెహోషువా సైన్యాధిపతిగా నుండి వారి ముందుగా వెళ్ళెను. మన యెహోషువాయైన యేసుప్రభువు అట్లే ముందు నడుచును. ప్రవక్త ఈ మాట విని నంతోషించలేదు. అది దైవజనుల తీరు. తమ్మును గురించి తాము అతిశయపడరు, గొప్ప చెప్పుకొనరు.
అయితే ఇశ్రాయేలీయుల రాజు చెప్పవలసిన మాటలేవనగా “యెహోవా 'నీవే రథము' నీవే రౌతువు” అనవలసినదే. నీవు మరియొక దైవజనుని చేత నీ పని చేయించెదవు అనవలెను. మోషే చనిపోయినపుడు ఇశ్రాయేలీయుల సంఘము ఆగిపోయినదా? దేవుడు మరియొకరిని తీసికొని వచ్చి ఆ పనిని సాగించుకొనును. మోషే తర్వాత యెహోషువా వచ్చెను. దేవుని పని ఆగదు. ఒక ప్రవక్త వెళ్ళిపోయిన మరియొకరు. ఒక రాజు పోయిన మరియొకరు, ఒక బోధకుడు పోయిన మరియొకరు, దేవుని ఏర్పాటు ప్రకారము వచ్చెదరు ఈ విధముగా దేవుడు తన రాజ్యము యొక్కయు, సంఘము యొక్కయు పనిసాగించును. వీరందరికి వెనుకనున్న యెహోవా వలననే సమస్తము సాగును, ఎలీషా వల్లకాదు. రాజు దృష్టిలో ఎలీషా రథము, రౌతు. అయితే అది కొంత కాలమే. దేవుని పని సాగించుటకు, సంఘము యొక్కయు, రాజ్యము యొక్కయు రథము, రౌతు యేసుక్రీస్తే ఇశ్రాయేలీయులు అనుకొన్నట్లు కాదు, రాజు తలంచినట్లు కాదు. ఈలోకములో దైవజనులు కొంతకాలము మాత్రము మనమధ్యన పనిచేయుదురు. కాని ప్రభువే నిజమైన నాయకుడు. మనకు రధము, యోధుడు ప్రభువే. ఆయనే ముందు నడిచివెళ్ళును. ఇప్పుడు యేసుప్రభువే మన రథము. ఈ రథములో కూర్చున్న భయముండదు కష్టము వచ్చిన ఆయనే భారము వహించి చూచుకొనును.
ఈ వాక్యభాగములో రాజ్యము యొక్కయు, సంఘము యొక్కపని సాగించుటకు యెహోవాయే రథము, రౌతు అని రాజునకు బోధించుటకు ప్రవక్త ఒక పాఠము రాజునకు చెప్పెను. ఇది (బహిరంగమునకు కనబడు) వస్తు పాఠము వంటిది. రాజ్యము, సంఘము ప్రభువునందు గురియుంచవలెను. గాని దైవజనుని యందుకాదు. దైవజనులను గౌరవించవలెనుగాని అందరికంటె ముందుగా ప్రభువు నుంచవలెను.