గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

నడత మార్చిన నయమాను



“అతడుపోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడుమారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 2రాజులు 5:14.


దమస్కు ప్రధాన పట్టణముగా నున్న ఆరాము దేశములోని రాజుగారి సైన్యాధిపతి నయమాను. అతనివల్ల దేశమునకు జయము కలిగినందున అతడు రాజుగారికి ఇష్టుడాయెను. ఆ సేనాధిపతి ఎంత మంచివాడైనను, పరాక్రమశాలియైయున్నను, కుష్టురోగియై యుండెను. మా దేశములోనున్న దైవజనుడు కుష్టును బాగుచేయగలని ఆ సైన్యాధికారి భార్యదగ్గర నున్న ఒక బాలిక ఆమెతో చెప్పగా, అతడు ఇశ్రాయేలు దేశములోని షోమ్రోను పట్టణమందున్న ఎలీషా అను పేరుగల దైవజనుని గృహమునకు వెళ్ళెను. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అను బిరుదు పొందినవారు. వారి దేశము ఇశ్రాయేలు దేశము. ఇది పాలెస్తీనాలో నున్నది. ఆ సైన్యాధికారి ఎలీషాగారికి కబురు పంపగా ఆయన నీవు యోర్దాను నదికి వెళ్ళి ఏడుమార్లు స్నానము చేసినయెడల నీ వ్యాధి అంతరించిపోవునని తన సేవకుని చేత చెప్పించెను. అది విని ఆ పటాలపు నాయకుడు ఆ దైవజనుడు నాయొద్దకువచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తనచెయ్యి రోగముగానున్న స్థలముమీద ఆడించి కుష్టురోగమును మాన్పునని నేననుకొంటిని దమస్కు నదులైన ఆబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నింటికంటె శ్రేష్టమైనవి కావా! వాటిలో స్నానముచేసి శుద్ధినొందలేనా! అని అనుకొని రౌద్రుడై తిరుగు ప్రయాణము పట్టెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైన నొక గొప్పకార్యము చేయుమని నియమించిన యెడల చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనుమాట దానికంటె మేలుకాదా? అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్దుడాయెను.


చదువరులారా! ఎలీషా బోధకుని గురించిన సువార్త చెప్పిన బాలిక మెచ్చుకొనదగినదా? ఆ సువార్త తన భర్తకందించిన భార్య మెచ్చుకొనదగినదా? ఆ రోగ బాధితునికి సెలవిచ్చిన రాజుగారు మెచ్చుకొనదగినవాడా?తిరుగు ముఖము పట్టిన ఆ ఆరాము దేశీయుని గిర్రున నదియొడ్డునకు నడిపించిన సేవకుడు మెచ్చుకొన దగినవాడా? దైవజనుడు చెప్పినట్లు చేసిన ఆ పరాక్రమశాలి మెచ్చుకొనదగినవాడా? దైవచిత్తము తెలిసికొని రోగి స్వస్థత నొందునను దృఢ విశ్వాసము గల దైవమానవుడు మెచ్చుకొనదగినవాడా? చదువరులారా మీరు ఎవరి జట్టులో చేరుదురు? మంచి నీళ్ళ వలన కుష్టు కుదురునా? కుదరదు గాని ఈ కథలో కుదిరినది. అట్లయిన అట్టి వ్యాదిగ్రస్తులందరు నీళ్ళలో స్నానము చేసినయెడల ఈ కాలమందు కూడ కుదురునా? మహాత్యము ఎందులో నున్నది? నీళ్ళలోనా? ఆ జయశాలి విధేయతలోనా? నమ్మికలోనా? దైవపురుషుని వాక్కులోనా? ఆయన పలికిన వాక్కు దైవ వాక్కు దైవవాక్కువల్ల కార్యసిద్ధి దేవుడు తన వాక్కును పంపి ప్రజలను బాగుచేసెను. అని కీర్తన 107:20లో గలదు. వాక్కు ఎంత గొప్పదైనను రోగికి విధేయత లేనియెడల ఏమి ప్రయోజనము? చదువరులారా ఇశ్రాయేలీయుల బాలికవలె మారును తెలిసియున్న ఉపకార సమాచారము ఇతరులకు అందించుచున్నారా? బాలిక, వ్యాధిగ్రస్తుని భార్య, వ్యాధిగ్రస్తుడు, ఆరాము దేశముయొక్క రాజు, దైవజనుడు, ఆయనయొద్దనుండి కబురు తెచ్చిన సేవకుడు, నదియొద్దకు వెళ్ళవలసినదని సలహా ఇచ్చిన సేవకుడు, ఈ ఏడుగురును ఈ చరిత్రలో చేసిన పనులు ధ్యానించండి. దైవప్రార్ధన చేయుచు ధ్యానించిన యెడల మీ ఆత్మకు ఆనందము కలుగును.


నయమాను చేత దేవుడు ఆరాము దేశమునకు జయము కలుగజేసెను. అతనిని గురించి ఇది ఒక మంచి విషయము. అతడు ఘనుడు. ఇది రెండవ మంచి విషయము. అతడు రాజుగారి దయను పొందినవాడు, ఇది మూడవ మంచి విషయము. అతడు మహా పరాక్రమ శాలి. ఇది నాల్గవ మంచి విషయము. ఈ నాలుగు మంచి విషయములనుబట్టి అతనిలో సంతోషము లేకపోలేదు. అయిన అతని వ్యాధిని గురించి చింతకూడ లేకపోలేదు. ఒకరికి శరీర జీవితములో ఎన్ని సంపదలు ఉన్నప్పటికిని ఏదోయొక కొదువయును, హానికరమైన విషయమును, ఉన్నయెడల మనశ్శాంతి ఉండదుగదా! అట్లే ఒకరి ఆత్మీయ జీవితములో ఎన్ని మంచి గుణములున్నను ఏదోయొక దుర్గుణమున్న యెడల అది తొలగించుకొను వరకు నెమ్మది కలుగదు గదా! గనుక నాలో ఎన్నో మంచి గుణములున్నవి గాని ఒకటేగదా దుర్గుణము అని ఎవరును అతిశయింపరాదు. అది పరిహారము చేసికొనవలెను.


మరియొక సంగతి ఆ దయాప్రాప్తుడు ఆ మతగురుని సలహాను అపార్ధము చేసికొనెను. రౌద్రము తెచ్చుకొనెను. ఈ రెండును మంచివికావు. ఇతనివలె దైవవాక్కును గ్రహింపనివారు గలరు. అట్టి వారు అతనివలెనె తమ తలంపును వెంటనే మార్చుకొన్న యెడల ఉపకారము పొందుదురు. మరియొక సంగతి. ఆ స్వస్థచిత్తుడు ఎంత గొప్పవాడైనను తన సేవకుని మాట విన్నందువలన బాగుపడెను. నేనధికారిని, ఇతడు నా సేవకుడు, ఇతని మాట నేనెందుకు గైకొనవలెను అని అతడు అనుకొనలేదు. ఆలాగే ఎంత గొప్పవారైనను ఎంత తెలిసిన వారైనను తమకన్న తక్కువైన వారు ఇచ్చిన సలహా వినుట క్షేమము. ఇదివరలో చెప్పినట్లు దైవవాక్కువల్ల మనము బాగు కాగలము. అది బైబిలు గ్రంథమందున్నది. బైబిలులోని బోధ విన్న తర్వాత ఎట్టి బాధితులకైనను శాంతి కలుగకమానదు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒకరిని చూచి నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి యున్నాడు అని చెప్పెను. అతడు వెళ్ళిచూడగా అతని కుమారుడు జ్వరముపోయి సుఖముగా నున్నాడు. యోహాను 4:50 ప్రభువు వాక్యము నమ్మబట్టిగదా అంత గొప్పపని జరిగినది.


వాక్యమును బట్టియేగదా స్వస్థత కలిగినది. గనుక బైబిలులోని దైవ వాక్యమును నిర్లక్ష్య పెట్టరాదు, ఆలకింపవలెను, నమ్మవలెను. నయమాను కథ నమ్మువారి వ్యాధులు నయమౌనుగాక! ఆమేన్.