గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

దానియేలు అంత్యకాల ప్రవచనము

13.8.44



దాని. 12:4 మత్త, 24:33-35; 1కొరింథి. 1:21.


వాక్యము:- “దానియేలూ! నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను నతడు చెప్పెను” - దాని. 12:4


దీనిని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. దానియేలు గ్రంథమును 12:4వచనము. దానియేలు గ్రంథమును క్రీస్తు పుట్టుకకు పూర్వము 534సం॥న వ్రాయబడెను. అనగా ఆ పుస్తకము వ్రాయబడి ఇప్పటికి సుమారు 2540సం॥లు అయినది. ఇప్పుడు ఆ గ్రంథమందున్న ప్రవచనము నెరవేరెను. ఈ ప్రవచనము అనగా జ్ఞానాభివృద్ధి ప్రవచనము, 18వ శతాబ్దములో పనిచేయ ప్రారంభమాయెను. జ్ఞానాభివృద్ధి రెండు భాగములు.

దేవుడు ఈ విషయములు బైబిలుద్వారా తెలియజేయును. పరలోక సంగతులు తెలుసుకొనుటలోకూడ జ్ఞానాభివృద్ధి కలుగును. దానియేలు ఈ రెండు విషయములను గూర్చి వ్రాసెను. దానియేలు గ్రంథములో పూర్వ అధ్యాయములో క్రీస్తు పుట్టుకనుగూర్చి, రెండవ రాకడనుగూర్చి, రాజ్యకాలమునుగూర్చి, సంఘమునుగూర్చి, వెయ్యేండ్ల పరిపాలన మొదలగు విషయములను గూర్చి వ్రాయబడియున్నవి. ఈ దినము మనము చదివిన పాఠములో

ఈ గ్రంథముయొక్క అర్ధము యూదులకు వ్రాయబడినప్పుడు తెలియబడలేదు. ఇప్పుడు ముద్ర విప్పబడినందున బహిరంగముగ దీని అర్ధము తెలియుచున్నది. పరలోక విషయములను తెలిసికొనుటలో మనకు జ్ఞానాభివృద్ధి కలుగుచున్నది.


భూగోళ, ఖగోళ విషయములనుగూర్చి తెలియజేయుటకు దేవుడు జ్ఞానులను లేపెను. పరలోక విషయములను తెలియజేయుటకు దేవుడు విశ్వాసులను లేపెను. వీరందరిపైన దేవుడున్నాడు. పరలోక సంగతులు, బైబిలునుగూర్చిన విషయములను మొదటి శతాబ్దము నుండి ఇప్పటివరకు వ్రాయుచునేయున్నారు. 15వ శతాబ్దములో మార్టిన్ లూథరు, 14వ శతాబ్దములో అగస్టీను; ఈ విధముగా అనేకమంది భక్తులు అనేక విషయములనుగూర్చి వ్రాయుచున్నారు. ఇంకా వేల సంగతులున్నవి. పూర్వ కాలమునాటి కొందరు భక్తులు వారి జ్ఞానమునుబట్టి పుస్తకములు వ్రాసిరి. ఈ కాలపు భక్తులు జ్ఞానమును పూర్తిగా వదలి పరిశుద్ధాత్మ చెప్పినట్లు వ్రాయుచున్నారు. ప్రకటన గ్రంథమును యోహానుగారు పరిశుద్దాత్మ శక్తిద్వారా వ్రాసెను.


అలాగే ఈ కాలమందలి కొందరు భక్తులద్వారా దేవుడు వ్రాయించుచున్నారు. తెలివి, విశ్వాసము వృద్ధియైనవి. క్రైస్తవ మతములో క్రొత్త సంగతులకు కొదువలేదు. ఇండియా దేశములో శిరంపూర్ లో ఉన్న కాలేజిలో బైబిలుమీద అనేక పుస్తకములు వ్రాయబడియున్నవి. ప్రపంచమంతటిలో పెద్ద పుస్తక భాండాగారం అమెరికాలోని “చికాగో” అనే గొప్ప పట్టణములో ఉన్నది. ఇచ్చట లోకజ్ఞానమునుగూర్చియు, పరలోక విషయములను గూర్చియు చాలా పుస్తకములున్నవి. దేవుడు అనేక భక్తులకు 1వ శతాబ్దము నుండి 20వ శతాబ్దము వరకు కొన్ని సంగతులు బైలుపర్చెను, కాని అందరికి అవి బైలుపర్చలేదు. రాకడ దగ్గరైనందున ఇప్పుడు భక్తులు అడిగినప్పుడెల్ల ప్రతిరోజును బైలుపర్చుచున్నారు. బైబిలులోని 66 పుస్తకములమీద వ్యాఖ్యానములు, ప్రసంగములు బైబిలులోని ఒక్కొక్క కథను ఒక్కొక్క పుస్తకముగాను వ్రాసిరి.


దానియేలు ప్రవచనము ఎంత సత్యము! రాను రాను క్రొత్త సంగతులు బైలుపడుచున్నవి. ఇతర దేశస్థులు ఏదైనా మంచి సంగతులు బైలుపర్చునప్పుడు వెంటనే పుస్తకములో వ్రాయుచుందురు. మన దేశస్థులకు ఈ అలవాటులేదు. దేవుడు ఏ మంచి సంగతి (బయలుపరచి) చేసినను వ్రాయవలెను. దానియేలు 12:1-4వరకు ఉన్న మాటలకు అర్ధములు


మిఖాయేలు:- ఈయన ప్రధాన దూతలలో ఒకదూత. మోషే శవమునుగూర్చి సాతానుతో వాదించెనని యూదా పత్రికలో ఉన్నది. సాతానుతో యుద్ధము చేసెనని ప్రకటనలో యున్నది. ఈయన దైవజనుల పక్షముగా గొప్ప పనిచేయువాడై యున్నాడు. సమయము వచ్చినప్పుడు దూతలందరు దైవజనుల పక్షముగా పనిచేయుదురు.


ఆపద:- ఇది పెండ్లికుమార్తె ఆరోహణమైన తరువాత భూమిమీద కలుగనైయున్న శ్రమకాలము. జీవగ్రంథములో ఎవరి పేరు వ్రాయబడెనో వారు శ్రమ తప్పించుకొందురు. సమాధులలో నుండి లేచువారు అంత్యతీర్పునాడు నిత్యనాశనమునకు వెళ్ళువారు లేతురు. మొదటి పునరుత్థానమునందు లేచువారు నిత్యజీవమునకు లేతురు.


అనేకులను త్రిప్పువారు:- రాకడవరకును సువార్త చెప్పి అనేకులను ప్రభువుతట్టు త్రిప్పువారు ప్రకాశింతురు.


మరుగుచేయుట:- మనము నివసించుచున్న ఈ కాలమువరకు అనేక విషయములు ఇప్పుడు బైలుపడుచున్నవి. ప్రకటనను చదువువారు దానియేలు గ్రంథమును బైబిలుఅంతయును సులభముగా అర్ధము చేసికొనగలరు. అలాగే పరమగీతార్థము తెలిసినవారు అనేక నూతన సంగతులు తెలిసికొందురు.


అనేకులు:- దానియేలు గ్రంథము విశ్వాసులందరును చదువుచూనేయున్నారు. అందరికి మర్మములు చెప్పబడవు, విప్పబడవు. ఏర్పర్చబడినవారికే విప్పబడును, వారనేకులు ఉందురు. ఒకరికి బైలుపర్చబడిన సంగతి మరియొకరికి బైలుపడదు. యోహానుకు బైలుపడిన సంగతులు తత్పూర్వము భక్తులకు బైలుపడలేదు. తర్వాత బైలుపడినవారు అందరు అనేకులైయున్నారు. ఎలాగనగా వ్యాఖ్యాన గ్రంథములు తెలియుటవల్ల ఈ సంగతి అందరకు తెలిసినదని మనకు బోధ పడగలదు.


ఇంగ్లీషు బైబిలులో చివరికాలమందు ప్రజలు భూమిచుట్టు తిరుగుదురు అని వ్రాయబడియున్నది. అది కొన్ని ప్రాచీన ప్రతులలో లేనందున తెలుగు బైబిలులో ఈలాగు వ్రాయబడినది - తెలివి అధికమౌటయు, అన్ని ప్రదేశములకు వెళ్ళుటయు మన కాలములోనే చూచుచున్నాము. కాబట్టీ దానియేలు ప్రవచించిన కడవరి కాలము మన కాలము అని గ్రహించుచుండుము. ట్రైన్‌లు, స్టీమర్లు, ఓడలు, గాలి విమానములు ఈ కాలములోనే విశేషముగా ఉన్నందువలన ఈ ప్రవచనము నెరవేరుచున్నది. మరియు సృష్టినంతటిని పరీక్షించి జ్ఞానులు వ్రాసిన పుస్తకములుకూడ ఉపయోగమే.