గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

పాత్రలో నూనె ఊరుట



“పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు - మరేమియు లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను.” వాక్యము: ॥ రాజులు 4:6.


ఈ వాక్యభాగములో ఇశ్రాయేలీయులలో జరిగిన కథ వ్రాయబడినది. ఒక స్త్రీయొక్క భర్త చనిపోయెను. ఆమెకు బిడ్డలు గలరు. అప్పులు చాలగలవు. అప్పులవారు వచ్చి ఆమెను బాధించుట వలన ఆమె ప్రవక్తయైన ఎలీషాతో చెప్పెను. ప్రవక్త నీ దగ్గర ఏమి ఉన్నది అని అడుగగా, ఆమె ఒక నూనెపాత్ర మాత్రము కలదని చెప్పెను. అప్పుడు ప్రవక్త నీవు పోయి నీ ఇరుగు పొరుగు వారియొద్ద ఉన్న పాత్రలు తెచ్చి అన్ని పాత్రలలో కొంచెము, కొంచెము నూనె పోయుమని చెప్పెను. ఆ తల్లి, కుమారులు అట్లు చేయగా పాత్రలన్నియు నూనెతో నిండెను, ఇంకా పాత్రలు లేవని తల్లితో చెప్పిరి. తర్వాత ఆమె ప్రవక్త దగ్గరకు వెళ్ళి పాత్రలన్ని నిండిన తర్వాత నూనె ఆగిపోయెనని చెప్పగా ప్రవక్త ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుమని చెప్పెను.


1. ఆ కాలము ప్రజలైన వారికి ప్రవక్త దగ్గరకు వెళ్ళి వారి అక్కరలు చెప్పువాడుక కలదు. గనుక స్త్రీ తన కష్టము ప్రవక్తతో చెప్పెను. కుండలన్ని నిండువరకు నూనె ప్రవహించుచుండెను. కుండలు లేనందున ధార ఆగిపోయెను. అద్భుత క్రియ దేవుడు జరిగించెను. అవసరమున్న యెడల దేవుడు అద్భుతము చేయును గాని తమాషాకు చేయడు, ఉపయోగముకూడ నుండవలెను. యేసుప్రభువుకూడ అవసరము నిమిత్తమే చేసెను. మనుష్యుల అవసరము తీర్చుటకు ప్రవక్తలు, యేసుప్రభువు అద్భుతములు చేసెను. ప్రవక్తలు ప్రార్థించి అద్భుతములు చేసిరిగాని, యేసుప్రభువు దేవుడు గనుక తనంతట తానే అద్భుతములు చేసెను. ఇశ్రాయేలీయులు యోర్దాను దాటునప్పుడు అద్భుతము అవసరము గనుక ఈ ప్రక్క ఆ ప్రక్క నీరు నిలిచిపోయెను. (యెహోషువ 3వ అధ్యాయము) ఈ కాలమందు దేవుడు చేయునుగాని, మనకు కావలసినవన్ని ఉన్నవి ఏదైన కావలసి వచ్చినపుడు చేయును గాని తమాషాకు చేయడు. ప్రతివారును తమ అవసరములను దేవునియొద్ద తెలియజేయవలెను. దేవుడు సాధనముల ద్వారా అవసరము తీర్చును లేదా అద్భుతము చేయును.


2. ఈమె భర్త విశ్వాసి. ఆమె దగ్గర చిన్న కుండలో నూనె గలదు. మనకు ఏది ఉన్నదో, అది ముందు వాడవలెను. యేసుప్రభువు ఐదువేల మందికి ఆహారము పెట్టునపుడు ఐదు రొట్టెలు తీసికొనెను. గనుక ముందు ఉన్నవి వాడుకొనవలెను. తర్వాత అద్భుతక్రియ జరుగుటకు ఏర్పాటు ఉండును. మన దగ్గర సొమ్ము ఉండి అది ఖర్చు చేయకుండ ఏ అక్కర గురించియైన ప్రార్ధించిన యొడల అది నెరవేరదు. ఆ సొమ్ము అయిన తర్వాత అక్కర విషయము ప్రార్ధించిన నెరవేరును. యేసుప్రభువు కనాను పెండ్లివిందునందు నా సమయము ఇంకా రాలేదని చెప్పెను. ఉన్నవి జాగ్రత్తగా వాడుకొనిన తర్వాత యేసుప్రభువును అడుగవలెను. ఆయన మన మనవి ఆలకించును.


3. వారు ఇరుగు పొరుగు వారియొద్దకు వెళ్ళి వట్టికుండలు తీసికొనివచ్చి వాటిలో కొంచెము నూనెపోయగా ఆ కుండలు నూనెతో నిండెను. ఇంక ఎక్కువ కుండలు తెచ్చిన ఇంకను నూనె వచ్చును. కుండలు లేనందున తైలము ఆగిపోయెను. మనము ఎంత తీసుకొనగలమో అంతే ప్రభువు ఇచ్చును. ఎక్కువ ఇయ్యడు కృపావరములు, బహుమానములు దేవుని దగ్గర చాల ఉన్నవి గాని మనము ఎంత తీసికొనగలమో అంతే మనకు వచ్చును. కథలోని స్త్రీకి ఆ నూనె చాలును గనుక నూనె ఊరుట ఆగిపోయెను. తండ్రి ఉచితముగా ఇచ్చును. ఎంతైన ఇవ్వగలడు. దేవుడు ఇవ్వలేదు అనకూడదు. మనము పుచ్చుకొనుటలోనే లోపమున్నది.


4. స్త్రీ యొక్క కుండలోని నూనె వారికి రొట్టె కాల్చుకొనుటకు సరిపోవునుగాని అప్పుల వారికిచ్చుటకు చాలదు. మనకు సరిపడు విశ్వాసముండును గాని ఇతరులకిచ్చుటకు చాలదు. గనుక సరిపడు విశ్వాసము సరిపోవునది మాత్రమేకాక ఇతరులకుకూడ ఉపయోగపడునంత సంపాదించుకొనవలెను. విశ్వాసులకుకూడ కొన్ని కొదువలు వచ్చుచున్నవి. మనము వారి యొద్దకు వెళ్ళి రహస్యముగా మాట్లాడిన కనబడును. ఒక వ్యక్తి సంతోషముగాలేడు అనగా అతనికి ఏమి కొదువగా ఉన్నదో ఎందుకనగా అతని హృదయ పాత్రలో సంతోషములేదు. ఆ స్త్రీ వట్టి కుండలను నూనెతో నింపినట్లు ఆ సంతోషము కొదువగానున్న విశ్వాసి ప్రభువు నొద్దకు వెళ్ళిన ఆ ఖాళీహృదయమును సంతోషముతో నింపును. ఇది అన్నిటికన్న విలువైన సంగతి.


విశ్వాసి మోకాళ్ళమీదనుండి ప్రార్ధించినపుడు ప్రార్ధన కుదిరిన వెంటనే సంతోషము హృదయములో ప్రవేశించును. మరొక విశ్వాసి వద్ద మరొక కొదువ కనిపించును. విశ్వాసము మందగిలినప్పుడు సంపూర్ణ విశ్వాసము కావలెను. అప్పుడు ప్రార్థించిన బలమైన విశ్వాసము కలుగును. మరొక విశ్వాసికి ఏమి చేసిన చిక్కుపోవునో తెలియదు, జ్ఞానము లేదు. అటువంటి సమయములో ప్రార్ధనలోనికి వెళ్ళి చేయగా, చేయగా జ్ఞానము కలుగును. ఏమి చేసిన ప్రార్ధన, విన్నపములు నెరవేరునో అట్టి జ్ఞానము కలుగును. వారు ఎంత వరకు అందుకొనగలరో అంత సంతోషము, అంత విశ్వాసము, అంత జ్ఞానమును వచ్చును. అలాగే ఖాళీ హృదయముతో ప్రభువు దగ్గరకు వస్తే వాటిని అయన తన అత్మతో (లేక) శక్తితో నింపును. మనము సరిచేసుకోలేని లోటుపాట్లను, విడిచిపెట్టలేని పాపమును, మన నైజమును, మొ.వి ప్రభువునకు తెలియజేస్తేనే అయన వాటిని సరిచేయును.


5. దేవుని కృపాధార ఎప్పుడును ప్రవహించుచునేయుండును యోబు 29:6 లో “బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను” అని గలదు. బండలోనుండి వచ్చిన నీరు ఇశ్రాయేలీయులు కావలసినంత త్రాగిరి. కొండలో నుండి తైలమును ప్రభువు రప్పించగలడు, అయనకు అసాధ్యమైనది ఏమియు లేదు. కుండలో నుండి తైలము రాలేదా, అలాగే కొండలో నుండి కూడా రాగలదు. ఎక్కడ ఏదిలేదో అక్కడ దేవుడు అది చేయగలడు. పచ్చికలో ఐదువేలమంది భోజనమునకు కూర్చున్నారు, వారికి భోజనము ఎక్కడనుండి వచ్చును. ఏమియు పుట్టనటువంటి చోట ఆయన ఏదైనా పుట్టించగలడు. విశ్వాసుల అక్కర ఆయనయొద్దకు తీసికొని వెళ్ళినప్పుడు వారి అక్కర తీర్చుటకు ఆయన ఏదైన పుట్టించగలడు. ఎవరు ఏది అందుకొనగలరో అది ప్రభువు అందించగలరు.


ఖాళీ కుండలు - ఖాళీ హృదయములు

నూనె శరీర జీవనము కొరకు - ఆత్మ జీవనము కొరకు దేవుడు కావలసినవి ఇచ్చును.


ఖాళీ కుండలు నింపిన దేవుడు - ఖాళీ హృదయములను విశ్వాస, జ్ఞాన సంతోషములతో నింపును.


6. మన జీవితములో ప్రభువును అడుగుటకు గొప్ప ఆధారముగా నున్నది. ఈ వాక్యము లూకా 11:11,12, 13వ చనములలో ఆయనను అడుగువారికి పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇచ్చును అని వ్రాయబడి ఉన్నది. నూనెను కొలుచుదురు. అట్టి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహింతునని ప్రభువు చెప్పెను. కొలత కొంచెము, మొక్కుబడికి ఇచ్చినట్లుండును. అట్లుగాక కొలత లేకుండ ఆత్మను ఇచ్చును. ఆత్మను పొందినవారు తగ్గిపోవచ్చును. వారు నింపబడవలను. ఒకప్పుడు ఉద్రేకము తగ్గవచ్చును మరల నింపుకొనవలెను. ఈ భూలోకపు తైలముకంటే ఆ తైలము అనగా పరిశుద్ధ ఆత్మ అభిషేకతైలము గొప్పది. ఆత్మపొంది ఊరకుండుట కాదుగాని పూర్తిగా నింపబడవలెను. ఆయనకు మన హృదయములో స్థలమునిచ్చిన ఆయన ఉచితముగా తన ఆత్మనిచ్చును. గనుక వారి హృదయములలో నుండి జీవపు ఊటలు ప్రవహించును (యోహాను 7:38; యెషయా 58:11).


కుండలో కొంచెము నూనెపోయగా ఆ నూనె ఊటలు కుండను నింపినట్లు విశ్వాసి హృదయములో జీవపు ఊటలుపుట్టి ప్రవహించును. ఆ జీవపు ఊటలు ఇతరులకు ఉపయోగకరముగా నుండును. విన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మచేత పొందియున్నారు గనుక మీరు చెప్పిన వాక్యము విన్నవారు ఆత్మను పొందిరి. ఒక కుండలోని నూనె అన్ని కుండలలోనికి వెళ్ళినట్లు, విశ్వాసియొక్కనిండు హృదయములలో నుండి ఇతరుల హృదయములోనికి జీవపు ఊట ప్రవహించి నింపును.


7. కథలో ప్రవక్త ఆమెతో “నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోయుము" అనిచెప్పెను. దేవుడు అద్భుతము చేయనైయున్నాడు గనుక ఇతరులెవ్వరు ఉండకూడదు. ఆయన అద్భుతము చేయునపుడు విశ్వాసులును, ఆ కార్యమునకు సంబంధించినవారు మాత్రమే ఉండవలెను. యేసుప్రభువు యాయీరు కుమార్తెను బ్రతికించినపుడు కూడ ఎవ్వరిని రానీయలేదు. (మార్కు 5:37). కథలో తైలము ఊరునప్పుడు కూడ ఎవ్వరు నుండకూడదు. ప్రార్ధించు ఆమె ఉండవలెను. సేవచేయు కుమారులును ఉండవలెను. మరెవ్వరు నుండకూడదు. పెండ్లికుమార్తెకూడ అట్లే రహస్యమందు అద్భుతము చేయును. దేవుడు తాను ఏర్పరచుకొనిన విశ్వాసులతో ప్రత్యేక అద్భుతములు రహస్యముగా చేయించును.


అట్టి అంతస్తుకు సిద్దపడగల ధన్యత ప్రభువు అనుగ్రహించునుగాక! ఆమేన్.