గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

బాలరాజు - యోషీయా

(అనగా యెహోవా బాగుచేయును)



“తానింకను బాలుడై యుండగానే తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనెను” (34:3).


వాక్యము: 2దినవృత్తాంతములు. 34,35 అధ్యాయములు


యోషీయా యూదా రాజ్యమునకు చిన్నతనమందే రాజాయెను. ఈయన 8 సం॥ములప్పుడు రాజుగా ఏలుట ప్రారంభించెను. ఈ రాజు చరిత్రలో ఆయన చేసిన రెండుపనులు కనబడుచున్నవి.

“యూదా దేశమును, యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను”, అని వాక్యములో వ్రాయబడియున్నది, అట్లే పరిశుద్ధ పరచెను. ఈ శుభ్రపరచేపని పూర్తి అయినది గనుక తీరికగా నుండెను. తర్వాత యెహోవా నామమందు పండుగ చేయవలెనను మంచి ఉద్దేశ్యము కనపరచెను.


యెహోవా పస్కాపండుగ: - ఈ పండుగ చేయవలెనని అందరికి తెలియజేసెను. పండుగ కబురు అందరికి తెలియగానే అందరు గుంపులు గుంపులుగా వచ్చిరి. ప్రజలు, యాజకులు, లేవీయులు, గాయకులు, యెహోవా మందిర సేవచేయు సేవకులందరు వచ్చిరి. అప్పుడు యెరూషలేము పట్టణము మహా మనోహరముగా కనబడుచున్నది. ఒకదరినుండి సేవచేయువారు, గాయకులు, రాజుగారు పండుగకు వచ్చుచుండిరి. ఒకదరినుండి ప్రజలు ఉత్సాహముతో పండుగలో పాల్గొనుటకు వచ్చుచుండిరి. వారు పస్కాపండుగను ఎప్పుడును ఎరుగరు. వారి పితరులు ఐగుప్తులో ఎప్పుడో ఈ పండుగ చేసిరి. సమూయేలు కాలమునుండి అంతగా ఈ పండుగ జరుగలేదు. ఒకవేళ పండుగ చేసినను అంత గంభీరముగా చేయుటలేదు. యోషీయారాజు కాలములో గంభీరముగా చేసిరి.


ఈ పండుగలో అందరు ఏకీభవించిరి. చిన్నరాజైనను భక్తిపరుడనియు, మంచివాడనియు అందరును గ్రహించిరి. దేశమును శుభ్రము చేసినాడను క్రియ అందరికి తెలిసినది, కనబడినది. గనుక ప్రజలందరు రాజు ఏమిచేయమంటే అదే చేయుటకు సిద్ధముగా నున్నారు. గనుక పండుగలో అందరు ఏకీభవించిరి.

ఈ రాజు క్రమము ఎరిగినవాడు, క్రమ ప్రకారము వారి వారి స్థలములు ఏర్పరచి పండుగ ఆచరించెను. మరియు రెండు క్రమములు గలవు.

వీటి ప్రకారము చేయవలెను. ఇది వారి పూర్వికుల క్రమము. వారి కాలములలో పరిపాలన బాగున్నది. తర్వాత రాజులలో భేదములు పుట్టికధ బాగుగా నడువలేదు. ఇన్నాళ్ళకు దైవభక్తిగల రాజు వచ్చినాడు. ఇతడు రాజులలో గొప్పరాజు. చిన్నవాడు. పస్కాపండుగ ఆచరించునప్పుడు మనము కనిపెట్టవలసినది క్రమము. ఇందులో మూడు క్రమములు కలవు. మొదటిది పై 6 గుంపులు ఎక్కడనుండవలెనో అక్కడనే ఉండవలెను. రెండవది దావీదు క్రమము, మూడవది సొలోమోను క్రమము. దీనిలో స్థలములు, పనులు ఏర్పరచినాడు. ఏ విధమైన అల్లరులు, పోట్లాటలు, మనస్పర్ధలు లేకుండ జరుగుటకు క్రమములు ఏర్పరచెను. ఈ రాజు దగ్గర మంత్రులుకూడ మహాగొప్ప పనిచేయగల సమర్ధులున్నారు.


సామెతలు 1:7 “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము” ఈ బాలుడైన రాజునకు దైవభక్తియున్నది గనుక జ్ఞానమునకు మూలమైనది. ఆయన చేతిక్రింద ఆయాపనులు చేయించు అధిపతులున్నారు. అందరు అన్నిపనులలో ఏకీభవించిరి. ఇది రమ్యమైన సంగతి. గనుక ఎంతపనినైనను, ఎంత పండుగ అయినను చేయగలరు. రాజు ఇచ్చిన ఆజ్ఞ రెండు భాగములు యెహోవాకు సేవచేయుడి. ఆయన జనులకు సేవచేయుడి. ఈ పస్కా పండుగలో ముఖ్యమైన వస్తువు గొర్రెపిల్ల. పశువును వధింపకపోయిన పండుగకాదు. చాల కుటుంబములు గలవు గనుక రాజు ముప్పదివేల గొర్రెలను ఇంకను కొన్ని మేకలను, కోడెలను పస్కాపశువులుగా ఇచ్చెను. అర్పించు పనిచేయు లేవీయులు ఆ పని సాగించిరి. వారు గొర్రెపిల్లను వధించిరి. ఈ పనికి వారు తమ్మును తాము సిద్ధపరచుకొనిరి. యాజకులు కూడ తమ్మును తాము సిద్ధపరచుకొని రక్తమును అర్పించిరి. వారు శుద్ది చేసికొనుట, ప్రజలను శుద్ధిచేయుట జరిగెను. అదివరకు ఎన్నడును జరగని రీతిగా యోషీయా కాలములో పండుగ జరిగెను. అదే సమయమున మరియొక సంగతి జరిగెను. అదివరకు లేవీయులు మందసమును మోసిరి. అందు పదియాజ్ఞలు, మన్నా చిగిరించిన అహరోను కర్ర ఉండెను. ఇశ్రాయేలీయులు 40సం॥లు అరణ్యములో దానిని మోసిరి. యోర్ధాను దాటి పాలెస్తీనా వెళ్ళుటకు ముందు మందసమును మోసిరి. తరువాత విగ్రహారాధన వచ్చినది గనుక మందసమును వేరొకచోట పెట్టిరి. బాలరాజైన యోషీయా ఈ సాక్ష్యపు మందసపు పెట్టెను తెప్పించెను. ఇదివరకు ఐక్యత లేనప్పుడు మందసము అటు యిటు త్రిప్పవలసి వచ్చినది. బాలరాజు ఇచ్చిన ఆజ్ఞ ఏమనగా మందసము దాని స్థలమందే యుండవలెను.

- మూడు పనులు యోషియా కాలములో జరిగెను. ఇదంతయు వాక్యములో ఏమి ఉన్నదో అదే చెప్పబడెను.


ఇందులోని పరిశీలనాంశములు:- పాతనిబంధన ప్రజలు ఏమిచేసినారో అది అంత క్రొత్త నిబంధనకు ముంగుర్తు. ఇది యూదులయొక్క మత సంఘచరిత్ర పాతనిబంధనలో జరిగినవన్ని క్రొత్తనిబంధనలో జరుగవలెను. వారేమి చేసినను ఇకముందుకు ఇది జరుగవలెనని నిరీక్షించువారు.

ఇప్పుడు మన సంఘములలోకూడ అలాగే నున్నది. క్యాటకిస్టులు(ఉత్తేజ ప్రేరణ కలిగించేవారు), ఇవాంజిలిస్టులు తమతమ పనులు చేయుదురు. ఈ కాలములో సంఘములలో ఇంకా ఎక్కువ పనులుగలవు. యోషీయా కాలములో చేసినది పస్కాపండుగ. క్రైస్తవులైనవారు ఎందుకు పండుగ చేయవలెను? పాతనిబంధనలోనివారు సూచన పండుగ గంభీరముగా చేసిరి. ముంగుర్తుగా జరిగిన పండుగ (నెరవేర్పు అప్పటికి ఇంకా రాలేదు) బహు ఘనముగా చేసిరి. నెరవేరినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషము గనుక క్రొత్త నిబంధన వారమైన మనము నెరవేర్పు గలిగియున్నాము గనుక వారికన్న ఎక్కువ చేయవలెను.


ఉదా: పచ్చిమామిడికాయ చాలమంచిది. అన్నిటికి పనికివచ్చును గాని దీనికంటె పండు గొప్పది. అట్లే పాతనిబంధన గొప్పదేగాని అంతకంటెగొప్పది, సంతోషకరమైనది క్రొత్త నిబంధన గనుక పండుగ చేయుట స్వభావ సిద్ధముగా చేయవలెను. ముంగుర్తు కాలములెన్ని? సూచన కాలములిన్ని? పాత నిబంధన క్రొత్త నిబంధనకు ముంగుర్తు. మనము పరలోకమునకు ముంగుర్తు అని విశ్వాసము వలన గ్రహించుకొందుము. అక్కడ మహిమ ఉన్నదనియు, దేవదూతలు, సింహాసనము, ధవళవస్తము, కిరీటము, అనంతారాధన ఇవన్ని ఉన్నవని విశ్వాసముద్వారా గ్రహించుకొనుచున్నాము. ఇప్పుడు, ఇక్కడ అవన్ని ముంగుర్తుగా చూచుచున్నాము. కాబట్టి మనము ఇక్కడ పరలోకములో మనకు సంభవించు వాటిని, పరలోకములో జరుగబోవు వాటినిచూచి సంతోషించుచున్నాము. పాతనిబంధనవారు మన క్రొత్త నిబంధనలో జరుగబోవు వాటినిచూచి సంతోషముతో చేసిరి. వారు రాబోవు దానికి నిరీక్షించి పండుగచేసిరి. మనమును పరలోకములో జరుగబోవు వాటినిచూచి సంతోషించుచున్నాము. పాతనిబంధనవారు ధన్యులు, మనము ఇంకా ధన్యులము, రేపు పెండ్లికుమార్తె వరుసలో నూతన యెరూషలేములో విందులో నుండువారు మరీ ధన్యులు.


ఆ విందులో పాల్గొనే సిద్ధబాటు అంతస్థు ప్రభువు చదువరులెల్లరకూ అనుగ్రహించునుగాక! ఆమేన్.