గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ఆనందదేశము - 2
(ఆత్మీయ చరిత్ర)
ఇందులోని ఆత్మీయభాగము:- ప్రియులారా! మనము బైబిలు చదువునప్పుడు నాలుగు సంగతులు జ్ఞాపకముంచుకొనవలెను.
- (1) పాత నిబంధన
- (2) క్రొత్త నిబంధన
- (3) సంఘ నిబంధన
- (4) మోక్షలోక నిబంధన - పాత నిబంధనలోని వాటికి క్రొత్త నిబంధనలో నెరవేర్పులుండును.
పాత నిబంధనలో గుర్తులు సూచనలు గలవు. వాటి నిజరూవములు క్రొత్త నిబంధనలో కలవు. క్రొత్త నిబంధనలోనున్న నెరవేర్పులు క్రైస్తవ సంఘములో అమలులోనికి తీసుకురావలెను (వాడుకలోనికి తీసికొనివచ్చుట). అనగా ఇక్కడ నేర్చుకొన్నవి మోక్షలోకములోనే పూర్తి అయి ముగింపు అగును.
ఆనంద దేశముయొక్క ఆత్మీయ చరిత్ర చాలా ముఖ్యము, చాలా పెద్దది, దానికి ముగింపులేదు. పాత నిబంధనలో కొన్ని సంగతులెత్తుకొని ఈ భాగములు వివరింతును. అది 4 భాగములు
- (1) అబ్రాహాము చరిత్ర
- (2) యెహోషువ చరిత్ర
- (3) రాజుల చరిత్ర
- (4) ప్రవక్తల చరిత్ర.
ఈ నాలుగు సంగతులు ఆత్మీయ చరిత్రగా ఏర్పడును. ఆ దేశము పితామహుల దేశము. అబ్రాహాము చరిత్రలోని ఆత్మీయ చరిత్ర కావలెను.
- (1) అబ్రాహాము చరిత్ర:- “భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును.” ఆది. 12:3 అని దేవుడు అబ్రాహాముతో చెప్పెను. భూమియావత్తు ఈ దీవెనలో గలదు. అన్ని వంశములు గలవు. ఇది మహాగొప్ప ఆశీర్వచనము. ఇదే ఆత్మీయ చరిత్ర. సువార్తలలో యేసుప్రభువు సృష్టి అంతటికి సువార్త చెప్పండి అనెను. దేవుడు అబ్రాహాముతో చెప్పినదే యేసుప్రభువుకూడ చెప్పెను. ఇదే రక్షణ సువార్త. ఈ రక్షణ వార్తను మొదట అబ్రాహామునకు దేవుడు తెలియపర్చెను. గనుక దాని మహిమ అందరికి వ్యాపింపవలెను. వంశములన్నిటికి రక్షణ సర్వజనులకు రక్షణసిద్ధమైయున్నది. అది దొరకకపోవుట మానవుని యొక్క లోటు. పాలెస్తీన పితామహుల దేశము. వీరు యూదులకు మనకుకూడా పితామహులే. వీరివలన లోకమంతటికిని దీవెన. మన పెద్దల దేశము గనుక. వారి దీవెనలో మన రక్షణ గలదు గనుక మనకు సంతోషము, గనుక ఇది ఆనందదేశమే.
- (2) యెహోషువ చరిత్ర: యెహోషువ 12 గోత్రముల వారికి పంచియిచ్చెను గనుక వారికి ఆనందము అది మనకుకూడా ఆనందము, ఎందుకనగా ఈ పంచి పెట్టుట ఏదో ఒకదానికి ముంగుర్తుగా నుండును. యేసుప్రభువు తన శిష్యులకు సువార్తను లోకమంతటికి ప్రకటించుడని హక్కుయిచ్చెను. భూలోకములోని సమస్త రాష్ట్రములు ఇచ్చెను. యెహోషువ పాలెస్తీనా ఇచ్చెనుగాని యేసుప్రభువు లోకమంతా ఇచ్చెను. అది దానికి ముంగుర్తు. గనుక ఆనందదేశము. మనకుకూడా ఆనందదేశమే ఎందుకనగా పితామహుల దేశము పరలోకమునకు ముంగుర్తు. పంచిపెట్టుటకు ప్రభువు శిష్యులకిచ్చిన హక్కునకు ముంగుర్తు మరియు యెహోషువ పాలెస్తీనా పంచినట్లు రేపు వెయ్యేండ్ల క్రీస్తుప్రభువు పాలనలో పెండ్లికుమార్తెకు భూలోకమంతా 12 భాగములుగాచేసి ప్రభువు ఇచ్చును. ఈ భాగములలో వారు అన్ని భాషలలో సువార్త ప్రకటింతురు. ఇట్టి మర్మములకు ముంగుర్తుగానున్న పాలెస్తీనా ఆనంద దేశమే.
- (3) రాజుల కాలము:- దేవుడు అభిషేకించి రాజులను ఈ దేశమును పరిపాలించుటకై ఏర్పాటు చేసెను. వీరు పరిపాలన విషయములోనే కాక, ప్రజల ఆత్మీయ జీవితమునుకూడా కాపాడిరి. వీరుకూడా ఆరాధనలు చేయువారు. క్రీస్తుప్రభువు వెయ్యేండ్లలో రాజైయుండును. పెండ్లి కుమార్తెకూడా రాజ్యము చేయును. రాజుల చరిత్ర వెయ్యేండ్లలో పెండ్లికుమార్తె జరిగించనైయున్న రాజ్యపాలనకు ముంగుర్తు గనుక ఆనంద దేశము అను పేరు తగినదే. తలాంతుల ఉపమానములో శక్తినిబట్టి భక్తులు ఏలుటకు ముంగుర్తుగానున్న పాలెస్తీనా ఆనందదేశమే. మనము రాజులము, యాజకులమని 1పేతురు 2:5లో ఉన్నదిగదా! వెయ్యేండ్లలో యాజకులముగాకూడ నుందుము. నేరస్తులకు తీర్పు తీర్చుటలో రాజులకు సువార్తచెప్పి వారి పక్షముగా ప్రార్థించుట యాజకులపని. సాలోమోను రాజ్యపాలన మరియు ఆరాధనకూడ చేసెను. వాటన్నిటికి ముంగుర్తుగా నున్న పాలెస్తీనా ఆనందదేశము.
- (4) ప్రవక్తల కాలము:- యెషయా మొదలు మలాకీ వరకు ఉన్న ప్రవక్తలు గొప్పపనులు చేసిరి. వీరు భూలోకములో ఏమి జరుగునో, వెయ్యేండ్ల పాలనలో ఏమి జరుగునో, మోక్షములో ఏమి జరుగునో, పాతాళములో ఏమి జరుగునో చెప్పియున్నారు. ఇట్టి ప్రవక్తలున్నదేశము గనుక ఇంకా ఆనందదేశము. ఆ ఆనందదేశము భూలోకమున ఆనందమునకు ముంగుర్తు. మనకు విచారము కలిగించు వాటన్నిటిని ప్రభువు కొట్టివేయును, ఆనందమే ఉండును. ఆనందమే భాగ్యము, మహిమయే భాగ్యము. మనలను భాదించుచున్నవన్నియు కొద్దిదినములలో అంతరించిపోవును. ఈ అన్నిటికి ముంగుర్తు పాలెస్తీనా గనుక ఆనందదేశము. దానికి భూమద్యదేశమని పేరు. ఇది భూలోకమునకు మధ్యగలదు. భూమి అంతటికి కనబడుటకు అట్లున్నది. బైబిలులోని అన్ని చరిత్రలు అక్కడే జరిగెను. గనుక అందరికి కనబడుటకు అక్కడనుండెను.
నిత్యానంద దేశమైన మోక్షము చేరు భాగ్యము అందరికిని కలుగునుగాక!