గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

నోవహు నావ - దేవుని నిబంధన



“దేవుడు - నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నింబంధనకు గురుతు ఇదే.” (ఆది. 9:12)


నోవహు నావ దిగినకొండ అరారాతు కొండ. ఈ నావ ఇప్పటి వరకున్నది. అనగ 40 వందల సంవత్సరములు ఆలాగే దాచబడి యున్నది. వర్షము రాకముందును, వర్షము ఆగిపోయిన తర్వాతను మేఘములు కనబడును. ఆ మేఘములలో 7 రంగుల దేవుని ధనస్సు కనబడును.


ఉదా:- గాజు గ్లాసులో నీరుపోసి సూర్యునికెదురుగా పెట్టిచూచిన 7 రంగులు కనబడును. మూడు మూలలుగల అద్దములోకూడ 7 రంగులు కనబడును. ఈ 7 రంగులు సూర్యునిలోనుండి వచ్చును. ఈ ఏడు రంగుల కలయికయే సూర్యుడైనాడు.


వారు ఓడదిగి వచ్చిన తర్వాత దేవుడు వారితో ఒడంబడిక చేసెను.

వరదవల్ల కొన్ని ఊళ్ళు మునిగిపోవుచున్నవి, గాన దేవుడు చేసిన నిబంధన ఏమనగ, లోకమంతటిని నాశనముచేయు వరద రానివ్వనని వాగ్ధానము చేసెను. ఇది దేవునిమాట - నిబంధన, అది దేవుని అగ్రిమెంటు, ధనస్సు పంపుటయే ఆ మాట నిలుపుకొనుట. ఆ 7 రంగులు దేవుని దయను చూపుచున్నవి. ఆ 7 రంగులను చూచి మనము సంతోషింతుము. ఆకుపచ్చ, ఎరుపు మొ॥రంగులనుచూచి సంతోషింతుము. అంతేకాకుండా దేవుడు ఏడు రకములుగా దయను చూపించు చున్నాడు. వారముయొక్క మొదటి దినమైన ఆదివారము మొదలు చివరి దినమైన శనివారము వరకు మనపై ఏడు రకములైన దయను చూపించుచున్నాడు. దేవుని ప్రేమయే ఆ 7 రంగులు తెలియజేయుచున్నవి.


ఉదా:- ఊయలతొట్టిలో కట్టిన గిలకయొక్క రంగులను చూచి ఏడ్చుచున్న పసిబిడ్డ ఊరుకొనును. అలాగే కష్టములలోనున్న వారున్ను మనమును ఆయన దయనుచూచి ఆదరణ పొందుదుము. మనకు ఆకాశమేఘముమీద కనబడిన ధనస్సును చూచినప్పుడెల్ల దేవునిదయ భూమిమీద ఉన్నదని జ్ఞాపకము చేసికొనవలెను. అట్లు జ్ఞాపకము చేయుటకే ఆ ధనస్సు మేఘములోనికి వచ్చినదని తెలిసికొనవలెను. జీవరాసులతోను, మీతోను, రాబోవువారితోను నా నిబంధన స్థిరపరచెదనని దేవుడు చెప్పెను. ధనస్సు కష్టకాలమైన తర్వాత కనబడినది. మనకుకూడ కష్టకాలము వచ్చిన తర్వాత దేవుని ఆదరణ, ప్రేమ కనబడును. ఏలాగనిన బిడ్డ ఏడ్చిన తర్వాత తల్లి ఆదరించును. ధనస్సునుబట్టి దేవుని ప్రేమ కనబడునని తెలియుచున్నది.