గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
దైవ గ్రంథము
“ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చనుబట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్దాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి - 2పేతురు 1:21.
క్రైస్తవుల మత గ్రంథము బైబిలు. బైబిలను పదము పుస్తకమను అర్ధమిచ్చు “బిబ్లాస్” అనుగ్రీకు పదమునుండి వచ్చినది. ఇదియొక్కటేనా పుస్తకమని పిలువబడుటకు తగినది? ప్రపంచమందు దీనిని మించిన పుస్తకములు లేవా? బైబిలను మాటను బట్టి ఇది యొక్కటే పుస్తకమనిపించుకొనుటకు తగినదా? ఎందుచేత?
1. దేవుని ఆత్మచేత నడిపింపబడిన భక్తిపరులచే వ్రాయబడుట చేతను: ఆదియందు దేవుడు సృష్టినెట్లు కలుగ జేసినదియు, ప్రపంచముల పరిశుద్ధత, పాపప్రవేశము, మానవులను రక్షించుటకు దేవుడు చేసిన వాగ్దానము, ఆ వాగ్దాన నెరవేర్పును దేవుడెట్లు చూపించినదియు, పాపమేదో, పరిశుద్ధతయేదో, ఆయన తెల్పుటయు, పాప పరిహారమును దేవుడిచ్చువాటిని పొందుటయునెట్లో బైబిలు మనకు చెప్పుటచేతను, మానవులనందరిని రక్షించుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఏకమార్గమిందు కనబడుట చేతను, మనుష్యులు క్రమ క్రమముగా కుటుంబములుగాను, జనాంగములుగాను అనేక భాషలు మాట్లాడువారుగాను, వివిధ వృత్తులు గలవారుగాను, వృద్ధియైన సంగతి బైబిలులో వ్రాయబడుట చేతను, అవిధేయులను శిక్షించుచు, విధేయులను రక్షించుచు, మానవజాతిని దేవుడెట్లు నడిపించినాడో అదియు బైబిలునందుండుట చేతను, దేవునిచేత సృష్టింపబడిన ఇద్దరు మానవులనుండి లోకమంతయు ఎట్లు వృద్ధియాయెనో బైబిలు చూపుట చేతను, ఆది మానవులు దేవుని మాత్రమే పూజించుటయు పిమ్మట వచ్చినవారు అనేక మతములుగా ఎట్లు విభాగములు చేయబడిరో బైబిలు తెలుపుటచేతను మానవ జ్ఞానమునకు దేవుడు తన చిత్తమును, ఉనికిని క్రమముగా ఎట్లు బయలుపరచెనో బైబిలు మనకు సరిపడిన సంగతి కలిగియుండుటచేతను, మానవులు సుఖముగా జీవించుటకు గాను గతకాల చరిత్రయు, భావికాల చరిత్రయు బైబిలునందుండుట చేతను, మానవులకు ఆత్మీయ విషయములను బయల్పరుచుటకు దేవుడు తన భక్తులనెట్లు పంపించెనో బైబిలునందు వ్రాయబడుట చేతను, దేవుడు తన దైవత్వమును లోకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుగా భూమిమీద మానవ స్వరూపమందు బయలు పరచుకొనెనని బైబిలు బోధించుట చేతను, క్రీస్తుప్రభువు మానవులను నశింపచేయుచున్న పాపము నెట్లు జయించి మానవులందరికొరకు సమస్తోపకార కార్యములను ఎట్లుచేసెనో బైబిలు వివరించుట చేతను, క్రీస్తు మతము స్థాపింపబడి ఆకాల ప్రపంచమంతయు ఎట్లు వ్యాపించెనో బైబిలు చూపుటచేతను, రక్షణకొరకు ఎదురుచూచువారు క్రీస్తును అంగీకరించినయెడల ఎంతపాపియైనను రక్షింపబడునను కృపాదరణ బైబిలిచ్చుటచేతను, బైబిలు చదువు ప్రతివారును దేవుడొక్కడే అనియు క్రీస్తుప్రభువుద్వారా తన దైవత్వమును బయలు పరచుకొన్న ఆయనే లోకైక రక్షకుడనియు, సర్వ జనాంగములను ఆహ్వానించునది క్రైస్తవమత మొక్కటేయనియు, మానవులకు కావలసినన్ని దేవుని మాటలుగల పరిపూర్ణ గ్రంథమనియు గ్రహింప గల్గునట్లు చేయుటచేతను బైబిలు పుస్తకమనియు, గొప్ప గ్రంథమనియు దైవగ్రంథమనియు చెప్పవచ్చును.
ఇవి బైబిలునుండి తీయబడిన బుజువులు:-
2. ఇది మొట్టమొదట కనిపెట్టబడిన ముద్రాక్షరశాలలో మొట్టమొదట అచ్చువేయబడిన గ్రంథమగుటచేతను, అక్షరములను లెక్కింపబడిన గ్రంథమిదియొకటే యగుటచేతను లెక్కింప శక్యముగాని వ్యాఖ్యాన పుస్తకములు బైబిలునకే వ్రాయబడుటచేతను, ఆ పుస్తకములు చదువుటకు మానవుని జీవితముకూడా చాలనందుచేతను, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన పక్షమున అట్లువ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది!” అని ఆయన శిష్యులు చెప్పెను. యోహాను 21:25. ఒక్కొక్క పదము ఎన్నిసార్లు గలదో లెక్కింపబడిన గ్రంథమగుటచేతను, ఒక్కొక్క పదము ఏయే అధ్యాయములలోను వచనములలోను, గలదో వ్రాయబడిన గ్రంథమగుట చేతను, సర్వదేశాలవారును ఇందలి వాక్యములను పుస్తకములందు ఉపయోగించుకొనుటచేతను, రెండువేలకు పైగా భాషలలో తర్జుమా చేయబడిన గ్రంథమిది యొకటే యగుటచేతను, ఆయా గ్రంథములను చదివిన పిమ్మట పొందిన ఆదరణకంటే బైబిలును చదివిన పిమ్మట ఆత్మాదరణ పొందితిమని దీని చదువరులనేకులచే యోగ్యతాపత్రములు పొందిన గ్రంథమగుట చేతను ఇతర పుస్తకములలో అనేక మంచి సంగతులు గలవుగాని క్రీస్తులేడని గుర్తించిన సాధు సుందర సింగును, సుప్రసిద్ధ శాస్త్రవేత్తను మార్చగలిగిన గ్రంథమగుటచేతను, 2600సం॥ల క్రిందట ప్రపంచము నేకచక్రాధిపత్యముననేలు అన్యరాజులు తమచరిత్రలు వ్రాయించిన రాళ్ళు భూగర్భమునుండి ప్రస్తుత కాలమున త్రవ్వగా బయల్పడి బైబిలు చరిత్ర జరిగినదేయని బైబిలు బుజువు చేయించు కొనుటచేతను (వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయును లూకా 19:40) బైబిలు గొప్ప గ్రంథమనియు, ఎన్నటికిని నాశనము చేయబడని దైవగ్రంథమనియు చెప్పవచ్చును.
ఇవి సంఘ చరిత్రనుండి తీయబడిన బుజువులు:-
మరియు బైబిలు పరిశుద్ధమైన పుస్తకమును, కథల పుస్తకమును, చరిత్ర పుస్తకమును, దైవోపదేశము గల పుస్తకమును, అన్ని ప్రార్ధనలకు జవాబిచ్చు పుస్తకమును, సమస్త జనులకు ఉపయోగకరమైన పుస్తకమైయున్నది. బైబిలునందుగల అరువదియారు పుస్తకములలోను ఒకవ్యక్తినిగూర్చి కొంతవరకు కనుగొనగలము. ఆయన యేసుక్రీస్తు ప్రభువే దీనినంగీకరించి నిత్యము చదివి ధ్యానించువారు ధన్యులు అని వ్రాయించిరి. (కీర్తన. 1,2).
చదువరుల నందరిని దేవుడు దీవించునుగాక! ఆమేన్.