గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

విశ్వాస స్థిరత



వాక్యము: దా॥కీర్తనలు. 56:12; యోహాను 16:33; 1పేతురు. 5:9. “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి" - 1పేతురు 5:9.


ఓ దేవా! నీ దివ్యమైన వాక్యము దూతలకివ్వవలసినదిగాని చీకటిగల భూమిమీద సంచరించుచున్న మాకు నీ వాక్యమిచ్చినావు నీకు స్తోత్రములు. మేము అనేకసార్లు మనోవిచారమువల్ల నిరాశవల్లను, అనేక రకముల చింతలవల్ల మా ముఖము నలుపుచేసికొనిన మాకు నీ వాక్యమిచ్చినావు తండ్రీ! నీకు స్తోత్రము. ఓ పరిశుద్ధాత్ముడవైన తండ్రీ! నీ వాక్యము వ్రాసి మాకిచ్చిరి. దానిని మేము ధ్యానించనైయుండగా తప్పుడు ఊహలు రానియ్యక మాలో ప్రతివారికి ఆదరణ సంతోషము అనుగ్రహించుము. మేము నీ వాక్యముపై భాగమునకు మాత్రమే గాక లోతైన అంతరంగ భావమును మహిమనుగ్రహించే లోతైన అనుభవజ్ఞానమను గ్రహించుము. ఆమేన్.


1. ప్రభువు సిలువ శ్రమకు వెళ్ళకముందు మీరు గొర్రెలవలె చెదరిపోవుదురని, ప్రభువు తన శిష్యులతో ముందే చెప్పెను. ప్రభువు పట్టబడినప్పుడు ఇది నిజముగా నెరవేరినది. ప్రభువుమాట జ్ఞాపకము చేసికొని వారు బలము నిమిత్తము ప్రార్ధించి బెదరకుండా చెదరకుండా నుండవలసినది కాని, ప్రభువు ముందె ఎందుకు వారికీ సంగతి తెలియచేసెను? జాగ్రత్తగానుండుటకేగదా! మనకు మన కష్టములు తెలిసినప్పుడు మనము వెంటనే మోకరించి బలహీనతలు ఒప్పుకొని నివారణ ప్రార్ధనచేసి, స్తుతించి, కష్టమును తొలగింపచేసికొనవలెను.


2. పేతురు తప్పిపోవునని ప్రభువు ముందే తెలియజేసెను. మత్తయి 26:34 అప్పుడు పేతురు ఏమి చేయవలసియుండును? ప్రార్ధన చేయవలసినదే. మరియు కోర్టు గుమ్మము దగ్గర ప్రభువుయొక్క మాట జ్ఞాపకము చేసికొనవలసినది. చేసికొంటే ఎంత బాగుండును? ఒక భక్తుడిట్లు చెప్పెను. మొదటిమారు కోడికూసినప్పుడు కూత పేతురునకు వినబడకుండా దయ్యాలు డప్పులు వాయించినవి. ఎంత పరధ్యానము? ఇవన్నియు మనకు బోధనిమిత్తమై ముందే వ్రాయబడియున్నవి. పూర్వీకులకంటె మనము ఎంత జాగ్రత్తగా యుండవలెను. మీరు శోధనలోపడకుండునట్లు మెళుకువగలిగి జాగ్రత్తగా నుండుడి.


3. ఇంగ్లాండులో ఒక గొప్పదైవభక్తుడు ఉండెను. తన ప్రసంగమువల్ల అనేకమైన పాపులను ప్రభువుతట్టు త్రిప్పెనుగాని తుదకు ఏదో ఒక విషయములో నిరాశపడి బాత్ రూమ్ లోనికి వెళ్ళి తలుపువేసికొని స్వహత్య చేసికొనెను అనే కథను విని నీవు జాగ్రత్తపడుము. ఓ సోదరుడా మెళుకువగా నుండు నీవు మేల్కొలుపు కలిగియుండు అజాగ్రత్తగాయుంటే, సోమరివైయుంటే, నిద్రమత్తు గలిగియుంటే పిశాచి నీ మీదపడడా?


4. ఒక భక్తురాలిని ఇద్దరు బోధింపరమ్మని పిలిచి పాప మార్గమున ప్రవేశపెట్టిరి. స్నేహితుడా! ఉషార్ గానుండు (జాగ్రత్త గలిగి) సాతాను యొక్క తంత్రోపాయములును, మాయోపాయములను కనిపెట్టవలెను కదా! వీరు కీడు ఉద్దేశముగలవారైయున్నారని ఆమె గ్రహించక పోవడమువల్ల కనిపెట్టకపోవడమువల్ల స్వల్పనేరమే అయియుండదా? ఆమె బైలుదేరకముందు తాను ప్రార్ధనచేసికొన్న యెడల ఆ పాపమార్గమునకు వెళ్ళకుండా ఆటంకము కల్గియుండునుగదా?


5. క్రీస్తుప్రభువు పరిశుద్దాత్మను పొందిన తరువాత వెంటనే సాతాను శోధన ఆరంభమాయెను, గొప్పస్థితిలోనికి వెళ్ళిన తరువాత (పరిశీలించుట) శోధించుట అవసరమైయున్నది. ఎందుకంటే నీ గొప్పతనము ఒంటరిగానుంటేనే గొప్పతనమా? శోధనవచ్చేటప్పుడు ఉండేదో, ఊడేదో బుజువు తెలుస్తుంది.


ఉదా: - క్షయరోగులకు జ్వరము పూర్తిగా పోగానే నడవడానికి సెలవిస్తారు. రెండురోజులు నడచిన తర్వాత జ్వరము మరలా వచ్చిన యెడల ఆ ఆరోగ్యము స్థిరమైన ఆరోగ్యముకాదని గ్రహించుకొంటారు.


6. సూదంటురాయికి (Magnet అయస్కాంతము) సరిహద్దులో సూదిగాని, ఇనుపముక్క గాని, యున్నయెడల సూదంటు రాయివైపు లాగబడును. ఎందుకంటే వాటిలో లాగబడే నైజమున్నది. మన హృదయములో నున్న చెడు నైజము పిశాచియొక్క శోధనకు త్వరగా లోబడిపోవును. అందుచేతనే మనము క్రీస్తునందు నూతన సృష్టియైయుండవలెను.


7. ప్రపంచమంతటన్ గ్రమ్ము పిశాచిలేమిచేయున్, మమ్మెల్ల మ్రింగ నున్నను మాకేల భీతివేయు? ఈలోకాధిపుడుగ్రుడైనను దానేమిచేయు? ॥మాకర్తగట్టి॥ ఇట్లు లూథర్ పాడెను. ఇట్లు శోధనకాలమందు ప్రతి క్రైస్తవుడు పాడవలెను.


8. యోసేపు శోధన తనయొద్దకు వచ్చినపుడు తాను ఆ శోధనకు లొంగిపోలేదు గాని ఆ శోధనయొద్దనుండి పారిపోయెను. ఇట్లే అందరు చేయవలెను. దావీదువలెనే గొప్ప ఆత్మీయమైన అనుభవము లేకపోయినప్పటికిని చిన్నపుడు నేర్చుకొన్న సంగతులను బట్టి యోసేపు బలముగలవాడై శోధనను జయించెను. యుద్ధములో ఒక దేశమును జయించిన రాజు కంటే యోసేపు వంటివాడే గొప్ప జయశాలి. స్నేహితుడా నీవు నీ నైజమును జయించుము. అప్పుడు నీవు యోసేవువలె సింహాసనాసీనుడవైయుందువు. యోసేపు పారిపోయెను గాని క్రీస్తుప్రభువు శోధన స్థలమునకు ఒంటరిగా వెళ్ళెను, జయించెను. ఇది మరింత చిత్రమైన కార్యము, ప్రభువు విషయములో నొకటి జ్ఞాపకముంచుకొనవలెను. ఆయన శోధన స్థలమునకు దైవాత్మచే నడిపింపబడెను. ఆయన నైజములో సూదంటురాయి ఎదుటనున్న వస్తువుయొక్క స్వభావము (అనగా పాపశోధనలవైవు లాగబడేట్టు) వంటి స్వభావములేదు. గనుక జయించెను. ముందు నైజమును మార్చుకొనవలెను. ఆలాగే మనలను ఆత్మ నడిపించుకొని వెళ్ళితే వెళ్ళవచ్చును.


9. ఒకనిచ్చెన కలదు. దానికి 7 మెట్లుయున్నవి. ఒకడు చివరమెట్టుకు వెళ్ళిపడ్డాడు. దెబ్బతగలదా? ఎక్కువ స్థితిలోనికి వెళ్ళి పడకుండా జాగ్రత్తపడవలెను.


10. శోధనలు అనగా

ఈ మొదలైన శోధనలు వచ్చేటప్పుడు వాటినన్నిటిని జయించుటకు స్థిరముగా నిలువబడవలెనుగాని చూచి బెదరకూడదు. ఇవి వచ్చునని ముందుగానే మనకు తెలియునుగదా పరలోకములోనుండి ఒక దరినుండి శక్తినిపొందుచు, ఒకదరినుండి శోధనలు జయించు చుండవలెను.


11. దావీదు దైవజనుడైయుండెను. ఆయన శోధన కాలమందు పాపముయొక్క సంగతి మరచిపోయియే ఉండెను. నాతాను ప్రవక్త వచ్చి ఉపమానముగా దావీదునకు పాపము జ్ఞాపకముచేసినప్పుడు అది జ్ఞాపకము వచ్చెను. ఆలాగుననే శోధనయుండును. కొందరు గొప్ప పాపములను గురించికూడా తలంపక ఏమియులేనట్లుగా నుందురు. స్నేహితుడా జాగ్రత్తగా నుండుము. మంచి మనస్సాక్షి కలిగియుండుము. పాపమువలన మనస్సాక్షి కప్పియుందును. అప్పుడు మంచిచేయుటకు దానికి మనస్సాక్షికి శక్తియుండదు.


12. సొలోమోను అన్నీ తెలిసినవాడైనను అన్యస్త్రీలను వివాహము చేసికొనెను. స్త్రీలయొక్క ప్రేరేపణచేత విగ్రహారాధన పాపములో పడెను. కాబట్టి ఇతరులయొక్క ప్రేరేపణలకు మనము ఒప్పుకొనకూడదు. ఎంతటివారైనను అనగా దావీదు, సొలొమోను వంటి సజ్జనులైనను పడబోవుటకలదని జాగ్రత్త పడవలయును. ఈ వాక్యములను బాగుగా నలగ చదువుకొనవలెను. 2తిమోతి 2:15; 3:12-13; 2కొరింధి. 11:14; 1పేతురు 5:9; 1యోహాను 5:4; ఎఫెసీ 6:16; దా.కీర్తన 56:12.


13. షద్రక్ , మేషక్ , అబెద్నెగోలు ఏమిచెప్పియున్నారు. రెండు సంగతులు చెప్పిరి. (దాని. 3:17-18)

చూచినారా! వారియొక్క స్థిరవిశ్వాసము. అగ్నిగుండమువంటి శ్రమలు వచ్చినను, విశ్వాసము కదలకూడదు. శరీరము భస్మమైపోవచ్చును, కాని విశ్వాసము అగ్నికి తగులవడిపోదు.


14. బెల్జియము దేశములో గొప్ప యుద్ధకాలమందు ఒకభక్తిగల స్త్రీ గాయపడినవారికి సహాయము చేయుచుండెను. ఆమెను తుపాకితో కాల్చివేయుటకు శత్రువులు నిశ్చయించుకొనిరి. అప్పుడు ఆమె వారితో తాను ప్రభువు భోజనము పుచ్చుకొనేవరకునుండుడని చెప్పెను. తరువాత ఆమె ధైర్యముగా వారి నెదుట నిలువబడెను. కష్టములు, చిక్కులు, నష్టములు, అవమానములు తలంచకూడదు. ఇవన్ని వెనుకయుండును. భూకంపమువంటి కష్టములు వచ్చును. ముందుకు సాగిపోవలెను. శోధనలను శ్రమలను సహించుకొనువారెవరో నూతన యెరూషలేములో ఒక ఆభరణముగానుందురు.


విశ్వాసి, శోధనకాలమిదియని, ఇది శోధనని గ్రహించే అందులో పడే కాలముగదా! అని తెలుసుకొని స్థిరముగా నిలువబడవలెను.