గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
దైవకృప అనే రక్షణ బాణము
"ఎలీషా బాణము వేయుమని" చెప్పగా అతడు బాణము వేసెను. అతడు - “ఇది యెహోవా రక్షణ బాణము” అని ప్రవక్త చెప్పెను. 2రాజులు 13:15-17
రక్షణ బాణము అనగా రక్షించునది అనగా రక్షణ యెహోవా చేతిలోనే ఉన్నది. అనగా దేవుడే రక్షించవలెను. అనగా విడిపించు బాణము. రక్షణ అనగా ఏమి?
- 1) విమోచించుట అనగా అన్ని కీడులు తొలగించుట.
- 2) సదుపాయము చేయుట అనగా మేలు దయచేయుట, రోగము నివారణ చేయుట.
ఈ రెండు చేసిన సంపూర్ణ రక్షణ అగును. మొదట పని అనగా కీడును తొలగించుట దేవుడు చేయవలసిన పని. రెండవ పని మేలును పొందుట మనుష్య ప్రయత్నముతో కూడినది.
ఉదా: అరణ్యములో పులి నోట పడవలసిన ప్రయాణికుని తప్పించిరి. ఇది మొదట పని. అయితే అతనిని అక్కడ విడిచిన రక్షించి ప్రయోజనము లేదు. పులి తిరిగి వచ్చును గనుక దగ్గరగాఉన్న గ్రామమునకు తీసికొని వెళ్ళి కాపాడుట, ఈ రెండు కలిపి రక్షణ అంటారు. ఈ రెంటిని ఇచ్చువాడు రక్షకుడు. యేసు ప్రభువు ఈ రెంటిని చేయుచున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా తండ్రి చినిగిన, మాసిన వస్త్రములను తీయించి స్నానము చేయించెను. ఇది విమోచన, తరువాత మంచి భోజనము పెట్టి సదుపాయము చేసియున్నాడు. ఇదే సంపూర్ణ రక్షణ. ఇశ్రాయేలీయులకు అరామీయులు శత్రువులు. యెహోవా మన పక్షమున నున్నాడు. గనుక యెహోవా అరామీయులను వెళ్ళగొట్టును. యెహోవా కృపవలన ఇశ్రాయేలీయుల రాజు రక్షింపబడును. రక్షణ ఉచితము, దేవుడిచ్చినది. సైతాను మనమీద శోధన బాణములు వేయును, అయితే రక్షణ దేవుని కృప వలన కలుగును. యోహాను 14:14లో “మీరు నా నామమున ఏమి అడిగినను చేతును” అని చెప్పెను. యేసుప్రభువును మనము నమ్మిన యెడల ఆయనే మనలను రక్షించును.
పౌలు ఎఫెసు పత్రికలో కృపవలన రక్షింపబడుదుమని చెప్పెను (ఎఫెసీ. 2:8). అనగా మనము పుట్టక పూర్వమే దేవుడు మన కొరకు రక్షణ ఏర్పరచియున్నాడు. దీనియందు మన ప్రయత్నములేదు. ప్రార్ధన లేదు. మన ప్రయత్నము లేనిదే జరుగునది కృప. మనము పుట్టక పూర్వమే దేవుడు తన అంతరంగ ప్రేమనుబట్టి రక్షణను సిద్ధపరచియున్నాడు. దీనియందు మన ప్రయత్నములేదు. చెట్లు, జంతువులు మొదలగునవి ఏలాగు కలుగజేసెనో, ఆ విధముగానే రక్షణ సిద్ధపరచెను. కృపలేని యెడల రక్షణలేదు కృప ద్వారానే రక్షణ కలుగుచున్నది.
రెండు సంతోష వాక్యములు:
- 1) జయము వచ్చును
- 2) అది దేవుని వలన కలుగును.
విచారముగా నున్నప్పుడు రెండు ఆదరణ వర్తమానములను రాజు వినెను. ఆలాగే విశ్వాసులైన వారికి విచారములో అవిశ్వాసస్థితిలో నిరాశ సమయములలో ఆదరణ ప్రభువు ఇచ్చును. ప్రభువు వలననే ఇట్టి ఆదరణ కలుగును. ప్రభువే వీటిపై జయము కలుగజేయువాడు. ప్రభువు ఇచ్చు ఆదరణ దైవజనుల ద్వారాగాని, వాక్యముద్వారా గాని మనకు వచ్చును. ప్రవక్తయైన ఎలీషా సేవలో మొదటి పర్వమైన 20సంవత్సరములు తర్వాత రాజునకు పట్టాభిషేకము చేసెను. తన విశ్వాసులకు ఆత్మాభిషేకము ప్రభువు ఇచ్చును. అదే పరిశుద్దాత్మ కుమ్మరింపు. యేసుప్రభువు నది ఒడ్డున నున్నపుడు ఆ విధముగా జరిగెను. ఈ అభిషేకము వలన ఆనందము, బలము వచ్చును. ఎలీషా సేవలో మరొక 45సంవత్సరములు అయిన తర్వాత రాజునకు ఆదరణ కలిగించెను. ఇది మరియొక అభిషేకము. యెహోవా రక్షణబాణము, ఇది గొప్ప ఆనందము. ఆత్మానందము, గొప్ప అభిషేకము. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని (దా.కీర్తన. 23:5) ఆనందములో నిండియుండుటను బట్టి దావీదు చెప్పుచున్నాడు.
ఈ కథను కొన్ని భాగములుగా చదువవచ్చును.
- 1) రాజు బాణముల మీద చేయివేసెను. ఎలీషా రాజు చేతులమీద తన చేతుల నుంచెను ఇది ఒక భాగము.
- 2) మూడు బాణములు తీసినేలను కొట్టుట ఒక భాగము.
- 3) తర్వాత ఎలీషా చెప్పిన మాటలు అనగా 5 లేక 6 మార్లు ఎందుకు కొట్టలేదు. మూడుమార్లు కొట్టితివి గనుక మూడుమార్లు జయించెదవు. మరొక భాగము -
- 4) నాశనమగు వరకు కొట్టవలసినది మరొక భాగము మొదటిభాగములో రాజు బాణముల మీద చేయివేసెను. దేవుడను గ్రహించిన బాణములను ఉపయోగించుటకు రాజు ఇష్టపడెను.
రెండవ భాగములో బాణములను నేలను కొట్టమని చెప్పెను. రాజు మూడుమార్లు బాణములను కొట్టి మానివేసెను. రాజు బాణములను నేలను కొట్టుటలో అర్ధములేదు. ఆలాగు కొట్టుటలో రక్షణ కలుగునను ఆశ రాజులకు కనబడదు. గాని రాజు ప్రవక్త చెప్పినట్లు చేసెను. ఇదే విశ్వాస క్రియ కాబట్టి విశ్వాసము ద్వారా రక్షణ కలుగును. రక్షణ సంపాదించుటలో రెండవ భాగము విశ్వాసము. దేవుడు రక్షణ సిద్ధపరచుట ఒక భాగము, విశ్వాసము ద్వారా గైకొనుట రెండవ భాగము.
కృప - రక్షణ - దేవుడు విశ్వాసము - రక్షణ - మనుష్యుడు
ఈ భాగములో కృపవలన రక్షణ కలిగెను. రెండవ భాగములో విశ్వాసము ద్వారా రక్షణ వచ్చెను. రక్షణ ఒకటే. కృప వెనుక దేవుడు నిలిచియున్నాడు. విశ్వాసము వెనుక మానవుడు నిలిచియున్నాడు. మొదట దేవునికి, కృపకు, రక్షణకు సంబంధము గలదు. రెండవది మానవునికి, విశ్వాసమునకు రక్షణలేదు. ప్రభువు పెండ్లి విందుకు పిలిచినప్పుడు అందరికొరకా? లేక కొందరికి మాత్రమేనా? అందరి కొరకు సిద్ధపరచెను గాని అందరు రాలేదు. రాని వారికి విందులో పాలున్నదా? లేదు. ఆ విధముగా అంగీకరించక పోయిన రక్షణ ఎవరికిని లేదు. అయితే పాపి నేనింత పాపిని నాకు రక్షణ దొరుకునా? అని తలంచుచున్నాడు. అందువలన విశ్వాసము లేదు. ధైర్యము, సంతోషము, ప్రేరేపణ లేదు. ఇవి ఉంటే రక్షణ సిద్దపరచబడి ఉన్నది. మనుష్యుడు దేవునియందలి విశ్వాసము సంపాదించుకొనవలెను. ఈ మూడు బాణములు రక్షణ సంపాదనకు ముంగుర్తులైయున్నవి.