2. శక్తికిమించిన శక్తి - ప్రార్ధనాశక్తి

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



రాజులు 18:36-39; మత్త. 6:5-15; యాకో. 5:13-18.

దీవెన :- దైవప్రార్ధనాశక్తి ప్రియులారా! నేటిదిన వర్తమానము ద్వారా ఆ పరమదేవుని ప్రార్ధనాదీక్ష మరియు పట్టుదలగల ప్రార్ధనలు చేయు దీవెన మీకు అందునుగాక! ఆమేన్.


ప్రార్ధన లోకములోనున్న శక్తులన్నిటికన్న గొప్పశక్తియను మాట ఒక పాదిరిగార్కి పిడుగులాంటి వార్తయై ఈవార్త నిజమైతే ప్రపంచములో నిదియే గొప్ప సత్యమగును. మనలో చాలినంతమంది చాలినంత తరుచుగా ప్రార్ధన చేసిన యెడల లోకములోని ప్రతి ఒక్కరును దేవునివైపు చూచి ఆయన మాట వినునట్లు చేయగలము. ప్రపంచమును మార్చి వేయగలము అన్నాడు. ఆయన చెప్పినది సత్యము ప్రార్థన లోకములో నున్న అనంతశక్తియే.

ప్రార్ధన శక్తివంతమైనదని లక్షలాదిసార్లు నిరూపింపబడినది. సరిపడనంతమంది చాలినంత ప్రార్థనచేస్తే లోకమును రక్షించగలము. చాలినంత ప్రార్థనచేస్తే పైమాటలు చెప్పిన పాదిరిగారు అధిక ఉత్సాహముతో క్రైస్తవులు దినమునకొక్క నిమిషము ప్రార్ధనచేస్తే చాలు. లోకమును రక్షించగలరు అన్నాడు. అంతమాత్రమైతే చాలదనియే నా అభిప్రాయము. జీవరాసులను కాపాడుటకు సూర్యుడు దినములో ఒక్క నిమిషము ప్రకాశించి ఊరకుంటే చాలదు. జీవము సూర్యకిరణముల మీద ఆధారపడియున్నది. కోట్లకొలది కిరణములలలో ఒక్క కిరణము జీవనమును సృష్టిచేయలేదు. కోట్లకొలది పడు వర్షపు చినుకులలో ఒక్కటిమాత్రమే చెట్లువేరు వద్దకు పోలేదు. కోట్లకొలదిగా ఉన్న విత్తనములలో ఒక్కటి మాత్రమే చెట్టుగా అగుచున్నదా?

ప్రార్ధన:- సదాకాలము మీతోకూడా ఉన్నానని సెలవిచ్చిన తండ్రీ! మానవులమైన మేము నీతో ప్రత్యుత్తరములు సంధించుటకు ప్రార్ధన అనే సాధనశక్తిని ఏర్పరచినందులకై నీకు వందనములు.


ఈదిన వాక్యముద్వారా జ్ఞానయుక్తముగా పట్టుదలగా ఏలాగు ప్రార్థించవలెనో మాకు నేర్పుమని తండ్రీ నీ నామమున అడిగి వేడుకొనుచున్నాము ఆమేన్.



మే నెల 1939వ సం॥లో దేవదాసు అయ్యగారు రాజమండ్రిలో చేసిన ప్రసంగము.