8. కానుకల పండుగలోని కానుకలు
గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
ఆది. 4:1-5; మార్కు 12:41-44; 2కొరింధి. 9:5-8.
కోతపండుగ, చందాపండుగ, కానుక పండుగ, అర్పణల పండుగ ఆచరించుటకై కూర్చున్న ప్రియులారా! మీ అందరకును ఈ పండుగయొక్క సంతోషము కలుగునుగాక.
కోతపండుగ, కానుకపండుగ, చందాపండుగ, అర్పణల పండుగ, కృతజ్ఞతపండుగ అనుపేరులుగల ఈ పండుగను ఆ పేరులకు తగినరీతిగా ఆచరించుటకై నేను చెప్పుమాటలు ప్రవేశించు నిమిత్తమై మీరు మీ హృదయములలో మీ హృదయములు విప్పి మనో నిదానముతో వినండి.
త్రియేకదేవునికి మహిమ; మనకు రక్షణ; దేవుని రాజ్యమునకు అభివృద్ధి; సైతాను రాజ్యమునకు నాశనము కలుగునుగాక. ఈ పండుగరోజున రెండు పండుగలు. ఈ పండుగ రోజున ఇద్దరి పండుగలు (అనగా మన పండుగ, దేవుని పండుగ).
- 1) మనము చేసే పండుగ అనగా సంతోషముతో చేసే ఈ పండుగ
- 2) మనము ఇచ్చేకానుకలు కృతజ్ఞతతో, సంతోషముతో ఇస్తే అది పరలోకములో ఉన్న దేవునికిపండుగ.
మనము పుట్టక ముందే, అన్నీ కలుగజేసి, మనముపుట్టిన తరువాత మనకనుదినము ఇస్తున్న కానుకల నిమిత్తమై, ఆయన చేసే పండుగే రెండవ పండుగ. మనము తిరిగి దేవునికి ఇస్తే, అప్పుడు ఆయనకు మనకు పండుగ. అనుదినము గాలి, ఎండ, వేడి, నీరు ఆయన ఇస్తే అది మనకు పండుగే ఎప్పుడనగా మనము గ్రహించి తెలిసికొనపుడు. గనుక మీకెన్ని పండుగలు జ్ఞాపకము చేయుదునో అవన్ని జ్ఞాపకము ఉంచుకొనండి. మొట్టమొదట దేవుడు మనకు రెండు కానుకలు ఇచ్చిరి. మనము పుట్టకముందే, వాటిని మనకు ఇచ్చివేసి, ఇంకా తీసికొనలేదు. మనము అవి అనుభవిస్తునే ఉన్నాము. అవి
- 1) ఆకాశము,
- 2) భూమి.
భూమ్యాకాశములు దేవుడు మనకు ఇచ్చిన గొప్ప కానుకలు. సూర్యకాంతి, వర్షము, ఆకాశమునుండియే వస్తున్నవి.
2. భూమినుండి ఫలవ్మక్షాలు, పంటలు వస్తున్నవి గనుక దేవుడు ఇచ్చిన ఈ రెంటి విషయమై కృతజ్ఞత చెల్లించవలెను. ఈ వేళ ఇంకా ఎక్కువ చెల్లించవలెను.
2వ కానుక:- ఇదియు దేవుడిచ్చినదే. ఇది మొదటి రెండిటికంటె గొప్పది. ఆయన మాటలుగల బైబిలుగ్రంథమే, ఆ కానుక, ఇది భూమ్యాకాశములను గురించికూడా బోధించుచున్నది. ఇది చదివినప్పుడే భూమ్యాకాశములయొక్క వివరములు తెలియుచున్నవి. చదవకముందు గ్రహింపు ఉన్నదిగానీ, బైబిలు చదివితే వాటి పూర్తి వివరములు తెలియుచున్నవి. * భూమి యాకాశముల కానుక గొప్పదా? వాటిని గురించి బోధించు బైబిలు కానుక గొప్పదా? బైబిలు కానుకే గొప్పది.
3వ కానుక:- మొదటి రెండు కానుకలకంటె, బైబిలు గ్రంథ కానుకకంటె మూడవది ఇంకా గొప్ప కానుక. ఇయ్యగా ఇయ్యగా ఇంకా గొప్ప కానుక దేవుడు ఇచ్చెను ఇయ్యగా ఇయ్యగా, ఆయన ఇంకా గొప్పవి ఇస్తునే వస్తున్నారు. ఇది పాత ప్రసంగమైననూ పండుగ వంక మీద క్రొత్తదిగా చెప్పుచున్నాను. దేవుడు ఇచ్చేవాటిలో మూడవది. ఏ కానుకయైననూ దేవుడిచ్చుట, మనము పుచ్చుకొనుటయై యున్నది. మనము పుచ్చుకొని దేవునికి కానుక ఇచ్చే పండుగయే ఈ కానుక పండుగ. ఆ మూడవ కానుక ఏనదగా అసలు దేవుడే మన మనిషియై మన కానుక అయిపోయినాడు గనుక అన్ని కానుకలకంటె ఆయన గొప్ప కానుక. మనము ఆ కానుక విలువను గ్రహించలేము.
ఒక ఆవును ఎంత మంత్రించిననూ, పక్షికాదుగాని దేవుడు మన మనిషిగా మారిపోయినాడు, మనకు కానుకగా ఏర్పడినాడు ఇదే క్రిస్మసుపండుగ. అది జ్ఞాపకముచేసికొని, ఈ కానుకల పండుగ, అర్పణల పండుగ కృతజ్ఞత పండుగ చేస్తున్నాము.
4వ కానుక:- దేవుడిచ్చే కానుక, మనము అందుకొనే నాలుగవ కానుక ఏదనగా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇంతకుముందు కుమారునిచ్చినది మూడవది. ఇది నాల్గవది అనగా పరిశుద్దాత్మనిచ్చిన పండుగ. యేసుప్రభువువారు ఆరోహణమైన తరువాత 120మంది మేడగదిలో ఆత్మకొరకై ప్రార్థించగా ఆత్మను ఇచ్చినది నాల్గవ కానుక పండుగ. ఈ కానుకద్వారా వచ్చే కానుకలు, వరములు అనేకములు. అవి మన అనుభవములో ఉన్నవి.
- 1) భాషలతో మాటలాడుట,
- 2) భాషార్ధము చెప్పుట,
- 3) రోగులను స్వస్థపరచుట.
ఇవన్నీ ఈ నాలుగవ దానినిబట్టి వచ్చినవి. ఓహో ఇవి చాలా ఉన్నవి. ఈ నాలుగు తలంచి కృతజ్ఞత గలిగి కానుక ఇచ్చే వారే, నిజముగా కానుక పండుగ చేసేవారు.
5వ కానుక:- ఈ కానుక ఆయన ఇంకా ఇవ్వలేదు. అదేదో తలంచండి. ఈ అయిదేకాదు ఇంకా ఉన్నవి అవి బాగా తెలిసికొనవలెను. అవి మనవద్దకు రాలేదుగాని వాటికొరకు ఎదురుచూస్తున్నాము. అదే ఆరోహణ కానుక. ఎవరు రెండవ రాకడకు సిద్ధపడుతున్నారో అది వారు పొందు కానుకే, ఆరోహణ కానుక. ప్రభువు మధ్యాకాశములోనికి వచ్చి సిద్ధపడిన వారిని తనయొద్దకు ఆకర్షించుకొనును. పై నాలుగు అందుకొన్న వారున్నారు. అయితే, వీరిలో రాకడకానుక అందుకొనేవారుంటే ఉంటారు లేకపోతే ఉండరు. ఈ ఐదవ కానుకకు సిద్ధపడుట కష్టము.
- 1. పాపవిసర్జన,
- 2. రక్షణ పొందుట (కష్టము),
- 3. ప్రభువుతో వెళ్ళుటకు సిద్ధపడుట.
ఈ మూడును చాలా కష్టము. మిగిలిపోయిన వారిగతి ఏమి అనగా, రాకడకు వెళ్లక పోయిననూ రక్షణపొందినారు గనుక చనిపోయి మోక్షానికి వెళ్లుదురు. ఆరోహణము ఇచ్చేవరకు ఉగ్గబట్టి ఉండలేక చనిపోయిరి. ఇన్ని కానుకలు అనుభవించిన ప్రియులారా! పై నాలుగింటికి సిద్ధపడినట్లు ఐదవ దానికిని సిద్ధపడంది. సిద్ధపడినవారిలో ఈ విషయాలు వింటున్న మనమును చేరాలి ఇప్పటికి కాలేదు అనగా సిద్ధపడలేదు. ఇకముందుకైన వస్తారా (సిద్ధపడతారా?) వస్తామా అనుసందేహముంటే అయిదవది అనగా ఆరోహణ కానుక అందుకొనలేము అదిచాలా ఆటంకము. “త్వరగా వస్తానన్నారు. నేను సిద్ధపడతాను” అని నమ్మి సిద్ధపడువారే రాకడలో వెళ్లువారు. మొదట నాలుగు కానుకలు ఆయన ఇయ్యడము నిజమైతే, ఐదవది మాత్రము ఎందుకు నిజముకాదు! అట్టివారే సిద్ధపడి రాకడలో పాలుపొందుదురు. ఇప్పుడు చెప్పిన కానుకలు అన్నిటికంటె మించినవి ఎవ్వరు ఇయ్యగలరు? ఎవ్వరూ ఇవ్వలేరు మనమెవరమూ ఇయ్యలేము, ఇయ్యడానికి లేవు లేవు. ముందు ఆయన ఇచ్చిన నాల్గింటికిన్ని నీ హృదయములో స్తుతిచేస్తే వాటితో సమానకానుక నీకున్నట్టే. నీ విచ్చినట్టే. ఈ ఐదు కానుకల నిమిత్తమై కృతజ్ఞతతో కానుకలు ఇయ్యండి మరి.
ఆయన ఇంకా ఐదవది ఇయ్యలేదు గాని మార్కు 11:24లో ఉన్నట్లు లేకపోయిన ఉన్నట్టే అని భావించి ఇస్తే మనకు ఆయనకు సంతోషమే.
దీవెన:- షరా! ఈ దీవెన రాకడలోకి వెళ్లేవరకు కూడా వస్తూనే ఉండును గనుక ఆయన ఇచ్చిన ఈ కానుకలేకాక ఈ కానుకలవలన ఇంకా ఇచ్చే దీవెన పొందుటకు మీ కానుకలు చెల్లించండి అట్లు చెల్లించుటకు దేవుడు మీకు కృప దయచేయునుగాక. ఆమేన్.