4. సంపూర్ణ ఉపవాస అభ్యాసము

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



యెషయా 58:3-8; 1థెస్స. 5:12-24

ఉపవాస దిన ఆసక్తిపరులారా! మాకందరకు సంపూర్ణ ఉపవాస దీవెనలు అందునుగాక! ఆమేన్.


ప్రార్ధన:- భూలోకమందున్న మా తండ్రీ! పరలోకమందున్న మా తండ్రీ! తండ్రి, కుమార, పరిశుద్దాత్మ అను త్రిత్వదేవా! ఇప్పటి మా కూటములో ఉన్న తండ్రీ నీకనేక స్తోత్రములు. సైతానుకుకూడా ఈ కూటమునకు వచ్చుటకు సెలవిచ్చిన తండ్రీ స్తోత్రములు. మేము ఎటువంటి మీటింగులు చేసికొనుచున్నామో, ఆ మీటింగులు సైతాను కూడా చూడవలెను. గనుక నీవు అతనికి సెలవివ్వడము మంచిదే. అతని ప్రయత్నములను, అతని రాజ్యమును పడగొట్టే ప్రయత్నముల నిమిత్తమైన ఈ మీటింగును అతడు అతని సైన్యము చూచుట ముఖ్యము. అలాగే నీ విశ్వాసులు నీ రాజ్యమును వృద్దిచేసే మీటింగులు చూచుటకు దూతలు, పరలోక వాస్తవ్యులుకూడా రావలెను. వారిని కూడా తీసికొని రమ్ము. అలాగే ఎవరికైతే వరమున్నదో అట్టి భూలోక వాస్తవ్యుల ఆత్మలనుకూడా ఇది చూచుటకు తీసికొని రమ్ము. ఎందుకంటే ఈ పని వారుకూడా చూడవలెను.


ఈవేళ ఇక్కడ మీటింగు ఉన్నదని తెలియ జేసినప్పుడు ఎవరికి తెలిసినదో, వారిలో మీకిష్టమైన వారిని తీసికొని రమ్ము నీకిష్టము లేనివారిని రానియ్యవద్దు. తీరా వచ్చిఉంటే మెల్లగా వారిని సాగనంపుము. ఈవేళ నీవు మాకు ఏమి చెప్పనైయున్నావో వాటిని చెప్పుము. వాటిని వినగలిగే మా హృదయ చెవులను విప్పుము, ఆదరించుము. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్పేవి వినవలెను గదా. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలను, పెద్దవారిని, క్రైస్తవులను, క్రైస్తవేతరులను అందరిని పేరు పేరు చొప్పున దీవించుము. ఈ ప్రార్ధన త్వరగా వచ్చుచున్న మా ప్రభువుద్వారా ఆలకించుము ఆమేన్.


1. కఠినమైన ఉపన్యాసాలు వినేటందుకు వచ్చినట్టి విశ్వాసులారా! వినండి. నా మొదటి ప్రసంగము ఏదనగా ఉపవాసము ఈ సంగతులు మీరు ఇదివరకే ఇతర స్థలములలో, బైబిలులో, సన్నిధి కూటాలలో విన్నారు. కొందరు వినలేదు. సన్నిధి కూటములలో యేసుప్రభువు చెప్పిన వివరణలు అనగా ఉపవాసమునుగూర్చిన వివరములు, ఆ కూటస్తులు నాకంటె బాగా చెప్పగలరు.

ఈ ఐదు ఉపన్యాసములును మిక్కిలి అవసరమైనవి.


ఉపవాసము: -

పూనానుండి దౌండు స్టేషనునకు బండి వెళ్ళుచుండగా, దానిలో ఒక పెట్టెలో మిలటరీవారు ఉన్నారు. దానిలో ఒక ఆంగ్లో- ఇండియన్ వలె ఉన్న ఒకవ్యక్తి, వారు స్థలమియ్యనందున బండిలో ఒక మూల నిలువబడి, ఆ బండిలో ఉన్నవారితో, లోకము ఎవరికొరకు కనిపెట్టుచున్నదో మీరు ఎరుగుదురా? అని అడిగి అంతర్థానమై పోయారు.


ఈలాగు ఆయన అనేకమారులు మనలను దర్శించును, పరీక్షించును, అనుభవము నేర్పించును. ఈ చెప్పబడిన సంగతులన్నీ మన అనుభవములో ఉండుటకే ఈ కూటము ఏర్పాటు చేసితిని. ఈ అనుభవములన్నీ క్రీస్తుప్రభువు మీకు నేర్పించి, తగిన కాలము తన దర్శనమిచ్చి, తనను గుర్తించగల్గిన జ్ఞాన ప్రత్యక్షతనిచ్చి, వివేకమును వెలిగించి, తన మహిమలో మిమ్ములను స్థిరపర్చుకొనునుగాక. ఆమేన్



16.9.1958వ సం॥లో దేవదాసు అయ్యగారు బేతేలు గృహములో ఉపవాస దినమున చేసిన ప్రసంగము.