గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
13. గింగురు చార్టు
1. కయీనుతో దేవుడెంత శాంతముగ మాట్లాడినను అతడు జవాబు కరుకుగానే ఇచ్చెను. ఎంత చేరదీయవలెనని యుద్దేశించినను అతడు దైవసన్నిధానములో నుండి వెళ్ళిపోనైన వెళ్ళిపోయినాడుగాని మనసు మార్చుకొనలేదు. తప్పులు చూపించుచు ఎంత శాంతముగ బోధించినను వినని వారెందరో గలరు? (ఆది. 4:6,7) సోదర ప్రేమ లేని వారు, దేవుని నెదిరించువారును, శాపము వచ్చునని తెలిసినను మాననివారును, క్షమాపణ కోరనివారును కయీను సంతతి వారగుదురు గదా!
2. 120 ఏండ్లు నోవహు బోధించినను ఓడలోనికి వెళ్ళలేదు. మునిగిపోనైన మునిగిపోయినారు గాని చేయి పైకెత్తలేదు. కొందరికి నాశనకరమైన కష్టము వచ్చినను, రక్షింపుమని చేయి పైకెత్తరు (ఆది. 6,7,8 అధ్యా).
3. ఆది. 19 అధ్యా! సొదొమవారు:
- (1) లోతుయొక్క భక్తినిచూచి మారలేదు
- (2) అక్కడకు వెళ్ళిన దేవదూతలకు హాని చేయవలెనని యత్నించినపుడు వారికి అంధత్వము కలిగినను మారలేదు.
- (3) తత్పూర్వము లోతువలన కడవరి ప్రసంగము విన్నను మారలేదు.
- (4) వెంటనే అంధత్వాద్భుతము జరిగినను దైవశక్తిని గ్రహింపలేదు.
4. ఆది. 27 అధ్యా:
- (1) ఏశావు దుఃఖపడెను
- (2) కేక వేసెను
- (3) వేడుకొనెను గాని దీవెన రాలేదు.
- (4) నాకు ఏ దీవెననైన మిగల్బలేదా? అని అడిగెను. అయినను దీవెన రాలేదు.
- (5) దీవెన కోరుకొంటే శాపమే వచ్చెను.
ఎందుచేతనో హెబ్రీ. 12 అధా॥లో తెలియుచున్నది. మారుమనస్సు పొందుటకే వీలులేకపోతే దీవెన పొందుటకెట్లు వీలుండును? ఎన్ని తప్పులున్న నేమి? మారుమనసుకు సందుంటే తప్పులు హరించు సందేలేదు. ఏశావునకు స్వకీయ సంతుష్టి కలదు, గాని దైవవాగ్ధాన సంతుష్టి రాలేదు. అది తండ్రి మాట, వేటకు వెళ్లుట తాను జ్యేష్టుడై యుండుట ఇవన్నియు సంతుష్టి కలిగించెను గాని ఏర్పాటు సంతుష్టిలేదు. అట్లే వధువు సంఘస్థులకు స్వకీయ సంతుష్టి అనగా చదువుచున్నాను, ప్రార్థించుచున్నాను, ఆరాధనకు వెళ్ళుచున్నాను, సేవ చేయుచున్నాను అనునవి స్వకీయ సంతుష్టికి సంబంధించినవి అవి మంచివేగాని ప్రభువునకుకూడ సంతుష్టి యుండవలెను (లూకా. 18:9).
5. భూలోకములో నా నామము ప్రచురమగు నిమిత్తమై నేను ఫరోను ఏర్పరచుకొంటిని మరియు ఫరో హృదయము కఠినపరచెను (నిర్గమ. 7:3) కొందరు వాక్యము వినగానే మార్పుపొంది చివరి వరకు భక్తిగానే యుందురు నడుచుకొందురు.
కొందరు వాక్యము వినగానే వృద్ధిపొందుచుందురు. నీరసము వల్ల పడుచుందురు లేచుచుందురు. ఇంకను మరికొందరు దేవుని భయము వల్లను, మనుష్యుల భయమువల్లను, కష్టముల భయము వల్లను, పాపము చేయుట మానివేయుదురు. అయితే వేరే కొందరు మనుష్యులకుగాని, దేవునికిగాని, కష్టములకుగాని వెరువక దేవుడెన్ని గడువులిచ్చిన, ఇచ్చిన కొలది మరింత ఎక్కువ పాపము చేయుదురు; తమ హృదయమును కఠినపరచుకొందురు. బహుశ చివరి గడియలో మార్పు పొందవచ్చు కొందరు ఎప్పటికిని మార్పుపొందరు. ఇట్టివారిని గూర్చి దేవుడే వారి మనస్సును కఠినపరచెనని చెప్పుకొందురు. ఫరో ఈ తెగలోనివాడు. నీవు చేయవలసినది త్వరగా చేయుమని ప్రభువు యూదా ఇస్కరియోతుతో చెప్పెను. ఈ తెగవారిని చేయనిస్తాడు. దానికే కఠినపరచుట అని పేరు. తక్కిన తెగవారినికూడ చేయనిస్తాడు గాని ఎప్పటికైన వారు మారుదురని నిరీక్షణకలదు. చివరి తెగవారి విషయములో నిరీక్షణ లేకపోయినను గడువులిస్తూ ఉండును. గడువుల కొలది కఠినత్వము. దీనికే దేవుడు కఠినపరచెను అని పేరుగలదు.
దేవుని న్యాయముయొక్క పని గడువు లిచ్చుటయైయుండును. ఒక కఠినాత్ముని గురించి ప్రార్ధన పెట్టుకొన్నప్పుడు వాలు కుదరవలెను. ఎవరికి కుదరవలెను? శ్రద్దగలవారికిని, పవిత్రులకును, విశ్వాసులకును, ముఖ్యముగా పట్టు విడువని వారికి కుదురును. భార్య ప్రార్ధనవలన భర్తమారిన విచిత్రమైన ఆరునెలల కథ (సంఘ చరిత్ర) మానవులకు బోధించుటకై మనము వెళ్ళుదుము, ప్రజల నిమిత్తమై ప్రార్థన చేయునప్పుడు ప్రభువును పంపుదుము ఫరో మారలేదు.
6. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యొక్క చురుకుదనము చూసిరి. వారు కట్టిన కట్టడములవల్ల మేలుపొందిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను కొట్టినను (సహించుట) పడుటవల్ల మేలుపొందిరి. దానినిబట్టి ఐగుప్తీయులు - ఇశ్రాయేలీయులలో కొట్టినను పడుటవల్ల లోబడేగుణమును చూచిరి. ఫరోతోబాటు అద్భుతములుచూచిరి. అయినప్పటికిని రాజు మాట విని ఇశ్రాయేలీయులను తరిమిరి. ఇశ్రాయేలీయులవలె గట్టెక్కగలమనే గొప్ప నమ్మకముతో సముద్రమునకు అడ్డుపడి అవిశ్వాసమువల్ల నశించిరి. విశ్వాసము ప్రక్కన తరుముట అను నేరమున్నందున హాని సంభవించెను. వధువు సంఘారోహణ కాలమున ఎంతమంది విశ్వాసులు వెనుకపడిపోదురో? (హెబ్రీ. 11:9) ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల యెడల అభిమానముంటే తరుముదురా? మనకాలములో ఎంతమంది అవిశ్వాసులు ఇతర విశ్వాసుల యెడల అభిమానము లేకుండా యున్నారో, ఐగుప్తీయుల దేవునిమీదకూడ అభిమానములేదు. అద్భుతములమీదను అప్పుడే కనబడిన క్రొత్త అద్భుతములమీదను అభిమానములేదు.
7. ఇశ్రాయేలీయులలో బయలుదేరినవారిలో వాగ్ధాన దేశమునకు ఇద్దరే వైళ్ళిరి. తక్కిన వారందరు అరణ్యములో నశించిపోయిరి. ఐగుప్తీయులు విశ్వాసముండినను ఎట్లు నశించిరో ఇశ్రాయేలీయులు వాగ్ధానముండినను పాలస్తీనా వెళ్ళలేదు. వధువు కోరిక గలవారలారా! మీమాట ఏమి? దానిని వదలకండి (రోమా. 9వ అధ్యాయము) రక్షింపబడుట అసాధ్యముగా నున్నను, కొందరికి సాధ్యమే. అనేక సద్గుణములున్నప్పటికిని, ఒక దుర్గుణమున్న యెడల వాటికి విలువ యుండదు.
8. అన్యజనాంగములు దేవుని జనాంగములయొక్క ఉపకారమును, శక్తిని బాటసారులవల్ల తెలుసుకున్నప్పటికిని నాశనము చేయజూచినారు - గనుక అంతరించిపోయారు. ఫరో పృదయమువలె కఠినపరచుకున్నారు గనుక నశించిరి. రాహాబువలె మీ దేవుని సేవించెదము అని అన్నయెడల వారు నేటివరకు ఉండేయుందురు. వారితో ఇశ్రాయేలీయులు యుద్ధము చేయకుండగనే యుండి యుందురు. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినట్టే జరిగెను. ఎట్లనగా ఓ ఇశ్రాయేలీయులారా మీరు నా మాట వినకపోతే నశించెదరు. వారు మిమ్మును శిక్షించితే వారిని శిక్షించెదను (ఆది. 15:19), మరియు ఐగుప్తీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, కల్టీయులు మొ॥వారు ఇశ్రాయేలీయుల శత్రువులు. వీరిప్పుడు లేరు. దైవ సంఘస్తులను నిరాకరించరాదు.
9. ఎన్నిమారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగ నాశనమగునని (సామె. 29:1)లో నున్నది. దీనినిబట్టి చూడగ గద్దింపునకు లోబడనివారు హాని పొందుదురు. ఈ మాటలు అట్టివారికి వినిపించినను మారరు.
ఎ) ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు బాహాటముగ అవమానపరచుచున్నారు. గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతన పరచుట అసాధ్యము అని హెబ్రీ. 6:4-6లో నున్నది. ఈ వాక్యము మిక్కిలి భయంకర ధ్వనిగల వాక్యము. ఇది చదివినను కొందరు మారుమనస్సు పొందకున్నారు. దేవుని వాక్యము తృణీకరించినవారు అనేక కష్టములు పొందుచున్నారు అను కథలు చాలా వినుచున్నప్పటికిని దేవునితట్టు తిరుగరు. భయంకర నాశన వృత్తాంతములు విన్నప్పుడే భయము తోచును కాని తరువాత మరచిపోదురు. మనము భయంకరములైన వృత్తాంతములు తరుచుగ వినుచున్నాము. ఇవన్నియు మనకు పాపములే, పాపిష్టి జనామా! దోషభరితమైన ప్రజలారా! దుష్ట సంతానమా! చెరుపుచేయు పిల్లలారా! మీకు శ్రమ. యెష. 1:4లో నున్నది. ఇట్టి వాక్యములు గద్దింపులు విన్నప్పటికిని కొందరు మారరు. ఆకలి బాధచేత కొందరు, వ్యాధిచేత కొందరు, దీర్ఘవ్యాధిచేత కొందరు, గాడ్పుతగిలి కొందరు, విషసర్పములవల్లను, జంతువుల వల్లను, ట్రైనుక్రిందపడి కొందరు, నీటిలోపడికొందరు, దెబ్బలాడి కొందరు, యుద్ధములో, విషముత్రాగి అనేకమంది మృతులగు చున్నారు. ఎత్తైన స్థలములోనుండి పడి కొందరు, గోతులలో పడి కొందరు మృతులగుచున్నారు. ఇట్లు భయంకరమైన సంగతులు విన్నపప్పటికిని మారుటలేదు. నేరము చేసినందువల్ల కఠినమైన శిక్ష పొందుదురు. కొందరు అజాగ్రత్తగా నున్నందువల్ల మరణము పొందుదురు. ఇవి విన్నప్పుడు మన చెవులకు గింగురుమనుశబ్దము వినబడును. అయినను ప్రజలు మారుటలేదు.
పాపము ప్రవేశించినది మొదలు ఇట్టి భయంకర వృత్తాంతములు అన్ని దేశములలోను జరుగుచునే యున్నవి. అయినను కొందరు. మారుమనస్సు పొందుట లేదు. కొందరికి కలలో తమ పాపములు తెలియుచున్నవి శిక్ష వచ్చునని తెలియుచున్నది. అయినను పాపము మానుటలేదు. మనస్సాక్షి తీవ్రముగ గద్దించుచున్నది. అయినను కొందరు మారుట లేదు. బోధకులయొక్క ప్రసంగములో పాపమును విసర్జించవలెననియు, శిక్ష వచ్చుననియు తెలియజేయుచున్నది. అప్పుడు మాత్రమే భయముగ ఉండును. తరువాత మరచిపోవుదురు మారరు.
కృపాకాలము దేవుడిస్తున్న కొలది కృపను లోకువకట్టి ఇష్టమువచ్చిన పాపములు చేయుచునేయున్నారు. కృపకు లొంగరు, శిక్షకు లొంగరు, భయపెట్టు మాటలకు లొంగరు. మరి దేనికి లొంగరు? కొందరు దేవుని తలంపు లేనివారై యున్నప్పటికిని దేవుడు వారికి ఆరోగ్యము, విద్య, ధనధాన్యములు సమృద్ధిగా ఇచ్చుచున్నాడు అయినప్పటికిని దేవుని తట్టు తిరుగరు. దేవుడు కొందరికి అనేక గండములు తప్పించుచున్నాడు. అయినప్పటికిని ప్రభువు తట్టు తిరుగరు. అప్పటి మట్టుకు పాపమునుమానివేస్తాను అని అనడమే గాని మరల శోధన వచ్చినపుడు పడిపోవడము కలిగియుందురు. ఒక్కసారే చివరివరకు మారిపోయి స్థిరముగ పవిత్రతయందు కొందరు నిలువరు.
దేవుడు కొందరికి గొప్ప ఘనత, గొప్ప ఉద్యోగము, సంతానము, మంచి మేడలు, తులములు, స్నేహితులు మొదలగునవి ధారాళముగా అనుగ్రహించును. అయినను కొందరు ప్రభువు తట్టు తిరుగరు. ఇవన్నియు ఈలోక అనుభవ చరిత్రలో మనము ఎరిగినవే, మరియు కొందరు అనుదినము బైబిలు చదువుదురు ప్రార్ధనలు చేయుదురు, సువార్త ప్రకటింతురు, చందాలు ఇచ్చెదరు, గుడికి క్రమముగ వెళ్ళుదురు అయినను దైవభక్తి విషయములో పట్టుదల, నిరత, వృద్ధి కలిగియుండలేకపోవుచున్నారు. మీ ప్రార్థన వల్ల నాకు ఈ నష్టము తొలగినయెడల నేను దేవునియెడల భక్తిగా నుండెదనని కొందరు చెప్పుచు ఆ ఘడియ దాటిపోయిన తరువాత యధాప్రకారముగానే ఉంటున్నారు. మార్పు కనబడదు. భూలోకములో నున్న అన్ని రాష్ట్రములకు సువార్త ప్రకటించవలెనని ప్రభువు చెప్పినందుకు ఆయన నామధారులు ప్రతి దేశము వెళ్ళి శుభకరమైన వార్త వినిపించుచున్నారు. కాని అన్ని దేశములు సువార్త తట్టు తిరిగినారా? లేదు ఎందుచేత? విన్నవారందరకు చెప్పలేకపోయినారు అంగీకరించే శక్తి యున్నప్పటికిని చెప్పే శక్తి క్రైస్తవులకు లేకపోయినది. మరియొక కారణము (కొద్దిమందికి) వినే శక్తియున్నదిగాని అంగీకరించు శక్తి లేకపోయినది. నేటికి సువార్త బైలుదేరి 2025 సం॥లు (lastest publish of this message) అయినప్పటికిని అన్ని దేశములవారు సువార్త అందుకొనలేదు. ఇది ఎంత విచారకరమైన సంగతి? క్రైస్తవమతము ప్రకటన మతమైయున్నది. అందుచేతనే అన్ని మతముల వారికిని బోధించుచున్నది. మరియు కొన్ని స్థలములయందు ఒక్కొక్కరికిని బోధించుచున్నది. నమ్ము ప్రతివాడను మాటలో ఒక్కొక్కరి సంగతి కలదు. సర్వదేశముల మధ్యను, సర్వరాష్టముల మధ్యను, క్రైస్తవ సంఘమున్నది. సర్వరాష్ట్రములవారు ప్రభువును అంగీకరించలేదు గదా? అట్లే క్రైస్తవులలో అనేకులు అంగీకరించలేదు. ఇది. మరింత గొప్ప విచారకరమైన సంగతి.
బాప్తీస్మము పొందినవారిలో అనేకమైన బలహీనతలు కనబడుచున్నవి. చాల కాలమునుండి క్రైస్తవులుగా నున్నటువంటివారు నూతన విషయములున్నప్పుడు అంగీకరించరు. ఇది అంతకంటే గొప్ప విచారకరమైన సంగతి. క్రైస్తవులలో కొందరు ఆరంభమునందు మహా ఉద్రేకముతో పాటలు పాడుకొనుచు వాక్యము ప్రకటించుచు భక్తిగా నడుచుకొనుచు ఉంటారు. కొన్ని రోజులు అయిన తరువాత కష్టములు రాకపోయినప్పటికిని ఉద్రేకము తగ్గినవారగుదురు? ఎందుచేత అని ఇతరులు అడుగుదురు. నిజమైన దైవమతమైతే ఇట్లు ఉండునా? అని ఇతరులు మతము మీదనే నేరము మోపుదురు. ఇది పొరపాటు. మనిషిది నేరముగాని, మతానిది నేరముకాదు. కొందరు ఆరంభములో బాగుగా ఉండి కష్టములు రాగానే తగ్గిపోదురు. మరికొందరు మొదటినుండియు బాగుగా ఉండి చివరకు తప్పిపోవుదురు. మరికొందరు బాగుగా ఉండి పడిపోదురు. లేతురు, పడుదురు, లేస్తారు, తూలిపోదురు, నిలువబడుదురు, పడుదురు, లేచెదరు, తుదకు ఏమగుదురో? ఇవి మన అనుభవములో కనబడుచున్నవి. సంఘమునకు దేవునికి ఎంత విచారమో మనిషి యొక్క అజాగ్రత్తనుబట్టి ఇవి జరుగును. అందుకే ప్రభువు చెప్పినారు శోధనలో పడకుండా ప్రార్ధయందు మెళకువగా నుండుడి మత్త. 26:41 అని.
ఒక బోధకుడు ఇట్లు అనుచున్నాడు. నేనునా స్నేహితులు మిక్కిలి తరచుగా ఆ గ్రామము వెళ్ళి రేయింబవళ్ళు కష్టపడి పనిచేయగా సంఘము గొప్ప వృద్ధిలోకి వచ్చినది. ఇప్పుడు వెళ్ళి పలుకరిస్తే ఇప్పుడు ఎవ్వరూ పలుకడమేలేదు. ఆ బోధకునికి ఎంత విచారము? పిల్లలకు ప్రతిదినము ప్రార్ధన, వాక్యము నేర్పు, పాటలు ఇంటిలోనున్నవిగాని మార్పులేదు అని అనుచున్న తల్లిదండ్రులకు ఎంత విచారము? ఒక అనుభవశాలియగు ఇవాంజలిస్టు ఇట్లు అనుచున్నాడు. నేను గొప్పవానిని తయారుచేసి బాప్తిస్మము ఇప్పించిన ఆయనకు క్రైస్తవులవల్ల ఆటంకము కలుగగా అతడు మతము, వదులుకొనెను. ఎన్నడు పాపము ఎరుగని ఆదాము, హవ్వలు పడిపోయినప్పుడు తండ్రికి ఎంత విచారము? వినేవారలారా! జాగ్రత్తగా నుండండి నిలిచియున్నానని అనుకొనువారు పడకుండ చూచుకొనవలెను అని పౌలు చెప్పినమాట ఎంత మంచిమాట. అందరిని పిలిచిన ఇంకా చోటున్నదని ఒక విందుకర్త అన్నట్టు ప్రభువు చెప్పెను. అంత్యతీర్పు అయిన తరువాత ఇదే జరుగును. నేను మనిషి కొరకు భూమి ఆకాశములు సమస్త సదుపాయములు కలుగజేసి తుదకు నేను మనుష్యుల మధ్య నివాసముచేసి బదలిచేసి సర్వత్ర సువార్త ప్రకటింపుమని నా పుస్తకము ఇచ్చినప్పటికిని ఇంకా రక్షింపబడలేదు గాన ప్రభువుకి ఎంత విచారము?