గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
4. బైబిలు మహిమ
బైబిలు మహిమయను దీనికి బైబిలు, సంఘ చరిత్ర, లోక చరిత్ర, నా వృద్ధానుభవము ఆధారము.
I. బిబ్లాస్ :- లోకములోని గ్రంథములన్నిటిలో గొప్ప గ్రంథమని అర్ధమిచ్చు “బిబ్లాస్” అను గ్రీకు పదమునుండి “బైబిలు” అను పేరు వచ్చినది. "బైబిలు" అను పేరులోనే ఆ అర్ధము తెలియుచున్నది.
(ఎ) దైవాత్మ: దైవాత్మ ప్రేరేపణ వలన వ్రాయబడిన గ్రంథము.
- 1.సృష్టి:- ఆదియందు దేవుడు సృష్టిని మనుష్యులను "లోకములోని సమస్తమును" ఎంత పరిశుద్ధముగా సృష్టించెనో, ఆ సృష్టిలోనికి ఎట్లు పాపము ప్రవేశించెనో, పాపమునుండి నరులను రక్షించుటకు దేవుడు ఎట్లు వాగ్ధానము వినిపించెనో, దేవుడు తన పని నెట్లు చేయుచు వచ్చెనో, ఇది పాపము, ఇది పవిత్రము అని ఎట్లు బోధించెనో, పాపమును ఎట్లు వదలుకొనవలెనో, దేవుడిచ్చునవి ఎట్లు పుచ్చుకొనవలెనో బైబిలు చెప్పుచున్నది.
- 2. ఏక మార్గము:- మానవులందరిని రక్షించుటకై, దేవుడు ఏర్పరచిన ఏకమార్గము ఈ బైబిలులోనే ఉన్నది.
- 3. ఇద్దరినుండి అందరు:- ఇద్దరిలోనుండి ఇంతమంది ఏ ప్రకారముగా లేచినారో ఏ ప్రకారముగా భూమిని ఆవరించుకున్నారో అది బైబిలులో కనబడుచున్నది.
- 4. శిక్ష, రక్ష:- అవిధేయులను శిక్షించుచు విధేయులను రక్షించుచు దేవుడు మానవజాతిని ఎట్లు నడిపించెనో అది బైబిలులో ఉదహరింపబడినది.
- 5. కుటుంబములు, భాషలు, వృత్తులు:- మానవులు ఎట్లు కుటుంబములుగాను ఆయా వృత్తులు చేయువారిగాను జనాంగములు గాను ఆయా భాషలు మాట్లాడువారిగాను చేయబడిరో అనునవి బైబిలులో వ్రాయబడినవి.
- 6. ఆరాధన:- మానవులు ఏక దేవుని ఎట్లు ఆరాధించిరో తరువాత ఇతర దేవతలను ఎట్లు ఆరాధించిరో, తుదకు మతాలు ఎట్లు కల్పించుకున్నారో బైబిలు చూపించుచున్నది.
- 7. దైవ చిత్తము:- దేవుడు క్రమేణ మానవుల అందుబాటునకు వీలైనట్లు తన చిత్తమును ఎట్లు ప్రత్యక్షపరచెనో బైబిలు చెప్పుచున్నది.
- 8. అన్ని కాలముల చరిత్ర:- మానవ సంతతియొక్క గతకాల చరిత్రయు, భావికాల చరిత్రయు, అన్ని కాలముల చరిత్రయు, మన ఉపయోగార్థమై బైబిలు కలిగియున్నది.
- 9. వార్తావాహులు:- ప్రజలకు పారమార్ధిక విషయములను వివరించుటకై దేవుడెట్లు వార్తావాహులను వంపెనో బైబిలు కనపరచుచున్నది.
- 10. నరావతారుడు:- దేవుడు మానవులకు మనుష్య రూపమునదాల్చి (క్రీస్తు అవతారమున) ఎట్లు ప్రత్యక్షమాయెనో బైబిలులో నున్నది.
- 11. క్రీస్తు ప్రభువు:- క్రీస్తుపభువు మానవుల బాధకరమగు దుష్టత్వమును ఎట్లు జయించెనో మనందరి నిమిత్తము సమస్త కార్యములు ఎట్లు నెరవేర్చెనో బైబిలు వివరించుచున్నది.
- 12. క్రీస్తు మతము:- క్రీస్తు మతమెట్లు స్థాపింపబడెనో అప్పటి లోకములో ఎట్లు వ్యాపించెనో మనకు జ్ఞాపకము చేయుచున్నది.
- 13. ద్వారము:- క్రీస్తుయొక్క శక్తిని ఆశ్రయించే మహాదుష్టులైన వారికి సహితము ద్వారము ఎట్లు తెరువబడియున్నదో బైబిలులో నున్నది.
- 14. ఒకటే:- బైబిలు చదివేవారికి యీ సంగతులు స్పష్టమగు చున్నవి. అవి యేవనగా? దేవుడొక్కడే, రక్షణావతారము ఒక్కటే. ఈ సంగతులు గల గ్రంథము ఒక్కటే. క్రీస్తును ఆశ్రయించిన వారికి నివాస స్థానమగు క్రైస్తవమత సంఘము ఒక్కటే. బైబిలు ఒక్కటే దేవుని మాటలు సంపూర్తిగా ఉండే గ్రంథము. క్రీస్తు ఒక్కడే సర్వజన రక్షకుడు. క్రైస్తవ మతము ఒక్కటే, సమస్త జనాంగమును సత్కరించే మతము. పై వ్రాయబడిన బుజువులు పుస్తకమను పేరుకు తగియున్నదని బైబిలొక్కటే చెప్పుచున్నది. ఇవన్నియు బైబిలులోని బుజువులే!
II. (i) మొదటి ముద్రితము:- ముద్రాక్షరశాలలో మొట్టమొదట అచ్చువేయబడినది బైబిలు (జర్మనీభాషలో 16వ శతాబ్ధమున అచ్చువేయబడెను)
(ii) అక్షరముల లెక్క:- బైబిలులోని అక్షరములన్నియు లెక్కపెట్టబడినవి. ఒక్క అక్షరము తీసివేయుటకు వీలులేదు. కలుపుటకు వీలులేదు పొల్లుకూడ తీసివేయుటకు వీలులేదు. మత్తయి. 5:18.
(iii) వ్యాఖ్యానము:- మానవునియొక్క ఆయుష్కాలమునకు మించిపోయే వ్యాఖ్యాన గ్రంథములు బైబిలునకు మాత్రమే కలవు. డాక్టరు మార్టిన్ లూథరుగారు వ్రాసినది తిరిగి వ్రాయుటకు ఒకని ఆయుష్కాలము చాలదు. యోహాను 21:25.
(iv) అందరి గ్రంథము:- బైబిలు ఇప్పటికి 20 వందల భాషలలో అచ్చువేయబడినది. లోకమంతా చదివే పుస్తకము బైబిలు ఒక్కటే. మిషనెరీలు అక్షరములులేని భాషలకు అక్షరములు కల్పించి బైబిలు వ్రాసి అచ్చువెసిరి.
(v) ఆదరణ:- ఇతర పుస్తకములు చదువుట వలన కలిగిన ఆదరణకంటే బైబిలు చదివినందువలన ఎక్కువ ఆదరణ కలిగినదని బైబిలు చదువరులు సాక్ష్యమిచ్చుచున్నారు.
(vi) సుందరసింగు:- సాధు సుందరసింగుగారు ఇతర మత గ్రంథములలో మంచి సంగతులు ఉన్నవిగాని క్రీస్తులేడు అన్నారు. బైబిలులోని అన్ని పుస్తకములలో క్రీస్తు ఉన్నాడు.
(vii) రాళ్ళపై బైబిలు చరిత్ర:- బైబిలు చరిత్ర జరిగిన కాలమందు అన్ని దేశములలో దేవుని విశ్వాసులు పరవాసముచేసిరి. అప్పుడు ఆ దేశములోని అన్యరాజులు తమ రాజ్యచరిత్రతోపాటు విశ్వాసుల చరిత్ర రాళ్ళమీద చెక్కించిరి. వాటిమీద బైబిలు చరిత్ర ఉన్నది. (లూకా. 19:40) ప్రభువు చెప్పినది నెరవేరుచున్నది.
(viii) బైబిలు సారము:- బైబిలు దైవగ్రంథము, బైబిలు కథల పుస్తకము, బైబిలు చరిత్ర పుస్తకము. బైబిలు నీతి పాఠముల పుస్తకము.
బైబిలు అన్ని ప్రార్ధనలయొక్క జవాబుల పుస్తకము. బైబిలులో 66 పుస్తకములలోను బహిరంగముగానైతేనేమి, అంతరంగముగానైతేనేమి ఆయననుగూర్చి వ్రాయబడియున్నది. ఆయనే క్రీస్తు.
(ix) బ్లాక్ :- ఇకమీదట అచ్చు అవసరము లేకుండా బైబిలు అంతా బ్లాక్ క్రింద తయారు చేయుటకు ప్రయత్నము జరుగుచున్నది.
(x) ప్రభువు స్వరము:- యేసుప్రభువు శరీరధారిగా నున్నప్పుడు మాటలాడిన మాటలు ప్రసంగములు ఆయన స్వరముతో తీసి లోకమునకు ప్రకటనచేయుటకు ప్రయత్నించుచున్నారు.
(xi) అక్షర విలువ:- ఆదికాండము మొదటి అధ్యాయము మొదలు మలాకీ వరకు హెబ్రీభాషలోని అక్షరాలు లెక్కపెట్టి 7చేత భాగించిన శేషము మిగలదు. హెబ్రీ భాషలోని వర్ణమాలలోని అక్షరములకు అంకెలు గలవు. అక్షరములకు విలువ అంకెకూడా కలదు. ఆ లెక్కనుబట్టి 7 చేత భాగించి చూచిన శేషము మిగలదు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలోకూడ ఇదే పద్ధతి కనుగొనవచ్చును. బైబిలు అంతటిలో ఉన్న ప్రతి వాక్యమునకు. పేరాకు ఇదే పద్ధతి కనుగొనవచ్చును. తర్జుమ భాషలోని ఈ లెక్క సరిపడదు. ఎవరైన ఒకరు ఎక్కడైన ఒక అక్షరము బైబిలులోనుండి తీసివేసిన ఇది ఎవరో చేసిన మోసమని గ్రహింపవచ్చును. ఒక్క సున్న అయినను లేక పొల్లు అయినను పోదు అను ప్రభువు మాట జ్ఞాపకము వచ్చుచున్నది. లోకములో ఎవరును ఈలాటి లెక్కలుగల పుస్తకము వ్రాయవీలులేదు.
(xii) వ్రాత:- 40 మంది గ్రంథకర్తలు 16 వందల సం॥లు ఈ గ్రంథమును వ్రాసిరి. ఈ గ్రంథమును వ్రాసినందుకు అనేకులు హతులైరి. ద్వితీయోపదేశకాండము భూగర్భములో తర్జుమాచేసిరి. కొన్ని గ్రంథములు గోడలలో దాచియుంచిరి. ఒకరు వ్రాయుచున్నట్లు మరియొకరికి తెలియకపోయిన అన్ని గ్రంథములు ఒకే భాషలో వ్రాయబడకపోయిన ఈ గ్రంథములన్నింటిని వరిశుద్ధాత్మ వ్రాయించుటచే ఒకదానికొకటి సంబంధము కలిగి ఒకే గ్రంథమైనది. అసలు గ్రంథకర్త దేవుడు. (నిర్గమ. 31:16) ఈ గ్రంథము కాపీ తీయునపుడు స్నానముచేసి క్రొత్తబట్టలు వేసుకొని వ్రాసెను. యెహోవా నామము వచ్చినపుడు క్రొత్తపాళీ వాడేవారు.
(xiii) అన్వయ పదములు:- ఒక అంశమునుగూర్చి ఎక్కడెక్కడ అన్వయ వాక్యములున్నవో ఒక గ్రంథము వ్రాసిరి ఒకమాట వంటి మాట ఎక్కడ ఉన్నదో వ్రాసిరి.
(xiv)అపోక్రిప:- ఆదికాండము మొదలు మలాకీ వరకు రక్షణ సంబంధమైన సంగతులున్నవి (తొగరుదారము) (యెహోషువ. 2:18) మలాకీ తరువాత వ్రాయబడిన 16 పుస్తకములలో (అప్రమాణిక గ్రంథములు) మంచి సంగతులున్నవి, గాని రక్షణ సంగతిలేదు గనుకనే బైబిలులో చేర్చలేదు. వాటికే అపోక్రిప గ్రంథములని పేరు.
(xv) టిన్ సిన్ దార్పు :- ఈ దొరగారు బైబిలు ప్రతులు వెదకుటకు లోకమంతా తిరిగెను. ఆయన సీనాయికొండ ఎక్కి బైరాగి మఠము వద్దనున్న బూడిదలో మార్కు సువార్తలో ఒకపుట దొరకగా బంగారమువలె పట్టుకొనిపోయెను (1845).
(xvi) సంచారము:- బైబిలులోని చరిత్ర జరిగినది, లేనిది తెలుసుకొనుటకు భక్తులు దేశ సంచారము చేసి వ్రాసిరి.
(xvii) పటములు:- బైబిలు చరిత్ర జరిగిన అన్ని దేశ పటములు తయారుచేసిరి.
(xviii) సవరణ:- బైబిలును సరిచేయుటకు 300 కాపీలు ప్రోగుచేసి సరిచేసుకొనిరి. కొన్ని ప్రతులలో కొన్ని మాటలు లేనప్పుడు ఈ ప్రతులలో ఈ మాటలు లేవని వ్రాసిరి.
(xix) హింస:- గ్రంథములలో హింసింపబడినది బైబిలు ఒక్కటే. మోషే దైవసన్నిధినుండి రాతిపలకలు తీసికొనివచ్చిన వెంటనే పగుల గొట్టుటకు సాతాను ప్రజలను ప్రేరేపించెను (నిర్గమ. 32:19).
(xx) ప్రతులు:- పరిశుద్ధ గ్రంథము అన్ని భాషలలో అచ్చువేయుటలోను ఎక్కువ ప్రతులు వేయుటలోను అమ్ముటలోను బైబిలే ఎక్కువ.
(xxi) సర్వవ్యాపకత్వము:- దేవుడు సర్వవ్యాపి గనుక బైబిలునకు కూడ సర్వవ్యాపకత్వము వచ్చినది. ఎట్లనగా బైబిలు అన్ని దేశముల లోనికి, అన్ని భాషలలోనికి, అన్ని మతములలోనికి, అన్ని జనాంగములలోనికి అన్నికాలములలోనికి ప్రవేశించుచున్నది. లోకాంతమువరకును వెళ్ళునట్టి ధోరణి కలిగియున్నది. బైబిలులోని ముఖ్య కధానాయకుడగు క్రీస్తు మోక్షములో నుండును. గనుక బైబిలు విషయముల ప్రమేయము కూడ ఆయనతో నుండును. గనుక బైబిలు అనంతకాలమువరకు వెళ్ళుచునేయుండును.
(xxii) గ్రుడ్డివారిచూపు:-
- (1) మీర్జాపురములో సావిత్రమ్మ అను ఒక స్తీ కలదు. ఆమె నేత్రములు మూతపడియున్నవి. ఆమె క్రీస్తు భక్తురాలైనందున బైబిలు చదువగలదు. తక్కిన పుస్తకములు చదువజాలదు. ఇది బైబిలు మహిమ
- (2) ఏలూరులో ఆనందరావు అను ఒకనికి దృష్టిలేదు, చదువులేదు క్రీస్తునందు విశ్వసించుటవల్ల బైబిలు చదువగలుగుచున్నాడు (ఆ దివ్యదృష్టి బైబిలు చదువుటకే ఉపయోగపడును, కాని మార్గము కనబడదు.)
- (3) కాకాని స్వస్థిశాలయందు బైబిలులోని మార్కు సువార్త 5వ అధ్యాయమును చదువునపుడు భూతపీడితులకు విముక్తి కలుగుచున్నది. ఒక గ్రామములో ఒక స్త్రీకి భూతము పట్టినది. ఆమెకొరకు నలుగురు ప్రార్ధించినను లోబడలేదు. అప్పుడు ఒకరు (1యోహాను 3:8) చదువగా రెండు చేతులు కలిపి భూతము దేవునికి నమస్కారము చేసినది. ఇది బైబిలు మహిమ.
(xxiii) పరిశుద్ధ గ్రంథము:-
- (1) బైబిలు దేవుని ప్రేరేపణ వలన వ్రాయబడినది గనుక బైబిలు దైవగ్రంథము.
- (2) బైబిలు సర్వజనుల నిమిత్తమై యుద్దేశింపబడినది. గనుక పరిశుద్ధ గ్రంథము
- (3) బైబిలు నేటికి 20 వందల భాషలలో అచ్చువేయబడి లోకమంతటికి ఉపయోగ గ్రంథముగా నున్నది, గనుక బైబిలు దైవగ్రంథము,
- (4) బైబిలు లోకములోనున్న చెడుగును, మంచిని చూపించుచున్నది. గనుక బైబిలు దైవగ్రంథము
- (5) బైబిలు దుర్జనుల పాపములను మాత్రమేకాక పక్షపాతము లేకుండా భక్తుల పాపములనుకూడా పేర్కొనుచున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
- (6) బైబిలు అనాది ఏర్పాటు మొదలుకొని అనంతము వరకు దేవుడు మానవులకు చేయదలచిన విషయములు కనబరచుచున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
- (7) బైబిలు నరుల నిమిత్తమై వారి జన్మమునకు పూర్వమే కాపుదల కర్తలగు దేవదూతలను, వెలుగునకు కారణమగు ఆకాశమును, నివాసమునకు అవసరమైన భూమిని, దేవుడు కలుగజేసినట్లు స్పష్టపరచుచున్నది గనుక బైబిలు దైవగ్రంథము.
- (8) బైబిలు దేవుడే స్వయముగా మానవుల రక్షణార్థమై నరావతార పురుషుడుగా జన్మించి మానవునికి చేయవలసిన అన్ని పనులుచేసెనని చెప్పుచున్నది గనుక బైబిలు దైవగ్రంథము.
- (9) బైబిలు: యేసు అనగా రక్షకుడనియు క్రీస్తు అనగా రక్షకులని చెప్పుకొను వారందరికంటే మించిన ఏర్పాటుగల రక్షకుడని అర్ధముగల యేసుక్రీస్తు నామమును ఆ అవతార పురుషుడు ధరించుకొనెనని అగపరచుచున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
- (10) బైబిలు క్రైస్తవమత సంఘము ఆ పురుషుని నామమున స్థాపించబడినదని తెలుపుచున్నది గనుక బైబిలు దైవగ్రంథము.
- (11) బైబిలు : క్రైస్తవమతము సర్వజనుల మతమగుటచేత అన్ని మతములలోని వారిని పిలుచుచు, సత్మరించుచున్నదని విశదపరచు చున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
- (12) బైబిలును దీనిలోను, మతమును, నిరర్ధకము చేయుటకై చిరకాలము నుండి అర్ధముకాని వారివలన అనేక ప్రయత్నములు జరుగుచున్నను ఈ రెండును నిలువబడియున్నవి. గనుక బైబిలు దైవగ్రంథము.
- (13) బైబిలు గతకాల వృత్తాంతములు మాత్రమేకాక భావికాల వృత్తాంతములు కూడ ప్రకటించుచున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
- (14) బైబిలు మానవుల ఊహకు తోచని విషయములు ఉదహరించుచున్నవి. గనుక బైబిలు దైవగ్రంథము
- (15) బైబిలు ప్రవచనముల నెరవేర్పునకు కారణమై యున్నది. గనుక బైబిలు దైవగ్రంథము.
సీ॥
బైబిలులోనున్న - పరిశుద్ధ కథలెల్ల
ఎత్తి ప్రార్థించిన - ఉత్తమంబు
బైబిలులో నున్న - వాగ్ధానములనెల్ల -
ఎత్తి ప్రార్థించిన - ఉత్తమంబు
సభ కథలందున్న ఆ సవ్య విషయములు -
ఎత్తి ప్రార్ధించిన - ఉత్తమంబు
నీ యనుభవములో - నీ ప్రార్ధనోత్తర -
లెత్తి ప్రార్ధించిన - ఉత్తమంబు.
తే॥ గీ॥
గ్రంథ వృత్తాంతములును వా - గ్ధానములును
సంఘ వృత్తాంతములును నీ - స్వానుభవము
చేరి నిను బలపరచి నీ - చేత లెక్క లేని
పనులు చేయించును - లెమ్ము లెమ్ము,