గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు
7. వధువు సంఘ చార్టు
I. ప్రత్యేకింపబడుట:-
- 1) ఆదాము పాపకాలము మొదలుకొని జలప్రళయారంభ కాలమువరకు భక్తులను, భక్తిహీనులును కలిసి యుండిరి. (ఇది మిశ్రమ సమూహము) అప్పుడు దేవుడు ఎనమండుగురిని ప్రత్యేకించి నావలో ప్రవేశపెట్టెను.
- 2) ప్రళయాంతము నుండి అబ్రాహాము వరకు మిశ్రమ సమూహము పెరుగుచు వచ్చెను.
- 3) అప్పుడు దేవుడు దానిలోనుండి అబ్రాహామును పిలిచి యూదుల జనాంగమును ప్రత్యేక పరచెను.
- 4) ఆ యూదులలోకూడ నామక భక్తులు నిజభక్తులు కూడ నుండిరి. తుదకు ఆ ప్రత్యేక సమూహము మిశ్రమ సమూహముతో సమానమైనది. తుదకు దేవుడు పెంతెకొస్తు పండుగ రోజున క్రైస్తవ సమూహమును ప్రత్యేకించెను.
- 5) నేటి క్రైస్తవ సంఘములోకూడ నామక క్రైస్తవులు, నిజక్రైస్తవులుకూడ నుండిరి. రేపు రాకడనాడు సజీవులగు నిజక్రైస్తవులను ప్రభువు (రివలేషన్ ) మహిమ మేఘమునకు కొంచుకొని పోవుటవలన ప్రత్యేకించుకొనును
- 6) పతనకాలము మొదలుకొని రెండవ రాకడ వరకుగల కాలములో మృతులైన భక్తులను దేవుడు మోక్షమునకు తీసికొనివెళ్ళుట వలన ప్రత్యేకించుకొనుచున్నాడు.
- 7) మేఘమునకు వెళ్ళు జనసమూహమునకు పెండ్లికుమార్తె సంఘమని పేరు. మృతులైన భక్తులుకూడ సంఘమునకే చెందుదురు. ఈ రెండు సమూహములు కలిసి పెండ్లి కుమార్తె అనబడును. ఈ పెండ్లికుమార్తెకే (పరమగీతము) గొర్రెపిల్ల యొక్క భార్యయనియు (ప్రకటన) నామాంతరములు గలవు. మరియొక సంగతి యూదులలో దేవుడు ప్రతి కుటుంబములోని ప్రథమ పుత్రుని ప్రత్యేకించుకొనెను. జ్యేష్ట పుత్రులు హెబ్రీ. 12:23 చాలామంది కలరు. వారినందరిని ఒక సంఘముగా భావించుకొనవచ్చును. ఏశావు జ్యేష్టుడైనప్పటికిని దీవెనకు దూరస్థుడైనందున తనకంటె చిన్నవాడైనను, యాకోబు జ్యేష్టుడాయెను. ఇది ఆత్మీయ విషయములో వాడుకొను ఒకమాట. ఇదే యూదా జనాంగమునకు వాడబడెను. ఎందుకంటే వారే సర్వ జనాంగములలో మొదట ప్రత్యేకింపబడినవారు (ఇది బాహ్యార్ధమునకు కూడ చెందుచున్నది) హెబ్రీ పత్రికలో జ్యేష్టుల సంఘమనుమాట కూడ కనబడుచున్నది. ఇదియే పెండ్లి కుమార్తె సంఘము.
II. తరగతుల వరుస:- తరగతిలో నామకభక్తులు, నిజభక్తులు అను విభజనలేదు. తరగతిలోనున్న వారందరు భక్తులే అయినను వారు వివిధములైన తరగతులుగా నుందురు. విత్తనముల ఉపమానములో పంట ముప్పదంతలు, అరువదంతలు, నూరంతలు అని ఉన్నది. కొలతలలో భేదమున్నదిగాని పంటలోలేదు. అలాగే రక్షణ పొందుటలో భేదము లేదుగాని వారి ఆత్మీయస్థితిలో భేదముండును.
ఉదా:- స్కూలులో ఫైనలు విద్య అభ్యసించువారు, బి.ఎ. వారు అనే భేదమున్నదిగాని, వారు వీరు చదువుకొన్నవారే. రక్షింపబదినవారందరు పరలోకములో వారివారి తరగతులలో నుందురు.
భూలోకములో ఆత్మీయ జీవన విషయవముందు ఎంత గొవృ స్థితి సంపాదించుకొందురో పరలోకములోకూడ అంత గొప్ప స్థితిలో నుందురు. పునరుత్థాన కాలమందు ఎవరి తరగతిలో వారే పునరుత్థానులగుదురని పరిశుద్ధుడైన పౌలు పౌలు చెప్పుచున్నాడు. 1కొరింథి 15:23. రక్షణ సంకల్పన చరిత్ర చదివిచూడగా - నూతన యెరూషలేములో కిరీటధారులైన పెండ్లికుమార్తె సంఘస్థులుందురనియు, మోక్షములో మరియొక భాగమందు కిరీటములేని రక్షితులుందురనియు, అంత్యతీర్పయిన పిమ్మట భూలోకమందు శేషించిన భక్తులుందురనియు కనబడుచున్నది. పెండ్లికుమార్తె సంఘములో చేరగలవారు మత్తయి 25లో రెండు గుంపులవారు కన్యకలే. రాకకు ఎదురు చూచినవారే. అయినను ఒక లోపమున్నందున రెండవ గుంపువారు చేర్చుకొనబడలేదు. ఏలోటైనను లేనివారు చేర్చుకొనబడిరి. ఇదియొక షరతు. రక్షింపబడిన పిమ్మట అనేకమందిని రక్షకుని యొద్దకు నడిపించువారు మాత్రమే బహుమానము పొందుదురు. సమరయ స్త్రీ రక్షింపబడిన వెంటనే గురుతుగా గ్రామస్థులనందరిని రక్షకుని యొద్దకు తీసికొని వచ్చెను (యోహాను 4:23-30). ఇది ఇంకొక షరతు రెండవ గుంపులోని లోపమేమి? నూనె తక్కువగుటయేగదా! దీనియర్ధమేమి? పెండ్లికుమారుని యెడల చూపవలసిన అభిమానము కొంత తగ్గెను. ఇది ఉండకూడని గురుతు, సంపూర్ణమైన ప్రేమ కలిగియుండవలెను. ఇది మరియొక షరతు. ఇది సొలోమోను (పాట పరమగీతము) చదువు వారికిని ఎఫెసి ఉత్తరము చదువువారికిని అర్ధముకాగలదు. క్రైస్తవ జీవితమును మూడు భాగములుగా ఊహించుకొనవచ్చును
- (1) పాపవిసర్జన స్థితి
- (2) రక్షింపబడిన స్థితి
- (3) కన్యకగా సిద్ధపడిన వధువుస్థితి మరియు కన్యకలు అనేకమంది ఉండవచ్చును, గాని పెండ్లి ఒక్కరికే అగును (లోకరీతిని) అలాగే రక్షింపబడినవారు అనేకులుండవచ్చును. గాని ఒక్క గుంపునకే పెండ్లి కన్యక అని పేరు.
పై రెండుస్థితులకే సంబంధించనపుడు మూడవ స్థితికి ఏల్గాగు చెందగలరు?
III. జ్యేష్ఠుల సంఘము:- హెబ్రీ 12:23 జ్యేష్ఠుడున్నాడని అనడముతోడనే కనిష్టుడున్నాడని తట్టకమానదు. జ్యేష్టుల సంఘము అని హెబ్రీయుల పత్రికలో చదవగానే కనిష్ట సంఘము ఉన్నదని తట్టకమానదు. జ్యేష్టుడనగా మొదటి కుమారుడు, కనిష్టుడనగా కడవరి కుమారుడు. ఇక్కడ జ్యేష్టుల సంఘమనగా నూతన యెరూషలేములో ఉండే పెండ్లికుమార్తె సంఘము అని ఊహింపవచ్చును. పూర్వము యూదుల కుటుంబములో జ్వేష్టుడు ప్రభువు సేవకు ప్రత్యేకింపబడినవాడు. తక్కిన కుమారులు తండ్రియొక్క కుటుంబములోనివారుకారు అని చెప్పకూడదు. జ్యేష్టులు జ్యేష్టులే.
మీరు పరలోకమున పన్నెండు మంది, పండ్రెండు సింహాసనములమీద కూర్చుందురని చెప్పలేదా? (మత్త. 19:28) దీనినిబట్టి చూడగా కొందరూ సింహాసనములమీద నుందురనియు, కొందరు పరలోక రాజ్యవాసులైనను సింహాసనముల మీద నుండరనియు కనబడుచున్నదిగదా? అంతస్థుల భేదముకలదు. అందరును సంతోషమే అనుభవింతురు. ప్రభువు శిష్యులు పన్నిద్దరు. రూపాంతరమప్పుడును (మత్త. 17:1-8) యాయీరు ఇంటిలోనికి వెళ్ళినప్పుడు (లూకా. 8:51) గెత్సేమనె తోటకు వెళ్ళినప్పుడు (మార్కు 14:33) ప్రభువు, పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే తీసికొని వెళ్ళెను. ఆత్మీయరీతిగా వీరు పన్నిద్దరిలో జ్యేష్టులేకదా? ఇది అంతస్థుల తేడ. అబ్రాహామునకు విశ్వాసులకు తండ్రి అను బిరుదు కలదు (రోమా. 4:11) అబ్రాహాము వేరు తక్కిన విశ్వాసులు వేరు. ఉభయులును విశ్వాసులే! అయినను తేడా గలదు. విశ్వాసులందరు విశ్వాసుల తండ్రియని బిరుదు పొందలేదు. విశ్వాసులు కృపను అల్పముగా నెంచుటగాని, దేవుడు విశ్వాసులలో కొందరియెడల పక్షపాతము కనబరచుటగాని, ఈ వంశములో లేదు. అంతస్థునుబట్టి సంకల్పన అబ్రాహాము తన కుమారుని బలి ఇచ్చుటకు పర్వత శిఖరము ఎక్కినప్పుడు సంహార యత్నములో అతని హృదయమున అదివరకున్న విశ్వాసముకూడ శిఖరమెక్కెను. వట్టినేలమీద నుండి జలప్రళయమందు తేలితేలి నావ అరారాతు కొండనెక్కిన సంగతి ఇక్కడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. క్రైస్తవ సంఘము కూడ ఈ లోక శ్రమలలో తేలితేలి అబ్రాహాము కొండకును, నోవహు కొండకును మించిపోయెను. ఇంక ఎత్తుననున్న మహిమ మేఘమునకు వెళ్ళవలసిన సంగతికూడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది.
విశ్వాస విషయములో నోవహు, అబ్రాహామును ఉన్నత స్థితి గలవారని కనబడుచున్నది. అట్లే మహోన్నత స్థితిగలవారందరు నూతన యెరూషలేము వాస్తవ్యులౌదురు. హనోకు, ఏలియా విశ్వాసము వల్లనేగదా ఆరోహణవమైరి? అట్లే రేపు క్రైస్తవ సంవుమును విశ్వాసమువల్ల ఆరోహణమగును. ఆరోహణము కాకుండ మృతులై పరలోకమునకు వెళ్ళనివారికి విశ్వాసములేదు?. ఉన్నదిగాని ఆరోహణము కాలేదు. ఇదియే తేడ. భక్తులందరు అంతస్థులో తేడా ఉన్నదని కనబరచుటకు యీ కథలు పేర్కొనబడినవి. పండ్రెండు గోత్రములున్నవిగదా? ప్రభువు జన్మగోత్రముగా యూదా గోత్రమే ఎన్నుకొనబడెను. ఆ గోత్రములో అనేక వంశములున్నవిగాని దావీదు వంశము ఎన్నుకొనబడెను. భక్తులయొక్క జీవిత చరిత్ర అంతటిలో ఇట్టి అంతస్థులు కనబడుచున్నవి. దేనారములు, మీనాలు (లూకా. 19:13-25) ఉపమానములయందు ఏమి యున్నది? వారి వారి వర్తక ఫలితములలో తేడా కనబడుచున్నది (ఎందుకంటే వారివారి సమర్థతలో తేడ ఉన్నది) గనుక, మరియు వారికి ఇవ్వబడిన బహుమానములోకూడ తేడ గలదు. పది పట్టణములమీదను, ఐదు పట్టణముల మీదనుగల అధికారములలో తేడ గలదుకదా! నక్షత్రములలో ఆ నక్షత్రము మహిమవేరు, ఈ నక్షత్ర మహిమవేరు! (1కొరింథి. 15:41) రెండు మహిమలే గాని మహిమలలో తేడ ఉన్నది? ఆమె ఎక్కువ ప్రేమించినందువల్ల ఆమె ఎక్కువ పాపములు క్షమింపబడెను (లూకా. 7:47) అని ప్రభువు పాపాత్మురాలైన స్త్రీని గూర్చిన విషయములో చెప్పెనుగదా? (ప్రకటన 3:21)లో ఏడు సంఘములను గూర్చిన చరిత్రలోని తేడ గుర్తించదగినది ఏలాగనగా, లవొదికయ సంఘములోని జయశీలులు ప్రభువు సింహాసనము మీద ఉందురని వ్రాయబడియున్నది.
IV పెండ్లికుమార్తె అనుమాట:- ఈ మాట లౌకిక చదువరులకు చాల అభ్యంతరమైనమాట. అయినను ఈ మాట క్రీస్తు సంఘమునకు పెట్టబడియున్నది గనుక మనము వాడవలెను. ఈమాటకు లౌకిక సంఘములో ఒక అర్ధమును, దృష్టాంతమును అగపడును. ఆత్మీయ పదములన్నిటిలో మరియొక అర్ధమును, వృత్తాంతమును అగుపడును. ఏది ఎట్లున్నను, అర్థములు వృత్తాంతములు, అభ్మిపాయభేదము ఏరీతిగా నున్ననూ, ఈ మాట బైబిలులో ఉన్నది గనుక అభ్యంతర పడరాదు. పెండ్లికుమార్తె సంఘములో పురుషులుకూడ ఉన్నారు గనుక కుమార్తె అనుట శరీర నైజమునకు వినసొంపుగా నుండదు. అయినను అర్ధము ఆత్మీయమైనది గనుక వినసొంపుగా నుండకేమి? పాత నిబంధనలోని సృష్టికర్తను భర్త అని (యెష 54:5) వ్రాయబడియున్నది. ఇది మరీ అభ్యంతరముగా నున్నది. అయినను భావము ఆత్మీయమైనది. గనుక అంగీకారమే. ఒక ఆశ్రితుడు తన గురువును చూచి మీరే మా తండ్రులు, మీరే మాతల్లి, మీరే మా స్వజన ప్రతి నిధులని చెప్పును గురువును తల్లి అనవచ్చునా? అని ప్రశ్నించరాదు. అట్లే పురుషభక్తుని పెండ్తికుమార్తెయని అనవచ్చునా? అని ప్రశ్నించరాదు. అర్ధము ప్రేమ సంచయమైయున్నది. ఇవన్నియు తేడాగానే ఉండును. యూదులలోని భక్తులు సొలోమోను పాట చదివి పెడార్ధము చేసికొనక దేవునికిని, మనకును గల గొప్ప సంబంధమును గూర్చిన వర్ణనను గూర్చి చాల ఆనందించిరి. బైబిలు మిషను కూటములలో వ్రాయబడిన పరమగీత వ్యాఖ్యానము చదువండి. హిందూమతస్థులుకూడా ఈ సంబంధమునుగూర్చి ఆనందించు చున్నారు. పోలికలు చదువునప్పుడు అర్ధము చెప్పుటలో జాగ్రత్తగా నుండవలెను. ఏలాగంటే విత్తనము దేవుని వాక్యము (మత్త. 13:1-23) అని వ్రాయబడియున్నది. అది పోలికగాని విత్తనము దేవుని వాక్యమేలాగౌను? మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు (మత్త. 5:13), వెలుగై యున్నారు (మత్త. 5:14) తీగలైయున్నారు (యోహా. 15:5) అని ప్రభువుచెప్పిన ఉపమాన వ్యాఖ్యానములలో నున్నది. మనుష్యులు ఇవి ఎట్లు కాగలరు! పెండ్లికుమార్తె సంఘమునుగూర్చి పరిశుద్ధ గ్రంథములో నున్నది గనుక దాని అర్ధము పూర్తిగా తెలిసినను, తెలియక పోయినను నమ్మి, అందుకు నన్ను సిద్ధపరచుము అని ప్రార్ధించువారు ధన్యులు, గాని వీనినిగూర్చిన సంగతులన్నియు వివరముగా తెలిసికొనుట ఎంతో శ్రేయస్కరము.
V. పెండ్లికుమార్తె పోలిక:- లోకములోని పెండ్లికుమార్తె ఎట్టిదై యుండవలెనని ప్రజలు చెప్పుదురు?
- (1) పవిత్రురాలైన కన్యకయై యుండవలెను
- (2) తల్లిదండ్రులు మొదలైన వారికంటే భర్తను ఎక్కువగా ప్రేమించునదిగా నుండవలెను
- (3) భార్య బానిస కాకపోయినను, సహకారియైనను, సమయము వచ్చినప్పుడు భర్తకు బానిసవలె పరిచర్య చేయవలెను. భర్తయొక్క ఆజ్ఞలకు పూర్తిగాలోబడి వాటిని శిరసావహించవలెను. వాటిని నెరవేర్చుటకు ప్రాణమునైనను, సమర్పింప సిద్ధలై యుండవలెను.
- (4) అనుస్థానములో, అనుసరించుటలో భర్తను, ఉదా:- మనుష్యుని వదలనట్టి నీడవలె నుండవలెను. పర పురుషుని ఆకర్షణలేనిదై యుండవలెను. భర్తలో తాను ప్రత్యేకమైన వ్యక్తికాక పెనిమిటితోపాటు ఏక వ్యక్తియైయుండవలెను. భర్తకు కలిగినదంతయు తనదే యని భావించునదియై యుండవలెను.
షరా:- ఇట్టి గుణములే విశ్వాసులకుకూడ క్రీస్తు విషయములో కలిగియుండవలెను. మరియు దేవుడు ఆది మానవులకు తన లక్షణములను పెట్టి తన పోలికగా సృష్టించెను గనుక వానిని మరలా సంపాదించుకొనవలెను. పరలోకములో వివాహము లుండవనియు (లూకా. 20:34-36), విశ్వాసులు దేవదూతలవలె నుందురనియు ప్రభువు వక్కాణించెను. అక్కడ ఈలోక వివాహముయొక్క ప్రమేయమే లేదు. సద్దుణములు తగ్గక పెరుగుచునేయుండును.
భూలోకములో వయస్సునుబట్టి శక్తులు తగ్గిపోవునట్లు అక్కడ తగ్గవు. ఉడికిపోవుట ఉండదు. యౌవనమే నిత్యముండును. పెండ్లి విందు అనగా క్రీస్తులోని వన్నియు ఆయన మనకు సంపాదించినవన్నియు అనుభవించుటయే ఈ విందు. ఇది అనంతకాలానుభవము. ఎప్పటికప్పుడే క్రొత్తదిగా నుండును. నిత్యము దేవుని దర్శనమే. యుండును. 1కొరింథి. 13:12, 2కొరింధి. 3:18, 1యోహాను 3:2.