గ్రంథకర్త: యం. దేవదాసు అయ్యగారు

14. బైబిలు మిషను ఎందులో ఎక్కువ



దేవునినడిగి తెలిసికొనకుండ ఏ సిద్ధాంతమును ఖండింవరాదు.


1. దర్శన వరములో ఎక్కువ (అనగా ధ్యానకాలమందు విశ్వాసికి, క్రీస్తు, దేవదూతలు, పరలోకభక్తులు మొదలగువారు వంతుల ప్రకారము కనబడి మాటలాడుట, భూలోకములోని భక్తుల ఆత్మలు, భక్తిహీనుల ఆత్మలు కనబడి మాటలాడుట, క్రీస్తును ఎరుగకుండా చనిపోయి పాతాళములో నున్నవారు కనబడి మాటలాడుట, భూతములు కనబడి మాటలాడుట. వీరందరు క్రీస్తు సెలవుమీదనే వత్తురు. తరువాత క్రీస్తు కనబడి పిశాచి మాటలను నమ్మవద్దు భయపడవద్దు అని ఆదరించుట).


2. బైబిలులో నున్న మర్మములను క్రీస్తే స్వయముగ అర్ధము చెప్పుటలో.


3. మందులేకుండా జబ్బులు బాగుచేయుటకై ప్రత్యేక స్వస్థత కూటములు పెట్టుటలో, (ఇట్టి కూటమొకటి బైబిలు మిషనువారు గుంటూరువద్ధ నున్న శ్రీ రావుసాహెబ్ జె. రాజారావుగారి కాకాని తోటలో ప్రతి సోమవారము జరుపుచున్నారు. ఇప్పటికి వేలకొలది రోగులు బాగైనారు. పరీక్షించుటకు రావచ్చును. పాపులకు, అనారోగ్య వంతులకు, బీదలకు, బిడ్డలు లేనివారికి, అప్పులు గలవారికి, కోర్టులో న్యాయము కావలసినవారికి, పెండ్లిచేసికొనగోరువారికి, కుటుంబ కలహములు గలవారికి, వస్తువులు పోయినవారికి, భూతపీడితులకు, విషపు పురుగుల బాధగలవారికి ఈ మొదలైన వారికి పశ్వాదులకు మేలు కలుగుచున్నది).


4. పరలోక భాషలతో మాటలాడుటలో మార్కు 16:17. ఆ. భాషయొక్క అర్ధము చెప్పుటలో కొరింథి. 14:20-33.


5. రాబోవు సంగతులు తెలియపరచునట్టి ప్రవచనవరము కలిగి యుండుటలో.


6. జీతనాతములు లేకుండ కేవలము దేవునిమీదనే ఆధారపడి సువార్త పని చేయుటలో.


7. ఆత్మ సంచారము చేయుటలో అనగా విశ్వాసి తన గృహములో ఉండును. అతని ఆత్మ దేవుడు ఎక్కడికి తీసికొని వెళ్ళునో అక్కడకు వెళ్ళి పనిచేసి మరల శరీరములోనికి వచ్చును. (పౌలు) కొలస్స. 2:5లో ఈలాగు వ్రాయుచున్నాడు. “నేన్సు శరీర విషయములో దూరముగా నున్నను ఆత్మ విషయములో మీతోకూడ ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను”.


8. సన్నిధి కూటములు స్థాపించుటలో అనుదినము విశ్వాసులు ఒకచోట గూడుకొని దైవసన్నిధియొక్క అనుభవమును గ్రహింపగల వరము. మొదటి అంకెలోని దర్శనవరమును గురించి ఇక్కడ మరల చదువుకొనంది. ముఖ్యముగా ఈ సంవత్సరము అనేక స్థలములలో సన్నిధి కూటములు కొద్దిగా ఏర్చడినవి.


ముఖ్య కూట స్థలములు:- గుంటూరు, బెజవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కాకినాడ.


9. "ఆయన మీతో చెప్పునది చేయుడి" అని యోహాను 2:5లోని బోధనుబట్టి క్రీస్తుప్రభువు స్వరముతో ఏమిచెప్పునో అది మేము చేయవలెను. అను సిద్ధాంతము బైబిలు మిషనులో మహా ముఖ్య సిద్ధాంతమైయున్నది. ఇది కలిగియుండుటలో బోధకులు, స్నేహితులు, స్వజనులు, అధికారులు చెప్పునది చేయకూడదను అర్ధము ఇక్కడ పనికిరాదు. వారు చెప్పినమాట క్రీస్తుమాటకు అనుగుణ్యముగా నున్న యెడల వారు చెప్పినది కూడ చేయవలెను. ఎవరు చెప్పినది చేయని యెడల మన జీవితము ఆగిపోవును (ప్రభువు తల్లి పరిచారకులకు చెప్పలేదా?)


10. బైబిలు కాలములో జరిగిన అన్ని అద్భుతములు అవసరమునుబట్టి మన కాలములోకూడ జరుగును అను సిద్ధాంతము కలిగియుండుటలో.


11. బైబిలుమిషనును దేవుడు స్వయముగా రాజమండ్రిలో నాకే 1938 జనవరి మాసమున గాలిలో వ్రాసి బైలుపరచుటలో (ఇది పరీక్షింపవలసిన మహాముఖ్యమైన విషయము. దేవునినడిగి తెలిసికొనండి).


12. ప్రభువు స్వయముగా మాటలాడునపుడు స్వంత మిషను సిద్ధాంతములు కొట్టివేసికొని ప్రభువు చెప్పిన సిద్ధాంతములు అవలంభించుటలో (దేవుని వాక్యమును పండితులు వివరించుట యందు బేధాభిప్రాయములు కనబడినందున క్రైస్తవమతము 800 ఎనిమిదివందల కంటే ఎక్కువ మిషనులుగా చీలిపోయినది గనుకనే ఇప్పుడు బైబిలు మిషనువారు క్రీస్తుప్రభువును వివరము అడుగు చున్నారు. అన్ని మిషనులవారు కలిసి ప్రభువును సిద్ధాంతములు అడుగుటవలన అన్ని మిషనులు ఒక సంఘమగును. అప్పుడు ఎంతో సంతోషముగా నుండును).


13. అన్ని మతములను, అన్ని మిషనులను తనలోనికి రావలెనని పిలుచుటలో క్రైస్తవమతము వచ్చువరకు దేవుడు ఇతర మతములను స్థాపించుకొననిచ్చెను. అలాగే బైబిలు మిషను వచ్చువరకు దేవుడు ఇతర మిషనులను స్థాపించుకొననిచ్చెను.


14. ప్రతి మతములోను, ప్రతి మిషనులోను దైవచిత్తాను సారమైన అంశములు కలవని నమ్ముటలో (పూర్ణమైనది వచ్చినపుడు అపూర్ణమైనది నిరర్ధకమగును కొరింథి. 13:10).


15. క్రీస్తుప్రభువు స్వయముగా కనబడి మాటలాడుచు చెప్పుచున్న సిద్ధాంతములు వ్యాఖ్యానములు ఏ సంఘములో ఉండునో ఆ సంఘమే సంపూర్ణమైన సంఘము. అదే పై అంతస్తుగలది. అట్టిది మాదేయని చెప్పుటలో (ప్రకటన 2అధా॥ 3 అధ్యా!) మాది పై అంతస్తు అని మేము చెప్పుటలేదుగాని బైబిలు మిషను అంతస్తుపై అంతస్తు అని చెప్పుచున్నాము.


ఎందుకనగా:

16. బైబిలు మిషను అని నాకు వ్రాసి చూపించి దేవుడు స్థాపించిన మిషను మాదే అని చెప్పుటలో. (గనుకనే బైబిలు మిషను పై అంతస్తు గలదియైయున్నది. అయినను బైబిలు మిషను వారిలో ఎవరిలో దోషము లుండునో వారికి ఈ అంతస్తు ఉండదు).


17. వారికి రక్షణలేదు. వీరికి రక్షణలేదు. మాకే రక్షణ ఉన్నది అని బైబిలు మిషనువారు చెప్పరు. కాని విశ్వాసులకు రక్షణ గలదు అని ఎఫెసి. 2:8నిబట్టి చెప్పుచున్నారు.


18. ఇతర మతములవారును, ఇతర మిషనులవారును బోధించుచున్న కొన్ని మేముకూడ బోధించుచున్నాము గాని బేధమిది.


వారు తమ జ్ఞానమునుబట్టి బోధించుచున్నారు. మేమైతేనో దేవుడు స్వయముగా చెప్పుటనుబట్టి బోధించుచున్నాము.


19. జ్ఞానమునుబట్టి బైబిలు మిషనులోనికి ఎవరైనను రావచ్చునుగాని దేవుడు స్వయముగా చెప్పుటనుబట్టి వచ్చినయెడల ఎంతో బాగుగా నుండును అని బోధించుటలో. ప్రభువా! భక్తిగల నీ సేవకులొకరు బైబిలు మిషనులో ఎందుకు చేరలేదు! అని సన్నిధి కూటస్తులు అడుగగా ఆయన నేను ఇంకను పిలువలేదు అని జవాబు చెప్పెను.


20. దేవుడు బైలుపరుపవలసినది బైబిలులో బైలుపరచినారు గనుక మరల ఏమియు బైలుపరుపడు అనియు బైలుపరుపుము అని అడుగుట ఆయనను శోధించినట్టే అనియు కొందరు వాదించు చున్నారు. బైబిలువ్రాత పూర్తియెన పిమ్మట దేవుడు లోకమునకు ఎన్నెన్ని క్రొత్త విషయములు బైలుపరచినాడో లెక్కపెట్టగలరా! అని మేము వారికి జవాబు చెప్పుటలో.


21. బైబిలు మిషను అను ఈ పేరు గలిగి యుండుటలో ఎక్కువ:

పేరులో భేదమున్నప్పటికిని భక్తిలో అన్ని మిషములు ఒకటే ప్రతి మిషనువారును తమ మిషను పేరునకు అనుగుణ్యముగా వ్రవర్తించుట అభ్యసింపవలెను. మరియు తము మిషను సిద్ధాంతములందు నేర్పరులై ఉండవలెను. వాటిని బైబిలునుబట్టి క్రమపరచుకొనవలెను. అలాగే క్రైస్తవులందరును తమ మతముయొక్క పేరునకు తగినట్టు ప్రవర్తించవలెను. పేరునకు ఎవరు తగినట్టు నడువలేరో వారినిచూచి ఇతరులు ఏమందురు? నీకు ఈ పేరు తగదు అని అందురు. ఎవరు తమ పేరునకు తగినట్టుగా నడుచుకొందురో వారినిచూచి ఆ ఇతరులు ఏమందురు? నీకు ఈ పేరు తగినదే అని అందురు. పేరునకు తగినట్టుగా నడుచునట్టి మిషనువారిని మతస్థుల వారిని ప్రజలు గౌరవింతురు. ఆలగే పేరునకు తగినట్టుగా నడుచుకొనువారిని ప్రజలు గౌరవింతురు. మరియు కొందరు ఇంగ్లీషు పేరులు, కొందరు బైబిలులోని పేరులు కొందరు తెలుగుపేరులు పెట్టుకొనుచున్నారు. వీటి అర్ధమునుబట్టి నడుచుకొనుట యుక్తమైయున్నది.


22. పేరులో ఏమి ఉన్నది? పేరునుబట్టి నడువవలసిన ప్రవర్తనలో ఉన్నదని అందరనుచున్నారు.


పేరులోను, ప్రవర్తనలోను ఉన్నదనియు పేరులో లేకపోయిన యెడల పేరు పెట్టుకొనుట ఎందుకనియు మేము జవాబు చెప్పుచున్నాము.


23. "హేడెస్సులో" బోధ ఉన్నదని చెప్పుటలో 'హేడెస్సు' అనగా పాతాళలోకము. మోక్షమునకు చేరలేని మృతుల ఆత్మలు ఇక్కడ ఉండును. కడవరి తీర్పు రాకముందు రక్షింపబడుటకు వారికికూడ క్రీస్తు ప్రభువు గడువు ఇచ్చుటకై పరలోక బోధకులకును, ఇతర బోధకులకును పంపునని నమ్ముటకు వీలున్నది. వారుకూడ ఆయన సృష్టియైయున్నారుగదా! నశించినదానిని వెదకి రక్షించుటకై ఆయన వచ్చెను లూకా. 19:10లో ఉన్నది. హేడెస్సులో నేను మారుమనస్సు పొందవచ్చునుగదా! అని చెప్పి ఒకరు నేటికాల సువార్త విననక్కర లేదనియు, ఇప్పుడు నా ఇష్టము వచ్చిన పాపములు చేసికొన వచ్చుననియు చెప్పెను. అట్టివారు తమ గడువుకాలమును తృణీకరించుచున్నారు. గనుక తమ హృదయములను మరింత కఠినపరచుకొనుచున్నారు.


1సమూ. 2:6, కీర్తన. 139:7-12, 1పేతు. 3:19,20, 4:6, మత్తయి 8:12, ఫిలిప్పీ. 2:9-11, కీర్తన 40:2, ప్రక. 1:17, ఆమోసు 9:2.


క్రీస్తుని ఎరుగనివారికి మంచిచెడ్డలు తెలిసికొనగల మనస్సాక్షి గలదు. దానిని బట్టియే ఆయన తీర్పు విధించును. బ్రతికియుండగా సువార్త వినియు నమ్మనివారు. పాతాళలోకము లోనికి వెళ్ళగా వారి రక్షణను గురించి మనమెందుకు విచారింపవలెనని అనుకొనువారు జాలిగలవారని అనిపించుకొందురా?