క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

రాకడ ప్రార్ధనలు - స్తుతులు



1. ఒక అబ్బాయి దూరదేశములోనుండి "నేను వచ్చుచున్నానని" ఉత్తరము వ్రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకొని ఆనందించి, ఆ అబ్బాయి కొరకు ఎదురు చూతురుకదా! అట్లే యేసుప్రభువు వచ్చెదనని చెప్పిరిగదా! వచ్చెదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండునా? ఎప్పుడో ఒకప్పుడు వచ్చునుగదా! ఆ అబ్బాయి ఇంటివారు అతనికొరకు ఎదురుచూచినట్లుగా మనమును యేసు ప్రభువు యొక్క రాకకై ఎదురు చూచిన యెడల, ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములో, ఆయనతో ఎగిరి వెళ్ళగలము.

అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి ఓ ప్రభువా! నిన్ను వందించు చున్నాము.


2. ఆ అబ్బాయి ఫలాని ఓడకు వచ్చుచున్నానని వ్రాసెను. ఆ ఇంటివారు కాకినాడకు ఓడలోవచ్చుచున్న అబ్బాయిని కలిసికొనుటకు వెళ్ళిరి. ఓడ వచ్చినదిగాని ఆ అబ్బాయి ఎందుకో ఆ ఓడమీద రాలేదు. ఆ ఇంటివారు ఆ ఓడను చూచి, అబ్బాయి రానందున తిరిగి ఇంటికి వెళ్లిపోయిరి. అయితే ఆ అబ్బాయి రెండవ ఓడమీద దిగినాడు. తన ఇంటివారెవరును తనను కలిసికొనుటకు రానందున తిరిగి వెనుకకు వెళ్ళిపోయినాడు. అలాగే యేసు ప్రభువు రాకడ ఆలస్యమైనందున అనేకులు వెనుకకు వెళ్ళిపోవుదురు. ఆ అబ్బాయి రెండవ ఓడకు వచ్చినట్లుగా ప్రభువుకూడ వచ్చి, సిద్ధపడియున్నవారిని తనతో కూడ పైకి తీసికొని వెళ్ళును గనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక, ఆయనతో వెళ్ళుటకు సిద్ధము చేయుమని వేడుకొనవలెను.

ఓ ప్రభువా! నీ రాకడ ఆలస్యమైనను మేము వెనుకకు తిరిగిపోవువారిలో చేరకుండ, ఎల్లప్పుడు సిద్ధపడియుండు కృప దయ చేయుదువని నమ్ముచు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము.


3. ఒక యౌవనస్తుడు తన భార్యకు నేను ఫలాని బండికి వచ్చుచున్నాను, ఆ బండికి నీవు వచ్చి నన్ను కలిసికొనవలెను, లేనియెడల నేను ఇంటికి రాను అని వ్రాసెను. అతని భార్య వంటలు మొ॥వన్నియు తయారుచేసికొని స్టేషనుకు వెళ్ళెను. ఆ దినము బండి రెండు గంటలు ఆలస్యమైనందున ఆమె ఇంటికి వెళ్ళెను. ఆ తర్వాత బండి వచ్చినది. అతడు దిగి ఆమె కొరకు అంతా చూచి, ఆమె కనబడనందున విచారించి, ఆ బండికే వేరొకచోటికి వెళ్ళెను. అలాగే మనమును ఆయన రాక కొరకు ఎదురుచూచి, తీరా వచ్చుసరికి వెనుకకు వెళ్ళిపోవుదుము, రాకడలో వెళ్ళలేము. గనుక ఆలస్యమైనను ఆయన వచ్చువరకు కనిపెట్టి చూచుచు, సిద్ధపడవలెను. అప్పుడు రాకడలో వెళ్ళగలము.

ఓ ప్రభువా! మేము కనిపెట్టుచు సిద్ధపడుచుండగల కృప దయచేయుదువని నమ్మి నీకు స్తుతులర్పించు చున్నాము.


4. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలెనని గోదావరి స్టేషనుకు వచ్చుసరికి బండిదాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు గలిగి రాజమండ్రి స్టేషనులో బండి అరగంట ఆగునని తెలిసికొని, వెంటనే రిక్షా కట్టించుకొని గబగబ పరుగెత్తించి స్టేషను చేరెను. వెంటనే టిక్కెట్టు కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకొని, గబగబ పనులు చేసికొని రాకడకు సిద్ధపడవలెను. ఒకవేళ వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకొనవలెను. ఆ ప్రయాణికునివలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము.


5. ఒకడు మగ్గముపై దుప్పటి నేయుచు ఈ కొంచెమే ఉన్నదిగదా! అతిత్వరగా నేసి వెంటనే వస్తాను, మీరువెళ్లి బండికి టిక్కెట్టు తీసికొనండని చెప్పెను. అతడు ఆదుప్పటిని త్వరత్వరగానేసి, ఎగబెట్టేసరికి ఆలస్యమైనది, బండికి అందుకొనవచ్చునను కొన్నాడు గాని పనులవలన ఆలస్యమైనందున, అతడు వెళ్ళుసరికి ఆ బండి వెళ్ళిపోయెను. అలాగే ఆయా పనులు పెట్టుకొని బండిని అతడు దాటిపోజేసినట్లు, మనమును నానాపనులు పెట్టుకొని రాకడలో వెళ్ళలేక వెనుకబడి పోవుదుము.

ఓ ప్రభువా! నీ రాకడ విషయములో మేమట్టి అశ్రద్ధ చూపకుండ మమ్మును సిద్ధపర్చుదువని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము.


6. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి ఈదులాడుకొనుచు, ప్రభువుయొక్క రాకడను మరచి పోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు, సిద్ధపడినవారిని తీసికొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచునప్పటికి రాకడ వచ్చి వెళ్ళిపోవడము కూడ జరుగును. అలాగే సమయమంతా పనులు, పనులు అని పనిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ప్రభువును కలిసికొనలేరు. మేమట్లు లోకపు పనులలో మునిగి, నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండ ఉండే కృప దయచేయుదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము.


7. ప్రతి దినము రాకడ ప్రార్ధన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగియుండక పోయిన రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యమును, ఏ పనిచేయుచున్నను రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగియుండిన రాకడలో ఎత్తబడగలరు. నీ రాకడ తలంపు నిత్యము మాలోనుంచుదువని నమ్ముచున్నాము. నీకు నిత్య స్తోత్రములు.


8. ఒక రైతు కళ్ళమునందున్న ధాన్యములోని రాళ్ళను ఏరి పారవేసి, జల్లెడలోవేసి జల్లించి, చేటలోవేసి చెరిగివేసి, శుభ్రముగానున్న గట్టిగింజలను జాగ్రత్తచేసెను. అలాగే మనలోనున్న చెడు ఆలోచనలు, చెడు పనులు మొదలగు రాళ్ళన్నిటిని, చెత్త, పొట్టువంటి పాపములను జల్లించి చెరిగివేసికొనవలెను. అప్పుడు మనమును గట్టిగింజలుగా ఏర్పడి రాకడలో ఎత్తబడగలము.

ఓ ప్రభువా! అట్లు మమ్మును మేము శుభ్రము చేసికొనగల సహాయము దయచేయుదువు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములు.


9. ఒక స్త్రీకి చంటిబిడ్డ కలదు. ఆ బిడ్డ ఆడుకొనుచు బురద చేసికొనగా, బిడ్డను ఆమె నీళ్ళతో కడిగి శుద్ధి చేసినది. అయితే ఆ బిడ్డ మరల ఆడి మరల బురద చేసికొనగా, తిరిగి తల్లి కడిగివేసినది. అనేకమార్లు ఆ బిడ్డ బురద చేసికొనగా అలాగే తల్లి అనేకమార్లు కడిగి శుద్ధిచేసిన రీతిగా, మనమును మన మనస్సులోనికి చెడ్డ తలంపులు వచ్చినప్పుడు, వెంటనే యేసు రక్తముతో ఆ పాపము శుద్దిచేసుకొను అలవాటు కలిగియుండవలెను. వెంటనే శుద్ధిచేసికొనకపోయిన ఆలస్యమైపోవును గనుక (పాపపు తలంపు రాగానే), పాపములో పడగానే ప్రభువు రక్తముతో పవిత్రము చేసికొనవలెను. ఎన్ని మారులైనను "యేసు రక్తమే జయము" అనునది అలవాటు చేసికొనవలెను.

ఓ ప్రభువా! మేమట్లు శుద్ధిచేసికొని, నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి వందించుచున్నాము.


10. దూర ప్రయాణము చేయువారు ఉదయం కాఫీ, మధ్యాహ్నము, సాయంకాలము భోజనము, 4 గంటలకు మరల కాఫీ తీసికొనినగాని ప్రయాణము చేయలేరు. అలాగే మనమును ఆకలి వేసినప్పుడెల్ల ప్రభువుయొక్క శరీర రక్తములు అను ఆహారమును తీసికొని అనుభవింపక పోయిన రాకడ ప్రయాణము చేయలేము. గనుక సంస్కార భోజనము పుచ్చుకొనిన రాకడలో వెళ్ళగలము.

ఓ ప్రభువా! నీవు ఏర్పాటు చేసిన సంస్కారపు విందును అనుభవించి, బలముపొంది, నీ రాకడలో పాల్గొను కృప దయచేయుదువని నమ్మి నీకు నుతులర్పించు చున్నాము.


11. క్రైస్తవ సంఘములోని కొందరు రాకడ సమీపమను చున్నారు. కొద్దిమంది మాత్రమే నమ్ముచున్నారు, కొందరు నమ్ముటలేదు.

ఓ ప్రభువా! ఒకవేళ నమ్మనివారు, నమ్మిన యెడల వారిని రాకడకు సిద్ధపరచుము. నమ్మినవారిని ఇంకను సిద్ధపర్చుము. నమ్మని వారికి నమ్మకము పుట్టించుము. నమ్మిన వారిని, నమ్మలేని వారిని, నమ్మనివారిని రాకడకు సిద్ధపర్చుము. ఇట్లు నీ సంఘమును రాకడకు ఆయత్తము చేయుదువని విశ్వసించి స్తుతులర్పించు చున్నాము.


12. అన్యులలో ప్రభువును నమ్మినవారున్నారు, నమ్మనివారు కూడా ఉన్నారు. వారు సిద్ధపడుట ఎట్లు? ఎవరో ఒకరు వెళ్ళి, వారికి రాకడను గురించి బోధించవలెను. లేనియెడల వారికి నమ్మకము కలుగదు. వారు సిద్ధపడినను సరే, సిద్ధపడకపోయినను సరే, వారిని కూడ సిద్ధపర్చుమని ప్రార్థించుచున్నాము.


13. గురుతులు అయిన తర్వాత రాకడ జరుగునని క్రైస్తవులు చెప్పుచున్నారు. అయితే ఎప్పుడును ఒకేలాగున్నది, ఈ గురుతులు ఎప్పుడును ఒకేరీతిగా నున్నవి, ఈ గురుతులన్ని ఇదివరకే ఉన్నవి, క్రొత్తవేవియు లేవు అని ఆక్షేపణ చేయు వారిని గురించి ప్రార్థించవలెను. గనుక భక్తులైనవారు గురుతులు ఏవేవి, ఏ సంవత్సరమున, ఏయే దేశములలో జరిగినవో, ఇంకా క్రొత్త గురుతులు ఏమి జరుగునో, బైబిలులో లేని ఎక్స్ ట్రా (extra) గురుతులు వ్రాయునట్లు "ప్రార్ధింపవలెను. ఇవి లోకమంతా తెలిసికొనునట్లు భక్తులు త్వరలో వ్రాయునట్లు" ప్రార్ధింపవలెను.

ఓ ప్రభువా! అట్టి భక్తులనులేపి రాకడ గుర్తులను వ్రాసి, లోకమునకు చూపించు కృప దయచేయుదువని నమ్మి నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాము.


14. లోకములో కొందరు సువార్త పత్రికలు అచ్చువేసి, అనేకులకు పంపు చున్నారు. వారు కేవలము దేవునివలన ప్రేరేపింపబడి, అట్టి వాటిని వ్రాసి అనేకులకు పంపుచున్నారు. అట్టి పత్రికలలో కొన్ని

పై మూడు రకముల పత్రికలు వారు ఊరకనే అనేకులకు పంపు చున్నారు. వీటన్నిటిని ప్రభువు దీవించు చున్నారు గనుక ఆయనకు మంగళ స్తోత్రార్పణలు.


15. క్రీస్తుమతము పుట్టి 19 శతాబ్ధములు అయినది. ఈ 19 శతాబ్ధములలో ఏయే సంగతులు జరిగినవి, ఎందరు క్రైస్తవులయినది, ఎన్ని రాకడ గురుతులు జరిగినవి, ఏయే గురుతులు ఏయే కాలములలో జరిగినవి, ఆ గురుతులు జరిగినపుడు వాటి పని ఏమిటయినది, ఆ గురుతులవలన ప్రభువునకు ఏమి మహిమ కలిగినది; ఈ విధముగా లోకములో జరిగిన మరియు జరుగుచున్న విషయములు ఒక పుస్తకములో అయ్యగారు వ్రాసియుంచిరి. ఆ పుస్తకమును అయ్యగారు జాగ్రత్తగా దాచి ఉంచగా, ఎవరో ఒకరు మరల పంపించెదనని తీసికొని వెళ్ళిరని తెలిసి, ఆ పుస్తకము కొరకు వ్రాయగా, పంపిచెదనన్నారుగాని ఇంతవరకు పంపలేదు. ఆ పుస్తకము మరల దొరికిన యెడల రాకడ గురుతులన్నియు అందులోగలవు గనుక ఎంత పనియైనను చేయవచ్చును. అతిత్వరలో దొరుకునట్లు ప్రార్థన చేయండి. ఆ పుస్తకము దొరికినప్పుడు, అన్యులు మరియు క్రైస్తవులు ఏలాగున్నది, ఏమేమి పొందినది తెలియగలదు.


ప్రార్ధన: దయగల తండ్రీ! నీ రాకడకు కొందరు సిద్ధపడుచున్నారు, కొందరు సిద్ధపడుటలేదు, కొందరు సిద్ధపడవలెనని తలంచుచున్నారు, కొందరు సిద్ధపడవలెనని ప్రయత్నము చేయుచున్నారు గాని సిద్ధపడలేక పోవుచున్నారు. గనుక మమ్ములనందరిని నీ రాకడకు సిద్ధపరచి, నీతో మేమందరము బయలుదేరు భాగ్యము అనుగ్రహించి సిద్ధపరచి, సిద్ధపరచి స్థిరపరచుము.


16. పౌలురాజు తైలాభిషేకమును, ఆత్మను పొందినను, యుద్ధములలో జయము పొందినను చివరకు తప్పిపోయెను. అలాగే కొందరు క్రైస్తవులు చివరివరకు అనగా రాకడ వరకు బాగుండి, రాకడ ఈ వేళో రేపో అనగా తప్పిపోయి నిరాశపడుదురు. మేము అట్టివారము కాకుండా కాపాడుదువని నమ్మి నిన్ను స్తోత్రించుచున్నాము.


17. ఎప్పుడునూ రక్షణను గురించిగాని, రాకడను గురించిగాని, విననివారు ఆఖరు దినమున విని తయారు కావచ్చును. ఏలాగనగా రైలుబండికి ఆలస్యముగా బయలుదేరిన కొందరు పరుగెత్తుకొని వచ్చి, రైలు కదిలే సమయములో ఎక్కుదురు గదా! సిలువ మ్రానుమీద, దొంగ ఆ క్షణములో మారుమనస్సు పొందెనుగదా! అట్లు మేమును రాకడలో పాల్గొను కృప దయచేతువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


18. తీరా మరణ సమయమున కొందరు మారుమనస్సు పొంది, బహు కొద్ది మంది రాకడకు సిద్ధపడుదురు. అది నీ కృప, అట్టి కృప మాకును దయచేయుము. నీకే ప్రణుతులు.


19. కొందరు మంచి పనిమీద ఉండి, ముగించునప్పటికి రాకడ వచ్చును. భోజనము సగము తినుచున్నప్పుడు, రాకడ వచ్చినయెడల, తయారుగానున్నవారు వెళ్ళిపోవుదురు. మేమే స్థితిలో ఆ సమయమునకు ఉన్నను, రాకడలో ఎత్తబడగల కృప దయచేయుదువు గనుక నీకు మా నమస్కారములు.


20. కొందరు నిద్రలో ఉండగానే రాకడలో ఎత్తబడుదురు గనుక నీకు మా హృదయ వందనములు.


21. ఒకరు, మరియొక గ్రామములో ఎవరో చనిపోయినారని విని ఏడ్చుచుండగా రాకడలో ఎత్తబడుదురు గనుక నీకు స్తుతులు.


22. ఒకరు స్వస్థానమునకు వెళ్ళుటకు, అనగా కుమార్తె తండ్రి ఇంటికి వెళ్లుటకు ఆశించును. అలాగే సంఘము ప్రభువుయొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్నది. అనగా పెండ్లికుమార్తె, పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూచుచున్నది. గనుక ఎదురుచూచు సంఘము రాకడలోనికి వెళ్ళును. ఎదురు చూడనివారు రాకడలోనికి వెళ్ళరు. మేము ఎదురు చూచు వారిగానుండు వీలు కలిగింతువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


23. ఒక గ్రామములో చాలా కలహములుండెను. ఒకరు జ్వరముతో నున్న తన కుమార్తెను చూచుటకు వచ్చి, కలహముల యొక్క భయంకర స్థితినిగూర్చి వినెను. ఈ కలహములలో తన కుమార్తెను అక్కడ ఉంచుట అపాయమని తలంచి, తన ఇంటికి తీసికొనిపోయెను. అలాగుననే ఈ లోకము గత్తర లోకము, పాప లోకము, పాప ఫలితములున్న లోకము, అవస్థల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విష పురుగుల లోకము, నిరీక్షణలేని లోకము, మరణలోకము, దయ్యముల లోకము, దయ్యములకు లోబడిన మనుష్యులున్న లోకము. గనుక ప్రభువు మనలను మోక్ష మందిరమునకు తీసికొని వెళ్ళుటకు శీఘ్రముగా వచ్చును. ఇదే రెండవ రాకడ. తండ్రి కుమార్తెను తీసికొని వెళ్ళునప్పుడు "రాను" అని చెప్పదుగదా! అలాగే మనముకూడ మేఘములోనికి "రాము" అని చెప్పకూడదు.

"ప్రభువా! తండ్రీ! సిద్ధముగానున్నాను" అని చెప్పవలెను. అట్లు చెప్పగల కృప దయచేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


24. సముద్రముయొక్క కెరటములు రేయింబగళ్లు (పగలు, రాత్రి) గాలివలన శబ్దము చేయుచున్నవి. సముద్ర తరంగములను రేపుచున్న గాలివలె దైవాత్మ భక్తులయొక్క హృదయములను రేయింబగళ్ళు కదిలించుచున్నది. అప్పుడు వారు రక్షణ పొంది అందులకు స్తుతింతురు. మరియు రాకడ వచ్చుచున్నదని స్తుతించుచు సంతోషింతురు.

ఓ ప్రభువా! అట్టి రెండు విధములైన స్తుతులు మాకు నేర్పుము.


25. దేవా! నీవు ఏనాడు సూర్య చంద్ర నక్షత్రములను సృజించినావో, ఆ దినము మొదలు నేటివరకు అవి ఆకాశమండలములోనుండి ప్రకాశించు చున్నవి.


జ్యోతులు తమకు నియమింపబడిన మార్గములో ప్రయాణము చేయుచునే ఉన్నవి. అలాగుననే మేము కూడ మా ఆనంద దీపములతో మా మార్గములలో నడుచుచు, స్థిరముగా నుండునట్లు దీవించి నీ రాకడకు సిద్ధపరచుము. నీవు దయచేసిన రక్షణ, రాకడ భాగ్యములను గురించి నిన్ను మహిమపరచు కృప దయచేయుము.


26. దేవా! నీవు కలుగజేసి మాలో పెట్టిన ఆత్మ, ఎల్లప్పుడు నిన్నే తలంచునట్లు చేయుము. ఆత్మవైన నీతో ఏకీభవించుటకు కృప దయచేయుము.


మా ఆత్మతో నిన్ను స్తుతించు శక్తి దయచేయుము. మా ఆత్మ నీయొద్దకు వచ్చువరకు రక్షణను గురించియు, రాకడను గురించియు, స్తుతించు ధోరణి దయచేయుదువని నమ్మి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము.


27. ప్రభువా! మా వ్రాత స్తుతులు నిజమైన స్తుతులుగా, నీకు ఇష్టమైన స్తుతులుగా మార్చివేయుము. వ్రాత ఎప్పటికైన చెరపవచ్చును గాని, నీ ఆత్మ సహాయముచేత వచ్చిన స్తుతి చెడిపోదు. అట్టి స్తుతి మాకు దయచేయుదువని నమ్మి నిన్ను వందించు చున్నాము.


28. ఓ దేవా! వ్రాత ఎంత నిశ్చయమో, ఎంత నిజమో, మా స్తుతి కూడ అంత నిశ్చయము, నిజమైయుండుటకు కృప దయచేయుము.


29. రక్షణ ఎంత నిశ్చయమో రాకడ అంతనిశ్చయము. మేము స్తుతించుటయు, సిద్ధపడుటయు అంతనిశ్చయమై యుండునట్టి కృప దయచేయుము.


30. మేము పరలోకమునకు వచ్చునప్పుడు, మా పాతశరీరము ఇక్కడ విడిచివస్తాము. మా స్తుతులలోను, మా సిద్ధపడుటలోను, మా నమ్మికలోను ఉన్న కళంకములు ఇక్కడ విడిచిపెట్టు శక్తి దయచేయుము.


31. కలముతో కాగితముమీద స్తుతి ప్రార్ధనలు వ్రాసిన ఎప్పటికైనను చెడిపోవును. అయితే మా హృదయమనే కాగితముమీద ఆత్మవ్రాసిన స్తుతి ఎప్పటికిని చెడిపోదు. అట్లు మా హృదయములపై వ్రాయుము.


32. యేసుదాసు అను యౌవనస్థుడు పడమటినుండి రాజమండ్రి వచ్చెను. రోడ్లమీద తిరుగుచు చిరతలు వాయించుచు, చిందులు త్రొక్కుచు, ప్రజలారా! యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి వచ్చుచున్నారు. ఈ సంగతి తెలిసికొనండి, ప్రార్ధించండి, సిద్ధపడండి అని కేకలువేసి చెప్పేవాడు. అందుచేత ప్రజలు పరుగు పరుగునవచ్చి గుంపుకూడి, వింతగా ఆయన చెప్పుమాటలు వినువారు. అతనికి జీతములేదు, చదువులేదు. ప్రతి ఉదయము వీధులలోనికి వెళ్ళి 12 గం॥ వరకు రోడ్లమీద ప్రసంగముచేసి, ఆ తరువాత చెట్టుక్రింద కూర్చుని, ప్రభువా! ఇప్పటివరకు నీ సేవ చేసివచ్చినాను, నాకు అన్నము పెట్టు అని "ప్రార్థించేవాడు". అప్పుడు ఎవరో ఒకరు వచ్చి సంగతి కనుగొని, ఆకువేసి అన్నం పెట్టేవారు. ఒకనాడు ధవళేశ్వరము వెళ్ళి బోధించినాడు. పోలీసువారు అతనిని కొట్టులో పెట్టిరి. అక్కడ ఆయన పోలీసువారికి, ఇన్స్పెక్టర్ గారికి బోధచేసెను. అప్పుడు వారు ఇతడు దైవభక్తుడు, ఇతనిని జైలులో వేయరాదని విడిచిపెట్టిరి.

గనుక చదువరులు రాకడబోధ ఇంకా ఎక్కువ చేయవలెను. అట్లు బోధించువారిని ఎక్కువమందిని లేపుమని ప్రార్ధించండి. ఇతనికి విశ్వాసమువల్ల అన్నము దొరికినది.


మరియొక సంగతి ఏదనగా, ఒకప్పుడితడు అడవిలో బడి వెళ్ళుచుండగా పెద్దపులి ఎదురుగా కూర్చుండెను. అతడు చిరతలు వాయించుచు చిందులు త్రొక్కుచు, ఓ పెద్దపులి! నేను నీకు హానిచేయ రాలేదు గనుక నీవు నాకు హాని చేయకూడదని చిరతలు వాయించి ఎగిరి దుమికెను. ఆ పులి పారిపోయెను. అట్టి విశ్వాసమున్నవారు రాకడకు సిద్ధపడగలరు. వారు భూతమును ఎదిరింతురు.

ప్రభువా! మేమట్టి విశ్వాసము గలిగి సాతానునెదిరించు కృప దయ చేయుము.


33. గవర్నరుగారు వచ్చుచున్నారనగా ఇండ్లు శుభ్రము చేసికొని, సున్నము వేసికొని, రోడ్లన్ని శుభ్రముగాచేసి సిద్ధముగా నుందురు. అలాగే రాజాధిరాజైన ప్రభువు వచ్చుచుండగా సిద్ధపడరాదా! మేము మరి ఎక్కువగా సిద్ధపడు కృప దయచేయుము.


34. రాజమండ్రిలో క్రొత్తగా రైలుబండి నడిచినప్పుడు ప్రజలు అన్ని ప్రక్కలనుబడి అనగా పొలములలోనుండి, ఇండ్లలోనుండి, బజారులలోనుండి పరుగెత్తుకొని వచ్చేవారు. అలాగే రాకడ అనగా అందరు సిద్ధపడవలెను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణముల నుండి ప్రజలు ఏలాగు రైలుబండికి వచ్చుచున్నారో అలాగే రాకడకు అందరూ రావలెను.


35. క్రీస్తుప్రభువా! నీవు మానవులమైన మమ్ములను రక్షించు నిమిత్తము, ప్రత్యేకముగ నియమించబడిన దివ్య పురుషుడవు గనుక నీకు అనంతకాల స్తోత్రములు.


36. యేసుప్రభువా! నీవు ఈ లోకములో మనుష్య శరీరముతో జన్మించెదవని పాత నిబంధనలో వాగ్ధానములు వ్రాయబడియున్నవి. అవి ప్రత్యేక వాగ్ధానములై యున్నవి. ఇది నీ రాకడలో ఒక రాకడయైయున్నది. గనుక నీకు స్తోత్రములు.


37. మా ప్రభువా! నీ జన్మము మానవులలో ఒక ప్రత్యేకమైన జన్మమై యున్నది. ఇది నీ రాకడలో ఒక రాకడయై యున్నది. గనుక నీకు స్తోత్రములు.


38. మరియు నీవు భూలోకములో నడిచిన జీవితము ఒక చరిత్రయై యున్నది. ఇది నీ రాకడలో ఒక రాకడయై యున్నది. గనుక నీకు స్తోత్రములు.


39. ఓ ప్రభువా! నీ మరణము ఎవరికిని లేని ప్రత్యేకమైన మరణమై యున్నది. ఇది నీ రాకడలో ఒక రాకడ గనుక నీకు స్తోత్రము.


40. ప్రభువా! నీ పునరుత్ధానము, ఎవ్వరు ఎరుగనటువంటి ప్రత్యేకమైన పునరుత్ధానము. ఇది నీ రాకడలో ఒక రాకడ గనుక నీకు స్తోత్రములు.


41. ప్రభువా! నీ ఆరోహణము ఎవరికిని అర్ధముకాని ఆరోహణము మాత్రమేకాక, హనోకు యొక్కయు, ఏలియా యొక్కయు ఆరోహణమువంటిది మాత్రమేకాక ప్రత్యేకమైన ఆరోహణము. ఇది నీ రాకడలో ఒక రాకడ గనుక నీకు స్తోత్రములు.


42. యేసు ప్రభువా! నీ రాకడ అందరికిని ఆశ పుట్టించి, ఎదురు చూచుటకు ఇదిగో, అదిగో అన్నట్లుండుటవలన ఇది చిత్రమైన సంఘారోహణము. ఇది పెండ్లి రాకడ. నీవు మేఘాసీనుడవై వచ్చే రాకడ. రాకడయందు సంఘమును ఆకర్షించే రాకడ. నేడు లోకమును గలిబిలి కలిగించే రాకడయై యున్నది. గనుక నీకు వందనములు. అట్టి విచిత్రమైన రాకడకు మమ్మును సిద్ధపరచుము నీకు స్తోత్రములు.


43. భూమి పుట్టినది మొదలుకొని నేటివరకు, నీ భక్తులు నిన్ను పిలుచునప్పుడెల్ల వచ్చుచునేయున్నావు. అవన్నియు లెక్కపెట్టిన అనేకమైన రాకడలగును. అవి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చిన రాకడలు గనుక నీకు స్తోత్రములు.


44. ఒక గ్రామమునకు గొప్ప ఉద్యోగులు వచ్చుచున్నారని మునసబుగారు చాటింతురు. ఆయన వచ్చేదారిలో చెత్త మరియు ఇతర అడ్డములు లేకుండ చేయుమనియు, వీధులలోని ఇండ్లకు వెల్లవేసికొమ్మనియు చెప్పుదురు. వీటన్నిటికి ఖర్చులు మునసబుగారు ఇవ్వరు. ప్రజలు తమంతట తామే ఆ ఖర్చు భరింతురు. అలాగే గురుతులు యేసుప్రభువు వచ్చుచున్నాడని చాటించుచున్నవి. గనుక బోధకులు - మీ హృదయములు శుద్ధిచేసికొనండి, తప్పిదములు ఒప్పుకొనండి, సిద్ధపడండి, అని సలహాలు చెప్పుదురు గాని బోధకులు మనుష్యులయొక్క హృదయములలోనికి వెళ్ళి శుభ్రము చేయరు. ఎవరిమట్టుకు వారే సిద్ధపడవలెను. ఎవరిమట్టుకు వారే ప్రార్ధనలు, స్తుతులు చేసికొనవలెను. ఎవరి మట్టుకువారే రాకడ పాఠములు నేర్చుకొనవలెను.

ఓ ప్రభువా! మేము స్వయముగా సిద్ధపడుటకు తగిన శక్తి నీ సహాయము, వీలు దయచేయుము. నీకు స్తోత్రములు.


45. పరలోకములోనున్న పరిశుద్ధులు, దేవదూతలు, వారికి రక్షణ అవసరము లేనప్పటికి రాకడ, రాకడ అని తొందరపడుచున్నారు. అయితే రక్షణ కావలసిన మనము ఇంకా ఎంత తొందరపడవలెను! లోకములోనున్నవారు, నీ రాకడ ఎప్పుడు? అని అడుగుచున్నారు.

ఓ ప్రభువా! మా పక్షముగా నీవే వారికి జవాబు చెప్పుము.


46. ఓ ప్రభువా! మా పద్ధతి ప్రకారము లోకమునకు రక్షణవార్త, రాకడవార్త అందించినాము. ఇప్పుడు నీ స్వంత పద్ధతి ప్రకారము రక్షణవార్త, రాకడవార్త ఎట్లు చెప్పవలెనో, అట్లు లోకములోని ప్రతిమనిషికి చెప్పుము. నీ పద్ధతి మాకు తెలియదు. అట్లు లోకమునకు నీ రాకడవార్త అందజేయుదువు గనుక నీకు స్తోత్రములు.


47. "ఓ స్వతంత్రతగల మానవులారా! ఒక్క నిమిషము మీ పనులు కట్టివేసి నా మాట ఆలకించుడి. దేవుడును, అందరి రక్షకుడును అయిన క్రీస్తు ప్రభువు, మేఘముమీద వచ్చి, భూమిమీదనున్న భక్తులను ప్రాణముతోనే మోక్షమునకు తీసికొని వెళ్ళును. ఆ భక్తులకు మరణముండదు. ఇప్పటినుండి ప్రార్థించి సిద్ధపడండి."

ఓ ప్రభువా! ఇట్టివార్త లోకమంతటికిని అందించుము.


48. కొన్ని యేండ్ల క్రిందట వైద్యులు కొన్ని మాత్రలు కల్పించినారు. అవి కొనినవారు గదుల మూలలో వాటిని ఉంచగా, ఎలుకలు వాటిని మ్రింగి బయటికి పోయినవి. అప్పుడు వాటి గుండెలలో భయముపుట్టి మరల ఆ గదులలోనికి రాలేదు. అది ఎలుకలను చంపకుండ వెళ్ళగొట్టు పద్ధతి. అలాగే రక్షణవార్త మరియు రాకడ వార్త రేపు మా సన్నిధి కూటమునకు డిక్టేషను (నీ నోటి మాటగా) చెప్పుము. అది తెలుగులో, ఇంగ్లీషులో ప్రచురించి, ఇంగ్లీషువార్త అయిదు ఖండములకు పంపించెదము. అప్పుడు చదువుకొను వారియొక్క గుండెలలో గొప్ప భయము, దడ, ఆందోళన కలుగును. నమ్మనియెడల మతి చాంచల్యము కలుగును. ఇది భయంకరము, గాని రక్షణమార్గము కలుగును. ఇది మేము నీకు విన్నవించుకొను నూతనమైన కడసరి పద్ధతి. దీనివల్ల మనుష్యుల హృదయములలో భూకంపములు కలుగును. అప్పుడు అందరు కెవ్వున కేకవేసి ప్రభువా! రక్షించు, రాకడకు సిద్ధపర్చు అని ప్రాధేయపడుదురు లేదా రక్షణకైనను సిద్ధపడుదురు. ఇట్టి కంపము అందరిలోను కలిగింతువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


49. కొందరు నిశ్శబ్దముగా తమయొక్క పనులు చేసికొనుచుండగా, చుట్టుప్రక్కల ఉన్న కొందరు కేకలు వేయుచు, ఫలానావారు వచ్చుచున్నారని అన్నప్పుడు, విన్నవారు కూడ పని మానివేసి చూచుచు ఆలకింతురు గదా! అలాగే లోకస్థులందరు తమ పనులలో మునిగి యుండగా మనము, "క్రీస్తు ప్రభువు రెండవసారి శీఘ్రముగా రానైయున్నారు" అని చెప్పవలెను. మన మాటలకు వారిచెవులు గింగురుమనుట వలన మన వర్తమానము వారు ఆలకింతురు. కొందరు నమ్ముదురు, కొందరు నమ్మరు, అయినను పరవాలేదు.

ప్రభువా! నీ రాకడవార్త ఆ విధముగా మ్రోగించుము.


50. ప్రభువా! నరమాంస భక్షకులకు రక్షణవార్త, రాకడవార్త ఏలాగు అందును? ఎవరైన వెళ్ళిన యెడల వారిని పట్టుకొని, చీల్చి తినివేయుదురు. అట్టివారు అస్సాములోను, నాగాకొండలలోను, ఆఫ్రికాలోని అరణ్యములోను ఉన్నారు. వారిలో కొందరు దిగంబరులు, కొందరు కోతులవలె మారియున్నారు. వారికి తెలివిలేదు. వారికి రక్షణవార్త, రాకడవార్త ఏలాగు అందగలదు? వారికి సువార్త చెప్పుటకు కొందరు మిషనెరీలు వెళ్ళిరి. వారినికూడ వీరు తినివేసినారు. వారు వేసికొన్న కోటులనుకూడ తినివేసిరి. వారికి ఈ సువార్త ఎలాగు వినిపించగలము?


జవాబు: వారికి రక్షణ సువార్త వినిపించుటకు మొట్టమొదట కైలాస బుషిగారు వెళ్ళి, వినిపించవలెను. తరువాత సన్నిధి కూటస్థులలో కొందరు వారికి రాకడ సువార్త అందించవలెను.

ప్రభువా! నీవు మా యెడల ఏమిచేసిన ఆ పనికి మేము సిద్ధపడగలమో, ఆ పని మా యందు నెరవేర్చి మమ్మును సిద్ధపర్చుము.


51. అవిధేయుడైన బిలామునకు గార్థభముచేత మనుష్య వాక్కుతో వర్తమానము చెప్పించినావు. ప్రభువా! ఇప్పుడు నిన్ను నమ్మిన అన్యులు, నీ రాకడ నమ్మని క్రైస్తవులు, నామక క్రైస్తవులు ఉన్నారు. వారికి, వారి స్వంత పశువులచేత సువార్త చెప్పించ కూడదా? అట్లు చెప్పించుట నీ కార్యక్రమమునకు విరుద్ధమా?

ప్రభువా! ఏరీతినైనను నీ రాకడ వార్త వారికి చెప్పించుమని వేడుకొనుచున్నాము.


52. ప్రభువా! నీవు 5 వేలమందికి ఆహారము కల్పించి పెట్టినావుకదా! ఇప్పుడు కూడా అనేక వేలమంది బీదలకు ఆహారము పెట్టిన యెడల వారికి సువార్త చెప్పవచ్చును గదా! ఇది బైబిలు చరిత్రకు సంబంధించిన ప్రార్ధన.


53. యేసు ప్రభువా! లోకములో ఏ పత్రికాధిపతి వలననైనను, ఏ గ్రంథకర్తచేతనైనను ఈ క్రింద చెప్పబడిన పత్రిక వ్రాయించుము. మొదటి గదిలో రాకడకు ముందు జరగవలసిన గురుతులను, రెండవ గదిలో ఆ గురుతులయొక్క వచనములు బైబిలులో ఎక్కడ నున్నదియును, మూడవ గదిలో ఏఏ తేదిలలో ఆ గురుతులు నెరవేరినవియును, నాలుగవ గదిలో ఇంకను నెరవేరవలసిన గురుతులు ఉన్నయెడల అవియును, అయిదవ గదిలో బైబిలులో లేకపోయినను రాకడను సూచించు గురుతులును, ఆరవ గదిలో అవి నెరవేరిన తేదీలును, ఏడవ గదిలో పై రెండు గురుతులు నెరవేరిన స్థలములును వ్రాయించుము లేదా సన్నిధి కూటములలో నీవైనా చెప్పుము. అప్పుడు ఆ సంగతులను ప్రచురణ చేయుదుము. ఈ మా ప్రార్ధన నెరవేర్చుము.


54. యేసు ప్రభువా! నీవు త్వరగా వచ్చెదవని చెప్పి ఇంత ఆలస్యముగా వచ్చుచున్నావు. ఈ ఆలస్యము యొక్క అర్ధము మేము ఇతరులకు ఎట్లు చెప్పవలెనో మాకు నేర్పుము.


55. దేవుని దృష్టిలో, విశ్వాసియొక్క ఆత్మలోకూడ గురుతులు అయిన తర్వాత త్వరగా వచ్చును. "త్వరగా" అని చెప్పియున్నాడు. గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసియొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురుకూడుకొని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును, కాని విసుగు కొనరాదు.

ప్రభువా! నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మును త్వరగా సిద్ధపర్చుము.


56. ప్రభువా! అన్ని జనాంగములనుండి నీ రాకడకు మనుష్యులను సిద్ధపరచుకొనుము. అన్ని భాషలలో నున్నవారిని నీ రాకడకు సిద్ధపర్చుము.


అన్ని స్థితులలో నున్నవారిని అనగా పాప స్థితిలో, వ్యాధి స్థితిలో, బీద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశ స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపర్చుకొనుము.


నీ వాక్యము విన్నవారిని, వినియు నమ్మనివారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము.


నరమాంస భక్షకులలో కొందరినైనను నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకములో నున్నవారిలో కొందరు, రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు, కొందరు భక్తులైనప్పటికిని రాకడకు సిద్ధపడ లేరు గనుక సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపర్చుము.


దేవా! చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేదు గనుక వారిని గూడ నీ రాకడలో తీసికొని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్ధన ఆలకించినందులకు నీకు వందనములు.


57. సొదొమ పట్టణము నాశనమప్పుడు, దేవదూతలు బలవంతముగా కొందరిని రక్షించి అగ్నిపాలు కాకుండచేసిరి. అబ్రాహాము ప్రార్ధనచేసెను గాని నెరవేరలేదు, అయినను నిరాశపడలేదు. రాకడకు సిద్ధపడువారుకూడ తమ ప్రార్ధనలు కొన్ని నెరవేరనప్పుడు నిరాశపడరాదు.

ప్రభువా! అట్టి సమయములో నిరాశపడకుండ మమ్మును కాపాడుదువని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


58. ఒక గ్రామములో ఇంటి యజమానుడు తన కుమారునికి వివాహము ఏర్పరచును. మరియొక గ్రామములో ఇంకొకరు తన కుమార్తెకు పెండ్లి ఏర్పాటు చేయును గాని పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె మన దేశములో మాట్లాడుకొనరు. అయితే మానవులు పాప లోకములో పుట్టిరి గనుకను ప్రభువు తన స్వరక్తముతో శుద్దిచేసెను గనుకను, ప్రభువు పెండ్లి సంఘముతో గదిలో (సన్నిధిలో) మాటలాడును.


సంఘము అను పెండ్లికుమార్తెయు, వరుడైన ప్రభువును మాటలాడు కొనుచున్నారు. ఇట్టి చనువు సంఘమునకిచ్చిన ప్రభువా! నీకు స్తోత్రములు.


59. దయగల యేసుప్రభువా! నీవు మా సన్నిధి కూటములోనికి వచ్చి, రాకడ వర్తమానములు ఇచ్చుచున్నందుకు వందనములు. మాకు తెలియజేయుచున్న రాకడ వర్తమానములు లోకములోనున్న ప్రతివారికి తెలియజేయుము. మాకు వర్తమానము తెలియజేసినప్పుడు ఎలాగు వ్రాసికొనుచున్నామో, అలాగే వారికిని తెలియజేసి వ్రాసికొనునట్లు చేయుము. మాకు ప్రతిదినము తెలియజేయుచున్నట్లు, నమ్మినను నమ్మకపోయినను వారికికూడ తెలియజేయుము.


నీ మాటలు నమ్మినను, నమ్మకపోయినను నీవు వెళ్ళి చెప్పుము అని యెహెజ్కేలు ప్రవక్తతో చెప్పినావు గదా! (యెహెజ్కేలు 2:4) మా పత్రికలలో మేము చెప్పుచున్నాము గాని అది చాలదు. మేము స్వయముగా చెప్పినను చాలదు. నీవు చెప్పిన సరిపోవును. వారి హృదయమునకు, జ్ఞానమునకు అందును. అధమపక్షము వారి జ్ఞానమునకైనను అందునట్లు చెప్పుదువని నిన్ను వందించుచున్నాము.


60. మాకు పట్టుదల లేదనియు, నీవు జవాబు చెప్పువరకు మేము కనిపెట్టుటలేదనియు నీవు దర్శనములో చెప్పినావు. ఆ మాట నిజము. మేము పట్టుదల, ఓపికతో కనిపెట్టు శక్తి దయచేయుము. నీకు లెక్కకు మించిన వందనములు.


61. దేవుడు అబ్రాహాముతో నేను చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పినప్పుడు "ఎట్లు పోవలెను" అని అడుగలేదు. మరియు దేవుడు అబ్రాహామునకు కుమారుని ఇచ్చెదనని వాగ్ధానము చేసెను. అబ్రాహాము ఏలాగు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? అని ప్రశ్నించలేదు. దేవునిమాట నమ్మి ఊరకుండెను. కుమారుడు ఆలస్యముగా జన్మించినను విశ్వాసము చెడలేదు. శారా నమ్మలేదు గాని నవ్వినందుకు ప్రభువు కోపపడెను. అబ్రాహాము కూడ నవ్వినాడుగాని దేవునికి అసాధ్యమైనది లేదని నమస్కరించి నమ్మెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు ముంగుర్తుగానున్న యేసు ప్రభువుయొక్క రెండవ రాకడను గురించి రెండువేల సం॥ముల నుండి కనిపెట్టుచున్నాము. మనము ప్రార్థించి, నమ్మి, విసుగుకొనక సిద్ధపడవలెను. రాకడకు సిద్ధపడుటలో అబ్రాహాముయొక్క విశ్వాసము దయచేయుదువని నమ్మి నీకు నమస్కారములు చెల్లించుచున్నాము.


62. ఇస్సాకు అను పెండ్లికుమారుడు, రిబ్కా అను పెండ్లి కుమార్తెయున్న ఊరువెళ్ళలేదు. ఎలీయెజెరు అను అబ్రాహాము యొక్క సేవకుడు, పెండ్లికుమార్తెను తీసికొని వచ్చెను. పెండ్లికుమార్తె ఊరికిని, పెండ్లికుమారుని ఊరికిని చాలాదూరము. అలాగే మేఘములపైన పరలోకములోనున్న నీతి సూర్యుడైన యేసు ప్రభువునకును, భూమి మీదనున్న సంఘమునకును చాలాదూరము. ఎలీయెజెరు పరిశుద్దాత్మకు ముంగుర్తు. ఎలీయెజెరు రిబ్కాను తయారు చేసినట్లు, ఇప్పుడు పరిశుద్దాత్మ సంఘమును తయారు చేయుచుండెను. ఎలియాజరు రిబ్కాకు నగలు ఇచ్చినట్టు, పరిశుద్దాత్మ సంఘమునకు "వరములు" అనే నగలు ఇచ్చి తయారుచేయుచు అలంకరించుచున్నారు. ఇప్పుడు ఆ పని జరుగుచున్నది. మనము రాకడ సంఘములోనున్న యెడల మనలను పరిశుద్దాత్మ తయారు చేయును. రిబ్కాతనంతట తాను తయారు కాలేనట్లు, మనంతట మనమును పెండ్లికుమార్తెగా తయారు కాలేము. ఎలీయెజెరు బాటసారి అనుకొని రిబ్కా నీరు పోసెను.


ఓ ప్రభువా! ఎలీయెజెరు, రిబ్కా అను పెండ్లికుమార్తెను తయారుచేసి ఇస్సాకు నొద్దకు తీసికొని వెళ్లినట్లు, పరిశుద్ధాత్మ భూమిమీదనున్న సంఘము అను పెండ్లి కుమార్తెను సిద్ధముచేసి మేఘములోనున్న నీయొద్దకు తీసికొనివచ్చును. ఆ సంఘములో మేముకూడ ఉండునట్లు నీ కృప దయచేయుము. "ఎలీయెజెరుతో వెళ్ళుదువా" అని రిబ్కాను తనవారు అడిగినప్పుడు ఆమె "వెళ్ళెద"నని జవాబు చెప్పెను. ఆలోచించి చెప్పుదుననలేదు, చాటునకు పోలేదు, సిగ్గు పడలేదు, తల వంచుకొనలేదు గాని వెళ్ళడానికే నిశ్చయించుకొన్నది. ఎలీయెజెరుతో వెళ్లుటకు (రెడీ) సిద్ధము, నగలు ధరించుకొనుటకు (రెడీ) సిద్ధము, నీళ్ళు పోయుమనగా తన ఒంటెలకు కూడ పోయుటకు (రెడీ) సిద్ధము, ఇల్లు చూపించెదవా అనగా బస, భోజనము కూడ (రెడీ) సిద్ధము అని చెప్పెను. ఇంటిదగ్గర ఎవరిని అడుగకముందే అన్నీ సిద్ధము అని చెప్పెను. అలాగే సంఘము అను పెండ్లికుమార్తె రిబ్కావలె ప్రభువు విషయము అన్నిటిలోను సిద్ధముగానుండి, (రెడీ) సిద్ధము ప్రభువా! అని చెప్పవలెను.

అట్లు మేము అన్ని విషయములలో సిద్ధముగానుండే కృప దయచేయుదువని నమ్మి నీకు మంగళ స్తోత్రములర్పించు చున్నాము.


63.

ఇంకా కొందరు ఏమనుచున్నారు. "రోడ్డు" అని ఒకభాషవారు, తెలుగువారు "బాట" అని, మహ్మదీయులు "రాస్తా" అని అంటారుగాని అన్ని ఒక్కటే గదా! అలాగే ఎవరు ఏది అనుకొనినా, వచ్చుచున్న ఆయన దేవుడు అనుచున్నారు.

ప్రభువా! నీవు వచ్చుచున్నావని మాకు తెలిసినది గనుక వారికి కూడ తెలియపర్చుము.


64. యేసు ప్రభువా! నీ మొదటి రాకడకు పాత నిబంధన భక్తులు ఎంత ఆశతో కనిపెట్టినారో, అలాగే క్రొత్త నిబంధనవారమైన మేము నీ రెండవ రాకడకు అంత ఆశతో కనిపెట్టునట్లు మమ్మును ప్రేరేపించుము.


65. ఆహ్వాన పత్రిక: భూలోకములో పెండ్లి సమయములో, ఆహ్వాన కార్డులు అచ్చువేసి పంపించెదరు. రాకడ తర్వాత పరలోకములో పెండ్లివిందు జరుగును. ఆ విందులో పెండ్లికుమార్తె కూర్చుని యుండును. ఈ పెండ్లికుమార్తె సువార్తవలన, ప్రార్ధనల వలన మారుమనస్సు పొంది, మోక్షములోనున్న వారిని ఆ విందుకు పిలిచెదరు. గనుక ఇపుడే మనము అందరికి సువార్త వినిపించవలెను. ఈ లోకములో సువార్త ప్రకటించుటే పెండ్లికార్డు అందించుట. గనుక సువార్త పని నిర్లక్ష్యపెట్టకూడదు. ఇట్టి ఆహ్వాన పత్రిక విషయములో శ్రద్ధ వహించవలెను. అట్టి శ్రద్ధ మాలో పుట్టించెదవని నిన్ను స్తుతించుచున్నాము.


66. ప్రభువా! మాకు భూలోకములో రక్షణ విందు అనుభవించు భాగ్యము దయచేసినావు వందనములు. అలాగే రాకడ విందు అనుభవించు భాగ్యము దయచేయుము. వివాహము కాకముందు పెండ్లి కుమార్తె తన గృహమందు విందు చేయునుగదా! అదే భూలోకములోని రక్షణ విందు. రాకడ అయిన తర్వాత ఏడేండ్లలో అసలు విందు జరుగును. మేము ఈ విందులో పాల్గొను కృప దయచేయుదువు గనుక నీకే స్తోత్రములు.


67. దేవుడు భూలోకములో నున్నవారిని ఎవరిని విడిచిపెట్టడు. అందరికీ సువార్త వినిపించనిదే అంత్యతీర్పు రానివ్వడు. హేడెస్సులోనున్న వారికికూడ బోధించవలెను. రాకడ తర్వాత పరలోకములోనున్న రక్షితులను ప్రభువు విందుకు పిలుచును. అనగా రక్షణ కలిగినవారికి ప్రభువు ఇచ్చు అంతస్థు, పెండ్లికుమార్తె యొక్క విందుకు రానిచ్చుట. వీరు విందును చూచుటకు మాత్రమే కాక విందు అనుభవించుటకు కూడ పిలువబడుదురు. పెండ్లికుమార్తె తన సువార్త వలన రక్షింపబడిన వారిని విందుకు ఆహ్వానించవలసినదిగా ప్రభువును కోరుకొనును. ఆ సమయమున భూలోకములో 7 ఏండ్ల శ్రమలలో అవిశ్వాసులు బాధపడుచుందురు.


పరలోకములో పెండ్లికుమార్తె, రక్షితులు విందులో నుందురు. అందువలన అవిశ్వాసులకు, సాతానుకు సిగ్గు. అంతేకాదు పరాభవము, అపజయము వచ్చినదని గోల పెట్టుదురు. రక్షితులైన వారు, పెండ్లి విందుకు వెళ్లు హక్కు చూచి మరింత సిగ్గు పడుదురు. ఈ విందు సమయములో పెండ్లికుమార్తె మహిమ, వెలుగు, కాంతి రక్షితులు చూడలేరు గనుక పెండ్లికుమార్తె తన ముఖముపై ముసుగు వేసికొనును.

ప్రభువా! ఇట్టి మహిమగల విందులో నుండుటకు మమ్మును తయారుచేయుదువని నమ్మి నీకు హారతులొసగు చున్నాము.


68. ఏనుగు నీడ పెద్దది, సూదినీడ చిన్నది. రెండును నీడలే గనుక ఎట్టి బలహీనత మనలో ఉన్నను అది చీకటియై యున్నది. తండ్రీ! ఏ విధమైన చీకటి లేకుండ మమ్మును క్రమపర్చుము. మేము ఈ భూలోకములో పొందవలసిన మహిమ పొందగలుగునట్లు క్రమపర్చుము. పరలోకములో అందరికన్న ఎక్కువ మహిమ నూతన యెరూషలేము వాస్తవ్యులకు ఉన్నది. గనుక మాలో ప్రతివారిని ఆ మహిమ, జీవితమునకు సిద్ధపర్చుము. ఇట్టి స్థితికి అన్నీ అడ్దులే. వ్యాధి మొదలగు అడ్దులు గలవు. అయినను ఇట్టి అద్దులన్నియు తొలగించుకొని ఆ మహిమకు సిద్ధపడు భాగ్యము అనుగ్రహించుము.


మా తప్పులు, పొరపాట్లు దిద్దుకొనుటకు ప్రయాసపడునట్టి కృప, దయ మాకనుగ్రహించుము. నీవు అందుకు కావలసిన గడువులు, సాధనములు ఇచ్చుచున్నావు. మేము సంపూర్తిగా ఈ నిమిషమందు మారునట్టి కృప దయచేయుము. మేమట్లు మారుట కష్టము కాదు. ఎందుకనగా నీ వాక్యములో ఒక మాట వ్రాయించినావు. అదేదనగా "నీ యాజ్ఞలు భారమైనవి కావు" (1 యోహాను 5:3) గనుక మేము నిన్ను బట్టి నెరవేర్చగలము గనుక నీకు స్తోత్రము. యోహానువలె నీ ఆజ్ఞలు భారమైనవి కావని మేము చెప్పగల భాగ్యము అనుగ్రహించుము. ఈ నిమిషములోనే మేము సంపూర్ణ స్థితికి రాగల కృప దయచేయుము. మేము "తర్వాత" అని జరుపుకొనక "త్వరగా" సిద్ధపడు భాగ్యము అనుగ్రహింపుము. నీ వాక్యము నీ సృష్టి, మేము గుణపడునట్లు మాకు బోధించుచున్నవి గనుక నీకు స్తోత్రము. మేము మొదట మారి, తరువాత ఇతరులు మారుటకు మార్గమును చూపునట్లు, మమ్మును మాదిరి జీవితముగలవారినిగా మార్చుము. మా జీవితము నూతన యెరూషలేమునకు తగు జీవితముగా క్రమ పరచుము. మేము అన్ని విషయములలోను మంద భాగ్యులమైయున్న యెడల ఏలాగు నూతన యెరూషలేము చేరగలము? కొందరు ఎంత విన్నను ఫలితము కనబడదు, వారు మార్పు చెందరు. కొందరు త్వరగా మారి పోవుదురు. సిలువ దగ్గర ఒకరు మారినారు, ఇంకొకరు మారలేదు. పెండ్లి కుమార్తె వరుసలోని వారు కూడ మందస్థితిలో నున్నారు. గనుక మెళుకువ స్థితి గలిగి జాగ్రత్తపడు కృప దయచేయుము.


69. ఓ తండ్రీ! పదియాజ్ఞలనుబట్టి మా హృదయమును శుద్ధిచేసికొనుట నేర్చుకొన్నాము. గాని మా జ్ఞానమునకు తోడుగాను, మా మనస్సాక్షికి తోడుగాను, నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నీ ఆత్మ చేత కూడ నేర్పించుమని వేడుకొనుచున్నాము.


70. నీ వాక్యమంతయు చదివి, మమ్మునేలాగు శుద్ధీకరించుకొనవలసినది కొంతవరకు నేర్చుకొన్నాము. ఈ వాక్య జ్ఞానమునకు తోడుగా మాకు నీ పరిశుద్దాత్మ సహాయమునిచ్చి, మా జ్ఞానమును వెలిగించి, నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నేర్పించుమని వేడుకొనుచున్నాము.


71. ఇతరులకు సువార్త ప్రకటించుట వలన మా ఆత్మీయ జీవనమునకు బలము కలిగించు సాధనము దొరకునని గ్రహించినాము. అయితే ముఖ్యముగా నీ రాకడను బోధించు సేవవలన కూడ, నీ రాకడకు మేమెట్లు సిద్ధపడవలెనో నీ యాత్మచేత నేర్పించుమని వేడుకొనుచున్నాము.


72. ప్రార్ధన చేయుటవలన అనగా మా పాపములు ఒప్పుకొనుట వలనను, మాకు కావలసినవి ఇమ్మని నిన్ను వేడుకొనుట వలనను, పూర్తిగా మేము నీకు సమర్పణ అగుటవలనను, నిన్ను స్తుతించుట వలనను, మేము మంచిస్థితిలోనికి తయారు కాగలము. వీటికి తోడు నీయాత్మ సహాయము కూడ దయచేసి, మమ్మును నీ రాకడకు సిద్ధపరచుమని వేడుకొనుచున్నాము.


73. మేము ఏమి చేసిన రక్షణ స్థితిలోనికి రాగలమో, ఏమిచేసిన రక్షణ నిలుపుకొనగలమో, ఏమి చేసిన ఆత్మీయ జీవనమును నిలుపుకొనగలమో,


అన్నీ మేము చేయుటకు ప్రయత్నించు చున్నాము. మేము రాకడకు సిద్ధపడుటకు, ఇవన్ని మాకు సహాయకరముగ నుండునట్లు నీ పరిశుద్ధాత్మ వలన మమ్మును నడిపించుమని వేడుకొనుచున్నాము.


74. మేము ప్రత్యేక కూటములు పెట్టుకొని రాకడను గూర్చియు, రాకడకు సంబంధించిన విషయములను గూర్చియు నేర్చుకొనుచున్నాము. గాని నీ యాత్మ సహాయము ప్రతి విషయములోను మాకు అవసరము. మా స్వంత జ్ఞాన ప్రయత్నము, మా విశ్వాస ప్రయత్నము చాలదు గనుక ప్రత్యేకమైన రీతిని నీ యాత్మ సహాయము కోరుకొనుచున్నాము. గనుక ఏమేమి చేసినయెడల నీ రాకడకు సిద్ధపడగలమో అట్టివి మాచేత చేయించుమని వేడుకొనుచున్నాము.


75. ఏయే గురుతుల వలన మేము నీ రాకడ సమీపమని తెలిసికొనగలమో, ఆయా గురుతులు మాకు బైబిలులోను, లోక చరిత్రలోను, సంఘములోను, సృష్టిలోను చూపించి, వాటివలన నీ రాకడ సమీపమని మేము గ్రహించి, సిద్ధపడుటకు నీయాత్మ సహాయము దయచేయుము. ప్రతిచిన్న విషయములోను నీ యాత్మ సహాయము ఎంతో అవసరము. గనుక నీ యాత్మ సహాయము మాకు దయచేసి, నీ రాకడకు ఆయత్తపరచుమని వేడుకొనుచున్నాము.


76. వీటిద్వారానే కాకుండా, ఇంకా వేటిద్వారా నీ రాకడ సమీపమని మాకు తెలియజేయుట నీ చిత్తమో, అట్టివి కూడ మాకు తెలియజేయుము. మేము అంగీకరింతుము. పూర్వకాలమందు విశ్వాసులకు నీవు దర్శనములో కనబడి, చెప్పవలసిన సంగతులు చెప్పియున్నావు. అది నీ చిత్తమైయున్నది. ఈ కాలములో కూడ మాలో ఎవ్వరికైనను దర్శనములో కనబడి, చెప్పవలసిన సంగతులు చెప్పుమని వేడుకొనుచున్నాము. అట్టి సమయములో నీయాత్మ యొక్క సహాయము మాకు ఎక్కువ అవసరము. ఎందుకనగా పిశాచి వలనను, కొందరి స్వంత ఊహల వలనను, తప్పుడు దర్శనములుకూడ రావచ్చును, వీటికి మేము భయపడకూడదు. ఎందుకనగా ఎవరు నీకు సమర్పణ అయినారో, ఎవరు నీ చిత్తప్రకారము చేయ నిశ్చయించుకొందురో వారికి తప్పుడు దర్శనములు రావు. నీ కృప మాకు దయచేసి మమ్మును కనికరించుమని వేడుకొనుచున్నాము.


77. రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటలో, లోతు ఆలస్యముచేయుట నీవు కనిపెట్టి, అయ్యో! త్వరపడలేక పోవుచున్నాడు గదా అని నీవు కనికరించి, ఆయన చేతులు పట్టుకొని నడిపించుకొని వెళ్ళినావు. ఇది ఎంత అద్భుతకరమైన కృప! అలాగుననే మాకు తెలిసిన ఏడేండ్ల శ్రమ తప్పించుకొనగోరు మేము, నీ రాకడకు త్వరపడు విషయములో జాగుచేయుట నీకు తెలియును. గనుక మా మీద నీ కనికరముంచుమని వేడుకొను చున్నాము.


78. ఓ తండ్రీ! జీవాంతమందు ఎవరు ఎక్కడికి వెళ్లునది, నీకు ముందుగా తెలియును. కొందరు నూతన యెరూషలేమునకు సజీవుల గుంపులో వెళ్లుదురు. కొందరు మృతుల గుంపులో నూతన యెరూషలేము చేరుదురు. కొందరు ఏడేండ్ల శ్రమలలో సిద్ధపడుదురు. కొందరు వెయ్యేండ్లలో తయారగుదురు. రక్షింపబడిన వారిలో కొందరు పరలోకములో నుందురు. కొందరు రక్షింపబడి, మారిపోయిన భూలోక మోక్షములో నుందురు. ఈ గుంపులన్నియు గలవని నీ వాక్యమువలననే నేర్చుకొన్నాము. గనుక నేను ఏ గుంపులోనికి చేరవలయునో, ఆ గుంపులోనికి తయారుకాగల కృప దయచేయుము. నేను వేరే గుంపులో చేరవలెనని ప్రయత్నము చేసినా అది నా గుంపు కాదు గనుక నెరవేరదు. గనుక నాది ఏ గుంపు అయిన, అందులోనే చేరగల కృప దయచేయుము.


మరియు ఓ ప్రభువా! ఫలాని గుంపులో చేరుమని నా మనస్సాక్షి చెప్పినది నిరుకుకాదు. నన్ను గురించి ఇతరులకు వచ్చు దర్శనములనుబట్టి కూడ నిరుకు కాదు. నా స్వపరీక్ష చెప్పునదికూడ నిరుకు కాదు గానీ నీకు ఏది తెలియునో అదే ఖాయము నీవు నాకు ఏది చెప్పుదువో అదే ఖాయము. ఈ కాలములో కొందరికి దర్శనములో కనబడి, వారికి చెప్పవలసినవి చెప్పుచున్నావని వింటున్నాము గనుక నాకుకూడ కనబడి చెప్పుము. ఆ విధముగా చెప్పుటకు నీకిష్టమయిన యెడల చెప్పుము. నీ కిష్టము కాకపోయిన యెడల నాకు చెప్పకుము, గాని నేను సజీవుల గుంపులో నూతన యెరూషలేములో చేరుటకు అవసరమైన ముఖ్యమైన పనులును, ప్రార్ధనలును చేయుదును. అడ్డములు వచ్చినను, శ్రమలు వచ్చినను, నేను వీటిని ఎక్కువగా చేయుదును గనుక దీవించుము. నేను ఒకరి ప్రార్ధన మీద ఆనుకొనను గాని ఆత్మ అందింపును బట్టి ప్రార్ధన చేయుదును.


షరా: జ్ఞానముతో అనగా మనస్సుతోను, స్వంత ఆత్మతోను ఏమిచేసినను చేయవచ్చును గాని స్వంత ఆత్మ పరిశుద్ధాత్మ వలన వెలిగింపబడవలెను. అందుకే మనో నిదానము అవసరము.


79. సజీవుల గుంపులో నుండు వారికి ఉండవలసిన లక్షణములు.

80. పరీక్షాంశములు

"..ఆ గురితో" అనగా రాకడకు సిద్ధపడు గురితో పై పనులన్నియు చేయుచున్నావా?


81. శుద్ధి ప్రార్ధన: మహాపరిశుద్ధుడవైన ఓ తండ్రీ! నేను ఈ లోకములో ఎంతకాలము జీవించవలెనో అంతకాలము నీ దృష్టిలో పవిత్రముగా జీవించుటకు, నీ వాక్యములోనున్న ఆజ్ఞలనుబట్టి నా హృదయమును శుద్దిచేసికొనుట ఎంత అవసరమో, నేను నీ యొద్దకు వచ్చుటకు నా జీవితమంతటిని శుద్ధిచేసికొనుట అంత అవసరము గనుక ఈ శుద్ధి కార్య విషయములో నీ పరిశుద్దాత్మ సహాయము అనుగ్రహించుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఈ లోకమునకు సరిపోవు శుద్ధికాదు గాని ఈ లోకమునుండి మహిమ మేఘము మీదికి వెళ్ళుటకు అవసరమైన శుద్ధి కావలెను.


షరా: ఈ శుద్ధి ప్రార్ధనయొక్క ప్రతి అంశములోను ప్రార్ధన మరియు స్తుతి, రెండును ఉండవలెను. మరియు ప్రార్ధనచేయునపుడు పరిశుద్దాత్మ పేరు ఎత్తి, పరిశుద్దాత్మ సహాయము దయచేయుమని అడుగవలెను. లోకజీవనశుద్ధి కొరకు పది ఆజ్ఞలు ఉపయోగపడును. రాకడకు సిద్ధపడు శుద్ధి, రాకడకు సిద్ధపడవలసిన వాక్యములనుబట్టి కావలెను.

ప్రార్ధన

  1. లోపములను తెలిసికొనుట : పది ఆజ్ఞలనుబట్టి మరియు
  2. రాకడ వాక్యములను జ్ఞాపకము చేసికొనుటనుబట్టి
  3. ఎవరు శుద్ధిచేయుట : పరిశుద్ధాత్మ తండ్రి
  4. దేనితో శుద్ది : క్రీస్తు రక్తముతో

స్తుతి

82. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందినాము గనుక రాకడలో ఎత్తబడుదుమను సంతోషముండును. అయితే జాగ్రత్తగా నుండవలెను, లేకపోయిన స్థితి తగ్గిపోవును.


ఉదా: చీకటిలో వెళ్ళుచున్న కుర్రవానితో పెద్దవారు లైటు ఉన్నను జాగ్రత్తగా నడువుమని అందురు. అంతేకాదు, గాలివల్ల లాంతరు ఆరిపోవచ్చును గనుక లాంతరు ఉన్నను అది ఆరిపోకుండ నుండవలెను.


మహా పరిశుద్ధుడవైన ఓ తండ్రీ! నేను ఎత్తబడు వారిలోనుండు నిమిత్తము చేసిన ఈ శుద్ధి ప్రార్ధన నీవు ఆలకించినావని నమ్ముచున్నాను, ఆనందించుచున్నాను. అన్ని మేళ్ళకంటే గొప్ప మేలైన ఈ మేలు నిమిత్తమై కృతజ్ఞతతో స్తుతించుచున్నాను. ఈ స్తుతి వలన కలిగే ఆనంద దీపము ఆరిపోకుండ చేయుదువని నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప కార్యము నాలో పరిశుద్దాత్మ వలన రాకడవరకు నిలుచుననియు, జరుగుననియు నిరీక్షించుచున్నాను.