క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
3. మృతుల కొరకైన ప్రార్ధన
యేసుప్రభువా! నీవు ఈ లోకములో నున్నప్పుడు ఒకరిని ఇంటిలో, ఒకరిని బయట, ఒకరిని సమాధిదొడ్డిలో బ్రతికించినావు. ఇంట్లో యాయీరు కుమార్తెను (మత్తయి 9:23-25), బయట నాయీను విధవరాలి కుమారుని (లూకా. 7:12), సమాధిలో నీ స్నేహితుడైన లాజరును (యోహాను. 11:44) లేపినావు.
యాయీరు కుమార్తెను బ్రతికించుమని ఒక మనవి యున్నది. లాజరును బ్రతికించుమని కూడ ఒక విధముగా మనవి యున్నది. వారిద్దరిని బ్రతికించినావు. అయితే నాయీను విధవరాలి కుమారుని గురించి మనవిలేదు, అయినను బ్రతికించినావు. అప్పుడు నీ మొదటి రాకడలో మృతులను బ్రతికించుటవల్ల ప్రజలకు నీవు ఎటువంటి వాడవో, ఎంత శక్తిమంతుడనో తెలియజేసినావు. కాబట్టి ఇప్పుడును, అడిగినను అడగకపోయినను కొంతమంది భక్తులను బ్రతికించమని వేడుకొనుచున్నాము.
వారు వచ్చి ప్రభువు రాకడను గురించి చెప్పగలరు. దేశానికి ఒకరు బ్రతికివస్తే చాలు, అప్పుడు వారు కొంతమందినైనా నమ్మించగలరు. నీ పునరుత్థానమును అందరు నమ్మలేదు, కొంతమంది నమ్మినారు. గనుక నేడును నీవు కొంతమంది భక్తులను లేపిన యెడల, అందరు నమ్మకపోయినను అందరు వింటారు. నీవు లేపినావనే వార్త వినడానికే మేము కోరుకొంటున్నాము. గనుక మృతులను బ్రతికింపుమని కోరుకునే విజ్ఞాపన (మత్తయి 10:8), నీ వాక్యానుసారమైన విషయమేగాని మా సొంతము కాదు. నీ వాక్యములో యున్నది గనుక మేమడుగుచున్నాము. నీవు నీ శిష్యులకు ఒకమాట చెప్పినావు, "రోగులను స్వస్థ పరచండి" (మత్తయి 10వ అధ్యాయము), అక్కడే ఆగలేదు, వెంటనే ఇంకొకమాట అన్నావు, "మృతులను లేపండి" అన్నావు. (మత్తయి 10:8). నీ శిష్యులు అలాగు లేపినారు. దోర్కాను పేతురు లేపినాడు (అపో॥కార్య॥ 9:41). కాబట్టి నీవు వచ్చి కొంతమందిని లేపితే, నీవు చెప్పిన వర్తమానమే వారు సిద్ధపర్చుకొందురు. నీ మరణ సమయమందు పరిశుద్ధ మనుష్యులు లేచి వచ్చినారు గదా? (మత్తయి 27:52), వారు అందరికి కనబడినారు (మత్తయి 27:53). అప్పుడు నీవనుకొనినవారినే లేపినావు. అందరిని లేప లేదు. గనుక ఇప్పుడు కూడ నీవు అనుకొనినవారినే లేపుము. మేము పేర్లు చెప్పుట ఎందుకు?
మృతులు వచ్చినప్పటికిని నమ్మనే నమ్మరు యని అబ్రాహాము ధనవంతునితో చెప్పెను లూకా (16:31). ఆ మాట చెప్పిన తర్వాత నీవు లేచినావు, దోర్కా లేచినది. మృతులు లేచిచెప్పినా, నమ్మరని చెప్పిన తర్వాత నీవు లేచినావు, దోర్కాను లేపినావు గనుక ఆ మాట తర్వాత వచ్చిన ఈ మా కాలములోకూడ కొంతమందిని లేపుము.
అయితే యేసుప్రభువా! నీవు భూలోకానికి నరరూపిగా రాకముందు కూడ లేపినావు. ఎలీషా కాలములో లేపినావు గదా! (2రాజులు 4:37). గనుక పాత నిబంధన కాలములోను క్రొత్త నిబంధన కాలములోను మృతులను లేపినావు యనేది యున్నది గనుక ఇప్పుడు మేమడుగుచున్నాము. ఇది సంఘకాలము.
త్రియేక దేవుడవైన ఓ తండ్రీ! పాత నిబంధన కాలములో, కొత్త నిబంధన కాలములో, సంఘ కాలములో నీకు మిక్కిలి ప్రియమైన సంఘకాలములో, ఈ మూడు కాలములలో మృతులను లేపిన నీవు, నీకు మిక్కిలి ప్రియమైన ఈ వధువు సంఘకాలములోకూడ మృతులను లేపగలవని నమ్ముచున్నాము. ఒకప్పుడు నీకు సాధ్యమైనది ఇప్పుడు కూడ సాధ్యమే.
త్రియేకదేవా! త్రికాలములలో నీ మహిమను చూపించుము. గతించిన రెండు కాలములలోని నీ మహిమ, ఈ మూడవ కాలములో యున్న మాకు జ్ఞాపకము చేయడమువలన నీ ప్రభావము కనబర్చుమని త్రియేక దేవా! నిన్ను వేడుకొనుచున్నాము. నీ వాక్య చరిత్రనుబట్టి ఈ ఉదయమున, ఈ మధ్యాహ్నమున చేసిన ఈ ప్రార్ధనలు ఇప్పుడు రానైయున్న ప్రభువు ద్వారా ఆలకించుము. ఆమెన్.