క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
2వ ప్రార్ధన
ఓ దయగల తండ్రీ! సమస్తము నీయందు గుప్తములైయున్నవి గనుక నిన్ను గురించి తెలిసికొంటే అన్నిటిని తెలిసికొనగలము. అందుచేత దైవభక్తులు నిన్ను "ప్రత్యక్షత" అన్నారు గనుక తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను గురించిన సంగతి మేము పూర్తిగా తెలిసికొనవలెను.
సమస్తమును నీయందు గుప్తములైయున్నవి. మేము నీకు నమస్కారము చేసిన యెడల మిగిలినవన్నిటికి చేసినట్లే. "నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే" అని చెప్పినావు. ఎందుకంటే అన్నీ నీయందు గుప్తములైయున్నవి. గనుక ఒక గంటసేపు ధ్యానములో నున్న యెడల పొందవలసిన స్థితి పొందగలము. ధ్యానమువలన మా ప్రార్ధన, మా వాక్యము ఉద్రేకముగా ఉండగలవు. అట్టిది లేకుండా యుంటే సమస్తము వ్యర్థము. కొన్ని చప్పగాను, కొన్ని మహా ఉద్రేకముగాను ఉన్నవని కూటములను గురించి చెప్పుదురు. గనుక ఏ కూటములోనైనను ప్రతిదినము నూతన విషయములను తెలిసికొనవలెను. ఆ దిన కూటములు ఏవైనా సరే, ఈ దినము సమాజము ఏరీతిగా నున్నదని ప్రశ్నించు కొనవలెను. అప్పుడు పరలోక కూటస్తులవలె మనమును ఉద్రేకముగా నుందుము. నిన్ను తలంచుకొనుట, నీ చిత్తమంతయు తలంచుకొనుటే, ఎందుకనగా సమస్తము నీయందు గుప్తములైయున్నవి. గనుక ప్రభువా! నీకు వందనములు.
ప్రభువైన యేసూ! పరిశుద్దాత్మా! తండ్రిలోనివన్నీ తీసికొని మాకు బోధపర్చుచున్నారు గనుక ప్రభువా మీ కనేక వందనములు. అంతియొకయ సంఘస్తులు కూటములుగా కూడినారు. నామకార్థముగా కాక ఉత్సాహముగా, భక్తితో, విశ్వాసముతో, సంతోషముతో కూడిక చేసికొన్నారు. అన్యుల పట్టణములో భక్తులను లేపినావు, నీకు వందనములు. నీవు వారికి ప్రత్యక్షమై ఒకమాట అన్నావు. ఆ మాట క్రొత్త నిబంధనలోనున్న అపోస్తలుల కార్యములు మొదలు, పౌలు వ్రాసిన పత్రికలయొక్క చివరిమాట వరకు నెరవేరినది. ఎంత ఆశ్చర్యము! యెరూషలేములో మాట్లాడినావు. ఖైదులోకి కూడవెళ్ళి ప్రత్యక్షుడవైనావు, నీకు వందనములు.
ఒక గొప్ప మాట అన్నావు, "ఓ సంఘమా! ఆత్మ మీతో ఏమి చెప్పునో ఆ మాట వినవలెను". మేము ఏ కూటము జరుపుకొన్ననూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడవైన తండ్రీ! నీ పునరుత్థానమును నేటివరకు తలంచుకొనుచున్న యెడల మా కూటము బలపడ గలదు. మేము, మాకు తెలియకుండనే ప్రక్కబడిపోదుము. మేడ గట్టిదైతే, వరద ప్రక్కబడి పోవును. ఒక ప్రక్కను "ప్రభువు రాకడ ప్రభువు రాకడ", ఇంకొక ప్రక్క "ఇప్పుడెక్కడ ఇప్పుడెక్కడ", ఈ రెంటిమధ్య మేమున్నాము గాన ఇప్పుడెక్కడ అనే సందేహముండరాదు.
ఓ తండ్రీ! మేము రెండు ప్రవాహముల మధ్య నున్నాము. ఒక ప్రవాహము కుడివైపు, మరియొక ప్రవాహము ఎడమవైపు ఆనకట్టమీద
ప్రవహించినపుడు ఒకధ్వని, ఇంటిమీద ప్రవహించి నపుడు మరియొక ధ్వని వినబడుచున్నది గాని మంచినీటి ప్రవాహధ్వని వినబడదు. నీ
దీవెన
అందరికి దయచేయుము. మా కూటస్తులు నీ సంగతులు ఇదివరకే నేర్చుకొనవలెను. తండ్రీ, కుమార, పరిశుద్దాత్మల పనులు మేము
క్రొత్తవిగా
నేర్చుకొనవలెను.
ప్రభువా! నీ రాకడ, తండ్రి రాకడను గూర్చి మేము నేర్చుకొనవలెను. ఆ నీ రాకడను గ్రహింపగలిగే కృప
మాకు
దయచేయుము.
ఈ కథ మా తలకెక్కదు. చివరి దినములలో "అనేకమంది ప్రేమ చల్లారిపోవును" గనుక ఆ వాక్యము మాయందు నెరవేరకుండా ఉండే కృప దయచేయుమని, కాపాడుమని అడుగుచున్నాము. విశ్వాసముండునా? అని తలంచుకుంటే బల్లెపుపోటు. ఎన్ని పర్యాయములు ఎన్ని మీటింగులు పెట్టుకొన్ననూ, అన్ని పర్యాయములూ, "ప్రభువైన యేసూ! త్వరగా రమ్ము" అను ప్రార్ధన చేయగలిగే గొప్ప కృప కలిగించుమని వేడుకొనుచున్నాము.
త్రియేక దేవుడవైన తండ్రీ! మా క్రైస్తవ జీవిత అనుభవము ప్రారంభమైనది మొదలు ఎన్ని వందనములు చెల్లించవలెనో, అన్ని వందనములు చెల్లించుచున్నాము. త్వరగా రానైయున్న యేసుప్రభువు ద్వారా ఈ ప్రార్ధనలు అంగీకరించుము. ఆమెన్.
షరా: ఈ ప్రార్ధన విని పౌరుషము, ఉద్రేకము గలవారై ఎన్ని ప్రార్ధనలు చేసికొనిననూ, ముగింపులో "త్వరగా వచ్చుచున్న నీ రాకడకు సిద్ధపర్చుము" అని అనవలెను.