క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

3వ ప్రార్ధన



త్రియేక తండ్రీ! ఓ తండ్రీ! ఓ దేవా! ఓ ప్రభువా! సర్వాధికారీ! సమస్త సృష్టికి కర్తవైన ప్రభువా! నీ మహాగొప్ప మహిమ ఎదుట పాపులమైన మేము ఈ దినమందు కూర్చుండి, నీ యొక్క రెండవ రాకడ ధ్యానము చేయనైయున్నాము గనుక ముందుగా నిన్ను స్తుతించు చున్నాము. ఈ సమావేశము నిమిత్తము నిన్ను స్తుతించుచున్నాము.


ఓ దేవా! నీవు కలుగజేసిన సూర్య, చంద్ర, నక్షత్రముల కాంతి ఈ వధువు సంఘము చూచినప్పుడు, ఇవే ఇంత కాంతిగాయుంటే నీవు ఇంకా ఎంత కాంతిగా యుందువో అనే తలంపుతో ఆనందించే కృపదయచేయుము. మేము ఎప్పుడు పరలోకమునకు వెళ్ళి, ఆయన కాంతిలో, ఆ మహిమ కాంతిలో, జ్యోతుల కాంతికి మించిన కాంతిలో నుందుమో అని ఆశించే కృప వధువు సంఘమునకు దయచేయుము. పై మహిమ తలంపు, ఆకాశమండల మహిమ మా కన్నులయెదుట చూపిస్తున్నావు. నీకు మా వందనములు.


మేము జన్మించినది మొదలు జీవాంతము వరకు ఆకాశ మహిమకాంతిని చూపించుచు, నీ కాంతిని జ్ఞాపకము చేస్తున్నావు గనుక నీకు వందనములు. నరులు నీ సంగతులు తెలుసుకొనవలెనంటే బోధకులకన్న గ్రంథములకన్న ముందుగా జ్యోతులే తెలియ పర్చుచున్నవి. గనుక నీకు వందనములు.


మా నిమిత్తమై జ్యోతుల దగ్గరనుండి వచ్చుచున్న కాంతిని, వాటి క్రిందనున్న మేఘములలో మా దాహశాంతి నిమిత్తమై, మా స్నానము నిమిత్తమై నీవు దాచి పెట్టిన జలమును చూడగా, మేము పరలోకమునకు వచ్చి, సమరయ స్త్రీకి సుఖారు నూతివద్ద నీవు చెప్పిన జీవజలమును, ఎప్పుడు పానము చేయుదుమో అనే తలంపుతో నిన్ను స్తుతించు కృప వధువు సంఘమునకు దయచేయుము.


మాకంటే తక్కువగా నిన్ను గురించి తెలిసియున్న పక్ష్యాదులయొక్క ఉదయకాల గానము విని, మేము ఎప్పుడు పరలోకమునకు వెళ్ళి స్తుతిగానము, ఆగని స్తుతిగానము, భూలోక మెరుగని స్తుతిగానము, నూతన గానము, భక్తుల గానము నందుకొనుము! అనే ఆతురతతో కనిపెట్టగల నిత్యాశను వధువు కలిగియుండునట్లు నీ కృప దయచేయుము. ఇట్టి జ్ఞానశక్తి నిమిత్తము నీకు వందనములు.


ఇంకను దిగువకురాగా, పాపముతో నిండియున్న ఈ భూమిమీద మొలిచిన చెట్లకు ఎంతో రమ్యమైన పువ్వులు, పండ్లున్నవి. పాపము లేనప్పుడు ఏదెనుతోటలోని పూలు, పండ్లు ఎట్లుండెనోయని, పరలోకములోనికి వచ్చునప్పుడు వాటిని చూచే ఆశ వధువునకు దయచేయుము. అట్లు స్తుతి చేయుటకు ఇవి ముంగుర్తులైయున్నవి. ఎంత పాపము వ్యాపించినను, సృష్టి ఇంత రమ్యత గలిగి యుంటే, మా తండ్రీ! పరలోకములో మేము, మా వస్త్రధారణ, దేవదూతలు, ఎంత రమ్యముగా నుందుమోయని మరెక్కువగా స్తుతించే కృప మాకు దయచేయుము. ఇట్టి తలంపు నిమిత్తమై నీకు మా వందనములు.


పాపముతో నిండిన ఈ లోకములో కొందరు బోధకులను, ఏర్పర్చి నీ వాక్యము వివరిస్తుండగా వింటూయున్న వధువు సంఘమునకు, ఒక మంచి తలంపు కలిగించుము. ఇక్కడి బోధకులే ఇంతగా వినిపిస్తే, పాపములేని ఆ పరలోకములో ఇంకా ఎంత వినసొంపుగా ఉండునో అనే తలంపు వధువు సంఘమునకు దయచేయుము. అట్టి జ్ఞాపకమును కలుగజేసే తండ్రీ! నీకు మా నిత్యమంగళ స్తోత్రములు.


పరలోకములో మా స్వజనులు, మాకు బోధించిన వారు, మా బోధవిని మారినవారు, మా పాత నిబంధనలోనివారు, మా కొత్తనిబంధనలోని వారు, మా సంఘచరిత్రలోని వారు, మా మిషను వారు, మేము ఎన్నడును అనుకొనని పరమ దుర్మార్గులు, పరమ భక్తులు మున్నగు వారిని మేము కలిసికొనే ఆతురత కొరకు నీ కృప దయచేయుము.


ఈ రమణీయ ఆలోచన నిమిత్తమై నీకు వందనములు. కొంతవరకు ఇక్కడ దర్శనములో చూస్తున్నాము. మాకు తృప్తిలేదు. నిన్ను ముఖాముఖిగా చూచు భాగ్యము దయచేయుము. అప్పుడు మాకు పాడు లోకము, పాడు తలంపులు, పాడు మాటలు, పాడు క్రియలు, పాప సమూహము మా జ్ఞాపకమునకు రావు. అట్టి స్థితి అక్కడయున్నది. గనుక మేము త్వరలో వెళ్ళిపోవలెను. త్వరగా వస్తానన్న ప్రభువు త్వరగా వస్తుంటే, మేముకూడ త్వరగా వస్తున్నాము యని అనుకొనే కృప దయచేయుము. చివరలో పాపులమధ్య, సుంకరులమధ్య కూర్చుండి భుజించియున్న మా ప్రభువువలె, నేడు పాపులమధ్య సుంకరుల మధ్యనున్న వధువుసంఘము యొక్క ఈ సంతోషము, ఈ నిరీక్షణ, ఈ సమావేశములు, ఈ బోధలు, ఈ జ్ఞానము - మా చుట్టునున్న వారు చూస్తుండగా వధువు సంఘములోనికి త్వరగా వచ్చేటట్లు వారికెక్కువ ప్రేరేపణ దయచేయగల ప్రభువా! అట్టి ఘనకార్యము నీవు చేస్తుండగా, ఎన్నాళ్ళకో నీవు కూడ వధువు సంఘములోనికి వచ్చావా? అని హస్త పరిచయము (shakehand) చేసికొనే కృపా తరుణము దయచేయుమని వేడుకొనుచున్నాము.


ఈ నూతన సంకల్పన నిమిత్తము నీకు వందనములు. నీ సన్నిధిలో నున్నాము అవసరమైనవి అందించుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.


షరా: 365 దినములుకూడా రాకడను గురించి ధ్యానింపవలెననిన యెడల, 370 సార్లు రాకడను గూర్చి క్రొత్త నిబంధనలో ఉన్నది. గనుక ఆ రాకడ వాక్యములు ప్రతిదినము చదివిన యెడల రాకడ కాంతి మీలో వెలిగింపబడును. అవి చదివినకొలదీ, అందులోనుండి నూతనమైన కాంతి మీకు కనబడగలదు.

యేసు ప్రభువు 3 మందలింపులు, 2 సలహాలు చెప్పెను

(లూకా 21:34-36)లో తిండి, మత్తు, ఐహిక విచారము అను 3 మందస్థితులు ఉన్నవి.


1. తిండి: తిండిమీద పడిపోయి పరలోకమునకు సిద్ధపడు విషయములో అశ్రద్ధగా నుందురు. రాకడ విశ్వాసులకు ప్రభువు ఈ మాట చెప్పుచున్నారు. ఈ విషయములో ఎవరైనా నేరస్తులలైయుందురేమో జాగ్రత్తగా చూచుకొనండి, పరీక్షించు కొనండి. పెండ్లికుమార్తె సిద్ధబాటును జ్ఞాపకము చేసికొని, భోజనము చేయునప్పుడు ఈ మందలింపు మాటను జ్ఞాపకముంచు కొనండి. ఒక ముద్ద తక్కువగా తినమని డాక్టర్లు చెప్పెదరు. ఎక్కువగా తింటే ఎక్కువ బలమనుకొంటారు, గాని రెండు ముద్దలు తగ్గించి తినిన మంచిది.


2. మత్తు : అలసట వలన, త్రాగడంవలన మత్తు రావచ్చును. ఏవిధమైన మత్తయినను సరే, సిద్ధపడుటకు ఆటంకమే గనుక మత్తును రద్దుచేయుము.


ఇప్పుడిప్పుడే కాదు అనుకొని నిద్రపోయినవారు (బుద్ధిలేని కన్యకలు). వారు భక్తి ఎక్కువైపోయి నిద్ర పోయినారు గనుక రాకడ ఇప్పుడిప్పుడే రాదు అనేది చేదస్తము. 30-35 ఏండ్లనుండి రాకడ వస్తున్నదని చెప్పుచున్నారు, ఇంకా రాలేదు గనుక రాకడ అప్పుడే రాదు అంటే విశ్వాసులు ఊరుకొంటారు. ఈలాగు మత్తు రావడమునకు అనేక కారణములుండును గనుక అది రాకుండా చూచుకొనండి.


3. ఐహిక విచారము : ఈ లోకసంబంధమైన చింత కుటుంబములో ఆరంభ మగును. భార్య, భర్తలు కీచులాడుట, పరలోక విచారము, చింత, పెనిమిటికి ఇంకా మారుమనస్సు రాలేదనే చింత. ఈ విధమైన చింతలు కలిగి ఉండుట, "పైనుండి వచ్చే జలము భూమిమీద బురదతో కలిసి చెడినట్లు" ఉండును. పిల్లలు చెప్పేమాట వినరు. ఈ చింతలు మనకు ఉండరాదు, ఆత్మకు కళంకము కలుగనియ్యరాదు. చింత పెట్టుకొంటే రాకడలో వెళ్ళలేరు. ప్రభువు యుక్తకాలమందు వారిని మార్చును. "చింతించితే మూరెడు పొడుగగుదురా"? అను వాక్యమును జ్ఞాపకము చేసికొని, "నేను బోధించినాను, ప్రార్ధిస్తాను" అని అనుకొనవలెను.


కుటుంబములో మాత్రమేకాదు, సంఘములో కూడ చింత ఉండును, మారుమనస్సు పొందని వారిగురించే ఉండును. గనుక బోధించుట, ప్రార్ధనచేయుట, ఉత్తరము వ్రాయుట మానవద్దు. శ్రద్ధతో వినేవారు స్థిరులు, ముప్పదంతలు. వ్రాసికొనేవారు అంతకంటే స్థిరులు, అరువదంతలు. వీరికంటే స్థిరులు ఇతరులకు చెప్పేవారు, వారు నూరంతలు. గనుక వినిన ప్రకారము చెయ్యవలెను.

ఆ సమయము కొరకు కనిపెట్టుకొనక పోయినందువల్లనే ఆ కన్యకలు వెళ్ళలేకపోయిరి. యేసు ప్రభువు ఆ గడియ, ఆ దినము తెలియదని, ఇప్పుడే రాదని ఎంత చెప్పినను, పెండ్లికుమార్తె ఆ గడియ ఏదో, ఆ దినము ఏదో, ఆ సంవత్సరము ఏదోయని ముఖ్యముగా కనిపెట్టవలెను.


సైమల్టేనియస్ (ఏక కాలము): ఆ ఏక కాలము ఏ కాలము? రెప్పపాటు కాలము. పై మూడు అనగా తిండి, మత్తు, ఐహిక విచారము. ఈ మూడు కూడనివి. ఏరగా ఏరగా, ప్రభువు ఈ మూడు ఏరినాడు. ఇవి పాపములుకావు గాని అజాగ్రత్తకు సంబంధించినవి. జాగ్రత్త నిమిత్తము ప్రభువు వీటిని ముందుగా చెప్పెను. పాపము చేయుటలో జాగ్రత్తగా నుందురు గాని ఈ 3 విషయములో మందముగా నుందురు.


సలహాలు:

మెళకువగా నుండుట అనగా నిద్రలేకుండ నుండుటకాదు. నిద్ర పోతున్నను సరే రాకడ తలంపుతో హుషారుగా నుండుట. డాక్టరు మార్టిను లూథర్ గారు "నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని" ప్రతి రాత్రి, చివరి ప్రార్ధన చేసి నిద్రపోయేవారు. అప్పుడు నిద్రపోయినా మెళుకువగా నున్నట్లే.


ఇంకనూ, పెండ్లికుమార్తె చేసే ప్రార్ధన ఏమైనా నున్నదా? ఉన్నది. "ప్రభువైన యేసూ రమ్ము" అనే ప్రార్ధన. ఈ ప్రార్ధన ఎందుకు? ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆదామవ్వలను సైతాను మోసము చేసెను. అప్పుడు సైతానును బంధించెనా? లేదు. అయితే వాడు ఒకనాడు పాపముచేస్తే, చిరకాలము వైరము ఎందుకు? (ఆది 3:15) అది బంధము. సైతానుకు విమోచనలేదు. అది నిత్య బంధకమే. మట్టి తింటావు, నేలను ప్రాకుతావు, నిత్యము బంధకమే, సాతానుకు శిక్షే గాని రక్షణలేదు. ఇది ప్రభువు మాకు బైలుపర్చిన వ్యాఖ్యానము. మనకు శిక్షయున్న రక్షణయున్నది.


సాతాను చిత్తుచేయబడిన శత్రువు, ఆదాము దగ్గరే వాడు ఓడిపోయినాడు. గనుక దేనికిని మనము భయపడనక్కరలేదు, చింతపడ నక్కరలేదు. ఆరు నరుని సంఖ్య, ఏడు దేవుని సంఖ్య. సైతానుకు పూర్తిగా బంధనకాదు. ఆదామవ్వలు పైన, క్రింద సైతాను జడ్జికోర్టులో బంధనలో యున్నారు. గాని అతనిలో విషమున్నది. ఉదాహరణకు పొడ పామున్నది. అది ఊదినది, వెళ్లిపోయింది గాని దాని గాలి, దాని విషము మనిషి మీద ఉండును కదా! ఆలాగే సాతాను ఊదిన విషముయొక్క వేరున్నది. ఆ విషము కయీనులోనికి వచ్చి, దేవుడు చెప్పినమాట అబద్ధమని చెప్పెను. హేబెలు చనిపోయెను. ఆ విషము అక్కడనుండి జలప్రళయ కాలమునకు వచ్చి, ఓడను ఎక్కనివ్వలేదు. అక్కడనుండి మన కాలము వరకు, ఆ తర్వాత 7 ఏండ్లు, వెయ్యి ఏండ్లవరకు వచ్చెను. చివరగా, ఆ వెయ్యేండ్ల తర్వాత దేవుడు, చెరలోనున్న సాతానుకు ఎందుకు విడుదల ఇచ్చెను? మారని మనుషులున్నందున విడుదల ఇచ్చెను. వీరు పిలిచిన పిలుపున్నది, వారు "నీవు ఊదిన విషము మాలో ఉన్నదని సైతానును కోరుకొందురు". కోరేవారు లేకపోయిన దేవుడు సాతానును ఆ పైనే నరకములోనికి పంపివేయును. మనుష్యులు ఎందుకు కోరుకొన్నారంటే, దానిలోని విషము వారిలో నున్నందున వారు కోరుకొన్నారు. పాపముచేసే వారందరూ సాతానును కోరుకొన్నట్లే. ఇప్పుడున్న పాపాత్ములందరు ఒక తెల్లని కాగితముపై, ఈ సాతానుమీద అర్జి వ్రాసి, పెండ్లికుమార్తెతో సంతకము చేయించిన, అప్పుడు పెండ్లికుమార్తె సింహాసనము దగ్గరనున్న విజ్ఞాపనకర్తకు దానిని అందించగా, తండ్రి శాంక్షను (Sanction) చేయును. వెంటనే సాతాను పనికి ముగింపు అగును. ఇది వెంటనే జరుగదని మాకు తెలుసు గాని జరిగిన బాగుండును. విశ్వాసులు అర్జీ ఇచ్చుకొంటున్నారు. గనుక సాతానును బంధించుము.


ఓ ప్రభువా! విశ్వాసులెవ్వరూ సాతాను చేతిలో పడకుండ చేయుము. ఈ మా ప్రార్థనలు, వాక్యములన్నియు త్వరగా రానైయున్న యేసుప్రభువు ద్వారా అంగీకరించుము. ఆమెన్.