క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
పెండ్లికుమార్తె
పరలోకములో గొఱ్ఱెపిల్లయొక్క వివాహము జరుగును. ఆ వివాహమునకు సంఘము పెండ్లికుమార్తెగా కూర్చుండును. ఈ సంఘమునకు క్రీస్తుప్రభువు వరుసకు పెండ్లికుమారుడగును లేక గొర్రెపిల్లయగును. ఎలాగనిన, యేసుప్రభువు గొఱ్ఱెపిల్లగా సిలువమీద దహన బలియై, తన స్వంత రక్తమును ధారపోసి, దానితో సంఘమును ఆస్థిగా కొనియున్నాడు. గనుక సంఘము పెండ్లికుమార్తెయెనది. అది ఇప్పుడు మనము ఆలోచించు అంశమై యుండవలెను. యూదులు ఒక్కరే సంఘమైయుండలేదు గాని యూదులు, అన్యులు కలిసి సంఘమగును. యూదులు, ఆయన లోక రాజని తప్పు అభిప్రాయపడి ఈ భాగ్యము పోగొట్టుకొనిరి. మనముకూడ పెండ్లికుమారుని విషయములో ఏ విధముగా పొరపడినను, ప్రేమ తగ్గినను, పెండ్లికుమార్తె వరుసలోనికి చేరలేము గనుక జాగ్రత్తపడవలెను. పెండ్లికుమార్తెగా ఎత్తబడువారికి ఉండవలసిన లక్షణములు: విజ్ఞానము, విన్నపము, విశ్వాసము, విధేయత.
- 1) విజ్ఞానము :- రాకడను గూర్చిన సంగతులు యావత్తు పూర్తిగా తెలిసికొనవలెను.
- 2) విన్నపము :- ప్రార్థించవలసిన సంగతులన్నియు ప్రార్థింపవలెను.
- 3) విశ్వాసము :- ప్రభువు నన్ను పెండ్లికుమార్తె వరుసలోనికి చేర్చుకొనునని నమ్ముట
- 4) విధేయత :- వాక్యము చెప్పిన రీతిగా అనగా ప్రభువు చెప్పినది చెప్పినట్లు చేయుట.
పదిమంది కన్యకలలో (మత్తయి 25వ అధ్యాయము) ఐదుగురు మిగిలిపోయిరి. కారణమేమనగా పెండ్లికుమారుని మీది ప్రేమ కొద్దిగా తగ్గినది. ప్రకటన 2:4 గనుక ప్రభువా! పెండ్లికుమార్తె వరుసలోనికి వచ్చువారిని త్వరగా సిద్ధము చేయుమని ప్రార్ధించవలెను.