క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
2. రహస్య సన్యాసుల కొరకైన ప్రార్ధన
దయగల యేసుప్రభువా! పరలోకములో అనగా దేవదూతల లోకములో, మోక్ష లోకములో, వాయుమండల లోకములో, భూలోకములో, పాతాళలోకములో ఉన్న ప్రతివారి జీవితము నీ చేతిలో యున్నది. మరణము యొక్కయు, పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో యున్నవి అని ప్రకటన వ్రాసిన యోహానుతో చెప్పినావు (ప్రకటన 1:18). పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికార మియ్యబడియున్నది అన్నావు (మత్తయి 28:18).
కాబట్టి గుహలలో యున్న రహస్య సన్యాసుల, గుహ నివాసులమీద కూడ నీ దృష్టి అధికార మున్నది గనుక వారిని బయటికి తీసికొని
రమ్మని
వేడుకొనుచున్నాము. ఒక పొలములో కొంతమంది పనిచేయుచుంటే, ముగింపు చేయనందున, రైతు మరికొంతమంది పనివారిని పెట్టును.
అలాగుననే
ప్రభువా! మైదానములలో పనిచేయుచున్న బోధకులు, పూర్తి చేయలేక పోవుచున్నారు గనుక పూర్తి పనిని చేయుటకు మాత్రమేకాక
బోధకులకు
ఉద్రేకము పుట్టించుటకును, మారుమూలలోనున్న రక్షితులను బయటికి లాగుకొని వచ్చి, మీరుకూడ బోధపని చేయండని వీధులలో
నిలబెట్టుటకును,
ఆ రహస్య సన్యాసులను పంపుము అని వేడుకొనుచున్నాము. నావలోనున్నవారు వల లాగలేక యున్నప్పుడు, పాలివారిని పిలిచినారు గదా?
(లూకా
5:7) వారు వచ్చినప్పుడు లాగే పని పూర్తియైనది.
అలాగే ఇప్పుడు మేము నీ సువార్త వలను భూలోకమంతట వేసియున్నాము. లాగుటకై రహస్య సన్యాసులను పంపుమని వేడుకొను చున్నాము. నీకు స్తోత్రములు. మైదాన బోధకులమైన మేము కొద్దిగా బోధ చేయుచున్నాము. ఎప్పుడో ఒక పర్యాయము నీ సన్నిధిలో కూడుకొనుచున్నాము గాని అది చాలదు, బోధపని కూడ చాలదు. మేము చేయు పని అసలే చాలదు. సన్నిధాన వర్తలను ఇతరులు ఆక్షేపించుచున్నారు. వీరు సోమరులు గనుక పనిలేక గదులలో కూర్చుండి, అరచుచున్నారని అనేక పేర్లు పెట్టుచున్నారు గాని గుహలలోనున్న రహస్య సన్యాసులకు ఎవ్వరు పేర్లు పెట్టలేరు. వారు నిత్య సన్నిధానవర్తనులు గనుక జీవిత కాలమంతయు నీ సన్నిధిలోనే యున్నారు. ఎంతగొప్ప ధన్యత! ఈలాగు నెలకొక పర్యాయము మేమిక్కడ కూడుకొంటే, అధమపక్షము ఒక క్రొత్త సంగతియైన నేర్చుకొనగలము. అయితే వారు ప్రతి రోజు క్రొత్త సంగతులు నేర్చుకొనుచున్నారు. ప్రతి దినము నీ సన్నిధిలో వారుంటున్నారు. మాలో ఎవ్వరును అలాగున్న వారులేరు, గనుక మా కంటే వారే గొప్ప వారు.
మరియమ్మ కొన్ని నిమిషములు మాత్రమే, కొంతసేపు మాత్రమే, నీ పాద సన్నిధియందు కూర్చుండెను (లూకా 10:39). అయితే వీరు సంవత్సరాల తరబడి నీ సన్నిధిలో కూర్చుంటున్నారు. మేమెవ్వరమైనను వారి దగ్గరకు వెళ్ళవలెనంటే చలిచేత చనిపోదుము. వారైతే మా దగ్గరకు రాగలరు. వారు మహిమతో నింపబడి యున్నారు గనుక చలితీవ్రతకు ఓర్చుకొనగలరు, ప్రతి వారియొక్క హృదయమును బద్దలు కొట్టగలరు, ఎదిరించే నోళ్ళను కట్టివేయగలరు, బిగించగలరు. కాబట్టి వారిని త్వరలో పంపుమని వేడుకొనుచున్నాము. నీకు స్తోత్రములు. నీవు చెప్పినట్లయితే వారు రాగలరు. మేము వెళ్ళి మాట్లాడితే "ఎందాక నిద్రమత్తులై యుంటారు! రాకడ సమీపమైనది, ఈ పాటికైన లెండి" అని మమ్మును గద్దించెదరు. ఓడ నావికుడు ఓడయొక్క అడుగుభాగమున నిద్రపోవుచున్న యోనా ప్రవక్తను లేపినట్లు, వారు వచ్చి మైదాన బోధకులను లేపగలరు (యోనా 1:6). కాబట్టి వారిని త్వరగా పంపించుమని వేడుకొంటున్నాము. నీకు స్తోత్రములు.
కోత విస్తారము, బోధకులు తక్కువయని నీవు చెప్పినప్పుడు, సన్యాసులున్నట్లు ఎక్కడ వ్రాయబడలేదు గాని క్రైస్తవ శకములో మాత్రము ఉన్నట్లు, సంఘ చరిత్రవల్ల కనబడుచున్నది. వారు గొప్ప పని చేస్తున్నారు, నీకు స్తోత్రములు. మా అందరికొరకు విజ్ఞాపన ప్రార్ధనలు చేయుచున్నారు. మావలె వారు మీటింగు మధ్యమధ్యలో బయటికి వెళ్ళువారు కారు. గాని నీ సన్నిధిలో స్థిరముగా ఉండేవారు. అది రెండవ పని.
మూడవ పని ఏమనిన నీవు ఏమి చెప్పితే వారు అది వినేవారు. గనుక మా మైదాన బోధకులు ఏమి చెప్పగలరు! ఒకవేళ చెప్పినయెడల ఎంతమంది వినగలరు! వారైతే విసుగుదల లేకుండ నీవు చెప్పు మాటలు వినుచున్నారు. వారికి ఎంత ధన్యత!
- 1) నీ సన్నిధిలోయుండే భాగ్యము
- 2) చలికి సహించే భాగ్యము
- 3) మా ఆహారము అక్కరలేని భాగ్యము
- 4) నీ వాక్యము వినే భాగ్యము
- 5) నీ మహిమ అనుభవించే భాగ్యము
- 6) ముఖాముఖిగా నిన్నుచూచే భాగ్యము
- 7) మా అందరి కొరకు విజ్ఞాపనలు చేసే భాగ్యము.
ఈ ఏడు భాగ్యములు కలిగియున్న రహస్య బుషులను, మా మైదానముల మీదికి పంపుమని వేడుకొనుచున్నాము. ఇదివరకు కూటములో, వారిని గురించి ప్రార్ధించినాము. ఆ ప్రార్ధనల గొలుసు తెగిపోయినది, మరల ఇప్పుడు ప్రారంభించుచున్నాము. 1889వ సం॥న పుట్టి, ఈ ప్రాంతములకు 1929 సం॥లో బోధకుడుగా వచ్చిన సాధు సుందర్సింగు చలిని సహించగలడు. గనుక ఆయన వెళ్ళి వారినిచూచి "బైటికి వచ్చివేయండి" అని చెప్పగా వస్తాం! వస్తాం! అని చెప్పిరి. ఇంకా రాలేదు. సుందర్సింగు చెప్పడముకాదు.
యేసుప్రభువా! నీవే చెప్పుము. ఆ పైన మేము కోరుకొనవలెను. వల లాగలేనివారు కోరుకొంటే పాలివారు రాలేదా? (లూకా 5:7). అలాగే క్రైస్తవ బోధకులు నిన్ను కోరుకుంటే, నీవు వారితో చెప్పి వారిని బయటకు రప్పించగలవు. మా దగ్గరనుండి వారి రాక విషయమైన దరఖాస్తు ముందుగా నీ దగ్గరకు రావలెనుగదా! ఎంతమంది ప్రార్థించుచున్నారు? తెలిసిన మేమే ప్రార్థించుట లేదు. ఇప్పుడు చేసిన తరువాత మరలా ఒక సంవత్సరము వరకు ఆ తలంపు యుండదు. అలాగైతే వారెట్లు రాగలరు! గనుక మైదాన బోధకులు కోరుకొనవలెను. ఆ కోరికను ప్రభువా! నెరవేర్చుము.
ప్రభువా! భూలోక సంఘము వారి రాకడ కొరకు ప్రార్థించునట్లు ప్రేరేపింపుమని వేడుకొను చున్నాము, స్తోత్రములు. అప్పుడు ఒక సంగతి జరుగును. వారు వస్తే దేశాలలో, పట్టణములలో, పల్లెలలో గొప్ప అల్లరి, ఆందోళన కలుగును. కలిగితే కలిగినదిగాని వారిని త్వరలో రప్పింపుము.
యువరాజుగా రానైయున్న యేసుప్రభువా! పెండ్లి కుమారుడవుగా రానైయున్న యేసుప్రభువా! నీకు స్తోత్రములు. ఈ సన్యాసుల గుంపునకు పెద్దగానున్న కైలాస బుషిగారి సంగతులుకూడ మాకు తెలియపరచుచుండుమని వేడుకొను చున్నాము.
మా దేశములో యొక గొప్ప మహాబుషిని లేపియున్నావు. మా దేశమునకు ఇతర మతస్తులు, బుషుల దేశమని పేరు పెట్టియున్నారు. అట్టి దేశములో నీ అనుచరులలో ఒకరిని లేపినందున నీకనేక స్తోత్రములు. మా దేశములో, ఎక్కువగా నీ సన్నిధిలోయున్న సుందర్సింగును బయటకు రప్పించిన నీకనేక వందనములు. ఆయనకును, బుషికిని స్నేహము కలిపిన నీకు స్తోత్రములు. ఆయన ద్వారా, ఆయన పుస్తకముల ద్వారా, ఆయన ఉపన్యాసముల యొక్క వర్తమానముల ద్వారా, మా దేశమునకు రెండవ రాకడ బోధ ఇంకను విరివిగా వినిపించు చుండుమని వేడుకొనుచున్నాము. రహస్య సన్యాసులు ధ్యానములో యుండగా, పరలోక వాస్తవ్యుల విషయములు, దేవదూతల విషయములు, మా విషయములు వారికి, కైలాసబుషికి తెలియుచున్నవి. అట్టి గొప్పవారిని హిమాలయ పర్వతములలో లేపియున్నావు. గనుక నీకు స్తోత్రములు.
ఒకరు మహమ్మదీయ దేశమునకు సంబంధించినవారు, ఇంకొకరు మా దేశమునకు సంబంధించిన వారు. ఇద్దరిని మా దేశములోనే లేపినావు. వీరును వారును సన్యాసులే, వారు రహస్య సన్యాసులు, అయితే సుందరసింగు బహిరంగ సన్యాసి. వీరి ద్వారా వర్తమానములు వినిపించినావు, ఇప్పుడు ఆ వర్తమానములు దొరకడములేదు. గనుక వాటి ఫలితము ఇప్పుడు చూపించుమని వేడుకొను చున్నాము. నీకనేక స్తోత్రములు.