క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

రాకడ ప్రార్ధనలు



(రాకడ ప్రార్ధనలు - ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన ప్రార్ధనలు)

మైదాన బోధకుల కొరకైన ప్రార్ధన

ఎ) త్రియేక దేవుడవైన తండ్రీ! యేసుప్రభువా! మా మొదటి ప్రార్థన:
"బోధకులను పంపించుము". భూదిగంతముల వరకు నీ సువార్త ప్రకటింపవలెను అని (మార్కు 16:15) లో ఉన్నది. కాబట్టి నమ్మకమైన స్వంత పని వారిని అనేకమందిని లేవనెత్తుము. ఇప్పుడున్న పని కొంతవరకు బాగుగా యున్నప్పటికిని, కొంతవరకు మందముగా ఉన్నది. కాబట్టి చురుకుదనముగా పనిచేసే బోధకులను, స్త్రీలను, పురుషులను పంపించుము. అన్ని దేశములకు పంపించుము.


ఓ ప్రభువా! కోత విస్తారము, పనివారు తక్కువ గనుక పని వారి కొరకు తండ్రిని వేడుకొనండి, ఆయన పంపును అని సెలవిచ్చినావు (లూకా 10:2). కాబట్టి ఆ వాక్యమునుబట్టి అడుగుచున్నాము. ఎప్పటికప్పుడే కొత్తది అడగండి అని చెప్పినావు (మత్తయి 7:7), ఇప్పుడు అడుగుచున్నాము పని పూర్తి అయ్యేవరకు అడుగుచునే యుందుము. నీకు వందనములు. ఎందుకంటే ఇచ్చేవాడవు, పనివారిని పంపేవాడవు నీవే. మరియు అడగండి, వేడుకొనండి అని చెప్పియున్నావు. అందుకే నిన్ను ఇప్పుడు వేడుకొనుచున్నాము.


బి) సమర్పణచేసి కేవలము నీ మీద ఆనుకొనియుండే పనివారిని పంపుము. సొంతాలోచనకాక, వ్యాఖ్యానము కాక, ఇతరుల ఆలోచనకాక, కేవలము నీయాత్మ అందించు వర్తమానమే (మత్తయి 10:19), సర్వజనులకూ అందించే, ప్రముఖులైన బోధకులను పంపించుము. ఇప్పుడు పని మీదనున్న బోధకులను, అట్టి బోధకులనుగా మార్చుచునే యుండుము.


సి) పనివారియొక్క బలహీనతలు నీ అమూల్య రక్తము వలన శుభ్రము చేయుచు, ఒక దరినుండి శుద్ధిచేయుచు, మరియొక దరినుండి బలము కలిగించుచుండుమని నిన్ను వేడుకొనుచున్నాము (1యోహాను 1:7).


డి) ఇప్పుడున్న పనివారు ఏ పద్ధతుల మీద, ఏ సాధనముల మీద, ఏ సాధనముల మూలముగా పనిచేయుచున్నారో, ఆ పద్ధతులను, ఆ సాధనములను దీవించుమని వేడుకొంటున్నాము. మా మనవులు ఆలకించెదవని నమ్మి నిన్ను స్తుతించుచున్నాము.


ఇ) ఇప్పుడున్న బోధకులు చేయుచున్నది గొప్పపని, అద్భుతకరమైనపని. అనగా బైబిలు గ్రంథమును రెండువేల కంటే ఎక్కువ భాషలలోనికి తర్జుమా చేయుటయే, అది నీ ఆత్మయొక్క పని. పెంతెకొస్తు దినమున నీ శిష్యులు అనేక భాషలలో సువార్తను బోధించిరి. ఇప్పుడు నీ బోధకులు, అప్పుడు మాట్లాడిన భాషలకంటే ఎక్కువభాషలలో మాట్లాడుచు సువార్త ప్రకటించుచున్నారు. కాబట్టి నీకు స్తోత్రములు. ఆ పని ఇంకను వృద్ధిలోనికి వచ్చునట్లు మార్చుము. చిన్నచిన్న భాషలున్నవి. వాటిని నేర్చుకొనుచు, వాటిలోకూడ నీ వాక్యము అచ్చువేయించుటకు పూనుకొన్న నీ పనివారిని, నీ ఆత్మచే వెలిగించుచు, వారిని, వారి పనిని దీవించుము.


ఎఫ్) ఓ ప్రభువా! ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరముల క్రిందట చెదరిపోగా, వారినిప్పుడు వాగ్ధాన దేశమునకు చేర్చుచున్నందుకు వందనములు. అలాగుననే బాబెలు గోపుర నిర్మాణమప్పుడు చెదరిపోయిన వారినందరిని, నీ మందలోనికి చేర్చునట్లుగా బోధకులను ప్రేరేపింపుము. మా ప్రార్ధన యావత్తు; రెండవ రాకడకు సంఘమును సిద్ధపర్చునట్లు పని చేయగల బోధకులను పిలువుము. ఎందుకనగా అనేకమంది బోధకులు, నీ రాకడ నిజమని నమ్ముచున్నారు గాని నీవు త్వరగా వచ్చుచున్నావని నమ్ముటలేదు గనుక ఆ బోధకులకు నీవే బోధకుడవైయుండి, త్వరగా వచ్చుచున్నావని బోధపర్చుము.


జి) ఓ యేసుప్రభువా! నీ శిష్యులను భూదిగంతముల వరకు సువార్త ప్రకటించేటందుకు సిద్ధపరచినావు (మార్కు 16:15). అలాగే నేటికాల బోధకులను కూడ రాకడకొరకు సంఘమును సిద్ధపరచునట్లు, పంపుమని వేడుకొనుచున్నాము. నేటి ప్రార్ధన విందువని నమ్ముచు నిన్ను స్తుతించుచున్నాము. అట్టిబోధ నీ రాకడబోధ.


హెచ్) ఈ గదిలోనున్న మేముకూడ తీవ్రముగా బోధించుటకై బలహీనులమైన మాకు బలము, జ్ఞానహీనులమైన మాకు జ్ఞానము; చురుకుదనము లేని మాకు చురుకుదనము; సమయములేని మాకు వీలైన సమయము దయచేయుమని వేడుకొనుచున్నాము.


ఐ) మా ప్రార్ధన, లోకమంతటిలో ఆయా స్థలముల యందు పనిచేయుచున్న పాత బోధకులను గురించియు, క్రొత్త బోధకులను గురించియునై యున్నది. ఈ రెండు రకములైన బోధకులు, ప్రజలకు సరిపోయేవారై యుండునట్లు, బోధకులను సరిచేయుమని వేడుకొను చున్నాము.


జె) కృపగల తండ్రీ! నీకు స్తోత్రము. కొందరికి రాకడ వర్తమానము తెలిసినను అందచేయుటలేదు. వారికి చెప్పే వాక్కు, నచ్చచెప్పే వాక్కు, ఖండించే వాక్కు, బోధపర్చే వాక్కు, ప్రత్యక్షపర్చే వాక్కు లేదు. సజ్జనులైనప్పటికిని వాక్కు లేదు. గనుక వారికి వాక్కు దయచేయుమని వేడుకొనుచున్నాము.


కె) ఓ ప్రభువా! బోధకులు లేనిదే ఎవరు ప్రకటించెదరు? ఒకవేళ ప్రకటించినను అది హృదయమునకు అందదు. నేను బాగుగా బోధించగలను అని అనుకొనేవారు కూడ బోధించలేరు. గనుక ఉన్నది ఉన్నట్లు, పూసగ్రుచ్చినట్లు చెప్పగల బోధకులను సిద్ధపర్చుమని వేడుకొనుచున్నాము.


యల్) దయగల తండ్రీ! బోధకులు బోధకులుగా మాత్రమే ఉంటే, ప్రజలు ఆనందింపరు. బోధప్రకారము నడుచుచు బోధిస్తుంటే వినెదరు, నీవైపు తిరుగుదురు. బోధ ఒకమూల, ప్రవర్తన ఇంకొక మూలను ఉంటే ఎవరు వింటారు!


కాబట్టి ఇవి రెండును సమానముగా ఏర్పరచుకొనే బోధకులను సిద్ధపర్చుము. మంచి ప్రవర్తనగల క్రైస్తవులు మాత్రమే కాదు, మంచి బోధలు చేసే క్రైస్తవులుకూడ అవసరమైయున్నారు.


అధికారులవలన ఏర్పాటు చేయబడిన బోధకులే కాక, రహస్యముగ నీవలన ఏర్పర్చబడిన బోధకులుకూడ వెలుపలికి వచ్చి, వెలుపల నున్నవారిని లోపలికి తీసికొని వచ్చునట్లు, వారిని ఆకర్షించుమని వేడుకొను చున్నాము (ఆది 19:16). నీ కృపకు అనేక స్తోత్రములు. నీవు వినువాడవు గనుక ఎన్ని మనవులైనను చేసికొంటాము. బోధకులను గురించి చేసిన ఈ మా ప్రార్ధన, తక్కినవారి ప్రార్ధనలతోపాటు నీ మహిమ సింహాసనము దగ్గరకు చేర్చుకొనుము. ఆమెన్.