క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

4. దేవదూతల కొరకైన ప్రార్ధన



యేసుప్రభువా! మేము రక్షణ స్వాస్థ్యము పొందవలసిన వారమై యుండగా మాకు పరిచర్యచేసే దేవదూతలను యేర్పరచినావు (హెబ్రీ 1:14). ఆ సమూహములో కొందరిని భూలోకమునకు పంపుమని వేడుకొను చున్నాము. ఈ సంగతి నీ వాక్యానుసారము కాబట్టి అడుగుచున్నాము. వాక్యములో లేనిది మేము అడగలేము. భూమిమీదయున్న రెండు గుంపుల వారు మనుష్యులే. అట్టి మనుష్యులను పనివారిగా పంపవేడుకొనుమని నీ వాక్యములో యున్నది. అందుచేత అడిగెదము. అలాగే దేవదూతలను కూడ నీవు ఈ లోకమునకు పంపినావని నీ వాక్యములోయున్నది గనుక అడుగుచున్నాము. సొదొమ పట్టణమునకు నాశనకరమైన తీర్పు వినిపించుటకై, మనుష్య రూపములో దేవదూత లిద్దరిని పంపినావు. గనుక రాకడ సమీపమందు ఇప్పుడు కూడ వారిని పంపుమని వేడుకొనుచున్నాము (ఆది 19అధ్యా॥).


కొర్నేలి ప్రార్ధించినప్పుడు దేవదూతను పంపినావు, ఆయన వర్తమానము ఇచ్చినాడు. నీ ధర్మకార్యములు చేరినవి, "పేతురు కొరకు పంపుమని" చెప్పెను (అపో॥కార్య॥ 10 అధ్యా॥). మనిషి మాట్లాడినట్లే మాట్లాడెను. అప్పుడు దేవదూతలను పంపిన నీవు ఇప్పుడెందుకు పంపకూడదు! దేవదూతలు ఆకారము లేనివారు (మత్తయి 28:3). అయినప్పటికిని ఒక దేవదూత నిద్రమీదయున్న పేతురును తట్టి, లేవనెత్తి పంపెను (అపో॥కార్య॥ 12:7). మన చేతితో తట్టినట్లు తట్టెను. అది అసాధ్యమైన సంగతి, ఎందుకంటే చేతులుంటే వారు తట్టగలరు. మన చేతులవంటి చేతులు లేనివారు ఎట్లు తట్టగలరు? అయినను దూత ద్వారా పేతురును బయటికి నడిపించుకొని వెళ్ళినావా? లేదా? (అపో॥కార్య॥ 12:7-10). అలాగే ఇప్పుడు కూడ ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క దేవదూతను పంపి, రాకడ వర్తమానము వినిపించుమని వేడుకొనుచున్నాము. నీ మొదటి రాకడలో దేవదూత, మనిషి మాట్లాడినట్లు మాట్లాడి వర్తమానము చెప్పినది. రక్షకుడు పుట్టినాడనే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని చెప్పినది (లూకా 2:11). అలాగైతే దేవదూతలను లోకమునకు ఇప్పుడు ఎందుకు పంపకూడదు! మొదటి రాకడ సమయములో దేవదూతలను పంపిన నీవు, రెండవ రాకడ సమయములో కూడ వారిని పంపిన యెడల కొంతమందియైనా నమ్మగలరు. రాత్రులు కాదు, పట్టపగలు ఎండ వేళప్పుడు, అబ్రాహాము తన గుడారపు డేరా యొద్ద యుండగా ముగ్గురు దేవదూతలను పంపినావుగదా! వారు మాట్లాడినారు, మనిషి రూపములో కనబడినారు, భోజనము చేసినారు, ఎంత ఆశ్చర్యము! అట్టి దేవదూతలను ఈ రాకడ కాలమందుకూడ పంపించిన యెడల కొద్దిమందియైన నమ్మగలరు (ఆది 18:1-15).


మనుష్యులలో పనివారు తక్కువ, దేవదూతలలో కోటానుకోట్ల పనివారున్నారు. ఒక కోటి దేవదూతలను పంపినచో, లోకమంతటా ఆవరింపగలరు. వారు మైదాన బోధకులకంటే, గుహవాసుల కంటే ఇంకా ఎక్కువ ధాటిగా పనిచేయగలరు. ప్రభువా! నీ దూతలు మా పరిచారకులు గనుక వారిని పంపించుమని అనుటకు మాకు హక్కు యున్నది (హెబ్రీ 1:14).


ఓ తండ్రీ! మరియొక సంగతి, గొప్ప సంగతి ఏమనగా వారి అంతటి స్నేహితులు మాకు లోకములో ఎక్కడను లేరు. అంతటి కావలిబంటులు కూడ ఎక్కడనూ లేరు (దా॥కీర్తనలు 34:7). మా రక్షణను గూర్చి ఎల్లప్పుడు ఆలోచించుచు, మాకు సహాయము చేయుటకు సిద్ధముగా నున్నవారు, వారు తప్ప అంత శ్రద్ధగలవారు ఇంకెవరును లేరు, అంత శక్తిగలవారును లేరు.

ప్రభువా! నీవు జన్మించినపుడు వర్తమానము మనుష్యులు తీసికొని రాలేదు, దేవదూతలు తీసికొనివచ్చినారు. ఎందుకంటే పరిశుద్ధ దేవకుమారుని, పరిశుద్ధ జన్మమును గూర్చిన పరిశుద్ధ వర్తమానము మోయుటకు, మనుష్యులలోని పరిశుద్దులుకూడ యోగ్యులుకారు. అందుచేతనే దేవదూత వర్తమానము తెచ్చెను.


ఆ కాలములో భక్తులు లేకపోలేదు గాని, ఆ వర్తమానమందించుటకు వారు తగరు. గనుక ప్రభువా! ఈ రాకడ వర్తమానము అందించుటకు మేము ఏ పాటివారము! నీ వార్త మాకు బోధపడదు. అందుచేత మొదటి రాకడకు దూతలను పంపి వినిపించినట్లుగా (లూకా 2: 14), ఈ నీ రెండవ రాకడకు కూడ, నీ దేవదూతలను పంపి వర్తమానము వినిపించిన, మాకెంత సంతోషము! అట్టి సంతోషము కలిగించుదువని నమ్మి, నీకు హృదయ పూర్వక వందనములు చెల్లించుచున్నాము. ఆమెన్.