క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

5. ప్రభువు రాకకొరకైన ప్రార్ధన



యేసుప్రభువా! 1845 సం॥లో, ఆఫ్రికాలోని ఒక వృద్ధురాలికి నీవు కనబడి, "నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పియున్నావట". మనిషి చెప్పలేదు. తన మనస్సు చెప్పలేదు. గానీ నీవే చెప్పినావు. ఆ రీతిగానే, అప్పటివలెనే ఇప్పుడుకూడ నీవు స్వయముగా వచ్చి, కొంతమందికి చెప్పుమని వేడుకొనుచున్నాము.


ఉదా:- కూలీలు సరిగా పని చేయనప్పుడు, రైతు తానే నడుము బిగించుకొని స్వయముగా పనిచేయును గదా!

ప్రభువా! నీవు దేవుడవు, మనుష్యుడవు కాబట్టి నీవే స్వయముగా వచ్చి చెప్పుమని వేడుకొనుచున్నాము. ఇది నీ వాక్యానుసారమే. అలాగే కైలాసబుషితో, సన్యాసులతో, సుందరసింగుగారితో, బరంపురంలోని స్త్రీల సమాజముతో, దేవదాసయ్యగారితో "నేను త్వరగా వచ్చుచున్నానని" చెప్పియున్నావు. గనుక ఆయావారికి నీవే స్వయముగా చెప్పి మా పనిని పూర్తిచేయుము.


మేము చెప్పిన యెడల వారు "మీకు ప్రభువు కనబడినారా"? అని అడుగు చున్నారు. "ఔను" అని చెప్పినయెడల అదేమి పక్షపాతము! మాకెందుకు కనబడకూడదు! మాకు కనబడినపుడు మేము కూడ నమ్ముదుము అని కొందరు గడుసు మాటలు పలుకుచున్నారు. అట్టివారికి బుద్ది చెప్పుటకు కూడ నీవే స్వయముగా కనబడి మాటలాడుమని వేడుకొనుచున్నాము (మార్కు 16:14, మత్తయి 5:8). ఈ ప్రార్ధన నీ వాక్యానుసారమే. ఎందుచేతనంటే "ఇదిగో త్వరగా వచ్చుచున్నాననే" మాట వ్రాయించినట్లు (ప్రకటన 22:20), ఇప్పుడు కొంతమందితో ఆ మాటే చెప్పుచున్నావు.

కొందరితోనే కాదు, ప్రభువా! నీవు అందరి రక్షకుడవు (ఎఫెసీ 4:6) గనుక అందరితోను చెప్పుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.


షరా: దేవదూతలను గాని దేవుడు పంపించిన యెడల, ఒక్కొక్క దేశమునకు, ఒక్కొక్క పటాలముగా దేవదూతలను నిలువబెట్టితే, ఆ క్రిస్ట్మసు వర్తమానము చెప్పినంత కాలములో చెప్పి ముగించగలరు. జపానులో ఒకదూత, అమెరికాలో ఒకదూత, అలాగే అందరు ఏకకాలములో ఒకేసారి రాగలరు, చెప్పగలరు, వెళ్ళగలరు. చెప్పడము మట్టుకే.

అలాగే యేసుప్రభువా! అన్ని దేశములలోనున్న ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి, ఏక కాలమందు ఒక నిమిషముండగలరు. 300 కోట్లమందివద్ద, 300 కోట్ల క్రైస్తవులుగా కనిపించగలరు, చెప్పగలరు.


దూతలైతే ఎక్కడబడితే అక్కడ చెప్పగలరు. అలాగే మృతులైన భక్తులు కూడ ఎక్కడైతే అక్కడే చెప్పగలరు. గాని నీవైతే అందరికి ఏకకాలమందు చెప్పగలవు. నీవు చెప్పుటకు ఎంతసేపు పట్టునంటె, "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను" అని బైబిలులో (ప్రకటన 22: 16)లో యున్నది అని చెప్పడానికి ఎంత కాలము పట్టునో, అంత సమయములో ప్రభువా! నీవు అందరికీ చెప్పగలవు.


ప్రభువా! మేము నీకు ఆలోచన చెప్పదగిన వారము కాకపోయినను నీ వాక్యమునుబట్టి, నీ శక్తినిబట్టి, "పరలోకమందున్న మా తండ్రీ" యని ప్రభువు ప్రార్ధనలో, నిన్ను ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన చనువునుబట్టి, నిన్ను అడగరాని ప్రశ్నలు అడిగినాము, చేయరాని మనవులు చేసినాము. నీవు క్షమీంచెదవు. మా ఉద్దేశములలో తప్పులుండవచ్చును, వాటిని క్షమించెదవని నమ్మి నీకు వందనములు చెల్లించుచున్నాము. ఆమెన్.

గమనిక

  1. ఈ ఐదు ప్రార్ధనలు అందరికి కాదు, ప్రభువుతో మిక్కిలి పరిచయముగల వారికి మాత్రమే.

  2. ఇది అనుదిన ప్రార్ధనే గాని చేయుటకు శక్తిచాలదు, ఒకవేళ చేయబోతే నామక ప్రార్ధన వచ్చును.

  3. ఆదివారము ఎక్కువ సమయముండును గనుక మీలో ఒకరు ఈ ప్రార్థనలను అతినెమ్మదిగా చదివితే, తక్కినవారు బహునెమ్మదిగా పలుకవలెను.

  4. మహా వినయముతో, భయముతో, సంకేతశాలలో యుండవలసిన భక్తితో, క్షమించు ప్రభువా! అనే స్వరముతో, నా ప్రార్ధనలవల్ల ప్రభువునకు ఎక్కడ కష్టము కలుగునో అనే జాగరూకతతో, వీలైతే కండ్లకు రుమాలు కట్టుకొని, మనో నిదానముతో ప్రార్థింపవలెను.

  5. ఈ ప్రార్ధనలు, పద్ధతులు గ్రహింపనివారు వస్తే ఈ ప్రార్ధనలు మానవలెను.

  6. ఈ ప్రార్ధనలు చేయవలెనని ఏర్పాటు చేసికొన్నప్పుడు, కూటస్థులు ఒక్కొక్కరు మాట్లాడుకొని, ఇతరులు రానివేళలో చేసికొనవలెను.

  7. అప్పుడు చదువవలసిన పాఠము "సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది" (యెషయా 6:3). ఇది కల్పించిన రమ్యరాగముతో పాడవలెను.

  8. ప్రార్ధన ఆరంభములో నాయకులు ఈ మాటలు చెప్పవలెను. అవేవనగా "ఈ ప్రార్ధనలయొక్క సూత్రములు అతిక్రమించువారికి, ఏ హానియైనా కలిగిన యెడల నన్ను అడగవద్దు అని నాయకులు సమాజములో ముందుగానే చెప్పవలెను.

  9. మధ్యాహ్నము 12 గం॥కు తత్పూర్వమే స్నానముచేసి, రేవు బట్టలు లేదా ఉతికిన బట్టలు కట్టుకొని సంకేతశాలకు (ప్రార్ధన స్థలము) రావలెను.

  10. సంకేతశాలలో యున్నప్పుడు ఒకరితో ఒకరు మాటలాడకూడదు. బైటికి వెళ్ళకూడదు, దగ్గకూడదు, తుమ్మకూడదు (ఇది అంత ఖండితము కాదు గాని భద్రముగా నుండవలెను.)

  11. ఒక గంటకంటే ఎక్కువ యుండకూడదు.

  12. మోకాళ్ళమీదనే యుండవలెను. శరీరము బైటగాని, లోపలగాని ఏ విధమైన అపవిత్రత యుండకూడదు. వీలైతే ఉపవాసముండవలెను. (ఆ గంటకే)

  13. మన ఎదుట తండ్రీ, కుమార, పరిశుద్దాత్మ యున్నట్లు ఊహించవలెను. ఊహలోనికి ప్రధానదూతలు, పరిశుద్దులు వచ్చినట్లుండినను పరవాలేదు గాని ప్రభువు మీది గురి చెదరనీయకూడదు.

షరా:

ఆ దినమునకై సిద్ధపడు విధము

  1. తెల్లవారు ఝామున 3 గంటలకు లేచి, దైవగ్రంథమును ఓపికయున్నంత వరకు కొన్ని అధ్యాయములు చదువవలెను.

  2. పిమ్మట పనులన్నియు చేయవలెను.

  3. తెల్లవారిన పిదప కుటుంబ ప్రార్ధనలో, ఈ రాకడ ప్రార్ధనలు జ్ఞాపకముంచుకొని, కొన్ని అంశములు ఎత్తి రాకడనుగూర్చి ప్రార్ధించవలెను.

  4. కుటుంబ ప్రార్ధన అయిన పిదప నోరు, చెవి, అవయవములు బిగబట్టుకొనవలయును. ఆ దినమంతా ప్రత్యేకమైన సిద్ధబాటు కలిగియుండ వలెను.

  5. ఐదు నిమిషముల తక్కువ 12 గం॥ అయినప్పుడు తల అంటుకొనరాదు, దువ్వెన వెదకరాదు.

  6. పిల్లలను దూషించరాదు.

  7. మనసు ఆయాసముతో లోనికి రాకూడదు.

  8. మెట్టు మెట్టునకు మనోస్తుతి కలిగియుండవలెను.

  9. అప్పుడు దైవసన్నిధిలోనికి ప్రవేశింపవలెను.

షరా: ఆత్మతండ్రి వచ్చి మిమ్ములను పరీక్షచేయును. ఇది శుక్రవారమునకు తగిన సిద్ధబాటుయై యున్నది. మిగత వారములలో కూడ ఈ పద్ధతి అవలంభించిన యెడల మంచిదే, అది గొప్ప క్రమమైయున్నది. త్రోవను వచ్చేటప్పుడు కుక్క అరిస్తే "ఛీఛీ" అనకూడదు, యేసు రక్తమునకు జయమనవలెను. త్రోవలో వచ్చేటప్పుడు ఎవరైనా మాట్లాడితే, అవి కేవలము పరిశుద్ధాత్మకు అనుగుణ్యమైన అంశములై యుండవలెను. ఆయాసకరమైన వేవియైనను వాటిని మాట్లాడకూడదు. పెండ్లికుమార్తెకు అవి తగవు.

గమనిక: ఇది, చిన్నికన్నియ సన్నిధి కూటములో 10-6-1960వ తేదిని, ప్రభువు ప్రత్యేకముగా ఇచ్చిన వర్తమానము.