క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

4వ ప్రార్ధన



తండ్రీ! నీ కుమారునిద్వారా ఇచ్చిన సమస్త వాక్యము నిమిత్తమై వందనములు. నీవు ఒకప్పుడు మేము, మా పూర్వికులు పుట్టకముందు నరులకు ఇవ్వడము ఆరంభించి, నేటివరకు నీ గుప్పిలి విప్పియే యుంచినావు, ఇంకా ఇచ్చుచున్నావు. ఇది నీ కృప. ఇంకనూ, వెయ్యేండ్లలో ఇవ్వనైయున్నావు ఇది నీ దాన కృప.


ఇప్పుడు మాలో కొందరు ఇబ్బంది పడుచున్నారు కొందరు వస్త్రములకు, మరికొందరు సొమ్ముకు ఇబ్బంది పడుచున్నారు. నీ కుమారుడు రెండవసారి రానైయున్నప్పుడు, అది నీతి సూర్యుడుదయించే యుదయమై యుండునని మాకు తెలియును. ఆ ఉదయమే వచ్చినయెడల ఇక రాత్రి చూడనే చూడము. చీకటిలేని ఆ దేశమునకు మమ్మును తీసుకొని వెళ్ళెదవు. ఉదయమైన తరువాత ఇక ఎప్పుడును పగలే.


అట్టి దేశమునకు వెళ్ళనైయుంటే ఇంకను చీకటి పనులు, చీకటి కార్యములు ఎందుకు? ఇది మా కృపాసమయము గనుక మాలో ఎవ్వరి ఇంటివద్ద చీకటి కార్యములున్నవో, వాటిని మానివేయు కృప దయచేయుము. పాపాంధకారమునకును, మాకును ఎట్టి పరిచయము లేకుండాచేసి నీ కృప మాకు అనుగ్రహించుము. మా క్రియలు, మా మాటలు వినేవారున్నారు. మా వంకర చూపులు గ్రుడ్డి చూపులు, అసూయ చూపులు, పాపపు చూపులు చూచేవారున్నారు. గాని మా హృదయములోని చెడుగును చూచేవారు లేరు. అలాగు చూచేవాడవు నీవు ఒక్కడవే యున్నావు. "నేను సజీవుల గుంపులో నున్నాను" అని చెప్పుకొను నీ రాకడ గుంపులోని వారి హృదయము లోపల, ఏ ఒక్క చెడుగున్నదో నీవు పరీక్షించి, దానికి వారు గడగడ వణికే కృప దయచేయుము.


డాక్టర్లు టి.బి. అనే (క్షయ) వ్యాధిగల వానితో, నీకు ఏ జబ్బులేదు అనవచ్చునుగాని, మా హృదయములో ఏలాంటి (చెడు) తలంపు లేదనుకొనువారి హృదయములోనికి నీవు తొంగిచూచి, నీవేల సజీవుల గుంపులోనికి వెళ్ళగలవు? ఏలాగు పెండ్లికుమార్తె సంఘములోనికి వెళ్ళగలవు? అని మనస్సాక్షి ద్వారా అడిగిన యెడల, మేము సిద్ధపడగలము. మాలో ఏ తప్పులేదని మరణించుట కంటే, మాలో ఈ తప్పున్నదని అరచుట మంచిది.


ఈ పాఠములను నేర్చుకొనిన తరువాతకూడ, ఇంకనూ మాలో కళంకములుంటే ఏమి లాభము? గనుక మాలో ఏ మూలనైనను కళంకమనునది లేకుండ రూపుమాపుము.


మాకు తెలియనిది తెలియపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఈ వేళ నేను భక్తిగా యుండవచ్చును, అయితే చనిపోవునప్పటికి, ఇంత భక్తి, ఇంత శ్రద్ధ యుండునా? అని ప్రశ్నించుకొనవలెను. నీ రాకడ కనుక ఎవరిమట్టుకు వారే తలవంచుకొని సిగ్గుపడి, తండ్రీ! యని ఒప్పుకొనే కృప దయచేయుము.


నీ రాకడ మేఘమెక్కు పర్యంతము, మేము మహా పవిత్రముగా యుండేటట్లు ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాము. మాలో ఏమైన తప్పున్నదేమో, అనే భాష మాకు అక్కర లేదు, ఉన్నది అనే భాష దయచేయుము.


దయగల ప్రభువా! నీవు కృపగలవాడవని అనేకమంది లోకువగట్టు చున్నారు, నీవు క్షమించేవాడవని చాటున పాపములు చేయుచున్నారు. తల్లి, ఎక్కువ గారాబముగా చూచినయెడల పిల్లలు మాటవినరు. కొందరు నీ కృపను, నిన్ను నీ వాక్యము బోధించేవారిని లోకువ గట్టినారు. మేమట్టివారము గాకుండ చేయుము.


శోధనలు రాకుండమానవు గనుక వాటిని జయించే దైవశక్తి అనుగ్రహింపుము. విశ్వాసులనోట సజీవులగుంపు, రెండవరాకడ, పెండ్లికుమార్తె, సంఘవరుస మేఘ నివాసము, పరలోకపు విందు ఈ మాటలేయున్నవి, అనగా ఆశయున్నదిగాని క్రియలేదు. మేమట్టివారమై యుండక, జాగ్రత్తగా యుండే కృప దయచేయుము, వందనములు. కొందరు ఎంత ప్రేమతో చెప్పినను మారరు, మారలేదు. అన్ని విడిచిపెట్టి, ఒక్కటి విడిచిపెట్టక పోయిన యెడల లాభము లేదు.


పెండ్లికుమార్తె, సజీవులగుంపు, రెండవ రాకడయని అనవసరముగా అనడము ఎందుకు? ఈ మూడును వ్యర్థముగా నుచ్చరించువారు దోషులగుదురు, కళంకమును అనుకొనువారును దోషులై యుందురని మాకు నేర్పుము. నీ కృప మాకు ఇక్కడ అందేటట్లు ఆశీర్వదింపుమని వేడుకొనుచున్నాము. ఆమెన్. మరనాత.


షరా: దేవదాసు అయ్యగారి ఉపదేశముల నోట్సునుండి ఈ ప్రార్ధనలు వ్రాసి ఇచ్చినవారు: శ్రీమతి. పి. జె. గ్రేసమ్మ గారు (విజయవాడ)