క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
రాకడ ప్రార్ధనలు
1వ ప్రార్ధన
మా పరలోకపు తండ్రీ! సంఘముయొక్క తండ్రీ! పరలోకముయొక్కయు దానిలో నున్న సంఘముయొక్కయు తండ్రివైన తండ్రీ! నీకు వందనములు. నీవు ఇంతమందికి తండ్రివి. నీ బిడ్డలు పరలోకములో పరిశుద్ధులై యున్నారు. భూలోకములో విశ్వాసులైన బిడ్డలు ఉన్నారు. నీ బిడ్డలు లేని స్థలములేదు. పాతాళ లోకములోకూడ తయారగుచున్న నీ బిడ్డలున్నారు. నీ బిడ్డలులేని స్థలములేదు. మోక్షముయొక్క పరిశుద్ధులు కాక, ఇప్పుడును పరలోకమునకు సిద్ధపడుచున్న పరిశుద్దులుకాక, ఊర్ధ్వ లోకమందు సిద్ధపడుచున్నవారును నీ బిడ్డలే, కాబట్టి నీకు వందనములు. అయితే ఇంతమందికి నీవు తండ్రివై యున్నావనే సంగతి అందరికి తెలియదు, తెలిసిన వారికి ఈ సిద్ధి కలదు.
ఓ తండ్రీ! నీవు తండ్రివని ఎవరైతే తెలిసికొని, విశ్వసించి, ప్రేమించుచున్నారో, వారు మరొక విషయము తెలిసికొనుచున్నారు. వారును, మేమును ఆ తండ్రి బిడ్డలమై యున్నాము. దేవదూతలెంతో, మోక్ష లోకములోని వారెంతో, భూమిమీద తయారగుచున్న మేమును అంతే. అయితే విశ్వాసులైనవారి నిమిత్తము మేము కనిపెట్టుచున్నాము. ముఖ్యముగా వధువు సంఘమెప్పుడు తయారగునో ఆ మహిమ మతాభీవలె, సూర్య కాంతివలె, నేను తెలిసికొన్న కాంతివలెకాదు, మేము ఎవ్వరము ఎప్పుడు చూడలేని మహిమ కాంతిలో, పరలోకములోనున్న ఆఖరు సంఘముతో కలిసికొన్నప్పుడు, నీ మహిమ, నీ శక్తి తెలిసికొందుము. ఆయన మహిమ అంటే ఇది, ఆయన శక్తి అంటే ఇది, అది భూలోకములో నుండగా తెలిసికొన్నదికాదు అని ఇక్కడ గ్రహింపలేని సంతోషముతో అక్కడ సంతోషింతుము. ఇక్కడ గ్రహింప లేని, మా సంతోషము కొంచెమే. మేము ఆ మహిమను గ్రహించుటకై, ఈ లోకపు మహిమను మరచిపోయే కృప దయచేయుము.
తండ్రివైన ప్రభువా! రక్షకుడవైన ప్రభువా! ఆదరణకర్తవైన ప్రభువా! ముగ్గురు తండ్రులుకాక ఒక్క తండ్రివై యున్న తండ్రీ! నీ కనేక స్తోత్రములు. మేము నీ బిడ్డలమని మహా థైర్యముతో, సంపూర్ణమైన శైలితో ఇప్పుడు అనలేము.
దయగలతండ్రీ! మమ్ములను దుఃఖములోనికి, నిరాశలోనికి దింపే ఒక్కమాట ఇదివరకే బైలుపర్చినావు. మహా ప్రేమగలమాట, మాకర్థముకాని మాట తెలియపర్చినావు. అది ఏమిటంటే "భూలోకములో నున్న ప్రతిమనిషితో మిక్కిలి స్పష్టముగా మాట్లాడవలెనని నాకు ఉన్నది" అని అన్నావు.
ప్రభువా! ఏమి గ్రహింపగలము! భక్తులతోనే
పూర్తిగా మాట్లాడుట లేదు. మిక్కిలి తరచుగాకూడా మాట్లాడుటలేదు. ఇది మేము ఎట్లు గ్రహింపగలము! నీవు అలాగు మాట్లాడక
పోవుటకు
మేమే
ఆటంకము. ఈ మహాగొప్ప ప్రేమ, దాగియున్న నీ ప్రేమ, నీ నామము ధరించిన సంఘమంతటికిని, అలాగే లోకములోనున్న
అవిశ్వాసులందరకును ఈ
సంగతి ఎప్పుడు బైలుపడును? ఒకవేళ మేము చెప్పినా వారు నమ్మరు. గ్రహింపను గ్రహింపరు, నమ్మను నమ్మరు.
అయితే ప్రభువా!
ప్రకటన
చివరి భాగములో అప్పుడు అందరితో ఒక్కసారే మాట్లాడుదువు అని ఉన్నది. అప్పుడు అందరికి వినబడునుగాని, అందరూ మార్పు
పొందరుగదా!
ఇప్పుడు మాత్రము వినబడితే మార్పు పొందుదురా? నా చెవి "ఓరు" పెడుతున్నదని అనుకొంటారు గాని ప్రభువు మాట్లాడుచున్నాడని అనుకొనరు. తండ్రి చెప్పినాడని వారనుకొనరు. కాని బెదిరి, బెదిరి చూస్తారు. కొందరు భక్తులు, "ఏదో దేవత మాట్లాడుతుంది, బయటకు వెళ్ళవద్దు తలుపు వేసుకొనండి" అంటారు. మనిషి తన హృదయమును ఇంతగా కఠినము చేసికొన్నాడు. అయినను ప్రభువా! నీవు తండ్రివి గనుక ప్రేమించడము మాత్రము మానలేదు. కాబట్టి నీ కనేక వందనములు.
మా ప్రభువా! ముఖ్యముగా గత 30 సం॥ల నుండి ఈ సంగతి వింటున్న వారిలో ఎవరైనా ఒకరు అనుదినము, మిక్కిలి తరచుగా నీ స్వరము వినేటట్లు సిద్ధముకాగలిగిన యెడల మాకెంత సంతోషము! అట్టి సమయము ఎప్పుడు వచ్చును? అట్టి వ్యక్తి ఎప్పుడు వచ్చును? మా ప్రభువా! ఇప్పుడనేకమంది కొద్దిగా నీ స్వరము వింటున్నారు సంతోషమే గాని ఎవరూ పూర్తిగా వినలేక పోతున్నారు, అదే విచారము. గనుక తరచుగా మేము ఈ ప్రకారము కూడుకొన్న క్రమేణ ఆ స్థితిలోనికి రాగలము (దేవుని స్వరము వినే స్థితి). లోకాధికారులు పాఠశాలలకైనా సెలవిస్తారు గాని నీ స్వరం వినడానికి మా శరీరము, మా స్వజనులు, మా పని, మా బలహీనత సెలవియ్యదు.
ఓ తండ్రీ! మేము నీతో మాట్లాడే విషయములు చాల ఉన్నవి గాని తరుణము లేదు 24 గంటల సమయమున్నను, మేమందుకొనే తరుణము లేదు సమయములేదు. క్షమించుమని త్వరగా రానైయున్న యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.