క్రమకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
రాకడ ప్రార్ధనలు
(5-9-58) వారమునకు ఒక అద్భుతము
ప్రభువా! నమ్మినను, నమ్మకపోయినను ప్రజలకు బోధించుమని నీవు యెహెజ్కేలుతో చెప్పినావు (యెహెజ్కేలు 3:11) గనుక దేవా! నీ రాకడ వార్త అందరికిని చెప్పుము. మరియు (యోహాను 14:14)ను ఆధారమును చేసికొని ప్రార్ధించుచున్నాము. ఇంకను బైబిలు మిషనును బైలుపర్చిన సంగతిని ఆధారము చేసికొని ప్రార్ధించుచున్నాము.
మా ప్రార్ధన నెరవేర్పులు కొట్టివేయకుము. ఎందుకంటే నీ శక్తికి మించిన ప్రార్థన మేము చేయము, చేయలేము. మా పొరబాట్లను అంతములేని నీ ప్రేమనుబట్టి క్షమించుము.
- 1) నీవు డిక్టేషను చెప్పి (వ్రాసుకొనుటకు వీలుగా నెమ్మదిగా బోధించుట), ఎవరిచేతనైనా రాకడ పత్రికను వ్రాయించి, బైబిలు సొసైటీ వారికి పంపించుము. మరియు వారు 2,000 భాషలలో ఆ పేపరు అచ్చువేసి, అమ్మే బైబిళ్ళలో పెట్టవలసినదిగా చెప్పుము. ఈ పని మేము చేయుట నీకిష్టమైతే సరి.
- 2) ప్రతి భాషలోను, నోటితో ప్రకటించుటకు కొంతమంది ఆత్మగల వారికి, మహిమ శరీరముతో సమానమైన శరీరము ఇచ్చి, గాలిలో పంపించి నీ వార్త చెప్పించుము.
- 3) కొంతమంది నిద్రలో యున్నప్పుడు, వారి యాత్మలను నీ యిష్టము వచ్చిన వారియొద్దకు పంపించి నీ రాకడ వార్త చెప్పించుము.
- 4) భక్తులలో కొందరు నీ మరణ దినమున లేచినారుగదా! అట్లే మృతులను లేపి, వారిచేత నియామక స్థలములలో, నియామక సమయము చొప్పున నీ రాకడ వార్త చాటించునట్లు చేయుము.
- 5) లోకములోనున్న నీ భక్తులలో పర్వతవాసులు, బుషులు మొదలగు వారున్నారు గనుక వారిని బయటకు రప్పించి నీ వార్త చెప్పించుము.
- 6) బ్రాడ్ కాష్టులు (సమాచార ప్రసార కేంద్రములు) ప్రతి పట్టణములోను ఏర్పరచి, సువార్త చెప్పే బోధకులను నిలువబెట్టుము.
- 7) ఆకాశమునుండి గొప్ప ధ్వని లోకమంతటికి, ఏక కాలమందు, ఒక గంటయైనను వినబడునట్లు చేయుము.
- 8) లోకములో నీకిష్టములేని దేవాలయములు, ప్రార్ధనశాలలు, యెరికో గోడలు పడగొట్టినట్లు, మనుష్యులు చావకుండ పడిపోజేయుము. (యెహోషువ 6వ అధ్యాయము)
- 9) ప్రతి దేవాలయము మీద, నీ రాకడ సంగ్రహ వర్తమానము గాలిలో వ్రాయించుము.
- 10) ఒక ప్రత్యేక దినమున లోకములోనున్న మృగములు, పక్షులు, పశువులు; పగలు కట్టుకర్రలు విప్పుకొని, వీధులలో రంకెలు వేయునట్లు చేయుము. అలాగే గొర్రెలు, మేకలు ఇతర జంతువులు కూడ.
- 11) ఒక ప్రత్యేక దినమందు ఆకాశ పక్షులన్నియు, ఒక రాత్రి అంతా మాటు మణిగిన తరువాత, చెవులు గింగురు మనునంత ఎక్కువగా కూసేటట్లు చేయుము.
- 12) ఒక ప్రత్యేక దినమందు కప్పలు, పాములు, జెర్రులు, ఈగలు, దోమలు, తూనీగలు మొదలగు అన్ని రకములైన పురుగులు, ఉదయమున ఎండ సమయములో రోడ్లమీద, బాటలమీద నడిచి వెళ్ళిపోయేటట్లు చేయుము (ఎవ్వరికి హానిచేయకుండ).
- 13) ఒక ప్రత్యేక దినమున లోకములోయున్న ఆసుపత్రి రోగులు, ఇంటి రోగులు అకస్మాత్తుగా పగలు నడిచి, బైటికివచ్చి మరల ఇండ్లకు వెళ్ళిపోయేటట్లు చేయుము.
- 14) ఒకరోజు పగలు, రాత్రి అపరిమితమైన వర్షము, పిడుగులు, ఉరుములు కురిపించుము (నరులకు హాని రాకుండ).
- 15) మరియొక దినమున లోకములోనున్న నదులన్నియు, వాటి గట్ల మీదుగా ప్రవహించునట్లు ఒకగంట మాత్రమే చేయుము (మనుష్యులకు హానిలేకుండ).
- 16) ఒకానొక దినము లోకములోనున్న చెరువులు, నూతులు, పొరలిపోయేటట్లు చేయుము. ఒక గంట మాత్రమే (మనుష్యులకు హానిలేకుండ).
- 17) మరియొక దినమున లోకములోనున్న చెట్లన్నియు ఏక కాలములో కిర్రున మోతపెట్టి, నిన్ను స్తుతించునట్లు చేయుము.
- 18) ప్రతి గ్రామములో నున్న నేల పట్టపగలు ఒకగంట, మనుష్యులకు హాని లేకుండా వణికేటట్లు చేయుము.
- 19) మరొకనాడు సూర్యుని ఎండ, ఒకగంట మాత్రమే బహు వేండ్రముగా ప్రకాశింప జేయుము (మనుష్యులకు హానిలేకుండా).
- 20) ఒకనాడు భూమియందంతట ఒకగంట మంచు కురిపింప జేయుము (మనుష్యులకు హానిలేకుండా).
- 21) ఒకరాత్రి ఆకాశము నుండి చిత్తుచిత్తుగా ఉల్కలు జారిపడునట్లు చేయుము (మనుష్యులకు హానిలేకుండా)
- 22) ఒకనాడు అన్ని సముద్రములు వాటి హద్దుదాటి, ఒక ఫర్లాంగు దూరము పొర్లి వచ్చునట్లు చేయుము (మనుష్యులకు హానిలేకుండా).
- 23) లోకములోయున్న దయ్యములన్నియు, అందరికి తెలిసేటట్లు మధ్యరాత్రి వేళ గొల్లున గోల పెట్టునట్లు చేయుము (ఒకగంట మాత్రమే).
- 24) ఎవరినైనా ఒకరిని పంపి, నీ రాకయొక్క బొమ్మను కోట్లు కోట్లు అచ్చువేసి, అన్ని దేశములలో ఇచ్చేటట్లు చేయుము.
- 25) నీ భక్తులతో ఆయాభాషలలో రాకడ కీర్తనలు కట్టించుము.
- 26) బైబిలు మిషనువారు ఆదిలో పాడుకొన్నట్లు, ఇప్పుడును రాకడ కీర్తనలు పాడుకొనునట్లును, రాకడ వర్తమానములు ఇచ్చేటందుకు బూరలు వాడుకొనునట్లును ప్రేరేపించుము.
- 27) ఏయే మతములవారు ఏయే తప్పుడు సిద్ధాంతములు, ఏయే దురాచారములు కలిగియున్నారో, వారందరికి స్వప్నములోనో, దర్శనములోనో కనబడి వారి తప్పులు దిద్దుము.
- 28) ప్రతి మనిషికి నీవిచ్చిన జ్ఞానమునకు, మనస్సాక్షికి, నీవే స్వయముగా బోధించుము లేదా నీ భక్తులు చెప్పగా విన్న బోధలు నచ్చేటట్లు చేయుము.
- 29) ఏమిటీ గురుతులు? ఏమిటీ వింతలు? ఏమిటి ఈ క్రైస్తవులు "రాకడ రాకడ" అంటున్నారు? అని ప్రతివారు రాకడ నిమిషము వరకు, రాకడను గురించి తమ మనస్సులో మరువకుండ తలంచుకొనేటట్లు చేయుము.
- 30) ఎప్పుడైన ఒకసారి మృతులైనవారు తమ బంధువులకు కనబడి, రాకడ విషయములు చెప్పేటట్లు చేయుము.
- 31) ఇప్పుడైనా పరలోక దూతలందరూ, రాకడ వర్తమానములు మనుష్యులందరికి చెప్పేటట్లు చేయుము.
- 32) కాకానిలో దయ్యముపట్టిన మనుష్యులను అడిగితే, యేసు ప్రభువే రక్షకుడని చెప్పుచున్నారు. అలాగే దయ్యములు కూడ తామున్న స్థలములలో నున్నవారికి, నిన్ను గూర్చి చెప్పేటట్లు చేయుము (సాక్ష్యమిచ్చేటట్లు చేయుము).
- 33) బిలాము యొక్క గార్థభము బిలామును గద్దించెను. అలాగే నీ వాక్యము వినని వారియొక్క పశువులు, వారిని గద్దించేటట్లు నియమింపుము; పశువులకు వాక్కు యిమ్ము (సంఖ్యా. 22:28).
- 34) దేవా! నీవు భూమిని, ఆకాశమును, వాటిలోని సమస్తమును, దేవదూతలను కలుగజేసినావు గదా! ఈ నీ సృష్టి అంతటిని అనగా సృష్టిలో ఉన్న చిన్న పెద్ద వస్తువులను వాడుకొనుటకు ఇదియే సమయము గనుక సృష్టి ద్వారా మనిషికి వర్తమానము అందించుము. అతని అనుచరులకు హడలు పుట్టించుము.
- 35) మొట్టమొదట మా కూటములకు, క్రమేణా తక్కిన కూటములకునూ ఈ అంశములు పంపేటందుకు సమయము, శక్తి దయచేయుము.
- 36) లోకములో అనగా నీవు కలుగజేసిన పరిశుద్ధ లోకములో, నేటివరకేది అపవిత్రముగానున్నదో అది ప్రతిమనిషికి జ్ఞాపకముచేసి, మా పాపముల వలననే గదా సాతానుకు లోబడుట, నీకు లోబడక పోవుటవలననే గదా, ఈ అపవిత్రత అని తెలిసికొని బుద్ధితెచ్చుకొనేటట్లు గద్దించుము. అపవిత్రత అనగా పాపరోగము, బంద, బాడి మొదలైనవి.
- 37) ఓ ప్రభువా! నీవు మాకు చెప్పిన సంగతులే లోకములోనున్న వారికందరికి, ముఖ్యముగా సన్నిధి కూటస్థులకు చెప్పుము. ఆమెన్.
- 38) దేవా! ఈ 37 అంశములలో నీకు ఇష్టము వచ్చిన అంశములకు జవాబు ఇమ్ము.