(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

రూతు చరిత్ర

ప్రేమ చరిత్ర


తండ్రి: రూతు 1:3; కుమార: మత్తయి 22:23; పరిశుద్ధాత్మ: రోమా 7:1-4.

రూతు గ్రంథములో నాలుగు భాగములున్నవి.

ఎలీమెలెకు అనే యూదుడు తన భార్య అయిన నయోమిని వెంటబెట్టుకొని 10 సం॥లు మోయాబు దేశములోకి వెళ్లెను. ఈ రూతు కథ న్యాయాధిపతులలోని కథ (రూతు 1:1). అనగా న్యాయాధిపతుల కాలములో అప్పుడు కరవు ఉన్నదని ఎలీమెలెకు మోయాబుకు వెళ్లెను. మోయాబీయులను ఇశ్రాయేలు సమాజములో చేర్చకూడదు (ద్వితీ. 23:3-5). 10సం॥ల తరువాత ఇశ్రాయేలీయులకు ఆహారము ఇచ్చుటకు దేవుడు దిగివచ్చియున్నాడని మోయాబులో వారు విన్నారు. అనగా పారిపోయినవారు తిరిగి వచ్చుటకు సిద్ధపడ్డారు. ద్వితియోపదేశకాండములో మోషే మరలా ఉపదేశించినట్లు, ఈ రూతు చరిత్రను మరలా చెప్పుటకు ఈ క్లాసుపెట్టడము అయినది. ఈ రూతు కథ కరవువలన కలిగినది. అందునుబట్టి, మోయాబు వెళ్లారు, 10సం॥లు ఉన్నారు, మరలా తిరిగివచ్చారు.


రూతు నయోమితో మాట్లాడిన ముఖ్య విషయములు:

నయోమి, తన సొంత దేశము వెళ్ళిన తరువాత అందరూ ఆమెను నయోమి అనుచుండగా, నన్ను నయోమి అనవద్దు “మారా అని అనమనెను. ఈ నయోమితో, యౌవనస్థురాలైన ఆమె కోడలుకూడ వచ్చెను. ఈ మధ్య మన దేశములో ఒక వాదము ఉన్నది. పెనిమిటిపోయిన దానిని వివాహము చేసికొనవచ్చునా? వారేమంటున్నారంటే పురుషులు చేసికొనవచ్చును, స్త్రీలు చేసికొనకూడదు అంటున్నారు.


క్రైస్తవులు - ఈ పుస్తకమును బట్టి రూతు చేసుకున్నట్లు మా బైబిలులో ఉన్నది. కాబట్టి చేసికొనవచ్చునని అనుచున్నారు. బోయజు వివాహము లేనివాడు, రూతు పిల్లలను కనిన స్త్రీ నయోమి మోయాబు నుండి వచ్చేటప్పుడు రూతు వచ్చినదని బోయజుతప్ప తక్కిన వారందరు చెప్పుకొనిరి. ఎందుచేతననగా వారు వచ్చినప్పుడు ఆయన దేశములో లేడు, యుద్ధంలో ఉన్నాడు.


వింత సంగతి:- పెనిమిటి పోయిన వారిని, పెండ్లికాని పురుషులు పెండ్లి చేసికొనరు. ఇక్కడ విపరీతమైన వివాహము బోయజు చేసికొనెను. బోయజు పడుచువాడు. ఆ కాలములో మిల్టరీవారు అధికముగా యున్నారు. అందరు నయోమినిగూర్చి చెప్పుచున్నప్పుడు బోయజు లేడు, మిల్టరీలో ఉన్నాడు. మిద్యాను యుద్ధమునకు వెళ్లెను. యూదులలో ఒక ధర్మశాస్త నియమమున్నది. ఒకని సహోదరుడు చనిపోతే అతని భార్యను వాని తమ్ముడు చేసికొనవచ్చును. మోషే ఆలాగు వ్రాసినారు. ఇది విపరీతమైన వివాహము గనుక ఘనమైన పెండ్లి.


“విమోచనము” అనగా అన్నగారి పేరు నిలువబెట్టుటకు, బోయజు ఆలాగు చేసెను. యేసుక్రీస్తు జన్మమునకుముందు అన్యులను పెండ్లిచేసికొనకూడదు. యూదులు యూదులనే పెండ్లి చేసికొనవలెను. గాని వీరి వివాహమునకు అందరు ఒప్పుకున్నారు. అంతా చేసినది ముసలమ్మే గనుక ఇది విపరీతమైన కథ.


పెండ్లికానివాడు పెండ్లి అయిన దానిని చేసికొనుట విచిత్రమైనది. యూదులు అన్యులను వివాహము చేసికొనకూడదు. ఎందుచేతననగా ప్రభువు యూదులలో నుండి రావలెను గాన సంకరము ఉండకూడదు అని యూదులు నిష్టగా ఉండిరి. ఈ రూతు పెండ్లికి మాత్రం యూదులంతా (పెద్దలందరూ) ఒప్పుకొనిరి. బోయజు నయోమియొక్క బంధువుడైయున్నాడు. అది దేవుని ఏర్పాటు గనుక అట్లు జరిగినది. (మోయాబీయులు ఎందుకు శపింపబడిరి? ఇశ్రాయేలీయులును శపింపవలెనని బిలామును పిలిపించిరి.) గనుకనే రూతు గ్రంథము చివరి పేరా చదివితే బోయజు వంశము తేలెను. బోయజు ఓబేదును, ఓబేదు యెష్షయి, యెష్షయి దావీదును, దావీదు మరియమ్మను, మరియమ్మ యేసును కనెను. ఈ సంగతి చెప్పుటకై ఈ గ్రంథము బైబిలులో చేర్చబడినది. (తన వంశావళిని బట్టి) రూతు యేసునకు తల్లి అయినది. లోతు కుమారుడు మోయాబు. మోయాబు సంతానమే మోయాబీయులు. మోషేచేతిలో ధర్మశాస్త్రము ఉన్నది, కృపాశాస్తము యేసు చేతిలో ఉన్నది. మోషే ధర్మశాస్త్రము అన్యులను పోనియ్యదు, అయితే ప్రభువుయొక్క కృపాశాస్తము రానిస్తుంది. ధర్మశాస్త్రము ఎవరిని చేరనియ్యదో, కృపాశాస్త్రము వారి హృదయమునుబట్టి వారిని చేరనిచ్చును. (శరీరరీతిగా రూతు మోయాబీయురాలే గానీ ఆత్మరీతిగా, మత విషయములో యూదా గోత్రికురాలైనది) బైబిలులో ప్రత్యేకముగా మరి ఇతర కథలు చేరక, కేవలము స్తీ కథ మాత్రమే కలిగిన గ్రంథములు: రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథములైయున్నవి. దేవుడు, స్త్రీలను గౌరవించు చున్నట్లు ఈ రెండు పుస్తకములు ఉన్నవి. స్త్రీలను బైబిలు సన్మానిస్తున్నట్లు ఈ రెండు పుస్తకములు చెప్పుచున్నవి. రూతుయొక్క భర్త యూదుడు. దేవుని జనాంగములో చేరిన రూతు అన్యురాలు.


రూతు - అన్యురాలు; బోయజు యూదుడు.


ఎస్తేరు - యూదురాలు; అహప్వేరోషు అన్యుడు.


అన్యులను, యూదులను ఏకముచేసి వారిలోనుండి రక్షకుని రప్పించే పనిమీద దేవుడు మోయాబు నుండి రూతును రప్పించెను. యూదులు ఎప్పుడు ఒక విషయములో బహు నిష్టగలిగి యున్నారు. అదేదనగా "మేము దేవుని జనాంగము."


పెండ్లికుమార్తె రెండు భాగములు:

పెండ్లికుమార్తెలో విశ్వాసులైన యూదులను అన్యులును ఉందురు. ఈ విషయము తెలియజేయుటకై రూతు గ్రంథము వ్రాయబదెను. అన్యులును, యూదులును కలసి పెండ్లికుమార్తె కాబోవుచున్నదను దానికి ముంగుర్తుగా, ఈ గ్రంథమును సమూయేలు వ్రాసెను.


బోయజు మీదనున్న ప్రేమ చొప్పున రూతు ఆయనను పెండ్లి చేసికొనలేదు గాని అత్తగారిమీద ఉన్న అభిమానము చొప్పున ఆయనను చేసికొనుటకు ఆమె అంగీకరించెను. ఇదియు ఒక విచిత్రమైన సంగతి. రూతుకు అత్తగారియందున్న అభిమానము ఎంతవరకు వచ్చినదనగా, క్రీస్తు జన్మ చరిత్రలో చేరువరకు వచ్చినది. ఇప్పటికాలములో అత్తకు, కోడలికి ఎందుకు పడదు? అత్తగారు కోడలిమీద అధికారము చేస్తారు. అత్తగారు ఎంత స్వతంత్రురాలో కోడలును ఆ ఇంట అంతే స్వతంత్రురాలు గాన కోడలిని వమియు అనకూడదు. కారణాలేలాగున్నను ఒక గృహమునందున్న అత్తకోడలికి రూతు నయోమిల చరిత్ర బాగున్నది. అభిమానము ఉభయులకు యుండవలెను. అది అందరికి యుండవలెను. భార్యభర్తలకు అభిమానము, గౌరవము అనునది యుండిన కుటుంబము నెమ్మదిగాను, నీతిగాను యుండును. బైబిలు మిషనులో అత్తకు కోడలికి, భార్యకు భర్తకు సమాధానముగా యుండుట శుభము.


సీమ దేశములో (విదేశాలలో) అత్తగారు కోడలిని ఏమి అనరని ఒక దొరగారు అన్నారు. కారణమెట్లు ఉన్నను అత్తగారికిని, కోడలికిని నయోమి రూతులవంటి అభిమానమే కలిగి ఉండవలెను. ఈ అభిమానము ఉభయులకు ఉండవలెను. భార్యభర్తలు ఒకరి యెడలనొకరు సమాన అభిమానము కలిగి ఉండవలెను. రూతు గ్రంథములో ఉన్న ఈ చరిత్ర కల్పించిన కథవలె ఉన్నది గానీ ఆలాగు ఎంత మాత్రమునుకాదు. దేవుని సంకల్పన ఆలాగున్నది. బైబిలు మిషనులో ఏ కుటుంబములో అత్త, కోడలికి అభిమానముండునో అది ధన్యమైనది.


డా॥ శామ్యేల్ జాన్ సన్ ఇంగ్లీషు డిక్షనరీ వ్రాసెను. ఒకప్పుడు క్లబ్ లోనికి వెళ్ళెను. అచ్చటివారందరు బైబిలు సోమరుల పుస్తకమని ఎగతాళి చేసిరి. ఈయన రూతు చరిత్ర ఒక కాగితము మీద వ్రాసికొని వెళ్ళి వారందరు తిని త్రాగుచుండగా, ఈ కథ చదువుతాను వినుమని చదివి వినిపించెను. వారందరు ఈ నవలు చక్కగానున్నది. బహు రమ్యముగా నున్నది. ఏ పుస్తకములోనిది అని అడిగిరి. ఇది బైబిలులోనిదే అని చెప్పగా వారందరు ఆశ్చర్యపడిరి, చాలా సంతోషించిరి. ప్రేమ చరిత్ర అభిమానమును బట్టి ఏర్పాటైనది. అందరు అట్టి అభిమానమును గౌరవించవలెను. అభిమానము లేనివారికి ఇట్టి కథలు ఇష్టముండదు గాని ఇంగ్లీషు వారికిష్టము. కారణమెట్లున్నను అత్త, కోడలు అభిమానమును కలిగియుండవలెను. కుటుంబజీవితము సరిగా నుండవలెనని ఈ గ్రంథము బోధించుచున్నది.