రూతు కథ
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
ప్రసంగ పాటము : రూతు 1:6.
- 1. న్యాయాధిపతుల కాలములో కరవు సంభవించినది. అప్పుడు ఎలీమెలెకు, నయోమి మరియు వారి ఇద్దరు కుమారులు మోయాబు దేశమునకు వెళ్లిరి. మోయాబీయులకు, హెబ్రీ వారికి సంబంధములేదని మోషే బోధించెను. (ద్వితీ. 23:3-6). అయితే, ఇది 10 సం॥ల క్రిందట జరిగిన కథ: నయోమి భర్త, ఇద్దరు కుమారులు చనిపోయిరి. దేవుడు వారిని ఆశీర్వదించుటకు దిగివచ్చెనని ఆమె మోయాబు దేశములో వినెను. వెంటనే స్వదేశమునకు బైలుదేరెను. ఇది ఈ చరిత్ర పరిచయము.
-
2. రూతు కథ బైబిలులో ఎందుకు చేర్చవలెను? అని అనేకులు అడుగుచున్నారు. రూతు మాటలలో దీనికి జవాబు కలదు.
- 1) నీవు నివసించు చోటున నేను నివసించెదను.
- 2) నీ జనమే నా జనము.
- 3) నీ దేవుడే నా దేవుడు.
- 4) నీవు చనిపోవు చోటనే నేనును చనిపోయెదను.
- 5) మరణము తప్ప మరి ఏమియు మనలను విడదీయకుండును గాక!
- 6) నీ దేవుడే నా దేవుడు అను మాటను బట్టి ఈ గ్రంథము బైబిలులో చేర్చబడినది.
- 3. మోషే చెప్పినట్లు మోయాబీయులు ఇశ్రాయేలీయులలో చేరకూడదు. వారి వంశము నిష్కళంకముగా ఉండవలెను. అయితే బోయజు, రూతు యొక్కవివాహమునకు పెద్దలు అందరు అంగీకరించిరి, సంతోషించిరి, రూతును దీవించిరి. మోయాబు దేశములోనుండి వచ్చిన రూతును బోయజు పెండ్లి చేసికొని, ఆమెను రక్షించెను.
- 4. మోయాబీయులు ఇశ్రాయేలీయులను శపింపవలెనని బిలాము అను ప్రవక్తకు లంచమిచ్చిరి. అయితే దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చివేసెను.
- 5. బోయజు ఎలీమెలెకు సంతతివాడు గనుక రూతును వివాహము చేసికొని ఆమెను విమోచించెను. ఆమె అన్యురాలు, బోయజు యూదుడు. అయినను వారు రూతును చేర్చుకొని దీవించిరి. రూతు అన్యులలోనుండి (ఇశ్రాయేలీయులు కానివారు) వచ్చుటద్వారా, రాకడకు సిద్ధపడవలసిన పెండ్లికుమార్తెకు ఆమె సూచనయై ఉన్నది. ధర్మశాస్త్రము ఆమెను దేవుని జనములో చేర్చుకొనదు గాని, రానైయున్న క్రీస్తు ప్రభువు చేతిలోనున్న కృపాశాస్తము ఆమెను రానిచ్చెను.
- 6. బోయజు కొడుకు ఓబేదు, ఓబేదు కొడుకు యెష్షయి, యెష్షయి కొడుకు దావీదు. దావీదు వంశములోనుండి మరియమ్మ, యేసుప్రభువు వచ్చిరి. ఈలాగు రూతు వరుసకు యేసుప్రభువుకు తల్లి అయ్యెను.
- 7. బైబిలు కథలలోని స్త్రీలను గూర్చిన కథలలో ముఖ్యమైనది రూతు గ్రంధము. బైబిలులోని 66 పుస్తకములలో రూతు చరిత్ర, ఎస్తేరు చరిత్ర ప్రత్యేకముగా వ్రాయబడినవి. స్త్రీలను గురించి వ్రాయించుటవలన దేవుడు స్త్రీలను గౌరవపర్చినట్లు కనబడుచున్నది. రూతు అన్యురాలు, భర్త యూదుడు. ఎస్తేరు యూదురాలు, భర్త అన్యుడు. దేవుడు రూతును ఇశ్రాయేలీయుల దేశమునకు రప్పించుటవలన అన్యులను, యూదులను ఏకము చేసి వారిలోనుండి రక్షకుని రప్పించుటకు ఆమెను తీసికొనివచ్చెను. అది దేవుని సంకల్పము. రక్షకుడు రాకముందే, అనగా 1500 సం॥ల క్రితమే అన్యులను, ఇశ్రాయేలీయులను దేవుడు ఏకముగా చేసెను. ఇది రూతు గ్రంథములోనున్నది.
-
8. యూదులు - "మేము దేవుని జనము, మాలోనికి అన్యులు రాకూడదు" అని వాదించుదురు. కాని మేఘములో ఎత్తబడే సంఘములో రెండు
గుంపులుండును.
- 1) మృతుల గుంపు,
- 2) సజీవుల గుంపు.
- 9. ఈ రూతు గ్రంథము ఎడారిలోని ఒయాసిస్సు అనగా నీటిబుగ్గ వలె నున్నది. ఇది ఒక ప్రేమ కథ. పరిశుద్ధమైన ప్రేమ, ఎటువంటి కష్టమునైనను జయించగలుగునని ఈ గ్రంథము బోధిస్తున్నది. పెండ్లికుమార్తెకూడ తనకు ప్రభువుయెడల ఉన్న పరిశుద్ధ ప్రేమనుబట్టి, లోకములోనున్న కష్టములన్నిటిని జయించవలెను. యువతీ, యువకుల మధ్యనున్న ప్రేమ, ఇందులో లేదుగాని ఒక యౌవనస్టురాలు తన అత్తగారి యెడల కలిగిన గాఢమైన ప్రేమను ఈ కథ చూపించుచున్నది.
- 10. బోయజుకంటె గొప్పవాడైన క్రీస్తుప్రభువు అన్యులైన మనలనందరిని తన రక్తము ద్వారా విమోచించెనని అనుటకు ఈ గ్రంథము సూచనగా ఉన్నది. రూతు మోయాబీయులలో ఒక పాపి. ఇశ్రాయేలీయులలో చేరకుండా దూరముగా నుండవలెను, పేదరాలు, అక్కరలు గలది. అయితే, బోయజు వివాహము చేసికొనుట వలన విమోచింప బడెను. ఆలాగే పెండ్లికుమార్తెకూడ ఒకానొకప్పుడు, పాపివలె దూరముగా నుండి ఆత్మ విషయములో పేదరికము కలది, అన్ని అక్కరలు కలది. అయితే క్రీస్తు ప్రభువుని వెదికినతరువాత రూతుకు విశ్రాంతి దొరికినట్లు, పెండ్లికుమార్తెకుకూడ విశ్రాంతి దొరికెను.
బోయజు క్రీస్తును పోలినవాడు, కోతకు అధిపతి, యుద్ధశూరుడు, రూతును చూచుటతోనే దయగా మాట్లాడి ఆదరించినవాడు. అలాగే క్రీస్తుప్రభువు కోత కోయించును (దూతలతో) యూదా గోత్ర సింహముగా సాతానును ఓడించిన యేసుప్రభువే, సంఘము అధిక కష్టములలోనుండి తన నొద్దకురాగానే, ఆయన ఆదరించి తన గాయములలో మనలను చేర్చుకొని, మనలను విమోచించి, తనతో ఐక్యము చేసికొనేవాడైయున్నాడు. బోయజు రూతును ఆదరించిన రీతిగా క్రీస్తు సంఘమును ఆదరించును.