(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

పరిచయము



“బైబిలు స్త్రీలు” అను ఈ పుస్తకము యం. దేవదాసు అయ్యగారి వ్రాతలనుండి సంకలనము చేయబడినది. బైబిలులోని ప్రాముఖ్యమైన స్త్రీలను గురించి వ్రాయబడిన ఈ పుస్తకములో రూతు, హన్నా, ఎస్తేరు, అన్న మొదలగు స్త్రీలు ఏలాగున వివిధ ఆత్మీయసత్యములను తమ జీవితముల ద్వారా మరియు అంతరంగ అనుభవములద్వారా లోకమునకు వెల్లడిచేసిరో విపులముగా వివరించబడినది. వీరి స్థితిగతులు ఏవైనప్పటికినీ, దైవ కృప ఏలాగున వీరిని వెంబడించి, ఏర్పాటులో నిలువబెట్టినదో, వీరి చరిత్రలను చదివినచో గ్రహించగలము. ఆయాకాలములలో ప్రభువు వీరిని ఏలాగున ఒక్కొక్క ప్రత్యేకమైన పనికి నియమించుకొని, తన అంతరంగ ఉద్దేశములు నెరవేర్చుకొన్నారో గమనించిన యెడల; ఈ కాలమునకు సంబంధించిన పరలోకపు తండ్రియొక్క ఆత్మీయ ప్రణాళికలో మనమును ఏలాగున భాగస్వాములుగా కాగలమో చక్కగా గ్రహించగలము. అందుకొరకే ఈ బైబిలుమిషను బైలుపరచబడినది.


రూతు మోయాబీయురాలైననూ, ఏర్పాటు జనాంగములోనికి ప్రవేశించి, 'నీ దేవుడే నా దేవుడు' అనుటద్వారా ఏకముగా యేసుప్రభువుయొక్క తల్లుల వరుసలోనికి చేరగల్గినది. దైవజనులు ఈమెను మోయాబు బురదలో పుట్టిన పద్మముగా వర్ణించారు. హన్నా చేసికొనిన సమర్పణ, పట్టుదలతో కూడిన వేదన ప్రార్ధన ఆమె కుమారుడైన సమూయేలును ఆ కాలములో తిరుగులేని ప్రవక్తనుగా నిలువబెట్టినవి. ఒక మానవ జీవితముయొక్క పరిణతి క్రమములోను, శరీరాత్మీయ స్థితిగతులను వికసింపచేయుటలోను ఒక స్త్రీయొక్క పాత్ర ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో ఈ ఉపదేశములలో చూడగలము.


ఎస్తేరు తాను చేసిన ఉపవాసప్రార్ధనద్వారా పొందిన బలమునుబట్టి తన జనాంగముపై విధించబడిన మరణ శాసనమును రద్దు చేయించగల్గినది. అన్న తాను రేయింబవళ్ళు చేసిన ఉపవాస ప్రార్ధనలనుబట్టి మొదటి రాకడలో పాలుపొంది, రెండవ రాకడలో ఎగిరివెళ్ళు సజీవులకు ముంగుర్తుగా నిలిచినది. ఈలాగున దైవ సహవాసమందు పరిపూర్ణులైన స్త్రీలు తాము పొందిన శ్రేష్టమైన ఆత్మీయ అనుభవముల ద్వారా ప్రభువు మహిమను ప్రతిఫలింపజేయుచు, వారి అడుగుజాడలయందు మనమును నడుచుటకు మనలను ప్రోత్సాహపర్చుచున్నారు.


అట్టి దీవెనకరమైన స్థితిలో త్వరగా వచ్చుచున్న వరుడైన క్రీస్తుప్రభువు మనలను స్థిరపర్చును గాక. ఆమేన్.


ఇట్లు
త్వరగా వచ్చుచున్న ప్రభువునందలి,

రెవ. డా॥ ఎ. జాన్

ప్రసిడెంట్ బైబిలు మిషను.