హన్నా చరిత్ర
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: 1సమూ. 1:11; కుమార: లూకా. 2:22-24; పరిశు: గలతీ 4:1-5.
రామా పట్టణమునకు సమిపమున షిలోహు అను పట్టణము కలదు. ఎల్కానా తన కుటుంబముతో దేవునికి ప్రార్ధన చేయుటకు అక్కడకు వెళ్ళుచుండెడివాడు. ఆయన భార్య పేరు హన్నా. ఆమెకు పిల్లలు లేకపోవుటయే ఆమె దుఃఖము. ప్రతి కుటుంబములో విచారము కల్గించే వృత్తాంతము ఏదోఒకటి ఉండి తీరును. ఇక్కడ భార్య, భర్తలకు గొప్ప మైత్రి ఉన్నది గాని విచారము కలదు. వారికిగల విచారమునకు దేవుని సమ్మతి కలదు. దేవుని సెలవులేనిదే ఏమి రాదు. ఆయన కొన్ని సమయములలో కష్టములు రాకుండా చేయగలడు, ఆలాగే కొన్నిమార్లు కష్టములు రానిచ్చి వాటినుంచి తప్పించగలడు. కష్టకాలముకూడ మనకు ఒక గొప్ప కృపాకాలమే. ఎల్కానా అను దైవజనుడు తన భార్యను ఆదరించెను. ఈ రీతిగా విశ్వాసులు ఒకరినొకరు ఆదరించుకొనవలయును.
ఒకనాడు వారు షిలోహునకు కానుకలను తీసికొని వెళ్ళిరి. దేవుని సన్నిధికి వెళ్ళినపుడే మనిషికి పూర్ణమైన ఆదరణ దొరుకును. రెండు పనులమీద వారు షిలోహునకు వెళ్ళిరి.
- 1) యెహోవాకు మొక్కుటకు,
- 2) బలిఅర్పణ కొరకు అనగా కానుకను అర్పించుటకు.
ప్రతివారు దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఈ రెండు సంగతులు జ్ఞాపకముంచుకొనవలెను.
- (1) దేవుని ఆరాధించుట,
- (2) కానుకలు అర్పించుట.
మనము కానుక ఎందుకు అర్పించవలెను? మనము సమస్తము దేవుని వలన పొందుచున్నాము గనుక మనము అట్లు చేస్తే దేవునికి ఎంతో సంతోషము. దేవాలయమునకు కానుక తీసికొని వెళ్ళుటలో హన్నాకు పూర్ణ సంతోషము కలదు. మనకు ఎన్ని కష్టములున్ననూ, విచారములున్ననూ దేవాలయమునకు తప్పక పోవాలి. దేవాలయములో
- 1) సంతోషము
- 2) ఆదరణ దొరకును.
షిలోహులో గొప్ప దేవాలయము లేదు గాని అది ఆరాధన స్థలము. అచ్చట ఏలీ అను యాజకుడు గలడు. ఆయనకు ఇద్దరు కుమారులు కలరు. కీర్తన 23లో ఉన్నట్లు, ఏలీ నిత్యము దేవాలయములో నివసించెడివాడు. హన్నా ఆ దేవాలయములో తన హృదయములోనున్న విషయములన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచుండెను. దేవునికి మాత్రము చెప్పుకొనుచుండెను, పెదవులు మాత్రం ఆడించుచుండెను. ఏలీ ఆమెను తప్పు అర్ధము చేసికొనెను. త్రాగివచ్చినది అనుకొనెను. అది మన కాలములో కూడా కనబడుచున్నది. ఒక ప్రార్ధనాపరురాలు పలువురిని గూర్చి ప్రార్ధించునపుడు కొందరు తప్పు అర్ధము చేసికొనవచ్చును. అప్పుడు మనము నిరాశపడరాదు.
హన్నా - "సైన్యములకధిపతియును, దేవుడునగు యెహోవా!
- 1) నన్ను మరువవద్దు,
- 2) జ్ఞాపకము తెచ్చుకొనుము.
- 3) నా శ్రమను చూడుము,
- 4) నాకు ఒక కుమారుని దయచేసిన యెడల నీ సేవకు అతనిని అప్పగించెదను" అని ప్రార్థించెను.
తన విషయములన్ని చెప్పుకొనుటకు ప్రతి విశ్వాసికి దేవుడు గడువులు ఇచ్చును. ఆమె దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించినది. ఆమెకు ఇప్పుడు గొప్ప సంతోషము కలదు. అయితే, తన మనవి తన ప్రార్ధన నెరవేరునని ఆమెకు నిశ్చయత తెలియదు. ఏలీ ఆమె దగ్గరనుండి సంగతి విన్న తరువాత, ఆయన చెప్పినది ఏమనగా "నీకు క్షేమము కలుగునుగాక! నీవు వెళ్ళుము. నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును" ఈ వర్తమానము ఏలీకి దేవునియొద్ద నుండి వచ్చెను.
మనము ప్రార్ధన ముగించిన తరువాత, ఏలీ చెప్పిన ఈ ఆదరణగల మాటలు జ్ఞాపకము తెచ్చుకొంటే, ప్రతి ప్రార్ధనాపరునికి సంతోషము కలుగును. వాగ్ధానమును ఆమె చెవినిపెట్టుకొని సంతోషముతో వెళ్ళిపోయెను. అట్లే ఆమెకు ఒక కుమారుడు కలిగెను. సమూయేలు అని పేరు ఆమె అతనికి ఎందుకు పెట్టినది? సమూయేలు అనగా యెహోవా నా ప్రార్ధన ఆలకించెను.
ఎల్కానా కుటుంబములో గొప్ప ఐక్యత కలదు. పాలు మాన్పించువరకు నేను షిలోహు రాను అని హన్నా చెప్పినపుడు, ఎల్కానా అడ్డు చెప్పక దేవుడు తన వాక్యమును స్థిరపరచును గాక! అనెను. కుమారుడు పుట్టుట అనేది నెరవేరినది. ఇంక సేవకు అర్పించుట అనేది నేరవెరవలెను. ఆమె తన కుమారుని దేవుని కొరకు పెంచెను. తమ సొంత మేలు కొరకు గాక, తల్లులు తమ బిడ్డలను దేవుని సేవ కొరకు పెంచవలెను. గవర్నమెంటు పని అయితే, దేశ సేవ నమ్మకముగా చేయవలెను. వారి కుటుంబములో ప్రతి విషయములోను భార్యభర్తలు ఏకీభవించిరి. కుమారుని షిలోహులోనున్న దేవుని మందిరములో అప్పగించి వారు ఇంటికి తిరిగి వెళ్ళిరి. “విచార సమయములో కలిగిన బిడ్డలవల్ల సంతోషము ఉండదు. ఆ పిల్లలు వర్ధిల్లరు” అని శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు గాని సమూయేలుకు గొప్ప సంతోషము కలిగెను.
- 1. దేవుడు ఒక కష్ట కాలము రానిచ్చెను. (అది కృపా కాలమే).
- 2. అందువలన ఆత్మ కుమ్మరించి ప్రార్ధన చేసెను.
- 3. వాగ్ధాన కాలము.
- 4. నెరవేర్పుకాలము.
- 5. సేవ చేసే కాలము
పార్ధనాపరులందరు తమ కష్టములను (పార్ధనద్వారా నెరవేర్చుకొనవలెను, సేవచేయవలెను. తన కుమారుని మరచిపోయి, దేవుని మాత్రము జ్ఞాపకముంచుకొనే కాలము ఆమెకు ఇంకముందుకు వచ్చెను. 10మంది కుమారులకంటే ఎల్కానా ఎక్కువ. 10 మంది కుమార్లకంటె సమూయేలు ఎక్కువ. అలాగే మనకు 10 సంగతులు కంటె రాకడ సంగతి ఎక్కువ. అందరి కుమారుల కంటె దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు మనకు ఎక్కువ గనుక అందరము రాకడ కొరకు సిద్ధపడి కనిపెట్టవలెను, ఆ నిరీక్షణ కలిగియుండవలెను. అట్టి స్థితి త్వరగా వచ్చుచున్న ప్రభువు ఏకీభవించినవారికి దయచేయునుగాక! ఆమేన్.