రూతు తీర్మానము
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: రూతు 1:16; కుమార: యోహాను 15:1-15; పరిశుద్ధాత్మ: రోమా 8:38-39.
రూతు గ్రంథముయొక్క వర్తమానము:
విమోచన ద్వారా విశ్రాంతి, ఆ విశ్రాంతి యేసుక్రీస్తుప్రభువు పాదములవద్ద దొరుకును.
- 1. ఈ గ్రంథముయొక్క అర్ధము ప్రేమ కథ. రూతుయొక్క రక్తము ప్రభువుయొక్క రక్తనాళములలో ప్రవహించెను. లోకములో అనేక ప్రేమ కథలున్న పుస్తకములు కలవు. అవి అపవిత్ర ప్రేమగాధలు. రూతు చరిత్ర అటువంటి ప్రేమ చరిత్రకాదు.
- 2. ఇది ఒక పవిత్రమైన ప్రేమ కథ. కోడలు మిక్కుటముగా తన అత్తను ప్రేమించిన ప్రేమ గాధ. భక్తులు దీనికి పరిశుద్ద ప్రేమ కథ అని పేరు పెట్టినారు.
- 3. రూతుయొక్క వివాహము లోకమంతటికి మాదిరిగానున్నది. దేవుడు ఏర్పర్చిన ఈ వివాహములో శరీర ఆశగాని, లోకాశగాని లేదు. దేవుడు వివాహమును ఏర్పాటు చేసిన ఉద్దేశ్యము, ఆమె వివాహములో సంపూర్ణముగా నెరవేరినది.
- 4. సంతానాభివృద్ధి దేవుని యొక్క ఉద్దేశ్యము. అది ఆమె వివాహములో నెరవేరినది. ప్రస్తుతకాల వివాహములు ఆ దేవుని ఉద్దేశమును నెరవేర్చుటలో వెనుకబడినవి అని చెప్పక తప్పదు.
రూతు తీర్మానములో 7 అంశములు కలవు.
- 1) (1:16) నీవు వెళ్ళుచోటికే నేను వచ్చెదను:- మనలను ప్రభువు ఫలాన చోటికి వెళ్ళు అని చెప్పినప్పుడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళి తీరవలెను. అట్లు లోబడని యెడల ప్రభువుతో మనము తీర్మానము చేయనట్టే.
- 2) (1:16) నీవు నివసించుచోటనే నేను నివసింతును:- ప్రభువు ఉన్నచోటునే విశ్వాసి జీవించవలెను. ఆయన సలహానుబట్టి సేవ చేయవలెను. భూలోకములో ఆయనతో సహవాసము చేసిన వారే, (యోహాను 14:2)లో నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు అని ప్రభువు చెప్పినట్లు, ఆ తండ్రి నివాసములలో చేరగలరు.
- 3) (1:16) నీ జనమే నా జనము:- క్రీస్తుప్రభువుని అంగీకరించిన తరువాత ఆయన ప్రజలయొక్క సహవాసములోనికి వెళ్ళవలెను. అదే భూలోక పరిశుద్ధులయొక్క సహవాసము. ఈ సహవాసము దేశము, భాష, రంగు ఈ తేడాలు లేకుండా ఉండును.
- 4) 1:16. నీ దేవుడే నా దేవుడు:- రూతుయొక్క తీర్మానములోని ఈ వాక్యము ఈ చరిత్ర అంతటికిని గుండె వంటిది, చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుని అంగీకరించిన విశ్వాసి దేవుని బిడ్డ గనుక వెంటనే దేవునియొక్క కుటుంబములో ప్రవేశించుట జరుగును. నా దేవుడు అనుటలో మన పూర్వపూ ఆచారములు, పద్ధతులు అన్నిటిని పూర్తిగా విడిచి బైటకు వచ్చుట ఉన్నది గనుక అది నంపూర్థమైన మెట్టు.
రూతు గ్రంథమునకు పరిశుద్ధమైన నవల అను పేరుపెట్టి, ఇంగ్లీషు డిక్షనరీ వ్రాసిన డా॥ శామ్మేల్ జాన్ సన్ గారు క్లబ్ లో
ఉన్నవారికి
ఈ గ్రంధమును చదివి వినిపించి, యేసుక్రీస్తు ప్రభువులోనికి వారిని నడిపించారు. అత్తకు, కోడలకు గల పరిశుద్ధ ప్రేమ ఈ
గ్రంథములో ఉన్నది. ప్రతి విషయములోను నయోమి ఆజ్ఞ మీదే రూతు నడచు చున్నది. ఈమె సంతానములోనుండి యేసుక్రీస్తు ప్రభువు
వచ్చారు.
అందుకనే ఈ మోయాబీయురాలు దేవునికి తల్లి అయినది. పుల్లటి మామిడి తెచ్చి మంచి మామిడికి అంటుగట్టినట్లు, అన్యులమైన
మనలను
ప్రభువుతో అంటగట్టినారు గనుక మనము గొప్పవారము.
స్త్రీల పేరుమీద బైబిలులో ఎన్ని పుస్తకములున్నవి? రూతు, ఎస్తేరు.
వీరిద్దరకు ఏమి తేడా? ఇశ్రాయేలీయురాలైన ఎస్తేరు, అన్యరాజును పెండ్లి చేసికొన్నది. అన్యురాలైన రూతు, బోయజులో
కలసిపోయినది.
అన్యరాజులో ఎస్తేరు కలిసిపోలేదు. ఎస్తేరు చెప్పితే రాజు విన్నాడా? లేదా? విన్నాడు కదా! ఆలాగే పెండ్లికుమార్తె
చెప్పితే
యేసుక్రీస్తు ప్రభువు వినడా? వింటాడు. పరలోక ప్రార్ధనలో స్తుతి చేర్చకపోతే ఆ ప్రార్ధన సంపూర్ణముకాదు. పెండ్లికాని
క్రితము
ఇల్లు అల్లకల్లోలముగా ఉండును. పెండ్లి అయిపోయిన తరువాత అల్లరిగా ఉండదుకదా? విమోచనద్వారా విశ్రాంతి పొందగలము. ఇదే
రూతుయొక్క
ముఖ్య వర్తమానము.
-
1) విడిచిపెట్టేవాటిని విడిచిపెట్టి, రావలసి వాటి వద్దకు వచ్చినది గనుక రూతునకు విమోచన కలిగినది.
- 1. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినది,
- 2. చేరవలసిన చోటునకు చేరినది గనుక విమోచన దొరికినది.
- 2) రూతు అను యౌవనస్తురాలి చరిత్ర, ఈ నాలుగు అధ్యాయములలో వ్యాపించి యున్నది. దీనికి చక్కదనము విచారమును బట్టి కలిగినది. మామగారును, పెనిమిటిని బట్టి ఈ గ్రంథమునకు చక్కదనము వచ్చినది. రూతు మొదటివిచారము ఏదనగా, తన అనుభవములో కన్నీరున్నది. ఆ విచారమునుబట్టి తాను బేత్లేహేము చేరుటవలన; బైబిలు గ్రంథమంతటిలో, లోకము ఎన్నడు ఎరుగనిదైన, అత్తపై కోడలికి గల గాఢమైన ప్రేమను ఈ పుస్తకము తెలియజేయుచున్నది. ఈ పుస్తకములోని సంగతులు ఎవ్వరు ఎన్నడు ఏ పుస్తకములో వ్రాయలేదు. ఈ పుస్తకములో ఉన్న చక్కదనము ఏ పుస్తకములోను లేదు. లోకములో అనేక వ్రాతలు కలవు. ఆ వ్రాతలలో ఉన్న తీర్మానములను మనము పైకి ఎత్తి చూచిన యెడల, రూతు తీర్మానము ముందు అవి ఎందుకును పనికిరావు. రూతు తన అత్తతో మాట్లాడిన మాటలు, ఈలోక పుస్తకములన్నిటిలో ఒక ప్రకాశమానమైన ముత్యమువలె ప్రకాశించుచున్నవి. ఇది పెండ్లికుమార్తెయొక్క తీర్మానము. ఓ సంఘమా! నీ తీర్మానము ఎట్లు ప్రకాశించుచున్నది. ఈ రూతు చరిత్ర ఎప్పుడు జరిగింది అంటే న్యాయాధిపతుల కాలములో జరిగినది. న్యాయాధిపతుల గ్రంథమే ఎడారివంటిది. ఎడారిలో ప్రయాణము చేసేవారికి నీరు అవసరము. ఈ రూతు చరిత్ర న్యాయాధిపతుల కాలములో జరిగినచరిత్ర. ఆ కాలము - పడుట, లేచుట అను గందరగోళము కలిగినకాలము గనుక అది ఎడారి భూమివంటిది. అట్టి సమయములో రూతుచరిత్ర జరిగినది గనుక ఎడారిలో దప్పిగొను వారికి నీటిసరస్సు దొరికిన ఎంత ఆనందపడుదురో, ఆ కాలములో జరిగిన రూతుచరిత్ర వారికి అంత ఆనందము కలిగించినది.
- 3) ఈ పుస్తకమంతా ఒక స్త్రీతో నిండియున్నది. బైబిలులోని ఒక గ్రంథమంతా ఈ స్త్రీ కొరకు కేటాయించబడినది. రూతు అన్యురాలు, ఏర్పాటు సంఘములోనికి వచ్చినది. ఇక్కడ బోయజని వివాహము చేసికొన్నది. ఓ విశ్వాసీ! నీకు వివాహమైనదా? అన్యురాలైన రూతు ఏర్పాటు జనాంగములోనికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ప్రవేశించి, యేసుక్రీస్తుయొక్క తల్లులలో ఒకరనిపించుకొని, గొప్ప ఐశ్వర్యవంతురాలు అయినది. ఎస్తేరు అన్యుడైన రాజును వివాహమాడి, అనగా 127 సంస్థానములు పరిపాలించు చక్రవర్తిని వివాహమాడి తన ప్రజల రక్షణకొరకు ఆ స్థితిని వాడుకొనెను. అట్లే పెండ్లికుమార్తె సంఘముకూడా తనకిష్టమైన కార్యములలో, సంఘ క్షేమకరమైన విషయములు వరునిద్వారా జరిగించుకొనును. చెల్లాచెదురుగా ఉన్న గృహమును క్రొత్తగా వచ్చిన పెండ్లికుమార్తె చక్కబెట్టునట్లు, సంఘ విషయములు చక్కబెట్టుకొనుటకు పెండ్లికుమార్తెకు అధికారము కలదు. రాజ్యము, బలము, జయము; ఈ మాటలు పరలోక ప్రార్ధనలో సంఘము కలిపినది. అలాగే పెండ్లికుమార్తె చేసినది.
- 4) ఎలియాజరు తన ఇష్టప్రకారము చేయుము అని ప్రార్థించెను. దేవుడు అలాగే చేసాడు. లోతుకూడా "అక్కడకు వెళ్ళలేను" అన్నాడు. వెంటనే దేవుడు అంగీకరించాడు.
- 5) "నీ దేవుడే నా దేవుడు" అనుటలో రూతు తన పూర్వపు ఆచారములు, పద్ధతులు అన్నిటిని విడిచి బయటకు వచ్చినది. అది సంపూర్ణమైన మెట్టు.
- 6) నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందెదను. ఈ తీర్మానమును బట్టి విశ్వాసికూడా క్రీస్తు ప్రభువుయొక్క మరణానుభవమును కలిగియుండవలెను. అనగా తన శరీరమును సజీవయాగముగా క్రీస్తు ప్రభువుకు అర్పించుట, మరణముతో సమానము (రోమా 12:1). ఆలాగు మరణించినప్పుడే, ఆయన పునరుత్థానములోకూడా పాలు దొరుకును. మరణించిన మనమే క్రీస్తు ప్రభువు కొరకు జీవించగలము.
- 7) "నీవు పాతిపెట్టబడు చోటనే పాతిపెట్టబడును". విశ్వాసి తన జీవితములో, పాతవాటిని అన్నిటిని మరలా కనబడకుండా పూర్తిగా పాతిపెట్టవలెను. అన్యురాలైన రూతునకు ఏర్పాటుప్రజలలో సమాధి కలిగియుండుట, ఎంతో ఘనమైన విషయముగాను, ఉన్నతమైనదిగాను ఎంచదగును. ఆ సమాధికి విలువ, క్రీస్తుప్రభువు సమాధియే.
- 8) మరణము తప్ప ఏదియు విడదీయుటకు వీలులేదు. తమ శరీరములో ప్రాణమున్నంతవరకు అత్త కోడలు వేరుగా జీవించుటకు వీలులేదు. శరీర సంబంధములు ఇహలోకము వరకే ఉండును గాని విశ్వాసి, క్రీస్తుతో ఈ జీవితములోను, రాబోవు జీవితములోను నిత్యము యేసుక్రీస్తు ప్రభువుతోనే ఉండును.
- 9)రూతు తీర్మానము చేసికొనుట:- మనమును అట్టి తీర్మానము కలిగియుండ వలెను. మన తీర్మానము ధవళేశ్వరం ఆనకట్టవలె ఉండవలెను. ఎన్ని తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా కొట్టుకొని పోకుండ ఉండవలెను. మొత్తముమీద గట్టి అమ్మాయి రూతు. బోధకులారా! మీ బోధ గట్టిదైతేనే మీ సంఘము గట్టిదైయుండును. నాలుగు డబ్బులు వస్తున్నాయని అనుకొంటే మా తీర్మానము గాలికి కొట్టుకొని పోయినట్లే.
- 10) రూతు సేవచేయుట:- రూతు నయోమికి ఎదురు చెప్పక, విధేయురాలై పరిగె ఏరుకొని, అత్తగారి యొక్క పోషణ భారమంతా భరించెను. దేనినిచూచి ఇంత ప్రేమ? తన అత్తగారిమీద కలిగిన గురినిబట్టి! గురిలేని సేవ ఫలితము కలుగజేయదని ఎరిగి, ఆమెవలె గురి కలిగిన సేవ చేయవలెను. ఓ పాదిరిగారూ! ఓ ఇవాంజలిస్టుగారూ! నీవు సువార్త పని చేయుటలో నీ గురి ఏమిటి. నీ కుటుంబము పోషించుకొనుటయా? లేక యేసుక్రీస్తు ప్రభువుకు కీర్తి కలిగించుటయా?
- 11) రూతు విశ్రాంతిననుభవించుట:- దీనికొరకు ఆమె విమోచకుని పాదముల యొద్ద పరుండెను. నీవు ఎంత నేవ చేసినను, ఆయన పాద సన్నిధిని లేనియెడల నీకు విశ్రాంతిలేదు. అక్కడికి చేరినవారిని ఆయన వట్టి చేతులతో పంపివేయడు. నీవు అనుభవించగలిగినన్ని వరములతో ఆయన నిన్ను నింపివేయును.
- 12) రూతు బహుమానమును అందుకొనుట:- బోయజు ఆమెను వివాహమాడి లేమిని తీర్చెను. దేవుడు సంతానమునుకూడ ఆమెకు అనుగ్రహించెను. పేదరాలు స్వతంత్రురాలు అయినది. ఎలీమెలెకు కుటుంబము నాశనము కాకుండ నిలిచినది. రూతు అన్ని దీవెనలు అందుకొన్నది. పెండ్లికుమార్తె అందుకొనని దీవెన భూలోకములో ఉండదు. పెండ్లికుమారుడు తన వస్త్రమును మనమీద కప్పును. ఆ భాగ్యము ఈ పందిరిలో ఉన్నవారందరికి కలుగునుగాక!
- 13) బోయజు రూతును గూర్చి పలికిన మాటలు: ఈమె మోయాబు జనాంగమునకు సంబంధించినదైననూ, “నా కుమారీ! వేరే పొలములో ఏరుకొనుటకు వెళ్లవద్దు. నీ ఇష్టము వచ్చినట్లు కూర్చుకొనుము. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసినది” అని బోయజు రూతుతో ప్రేమగా మాటలాడెను. వారు యూదులు, ఈమె అన్యురాలు గనుక బోయజు ఏలాగు ఉండవలెను? ఈమెను ఎందుకు ప్రేమించాలని వారన్నారు. ఎందుకంటే రూతులో ఉన్న గుణ లక్షణములనుబట్టి ఆమె కొరకు పనలు వదలిపెట్టుడని బోయజు ఆజ్ఞాపించాడు. ఈ ఇండియా దేశములో ఒక రూతు పుట్టినది, అది బైబిలు మిషను. దొర దాతలేని మిషను. భూసంబంధ భాగ్యము మనకు లేదు, మనకంటె గొప్ప భాగ్యము ఎవ్వరికి లేదు. ఇశ్రాయేలీయులను ఒక పక్షముగా, రూతును ఒక పక్షముగా పెడితే రూతే గొప్పది. నయోమి వస్తు వస్తూ, అన్ని పోగొట్టుకొంటే పోగొట్టుకుంది గాని ఒక గొప్ప చిన్నదాన్ని తీసికొచ్చినది. ఆలాగే దైవజనులు ఏమి లేనివాడైనను బైబిలు మిషను తీసికొని వచ్చినారు. నయోమి రూతును పోషించాలా? రూతు నయోమిని పోషించాలా? నయోమి చెప్పకపోయిన గాని రూతు పరిగె ఏరుటకు అడిగి వెళ్లినది. బైబిలు మిషను కొరకు మనము ఏమి చేస్తున్నాము? రూతు ఈ దేశములోనికి వచ్చినది. ఆమె పరిగె ఏరుకొన్నాగాని ప్రభావముగలది. రూతు ఏలాగు వెళ్లినదో ఆలాగే బైబిలు మిషను తాను వెళ్లవలసిన చోటికి వెళ్లును.
- 14) రూతు మోయాబు దేశములోఉంటే, ఆమె మంచి చెడ్డలు బైలుపడునా? అలాగే బైబిలు మిషను బయటకు వెల్ళితేనే గాని గొప్పతనము బయలుపడదు. పరిగె ఏరిన ఆమె, పనలు కూర్చుకున్నది. అక్కడనుండి వృద్ధి అవ్వాలి. రూతు కల్గియుండిన దివ్యమైన లక్షణములు కలిగియుంటే మనముకూడ గొప్పవారము కాగలము. మన ప్రార్ధనమెట్లులో ఉన్న తీర్మానము రూతుకు తెలుసు. ఇప్పుడు కనబడే కాలముకాదు. జైబిలు మిషను కనబడే కాలము ఒకటి వచ్చును. రూతు, ఆ దేశములో ఉన్నప్పుడే తీర్మానము చేసినది. ఇక్కడకు వచ్చిన తరువాత విలువ కనబడినది. ఈ మిషను ఏ విషయములో గొప్పదో 23 విషయములు చెప్పాను. ఈ రూతుయొక్క సౌందర్యము ఏమంటే ఆమె అత్తగారికి తెచ్చినది, అత్తగారికి పెట్టినది. పెట్టినది గొప్పదా? కలిగినది గొప్పదా? ఈమె పని గురిపెట్టి పనిచేయడము. మనము చేయకలిగిన పని మనము చేసిన యెడల, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తారు.
మనము ఎంతపని చేసినా ప్రతిఫలము దేవునిదే! ఆయన మీ సేవకు సంపూర్ణమైన ప్రతిఫలము దయచేయునుగాక! ఆమేన్.