హన్నా అనుభవము
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: 1సమూ. 1:6-20; కుమార: లూకా 1:49-55 పరిశు: రోమా 11:16-23.
దేవునియొక్క లక్షణములు హన్నా అనుభవములోనికి వచ్చినందున, ఆమె దేవుని గుణములను తీసికొని ఆయనను స్తుతించెను.
హన్నా తనకు పిల్లలు లేకపోవుటనుబట్టియు, పెనిన్నాకు పిల్లలుండుటను బట్టియు దేవుడు పక్షపాతి అని అనుకొనుటకు సందుగలదు. నిజముగా దేవుడు పక్షపాతియైతే ఆయన పరిశుద్దుడుగా నుండలేడు. హన్నా చేసిన స్తుతి మరియమ్మ చేసిన స్తుతివంటిదే. సాధారణముగా భక్తిపరుల స్తుతి ఒక రీతిగానే యుండును. పెనిన్నా హన్నా వీరిద్దరి యెడల ఆయన సంకల్పన ఆయన దృష్టికి యోగ్యమైనది. పౌలు, పేతురు జీవితములోకూడా ఇట్టి అనుభవములున్నవి. అన్యులు ఆత్మను పొందడము, భాషలు మాట్లాడడము (పేతురు అనుకొనని సంగతి); అందుకు పేతురు ఆశ్చర్యపడి సంతోషించినాడు. ఆయన అనుభవము దేవుడు పక్షపాతికాడు, యూదులతో సమానముగా అన్యులకును అన్ని వరములిస్తాడు. పేతురుకు గొప్ప సంతోషము. ఎప్పుడు? అనుభవములోనికి వచ్చినప్పుడు! ఆలాగే హన్నాకు కుమారులు లేకపోవడము అనే బాధలో అనుభవము వచ్చినపుడు ఆమె 'దేవుడు పరిశుద్దుడు' అని స్తుతించగల్గినది. అది తన జ్ఞానమునకు తెలుసును గాని హృదయమునకు తెలియదు. హృదయమునకు తెలిసినప్పుడు అనుభవములోనికి వస్తుంది. తన కుమారుని పోగొట్టుకొనిన ఒక స్త్రీ - "అయ్యా మా జీవరత్నమును దేవుడు తీసికొన్నాడు. దేవుడెంత దొడ్డవాడు! మంచి మాటలు, ఆదరణ మాటలు చెప్పిపోయినాడని" అనుట ఆమెకు అనుభవములోనికి వచ్చినది గనుక సంతోషించినది.
ఆలాగే మనకుకూడ దేవుడు అనేక విషయములలో అనుభవము కలుగజేయు చున్నాడు. ఇట్టి కృప కొరకుకూడా మనము ఎదురుచూడవలెను. హన్నా ఎప్పుడు ఎక్కువగా సంతోషించినది? కుమారుడు కలిగినప్పుడు సంతోషించినదా! లేక దేవునిని ఆశ్రయించినపుడు సంతోషించినదా! దేవునిని ఎప్పుడు ఆశ్రయించినదో అప్పుడే ఆమెకు ఎక్కువ ఆదరణ కలిగినది గనుక ఆమె ఆయనను ఆశ్రయదుర్గమని అనగలిగినది. ఆయన అనంతజ్ఞాని. కారణమేమి? ఆయన చేసే పనులు ఆరంభములో అంత జ్ఞానము గలవిగా కనబడవు. కొంతకాలము పిల్లల ననుగ్రహించకపోవడము ఆయన జ్ఞానమేయని హన్నా తెలిసికొనినది. దేవుని సృష్టి కార్యములన్ని జ్ఞానయుక్తములైనవి. మొదట మనుష్యుని చేయలేదు (ముఖ్యుడు) కాని అతనికి అవసరమైన వాటిని ముందు చేసినాడు.
దేవుడు యూదులను ఏర్పాటు చేసికొని వారిచే తన ఆజ్ఞలు అభ్య సింపజేసి, వారు విధేయులైనప్పుడు అన్యులను పిలిచి, వారిని వీరిని కలిపివేసినాడు. తర్ఫీదు అయినవారిద్వారా, ఇతరులనుకూడ తనదరికి తీసికొనిరావడానికే దేవుడు ఆలోచించెను. యూదులను ఏర్పర్చుకొని తర్ఫీదు ఇవ్వడము అన్యులను చేర్చుకొనుటకే హన్నా విషయములోకూడా ఇట్టి ఆలోచనయే దేవునికున్నది. కొంతకాలము పిల్లలు లేకుండా చేసి, ఆ తరువాత తన చేత ప్రార్ధనలు చేయించి, అటు తరువాత పిల్లలను ఇవ్వడము ఆయన జ్ఞానమే. మన కష్టకాలమందు దానిని తొలగించకపోవడము ఆయన జ్ఞానమే, తొలగించడము ఆయన జ్ఞానమే. ఆయన అనంతజ్ఞాని, అనాదిపరిశుద్దుడు, అనంత పరిశుద్దుడు.
ఉదా:- వడ్రంగి తన చేతిలోని కర్రను చెక్కి చిత్రికపట్టి, నగిషీపెట్టుట; దానికి సుందరమైన రూపు ఏర్పర్చుటకే గదా! ఈలాగు మలచునపుడు అతడు తన చేతిలోని కర్రనుచూచి జాలిపడును. ఎందుకనగా కర్రకు బాధే అయినా, తరువాతి కాలమునకు అది సుందరమైన సృష్టిగా మార్చబడును. కర్రమీద వడ్రంగి జాలిపడునట్లు ఆయన కార్యములుండును. గనుక మనము వీటన్నిటిని అనుభవములోనికి తెచ్చుకొనవలెను. ఒక టీచరు భూమి గుండ్రముగా నున్నదని పిల్లలకు బోధించి, అది నేను నమ్మలేననెను. ఆ టీచరు సముద్ర తీరమునకు వెళ్ళి ఓడను గమనించితేనే గాని ఆ విషయము, ఆయనకు బోధపడదు. దేవుడు క్రియాపరీక్షకుడు, ఆయన జ్ఞానమును బట్టి ఆయన పరీక్షకుడని హన్నా తెలిసికొనినది. ఎవరెవరు తన్ను హింసించినారో ఆయన పరీక్షించి, తగు ఫలితము ఇచ్చినాడని తెలిసికొనినది. ఆయన కార్యములు జ్ఞానయుక్తమని ఒప్పుకొనినప్పుడే మనకు ఆనందము, సమాధానము కలుగును. ఆయన వచ్చేటప్పుడే వస్తాడు. ఆయన జ్ఞాని గనుక ఎపుడు రావలెనో ఆయనకు తెలుసును. కంసాలి బంగారమును నిప్పులోవేసి, బాగుగా కాల్చి తీయును. ప్రభువు ఎప్పుడు రావలెనో ఆయనకు తెలియును. ఆయన వచ్చినపుడు సరిగా సిద్ధపడి ఎగిరివెళ్ళు ధన్యత ఇక్కడ చేరినవారికి ఆయన దయచేయును గాక. ఆమేన్.