హన్నా స్తుతి

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)


తండ్రి: 1సమూ. 2:1-10; కుమార: లూకా. 1:42-55; పరిశుద్ధాత్మ: గలతీ 4:21-28.

హన్నా అను ఆమెకు ప్రార్ధనాపూర్వకముగా కుమారుడు కలిగినప్పుడు తండ్రిని స్తుతించెను. అవి సాధారణమైన మాటలే. సాధారణముగా భక్తితో ఇతరులు చేయు స్తుతి అంతా ఒకేలాగునే యుండును. ఈ స్తుతి 3 భాగములు.

సన్నిధి కలిగియుండుట అనగా ప్రతిరోజు ప్రార్థనలో దేవుని ఎదుట హృదయమును కుమ్మరించుట.

ఉదా: 'విరిగి నలిగిన హృదయము దేవునికిష్టము' అని వ్రాయబడినట్లు హన్నా చేసిన ప్రార్ధన హన్నాను దేవునికి ఇష్టురాలుగా చేసింది. హన్నా పెదవులు తడబడుచున్నవి గానీ ఆమె హృదయము కుమ్మరించబడుచున్నది. హన్నా చేసిన ప్రార్ధన పలుకులు పలుకు ఏలీకి వినబడవలెను గాని, దేవునికి వినబడినవి.


దైవలక్షణ వర్ణన:- తన ప్రార్ధన నెరవేరిన పిదప హన్నా, దేవుని లక్షణములెత్తి ఆయనను స్తుతించెను. పరిశుద్దుడు, వేరొకదేవుడు లేడు, ఆశ్రయదుర్గము, అనంత జ్ఞాని, క్రియా పరీక్షకుడు. నిజముగా దేవుడు పక్షపాతి అని హన్నా అనవలెను. ఎందుకంటె తన ఇంటిలోనున్న పెనిన్నాకు సంతానము కలదు గాని హన్నాకు లేదు. గానీ హన్నా ఆలాగు అనలేదు. దేవుడు పక్షపాతి అయితే పరిశుద్ధుడుగా నుండలేడు. హన్నాకు సంతానములేకుండా చేయుట ఆయనకు న్యాయమే. మంచిదికానిది ఏదియు తండ్రి చేయడు. పేతురు అనుభవములోనికి రాకపూర్వము దేవుడు పక్షపాతి అనెను. కాని అనుభవములోనికి వచ్చిన తర్వాత పక్షపాతికాడని అందరిలో నిలువబడి చెప్పెను. అట్లే హన్నా అనుభవములోనికి వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్దుడని చెప్పెను. ఆ విషయము ఆమె జ్ఞానమునకు తెలుసును గాని హృదయమునకు తెలియదు. హృదయములకు తెలిసిన తరువాత అనుభవములోనికి వచ్చును.


ఆశ్రయదుర్గము: - హన్నా గొడ్రాలైయున్నప్పుడు దేవాలయమునకు వెళ్ళి దేవుని ఆశ్రయించినప్పుడు ఆమెకు సంతోషము కల్గెను. దేవుని ఆశ్రయించుటచే ఫలితముకూడ కలిగెను. అందుచే హృదయములోనుండి అనుభవములోనికి వచ్చిన సంతోషమునుబట్టి యెహోవావంటి ఆశ్రయదుర్గము లేదని చెప్పెను. అనుభవములోనికివస్తే గాని దేవుని వాక్యకాంతి, అందులోని విలువ కనబడదు. దావీదుకు ప్రభువు కోట, దుర్గము. ఇవి అన్నీ బహిరంగ ఆశ్రయములు. హన్నాకైతే ఆమె హృదయమునందు దేవుడే ఆశ్రయము.


అనంతజ్ఞాని:- దేవుడు మొదట పిల్లలను ఇవ్వకపోవుటకు కారణము ఆయనయొక్క అనంత జ్ఞానమే. తర్వాత ఇచ్చుట కూడ ఆ అనంతజ్ఞాని పనియే. ఏది ఎట్లు చేయవలెనో ఆయనకు తెలుసును. తండ్రి పని జ్ఞానయుక్తమైన పని. హన్నాకుముందే పిల్లలున్న యెడల అంత ప్రార్ధన చేయదు. అంత ప్రార్ధన చేయకపోయిన సమూయేలు అంత భక్తుడుకాడు. తండ్రిని రెండు విషయములలో మెచ్చుకొనవలెను.

క్రియాపరీక్షకుడు:- ఇంటి దగ్గరనున్న పెనిన్నా తన్ను అనిన మాటలన్నిటిని తండ్రి విని, ఆమెకు తీర్పుతీర్చి హన్నాకు ఉపకారము చేసెను. ఆయన అన్ని క్రియలను పరీక్షచేయును. మానవుడు ఏమి చేసిననూ, ఆయన జ్ఞాన నేత్రమునకు మరుగుకానేరదు.


సర్వాధికారి:- అపవాది పాపము చేయించుచున్నాడు. అందుచేత దరిద్రతవచ్చెను.


ఇది అపవాది పని అనకుండా, దరిద్రులను, ఐశ్వర్యవంతులను కలుగజేయువాడు యెహోవాయే అని హన్నా పలికినట్లు వాక్యములో వ్రాయబడియున్నది. ఇది అపవాదికి ఒక పాఠము. మనముకూడా ఒక పాఠము నేర్చుకొనవలెను. మనము అపవాదిని ఎదిరించుటకు ఈ వాక్యము వ్రాయబడినది. దారిద్ర్యము పాపమువలన వచ్చును. అంతేకాదు, అజాగ్రత్త, అజ్ఞానము, పాటుపడనందువలన కూడా దారిద్ర్యము వచ్చును. దేవుని సెలవు లేకుండా మనము కారణమైనను సరే, అపవాది కారణమైనను సరే దారిద్రమురాదు. తండ్రికూడా పేదరికము అనుభవించెను. పాపముయొక్క ఫలితము ఆయనకూడా అనుభవింపవలసి వచ్చెను. పాపము నిమిత్తము మనము దరిద్రులము. అయితే, మనకు ఐశ్వర్యము రావలెనని మన నిమిత్తము ఆయన దరిద్రుడాయెను. ఇది మహిమ మాదిరి. పేదరికము, దరిద్రత, కరవు వీటిలో వేటిలోనున్నను విశ్వాసి ప్రభువును స్తుతించవలెను. ఇది ఎంతో మహిమగల స్థితి. తండ్రి కొందరిని ఆరోగ్యవంతులుగాను, కొందరిని అనారోగ్యవంతులుగాను, మరి కొందరిని జ్ఞానవంతులనుగాను, ఇంకా కొందరిని వీటికి వ్యతిరేకముగాను చేయుచున్నాడు. ఈలాగు ఎందుకు చేయవలెను? అని అడుగునది అజ్ఞాన ప్రశ్న. అది తండ్రికి తెలుసును. మానవుడు దేవుని జ్ఞానమును గ్రహించలేడు. మానవుని జ్ఞానము తండ్రియొక్క జ్ఞానము ఎదుట వెర్రితనమైనట్టు అవిశ్వాసి జ్ఞానము, విశ్వాసి జ్ఞానము ఎదుట వెర్రితనమై యుండును. విశ్వాసియొక్క జ్ఞానము దేవుని జ్ఞానమును గ్రహించును.


మనలను వెయ్యేండ్ల పరిపాలనలో ధనవంతులుగాను, మరణమైన వెనుక పరలోకములో ధనవంతులుగాను చేయుటకు ఆయన 33½ సం॥లు బీదవాడుగా నుండెను. ఆత్మ జీవనములో పేదరికము కలదు. దీనివలన కీడు కలుగును. క్రుంగజేయువాడును, లేవనెత్తువాడు ఆయనే. ఎందుకు క్రుంగజేయవలెను? లేవనెత్తుటకే. క్రుంగజేయుట కూడ దేవుని ప్రేమయే. క్రుంగచేయుట అనగా బాగుగా నిలువబడిన వానిని పడగొట్టుట. ఇది పైకి కనబడదు గాని విశ్వాసి ఇందులోని మేలు గ్రహించును. విశ్వాసియొక్క జ్ఞానము తండ్రినుండి కలిగినది. బాగుగానున్న వానిని కృంగునట్లు చేసిన తర్వాత వానిని దేవుడు లేవదీయును. ఇందుకు దేవుని వాక్యములో అనేక వజ్ర వాక్యములున్నవి. వాటిని పరిశుద్దాత్మ జ్ఞాపకము చేయును. ఈ వాక్యములో మానవులనుగూర్చి, దుస్థితిని గూర్చి ఉన్నది. యేసు ప్రభువునకు రాజు అను పేరు పుట్టినరోజునే ఆరంభమాయెను. కాని ఆయన ఎక్కడను రాజు కాలేదు గాని వెయ్యేండ్లలో రాజగును. అయిననూ, ఈ మానవ చరిత్రలో సర్వాధికారి ఆయనే.


ప్రార్థన:- ప్రేమగల తండ్రీ! నీవు మహా పరిశుద్దుడవు. ఇది మా అనుభవములోనికి తీసికొని రమ్ము మా దేవా! నీవు ఆశ్రయ దుర్గము, అనంత జ్ఞానివి, క్రియాపరీక్షకుడవు, సర్వాధికారివి. ఇవి కూడా మా అనుభవములోనికి తీసికొని రండి. నీకు మరుగైనదేదియు లేదు గాన మేము నీకు భయపడి, కార్యములు చేయునట్లు సహాయము చేయుము. మేము త్వరగా సిద్ధపడునట్లు చేయుము. హన్నావలె స్తుతించే అనుభవములోనికి తీసికొని రమ్ము ఈ ప్రార్ధన త్వరగా రానైయున్న యేసు నామమున వేడుకొనుచున్నాము ఆమేన్.