అన్న ప్రార్ధన
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: కీర్తన. 45; కుమార: లూకా 18: 1-8 పరిశు: 1థెస. 3:7-9.
ధ్యానాసక్తిపరులారా! దేవుని ఎదుట మెప్పుపొందే దీవెన మీకు కలుగును గాక!
అన్న అను దైవజనురాలు 84 సం॥లు దేవాలయములో ఉండి, ఉపవాస ప్రార్ధనలు చేయుచుండెను. ఈమె 7 సం॥లు కుటుంబీకురాలుగా ఉన్నది. ఆమె బస దేవాలయములోనే, ఆమె భక్తిపరురాలు. ఆమె చరిత్రలో రెండు సంగతులు గలవు (ఇంకా అనేకములు గలవు). అవి
- 1. ఉపవాసము చేసేది
- 2. ప్రార్ధనలు చేసేది.
అన్నలో గల రెండు గొప్ప లక్షణములు ఏవనగా, ఉపవాసము మరియు భోజనము చేయకుండ ప్రార్ధనలో గడిపే జీవితము. అట్టివారు మనలో ఎవరైనా ఉన్నారా?
భర్తలేనివారు గమనించవలసిన విషయములు: ఉపవాసము, ప్రార్ధన. అన్న ఈ రెండు గొప్ప పనులు చేసెను. నీతిగానుండుట, భక్తిగానుండుట సుమెయోను స్వభావము. అయితే ఉపవాసముండుట, ప్రార్ధనచేయుట అన్న స్వభావము. ఇవి రెండు, రెండు గుణములు. తరచుగా ప్రార్ధన చేయుట గొప్ప విషయముకదా! తరచుగా ప్రార్ధనలో ఉండుటనుబట్టి వండుటకు, తినుటకుకూడ ఆమెకు ఖాళీలేదు. ప్రార్ధన ముఖ్యము కదా! లోకములో ప్రసంగము చేయుట సుళువు. అనగా మనుష్యులతో మాట్లాడుట తేలిక. ప్రార్ధన అనగా, దేవునితో మాట్లాడుట గనుక బహు కష్టము. ఉపవాసము సుళువే, ఈ వేళ తినకపోతే రేపు తినవచ్చును. అయితే కష్టమైన పని ఏదనగా ప్రార్ధన చేయుట. ఆమెకు అదే గలదు. ఆమెకు
- 1) ఉపవాసముండే పని,
- 2) ప్రార్ధన చేసే పని గలదు.
ఆమెకున్న మూడవ పని ఏదనగా, యెరూషలేములో విశ్వాసులుగలరు. వారు ప్రభువుయొక్కమొదటి రాక కొరకు కనిపెట్టేవారు. ఆమె వారికి ప్రభువు మాటలు చెప్పేది. అన్న ఇంటిలో ఉపవాసము, గుడిలో ప్రార్ధన చేస్తూ బయటికిపోయి రక్షకుడు వస్తాడని చెప్పేది. ప్రార్ధించే స్త్రీ, బైబిలు బోధకురాలైనది. ఇవి ఒకదానికంటె మరొకటి మించిన పనులై ఉన్నవి. ఉపవాసమునకు మించినపని సేవ. దానికి మించిన పని ప్రార్ధన యెరూషలేములోనివారు విమోచన కొరకు అనగా రక్షకుని కొరకు కనిపెట్టుచుండగా ఆమె వారికి ఆ సంగతులు చెప్పుచుండెడిది. అన్నవలె ఉపవాసము చేసే సమర్ధత, ప్రార్ధన చేసే సమర్ధత, ప్రకటించే సమర్థత మీకును లభించుగాక! ఇదే నేటి దిన దీవెన వర్తమానము. సుమెయోనువలె నీతిపరులముగాను, భక్తిపరులముగా మరియు అన్నవలె మూడు సమర్ధతల దీవెనలు, మొత్తము ఐదు దీవెనలు మనము కలిగి ఉండవలెను.
అన్న ఉపవాసమెందుకు చేయుచుండెననగా, ఆమె రేయింబవళ్ళు ప్రార్ధనలో ఉండుటనుబట్టి, ఆమెకు ధారాళముగా ప్రార్ధన వచ్చుచుండెను. ఆలాగే వండుటకు, తినుటకు ఆమెకు వేళలేదు గనుక ఆమె ఉపవాసం చేసేది. ఇక్కడ ఉన్నవారిలో ఒక్క పర్యాయమైనా, ఉపవాసము చేసేవారున్నారా? లేకపోతే ఉపవాసం చేయండి. మనకు కష్టాలు, నష్టాలు ఎందుకు పోవు? ఉపవాసప్రార్ధన చేయకపోవుటనుబట్టియే. గనుక దేవునిని గట్టిగా పట్టుకొనుటకు ఉపవాసము చేయవలెను. 'నేను వస్తే నీవు బయటికి వెళ్తావా? విను' అని దేవుని గట్టిగా పట్టుకొను పని చేయవలెను. అన్న చేసేది బోధకుల పనికాదు, గానీ విశ్వాసులతో మాట్లాడేపని. అన్యులతో, అవిశ్వాసులతో మాట్లాడుటకాదు గానీ నిరీక్షగల వారితో ఆమె మాట్లాడుచుండెను. విధవరాలి ఘోష ఎక్కడికి వెళ్ళును. గుడిలోనే ఉండును గనుక ఆమె మొదటిరాకడను గూర్చిన నిరీక్షణ సంగతులే మాట్లాడుచుండెను.
ఈ గుడిలో అన్నవలె ప్రభువుకొరకు కనిపెట్టేవారున్నారా! ఉంటే వారు గుడికి రాని అన్యులకు బోధింపవలెను. వారు విశ్వాసులతో మాట్లాడవలెను. ఏమని? రాత్రి నాకు ప్రభువు దర్శనమందు బయట మీరు అలాగున్నారని తెలియజేసిరి అని చెప్పవలెను. రాకడలో ఎగిరి వెళ్ళుట కొరకు త్వరలో సిద్ధముగా ఉండవలెనని చెప్పవలెను. ఒకరితో ఒకరు మాట్లాడుకొనవలెను. కనిపెట్టేవారితో చెప్పవలెను. ఇదే అన్న చేసిన పని. మన అనుభవము విశ్వాసులకు మాత్రమే చెప్పవలెను. విశ్వాసులు మాత్రమే అనుభవమును గ్రహించగలరు. అన్యులైతే అపార్ధము చేయుదురు.
అన్న 84సం॥లు దేవాలయములో ఉండి మూడు పాఠములు నేర్పించెను.
- 1. ఉపవాసముండండి,
- 2. ప్రార్ధన చేయండి,
- 3 మాట్లాడండి.
ఇతరులు అడిగితే అనుభవము చెప్పక బోధ చెప్పవలెను. ఇది అన్న పాటములో ఉన్న మాదిరి. అన్న అనుభవమును మీరును కల్గి ఉండి, అనేకులను రాకడకు ఆయత్తము చేయుటకు పెండ్లికుమారుని కృప మీకు తోడైయుండును గాక! ఆమేన్.
ప్రార్ధన:- గొల్లల మాటలు మరియ ముద్రించుకొన్న రీతిగా, ఈ వర్తమానమును విన్నవారు తమలో ముద్రించుకొను కృప దయచేయుము.