ఎస్తేరు చరిత్ర

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)


తండ్రి: ఎస్తేరు. 4:13-14; కుమార: మత్తయి 25:1-13; పరిశు: హెబ్రీ 11:30-35.

ప్రార్ధన:- తండ్రీ, హిందువులకు వారి నిష్టపోలేదు. ఆలాగే యూదులకును వారి నిష్ట పోలేదు. ఆలాగే బైబిలు మిషనువారుకూడ తమ నిష్టను కాపాడుకొనేటట్టు చేయుము. నీవే (అయ్యగారిని) లూథరు మిషనునుండి తీసికొని వచ్చావు. బైబిలు మిషను స్థాపించినావు. ఎక్కడకు నడిపించినా నీవే కదా. అలాగే నీవు బైలుపర్చిన ఈ బైబిలు మిషనువారు అందరు తమ నిష్టను కాపాడుకొనునట్లు కృప దయచేయుము. మిషనుకాదుగాని, విశ్వాసముగలవారు మోక్షమును సంపాదించుకొనగలరు. లూథరు మిషనులో పట్టుదలగల నన్నే నీవు పట్టుకొని ఈ మిషనుకు తీసికొని వచ్చినావు. లూథరన్ మిషను తల్లి మిషను అయితే బైబిలుమిషను తండ్రి మిషను. ఏ మతము వారైనను, ఏ మిషను వారైననూ సరే ఈ మిషనుకు రావలసియున్నది. ఇతర మతములను, ఇతర మిషనులను, ఇతర మనుష్యులను దూషించుట మా పనికాదు. గాని అందరి క్షేమము కోరుటయే మా పనియైయున్నది. అతిశయము, గర్వము మాలో ప్రవేశించకుండా సహాయము దయచేయుము. మమ్మునుబట్టి మేము అతిశయించకుండునట్లును, నిన్ను బట్టి అతిశయించే కృపను దయచేయుమని వేడుకొంటున్నాము. ఆమేన్.


వష్తి ఇతర క్రైస్తవులకు ముంగుర్తుగానుండెను. ఎస్తేరు అనగా తూర్పు నక్షత్రము. ఈమె క్రీస్తుయొక్క పెండ్లికుమార్తె సంఘమునకు ముంగుర్తుగానుండెను. మొదటి గుంపులోని కన్యకలు చేసిన పొరపాటు మిక్కిలి స్వల్పమే. అనగా చాలినంత నూనె తెచ్చుకొనలేదు. అందుచేత వారు పెండ్లికుమార్తె సంఘములోనికి చేరలేదు. ఒక చిన్న పొరపాటు ఉన్నను పెండ్లికుమార్తె సంఘములోనికి చేరలేరు.


ఈ గ్రంథములోని భాగములు:

ఎస్తేరు కాలములో యూదులనందరిని చంపివేయవలెననే కుట్రాలోచన జరిగెను. అన్యులు ఈ సంగతి ఆలోచించిరి. యూదులు ఉపవాసముండి ప్రార్ధిస్తే అపాయము రాక మానెను. ఎస్తేరును అన్యరాజైన అహష్వేరోషు వివాహము చేసుకొనెను. అప్పటికి ఎస్తేరు వంశము బానిసవంశము అనగా చెరలో ఉన్న యూదులవంశము.

ఉదా:- జూడిత్ అపోక్రిప. అపోక్రిప గ్రంథములు అనగా బైబిలులో చేర్చని గ్రంథములు. అనగా మలాకీ తరువాతను, మత్తయి పూర్వమందును గల గ్రంథములు. ఆ గ్రంథములలో ఒక గ్రంథము పేరు జూడిత్. ఎస్తేరుగ్రంధములో, రాజనగరులోనుండి దేవుని స్తుతించిన ఒకరిని గూర్చి నేర్చుకొంటిమి. అన్యులమధ్య దేవుని స్తుతించిన ఒకరినిగూర్చి ఎజ్రా గ్రంధములో నేర్చుకొంటిమి. నెహెమ్యా గ్రంధములో, పర్వతముల మధ్య దేవుని స్తుతించిన ఒక మనిషి యుద్ధరంగములో గలడు అని నేర్చుకొన్నాము. ఆలాగే జూడిత్ అనే స్త్రీ తన జనులను శత్రువుల హస్తమునుండి రక్షించిన కథ అపోక్రిపా గ్రంథములో యున్నది.