హాగరు
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
తండ్రి: ఆది. 16:1-12; కుమార: యోహాను 8:31-38, 57-59; పరిశు: గలతీ 4:28-31.
హాగరు శారా దాసిమై ఉండెను. ఈమె శారా సమ్మతి చొప్పున అబ్రాహామునకు కనిన కుమారుని బట్టి శారా ఆగ్రహమునకు గురి అయ్యెను. చివరకు శారా మాట చొప్పున అబ్రాహాము హాగరును, ఆమె కుమారుని నీళ్ళ తిత్తితోను, కొద్ది ఆహారముతోను పంపివేసెను. ఆమె బెయేర్షెబా అరణ్యములో ఎటూ తోచక సంచరించుచున్నది. హాగరు యొక్కకండ్లు దుఃఖమువలనను, విచారమువలనను మూయబడి యుండెను. అయితే, అబ్రాహాము ఇంటిలో పెరుగుటనుబట్టి ఆమె లోపల చూచే శక్తి వినేశక్తి గలవు. ఆలాగే బయటి అవయవములకుకూడ అదేశక్తి గలదు. దేవదూత ప్రసంగపు మాటలు హాగరుతో చెప్పెను. "దేవుడు ఆ బిడ్డ మాట వినెను, భయపడకుము" అని ధైర్యపరచెను.
హాగరు స్థితి
- 1) ఆమె అబ్రాహాము ఇంటినుండి వెళ్ళగొట్టబడెను.
- 2) ఒంటరిగా వెళ్ళుచుండెను.
- 3) అరణ్యములో నీళ్ళులేకయుండెను.
ఈ కష్టములలో ఆమె మరణము యొక్క అంచున ఉండెను. "మిక్కిలి ఆపదలోనున్నప్పుడు దేవునియొక్క సహాయము మనకు వచ్చును" అని హాగరు దృష్టాంతమును బట్టి తెలియుచున్నది. ఆమె మిక్కిలి నిరాశలోయుండెను. ఎటూ తోచక ఏమో పాలుపోక ఉండెను. అయితే, తీరా అపాయము వచ్చిన తరువాత, చివరన దేవుని సహాయము తటాలున దొరుకును.
దేవుడు మన కొరకు ఏమి చేయవలెనో అవన్ని ముందే సిద్ధముచేసి ఉంచినాడు. మనము ఏడ్వనక్కరలేదు. హాగరు కొరకు నీటి ఊటను ముందే సిద్ధముచేసి ఉంచినాడు. మనకు కావలసిన సహాయములన్ని దేవుడు ముందే చేసినాడు. మనము కండ్లు మాత్రము తెరవవలెను. దేవుని సహాయము ముందే ఉండును, ఆ తరువాత కష్టము ఉండును. దేవుడు సహాయము ముందే చేసియుంచినను, కొందరు దానిని పొందలేరు. విచారములో ఉండుదానినిబట్టి పొందలేరు. అయితే ప్రార్థించినపుడు దేవుడు సహాయము చేయుననే నమ్మిక పుట్టును. ఆ వెంటనే దేవుని సహాయము దొరుకును. మోక్షము ఉచితముగా ఇవ్వబడినది. మనము సొమ్ముపెట్టి కొననక్కరలేదు. మనుష్యులు ఇచ్చునదంతా సొమ్ము కొరకే ఇత్తురు. అయితే, దేవుడు ఇచ్చు సమస్తమునూ ఉచితముగానే ఇచ్చును.
- 1. మనిషి తన దుస్థితి తెలిసికొనవలెను,
- 2. ప్రార్థన చేయవలెను,
- ౩. నమ్మవలెను,
- 4. అప్పుడు సహాయము దొరుకును.
నీళ్ళగుంట దగ్గరగానేయున్నది. అలాగే రక్షణ దగ్గరగానే యున్నది. మనము అందుకొనుటలోనే అంతయు ఉన్నది. దూత మాటలు హాగరునకు ఆదరణ కలిగించెను. ఆలాగే దేవుని వాక్యము వలన మనకు ఆదరణ కలుగును, విచారము పోవును. అన్నిటికి విరుగుడు దేవుని వాక్యమే. హాగరు కోరుకొనినది నీళ్ళుగాని ఆమెకు మొదట దూతవలన సహాయము దొరికెను. దేవునియొద్దనుండి వచ్చు సహాయములు మనకు ఎప్పుడూ చాలినంతగా ఉండగలవు. అనగా సమృద్ధిగానే ఉండును గాని మన విశ్వాసమునుబట్టి తీసికొనుట ఉండును. నీళ్ళ గుంటలో నీళ్ళు చాలా ఉన్నవి గాని హాగరు తీసికొనినది, తిత్తి నీళ్ళు మాత్రమే. దేవుడు సమృద్ధిగా ఇచ్చును గాని గిచ్చిపట్టి ఇవ్వడు, ఆయన సహాయమెప్పుడూ చాలనట్లు ఉండదు. అపనమ్మిక, నిరాశ అనునవి గొప్ప పాపములు. ఇష్మాయేలు నీళ్ళు లేనందున ఏడ్చెను. ఆ ఏడ్పే దేవుడు ప్రార్ధనగా ఎంచుకొనెను. ఆ పిల్లవాడు నిజముగానే నీళ్లకొరకు ప్రార్థించియుండ వచ్చును. మనముచేసే ప్రతి ప్రార్ధనను ఆయన ఆలకించును. ఆలాగే మన ప్రతి ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చును. ఆ నమ్మకముతోనే ప్రార్ధన చేయవలెను.
అట్టి స్థితిని ఇక్కడ చేరినవారికి పెండ్లికుమారుడు దయచేయును గాక. ఆమేన్.