అన్న అనుభవము

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)


తండ్రి: ఆది. 30:13, 32:30 49:20; కుమార: లూకా 2:36-38 పరిశు: 1 పేతురు. 4:7.

ప్రార్ధన:- మాతో నిత్యము మాట్లాడుచున్న మా తండ్రీ! మేమిప్పుడు నీ నామమున సమావేశమైనాము. నేడు మేము చేయుచున్న ఆరాధనలోని ప్రతి అంశముద్వారా నీకు మహిమ కలుగునట్లు దీవించుము. మా జ్ఞానము వెలిగించుము, అప్పుడు మరుగైన విషయములు గ్రహింతుము. ఆత్మను వెలిగించుము, అప్పుడు జ్ఞాన నేత్రములకు కనబడని విషయములు వచ్చును. మనస్మాక్షిని వెలిగించుము, అప్పుడు నీ వాక్యము నమ్మగలము. ప్రత్యక్షతను వెలిగించుము, అప్పుడు నీ వాక్యమునందు స్థిరముగానుందుము. నీ వర్తమానమును బట్టి నూతన విశ్వాసములో సాగిపోయే కృప దయచేయుము. ఈ కూటమునకు రాలేని బలహీనులను దీవించుము. రాకూడని వారిని అడ్డగించుము. మా బ్రతుకులో రాకూడని వాటిని రానీయకుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.


అన్న చరిత్రలోని విషయములన్నిటినిబట్టి మన బ్రతుకులను సరిచేసికొందుము గాక! ప్రభువు జన్మించిన ఎనిమిది దినములకు ఆయనను మరియమ్మ, యోసేపులు గుడికి తీసికొని వెళ్ళిరి. బెత్తేహేమునుండి యోరూషలేముకు ఐదుమైళ్ళు దూరము ఉండెను. సుమెయోను అనే భక్తిపరుడు లోకరక్షకుడైన ఈయన కొరకు కనిపెట్టిన వారిలో ఆఖరువాడు. అన్నమ్మకూడ ఆ రక్షణ చూచే భాగ్యము పొందెను. అన్న ఆషేరు గోత్రికురాలు. ఇశ్రాయేలీయులలో 12 గోత్రములున్నవి. ఈ వంశములో ఆషేరు గోత్రములో పుట్టిన పనూయేలు కుమార్తె అన్న ఈమె 7 సం॥లు భర్తతోను, 84సం॥లు దేవాలయములోను నివాస స్ధలము ఏర్పాటుచేసికొని ఉపవాసముండి ప్రార్ధన చేయు స్థితిలోనుండెను. ఇది ఈమెను గూర్చిన కథ. ఇది మూడవ పర్యాయము కనబడుచున్న చరిత్ర. యాకోబు అను భక్తునికి ఆషేరు అనే కుమారుడు ఉన్నాడు. యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా యబ్బోకు రేవువద్ద అనగా పెనూయేలు దగ్గర రాత్రిఅంతా ప్రార్ధనలో ఉండెను.


ఆ చరిత్రను విడిచి ఇంకా ముందుకు నడచిరాగా ఆయన కుమార్తె అన్న గలదు. ఇది ఆదికాండములోని చరిత్ర. ఇది ఆదికాండమునుండి మధ్య పుస్తకములు, ఆ తర్వాత మలాకీ దాటి, బెత్లేహేమువరకు రావలెను. ఈమె ఆషేరు గోత్రికురాలు అనగా పాతనిబంధన చివర కాలమందలి, క్రొత్త నిబంధనలోని మొదటనున్న యాకోబుయొక్కమనవరాలు. ఆషేరుకు ఆశీర్వాదము అనగా భాగ్యమనే భోగమున్నది. ఆషేరు గోత్రములోనివారు భాగ్యవంతులు, ధనికులు. ఈ గోత్రములోనున్న నన్ను భాగ్యవంతురాలందురు అని అతని తల్లి మురుసుకొనెను. భాగ్యవతి, సౌభాగ్యము అని మనము వాడుకొను ఈ పేరులు ఆషేరునుండి వచ్చినవే. ఆ పేర్లు వినవచ్చినప్పుడు ఆషేరు గోత్రము తలంచుకొనవలెను. ఏ విషయములో? లోక సంబంధముగా ఏదైనా అవసరత ఉన్నపుడు ఈ పేరు జ్ఞాపకము తెచ్చుకొండి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతయు ప్రార్ధనలో ఉన్నాడు. పశువులను, మనుష్యులను రేవు దాటించి, తాను ప్రార్ధనలో ఉండెను. ఆ స్థలము పెనూయేలు అని పిలువబడెను. యాకోబు చాలా సమయము ప్రార్ధించినాడు. రాత్రియంతా ప్రార్ధించగా, ఆయనతో పోరాడిన పరలోక వాస్తవ్యుడైన వ్యక్తి దీవించి వెళ్ళిపోయినాడు. యాకోబు భయపడి నేను ప్రభువును ముఖాముఖిగా చూచి ప్రాణము దక్కించుకొన్నాననెను.


పెనూయేలు = దైవసన్నిధి. నీ గదిలో నీవు ప్రార్ధించునపుడు అది దైవసన్నిధే. ఆ యాకోబు వంశములోనుండి వచ్చిన పనూయేలులో నుండి అన్న బైలుదేరెను. అన్న లోకరక్షకుని కొరకు కనిపెట్టి లోపలకు వెళ్ళి, శిశువును చూచెను. ఆమె తాతగారు ప్రభువునుచూచి భయపడెను. గాని అన్న భయపడక సంతోషముతో ఆనందించెను, దేవుని స్తుతించెను అని లూకా వ్రాసెను. మనము ముఖాముఖిగా దేవుని చూడలేము. అన్న భాగ్యవంతురాలే. ఎందుకనగా యాకోబు దేవుని సన్నిధిలో ఉన్నాడు. అట్టి స్థితి అన్నకు అలవాటైనదని జ్ఞప్తి ఉంచుకొనండి.


మానవ జీవితములు రెండు విధములుగానున్నవి.

ఆషేరు దీవెన లోకసంబంధముగా గొప్పది. ఐగుప్తులో యాకోబు ఆలాగు దీవించెను. యాకోబు - "ఆషేరునకు శ్రేష్టమైన ఆహారము (భోజనము) కలదు" అని దీవించెను. అందరూ తినునది సామాన్య ఆహారము. ఆషేరు తినునది శ్రేష్టమైన ఆహారము. ఎంత ధన్యుడు, ఎంత భాగ్యవంతుడు! ఇది యాకోబు దీవెన మాత్రమేకాదుగాని ఆయన ప్రవచనమైయున్నది. మరియు రాజులకు కావలసిన మధుర పదార్ధములు ఆషేరువల్ల వారికి దొరుకును అని ప్రవచించెను. ఒకదానికంటే ఇంకొక దీవెన ఎక్కువగానే కనిపించుచున్నది.


తనకునూ, ఇతర రాజులకును కావలసిన శ్రేష్టమైన ఆహారము ఆషేరు దగ్గర ఉండెను. ఆ స్థితి అన్నలో కనబడుచుండెను. తరువాత మోషే వచ్చి, అన్ని గోత్రములను దీవించెను. ఆషేరును ఎక్కువగా దీవించెను. “ఆషేరు తన పాదములు తైలములో పెట్టుకొనగల ఎక్కువ తైలముగలవాడై యుండును.” అనగా ఆషేరు ఎక్కువ కటాక్షము పొందెను అని అర్ధము. సాధారణముగా తైలమును తరచుగా తలకు రాస్తాము. పాదములకు ఎప్పుడోరాస్తాము. తలకు రాయగా, ఇంకా మిగిలిన నూనె పాదములకు రాస్తాము. అయితే, ఈ గోత్రములో తైలము పాదములకు పెట్టుకొనునంతగా దొరుకుచున్నది.

ఆషేరునుండి పనూయేలు వరకు వచ్చిన దీవెన, అక్కడనుండి మోషేవరకు సాగి, మలాకీ దాటి, బెళ్లేహేము వరకు వచ్చి, అచ్చటినుండి అన్నవరకు రాగా, ఆషేరు నుండి అన్నవరకు ఈ దీవెన ప్రయాణించిన కాలము 1800 సం॥లు అయినది. మనమును ఆ మొదటి జీవితము జీవించుచున్నాము అని దా॥కీర్తన 23వల్ల (నూనెతో నా తల అంటియున్నావు) తెలుసుకొనుచున్నాము. ప్రభువు పరిసయ్యుని ఇంటిలోనికి రాగా, పాపాత్మురాలు ఆయన పాదములకు అత్తరు పూసినది. ఆమె ఎట్టి స్త్రీయో ఈయనకు తెలియదా? అని కొందరు అనుకొన్నారు. ఆయన పాదములకు ఆమె పూసిన అత్తరు విలువ గొప్పది. ప్రకటనలో ఉన్నట్లు (అపరంజిని పోలిన పాదములు), ఆమె పూసిన అత్తరు కంటే ఆయన పాదములు మహా విలువైనవి. ఆహారము, మధుర ఆహారము, తైలము; వీటినిబట్టి అవి ఇచ్చిన ప్రభువును పూజించాలి. లేయా, పనూయేలు, అన్నలవంటి దీవెనలు మనకునూ కావాలి. ఆషేరు గోత్రము పాలస్తీనా దేశములోని ఏ ప్రాంతములో నివసించునో ఆ స్ధలము తవ్వితే ఇనుము, ఇత్తడి దొరుకును.

లేయా, యాకోబు, మోషే చెప్పిన సంగతులు, ఇచ్చిన దీవెనలు ఆషేరు విషయములో ఎంతో నిజములైయున్నవి. ప్రవచనమువలన విశ్రాంతి, బలము కలుగును. తినవలసినది తిని, వ్యాపారానికి ఇత్తడి, ఇనుము దొరికితే మనసుకు బలము, సంతోషముగదా! ఎంత ధన్యత! పాత నిబంధన ముగించినాము, క్రొత్త నిబంధన ఆరంభించినాము. మధ్య పనూయేలు, ఈయన కుమార్తెయైన అన్న ఉన్నారు. వంశపారంపర్యముగా చూచినపుడు అన్నకు ఆహారము కొదువయై యుండకూడదు. ఇనుము, ఇత్తడికి కొదువయై యుండకూడదు. ఈ ఆషేరు గోత్రికురాలికి తిండికి తక్కువలేదు కానీ, ఈమె రెండవ వరుస అవలంభించినది. అనగా ఆత్మీయ జీవనమునకు అవసరమైన వరుస అవలంభించినది.


అన్న ఏడు సం॥లు బాగా తిన్నది. భర్త వెళ్ళిపోగానే, ఆమె దేవాలయమైన దేవుని ఇంటిలోఉండి ఆహారము మానింది. ఇదే గొప్ప భాగ్యము. ఈమె ముఖ్యమైన పని ఉపవాసము. ఆషేరు గోత్రములో పుట్టి శ్రేష్టమైన పదార్ధములు గలదైనను, ఇనుము, ఇత్తడి గలదైనను, ఉపవాసమును వీటికంటె ఎక్కువగా ఎంచుకొన్నది. గనుక ఈమె చిక్మలేదు, వణకలేదు, బాధపడలేదు. మోషే ఏలియాలు 40 దినములు ఉపవాసమున్ననూ, పై మూడును వారికి కలుగలేదు. వారివలె అన్నకుకూడ గొప్ప బలము వచ్చినది.


ఏలియా, మోషే, అన్న; వీరు ముగ్గురు ఒక వరుస.
అన్న

అన్నవలె ఈ ఐదు అనుభవములు కలిగియున్న యెడల, అన్న ధన్యతను, వారసత్వమును మనమును అందుకోగలము. ఆమె ఉపవాసములోనే తన సమయమును గడపలేదుగానీ ప్రార్ధనలోను ఉన్నది. ఏమి ప్రార్థించినదో తెలియదు, గానీ గొప్ప గొప్ప ప్రార్ధనలు చేసినది. ఆమె తాతగారైన యాకోబు యబ్బోకు రేవువద్ద ఒంటరిగా రాత్రంతయు ప్రార్థించెను. అన్న రాత్రి, పగలుకూడా ప్రార్ధించెను. ఆయన ఒక్క రాత్రే గాని ఈమె అనేక రాత్రులు ప్రార్ధించెను. యాకోబు పగలు ప్రార్థించలేదు. ఈమె పగలు ప్రార్థించినది. యాకోబుకంటె ఈమె ఎంత ధన్యురాలు! యాకోబు ఒక్క రాత్రేగానీ ఈమె అనేక రాత్రులు, అనేక పగళ్ళు ప్రార్ధనలో గడిపినది.


అన్న తన భర్తతో గడిపిన 7సం॥లు సంతోషకరములా? లేక భర్తలేకుండా ముసుగువేసికొని గడిపిన 84సం॥లు సంతోషకరములా? ముసుగువేసికొని గడిపినవే సంతోషకర సంవత్సరములు. పగలును పోలినవి 7 సం॥లు, రాత్రిని పోలినవి 84 సం॥లునైయున్నవి. 84 సం॥లు గడిపిన వయస్సు అంతయూ కలిపినా అది రాత్రి గనుక అది అంతయు ఒక రాత్రికే సమానము. తాతగారు పడిన ఒక్క రాత్రి ప్రయాసకు అది సాదృశ్యముగా ఉన్నది. అన్న చరిత్ర ఎరిగినవారు, అన్న ఎన్ని మంచి పాఠములు నేర్పించినదంటారు! మీరును రోజుకు ఒక్క పర్యాయమైన రాత్రి ఒక గంట, పగలు ఒక గంట దేవుని సన్నిధిలో ఉంటే, యాకోబుకు, అన్నకు దొరికినట్లు మనకును దొరుకును. పాతనిబంధనలోని ఒక పురుషుడు, కొత్తనిబంధనలోని ఒక స్త్రీ ఆలాగుచేయగా మనమెందుకు చేయకూడదని పౌరుషముతో మీరును చేయండి.


అన్నకు దొరికిన శరీరదీవెనలు, ఆత్మసంబంధమైన దీవెనలు మీకును దొరుకును గాక! ఆమేన్.