సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
లెమ్ము, తేజరిల్లుము
"లెమ్ము, తేజరిల్లుము" - యెషయా 60:1-3; లూకా. 10:17-20; కొలస్స. 2:1-5.
దేవుడు తన ప్రజలను అన్య జనాంగములమధ్యకు తీసికొని వెళ్లి అక్కడ మహిమ పొందిన సంగతి బైబిలంతటిలో కనబడుచున్నది. దావీదు ఇది వరకు ఇశ్రాయేలీయుల మధ్యనే తిరుగుచు సౌలు ఇంకను తరుముచున్నందున ఇశ్రాయేలీయుల దేశమునుండి పారిపోయినాడు. ఈవేళ శత్రువులైన ఫిలిష్తీయుల దేశమునకు పారిపోయినాడు. ఎక్కడకు పోయినా ఆయనను దేవుడు కాపాడినాడు. ఆయన తన ఏర్పాటులో ఉన్నవారిని, వారు ఎక్కడ ఉన్ననూ కాపాడును. వారిని తన మహిమ కొరకే కాపాడును ఆ పిదప వారికి అత్యధిక ఆశీర్వాదములను అనుగ్రహించి వెలిగించును. ఆలాగున అన్యజనులలో దేవుడు వెలిగించిన, పాతనిబంధన సంఘ పితరుల జీవితములను నేడు ధ్యానించెదము.
1. అబ్రాహాము:- అబ్రాహాము విశ్వాసమును విడిచిపెట్టి అన్యరాజున్న దేశమునకు వెళ్లినాడు. ఆది. 20:7 ఇందులో అబ్రాహాము హెబ్రోనునుండి బైలుదేరి అబీమెలెకు ఉన్న దేశములోనికి రాగా, శారా నిమిత్తము ఆ రాజుగారి ఇంటిలో అందరికి జబ్బు చేసినది. అప్పుడు దేవుడు ఆ రాజుకు కలలో కనబడి, అబ్రాహామును పిలిపించు అతడు ప్రార్ధనచేసిన నీ ప్రజలు బాగవుదురని చెప్పెను. గనుక దేవుడు అక్కడ తన ప్రభావమును చూపించెను. ఒక గదిలోని దీపమును మరియొక గదిలో పెట్టినను వెలుగును.
అబ్రాహామును గెరారు దేశములో పెట్టినను అక్కడకూడా వెలిగెను. దేవుని ప్రజలు వారు ఎక్కడ ఉంటే అక్కడ వెలగవలెను. ఒకానొకప్పుడు దేవుడు తన ప్రజలను తన ప్రజలమధ్యనుంచక అన్యుల మధ్య ఎందుకు ఉంచును? జవాబు-
- 1. తన ప్రజలు అన్యులమధ్య వెలగవలెను. దైవజనుల పని వెలుగుట.
- 2. దేవుడు తానే స్వయముగా బైలుపడుటకు (ఇది దేవుని పని).
- 3. అన్యులు ఇది తెలిసికొని సహాయము కొరకు దేవునియొద్దకు రావలెను (అన్యులపని).
సిద్ధాంతము:- దేవుని బిడ్డలు ఎక్కడబడితే అక్కడే వెలగవలెను.
అన్యులు దేవునిని తెలిసికొనుటకును, అబ్రాహామునకు పని కల్పించుటకును దేవుడతనిని ఇతర దేశమునకు పంపెను. పురుగు దీపము ఆర్పివేయుటకు రాగా దీపము దానిని కాల్చివేసినట్లు దైవ ప్రజలు తమ్మును చంపవచ్చిన శోధనలు, కష్టములు మొదలగు వాటిని తమ వెలుగుద్వారా ఆర్పివేయవలెను. దేవుడు తన ఉద్దేశమును నెరవేర్చుకొన్న తరువాత అబ్రాహామును పాలస్తీనా తీసికొని వెళ్లెను. సంఘములోనికి వచ్చేటప్పుడే ప్రభువు మనకు వెలిగే వరము ఇచ్చివేసినాడు. కొంతమంది నేను లోకమునకు ఎందుకు వచ్చినానో అని అనుకొందురు. పై మూడు పనులు జరుగుటకు మనము ఈ లోకమునకు వచ్చినామని గ్రహించవలెను.
2. ఇస్సాకు చరిత్ర:- ఆది. 26వ అధ్యాయము. కరువు కాలములో అన్యుల దేశమునకు వెళ్లెను. 28వచనము. దేవుడు ఇస్సాకునకు తోడైయున్నాడని అన్యులు తెలిసికొన్నారు. వెలుగుట, బైలుపడుట, తెలిసికొనుట, ఇస్సాకుయొక్క అభివృద్ధి దీపమువలన అన్యులు దేవునిని తెలిసికొనిరి. అబ్రాహాము కాలములో దేవుని స్వప్న ప్రత్యక్షతనుబట్టి అన్యులు దేవుని తెలిసికొనిరి మనము ప్రతి దినము అభివృద్ధిలో ఉండవలెను. విశ్వాసులు స్వజనుల మధ్యను, పరజనుల మధ్యను వెలగవలెను. సౌఖ్యకాలములలోను, కష్టకాలములలోను వెలగవలెను. నేను వెలుగుచున్నానా? నాద్వారా దేవుడు బెలుపడుచున్నాడా? అని ప్రశ్నించుకొనవలెను.
3. యోసేపు:- అన్నలు పడవేసిన గుంటనుండి పోతీఫరు ఇంటివరకు, అక్కడనుండి చెర వరకు, అక్కడనుండి సింహాసనము వరకు, తాను ఉన్న అన్నీ స్థలములలో వెలిగినాడు. ఐగుప్తీయులు శత్రువులపైనను, వారి మధ్యను, ఒక స్త్రీ శత్రువైనను, ఎక్కడబడితే అక్కడే వెలిగినాడు. యోసేపు అనగా అభివృద్ధి అని అర్ధము. మనమందరమును యోసేపులమై యుండగలము. యోసేపు అన్నదమ్ములతో “మీరు నన్ను ఇక్కడకు పంపలేదు, దేవుడు పంపినాడు” అనెను. యాకోబు సంతతి యోసేపు దగ్గరకి వచ్చిన తరువాత, యోసేపు ఆయా కష్టములలో పడినప్పుడు దేవుడెందుకు ఊరుకున్నాడో తెలిసినది. యోసేపుయొక్క అభివృద్ధి కొరకును, తన బిడ్డల (దేవుని బిడ్డల) అభివృద్ధి కొరకును ఊరుకొనెను. హెబ్రోనునుండి యోసేపు ఊరి బైటకు అనగా దోతానుకు వచ్చినప్పుడే అతనికి చాలా కష్టమైనది. అయినను దేవుడు ఊరుకున్నాడు. ఈ బోధ మన కొరకే అయి ఉన్నదని గ్రహించి, మన కష్టములలో ఊరుకొనవలెను. అన్నలు కలుగజేసిన కష్టములు, అతనికి తెలియును. అయినను దేవుడు చేసినాడని చెప్పెను. ఈ మూడు కథలలో మూడు వెలిగింపులున్నవి.
4. మోషే:- ఆదికాండము విడిచి, మోషే వద్దకు వెళ్లుదము. తన ప్రజల విజ్ఞాపన దేవుడు ఆలకించి మోషేను పంపగా, 10 అద్భుతముల మూలమున ఐగుప్తీయులు దేవునిని తెలినికొనిరి. తమకు విడుదల కలుగబోవుచున్నదని ఇశ్రాయేలీయులు గ్రహించిరి. పస్కాను ఆచరించిరి. ఐగుప్తీయుల నగలను తీసికొని వెళ్లిరి. ఇన్ని కష్టములలో దేవుడెందుకు ఊరుకున్నాడు?
జవాబు: లోక జనులందరు ఆయనను గురించి తెలిసికొని భూలోకమంతా తన మహిమను తెలిసికొనేటందుకు ఊరుకొనెను.
- 1) దేవునికి మహిమ రావలెను. ఐగుప్తీయులు హెబ్రీయుల దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడే గొప్పవాడనిరి.
- 2) దేవుని ప్రజలు దేవుని ప్రజలైయుండవలెను.
ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల యెడల అభిమానులై ఉన్నారు గనుక నగలు ఇచ్చినారు. దేవుడు తన ప్రభావమును చూపుకొనెను. నా చేయిచాపి ఐగుప్తీయులలో నుండి మిమ్మును విడిపిస్తానని మోషేతో చెప్పి, తన చేతిని చూపకుండా, ఐగుప్తేయుల చేతులు ఇశ్రాయేలీయులకు సహాయము చేయుటకు చాపుట అను క్రియద్వారా నెరవేర్చుకొనెను.
5. ముగ్గురు యౌవస్థులు:- ఇశ్రాయేలీయులు బబులోనుకు వెళ్లిరి. "అగ్నిగుండములో ముగ్గురు పడవేయబడిరి. ఎందుకు? దేవుని ప్రజలనుబట్టి నెబుకద్నెజరు గొప్ప పాఠము నేర్చుకొనుటకు. దాని. 3:26. మహోన్నతుడైన దేవుని సేవకులారా! ఈ విధముగా రక్షించుటకు మరీ ఏ దేవుడు లేడనెను. దేశరాజులకు గొప్ప పాఠము తన బిడ్డలద్వారా నేర్పెను. అగ్నిలోని బిడ్డలు వెలుగై యున్నారు. ఈ ఐదు కథలలో పై మూడు అంశములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నందున తన భక్తులకు హానిరాదు. తనకు మహిమ రావలెను. తన బిడ్డలకు ఒక మేలు రావలెను. శ్రమపెట్టిన వారికి పాఠము నేర్పవలెను. ఈ మూడింటినిబట్టి విశ్వాసులు శోధనలోనికి వెళ్లుదురు. మనకు ఎన్ని కష్టములు వచ్చినను ధైర్యముగా ఉండి, పౌలుచెప్పిన రీతిగా “నేను శ్రమలయందు సంతోషించుచున్నాను” అనవలెను.
ప్రభువు - నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి, ఆనందించుడి అని చెప్పినారుగదా! మత్తయి. 5:1-12; అపో. 9:15. యోహోవా దేవుడు ఇశ్రాయేలీయులను శ్రమలోనికి నడిపినారు, ఎందుకనగా వారిని విడిపించి వారి స్తుతులు అందుకొనుటకే.
ఈ 5 చరిత్రలు, 3 అంశములు తలంచుకొని మనము దేవునిని స్తుతించుచూ అభివృద్ధి పొందవలెను. దేవుడు ఈ కొద్దిమాటలు దీవించునుగాక! ఆమేన్.