సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

శిరో రక్తధార - హస్త రక్తధార



యోహా. 3:14-15.


సిలువధ్యానపరులైన వారలారా మీకు శ్రమకాదుగాని దీవెన కలుగుగాక, క్షేమము కలుగుగాక. మంచి శుక్రవారమునకు 'మంచి' అను పేరు వచ్చినది. అది అసలే మంచి శుక్రవారముకాదుగానీ ప్రభువుయొక్క సిలువనుబట్టి ఆ పేరు వచ్చినది. అయితే ఆయన సిలువలోనుండి ఆయనకు శ్రమయేగాని మనకు మంచియే వచ్చినది. గత బుధవారము శిరో రక్తధార గూర్చి కొద్దిగా వివరించితిని. ఈవేళ హస్త రక్తధారను గూర్చి ధ్యానించుకొందము. శిరస్సునకు, హస్తములకు సంబంధమున్నది. అట్లే శిరస్సునకును, పాదములకును సంబంధమున్నది.


శిరస్సు:- చెడ్డ తలంపులు శిరస్సులో పుట్టును. శిరస్సునందు కలిగిన తలంపులను నెరవేర్చుటకై చేతులు పనిముట్లుగా ఉన్నవి.


ఉదా:- శిరస్సులో కోపము వచ్చినయెడల వెంటనే చేతులతో ఒకరిని కొట్టుదురు. శిరస్సులో అసూయ కలిగిన యెడల చేతులు ఒకరిని కొట్టును. శిరస్సులో పగలున్నయెడల చేతులు ఒకరిని కొట్టును. చేతులు కొట్టునేగాని ఆ చేతులు కొట్టుటకు శిరస్సుకు సంబంధము కలుగును. ఒక్కొక్కప్పుడు రెండు చేతులతో కొట్టుదుము, లేక చేతులతో త్రోసివేతుము. తుపాకి వాడునప్పుడు రెండు చేతులు వాడుదురు. కత్తి వాడునప్పుడు అట్లే. కాబట్టి మానవుడు పాప విషయములో రెండు చేతులు వాడుచున్నాడు. శిరస్సుయొక్క పాపపు తలంపులు నెరవేర్చుటకై చేతులు ఉపయోగింతురు.


ఒక కథ:- అమెరికాలో ఒక ఉపాధ్యాయడు బాలురకు అసూయను గూర్చి నేర్చుటకు ఒక దృష్టాంతమును చూపెను. ఇద్దరు పిల్లలను ఒకచోటే కూర్చుండబెట్టి ఒక పిల్ల చేతులో పెద్ద రొట్టె, రెండవ పిల్ల చేతిలో చిన్నరొట్టె పెట్టగా చిన్న రొట్టె కలిగిన పిల్ల పెద్ద రొట్టెగల పిలయొద్ద లాగుకొనెను. ఈ ప్రకారము తలయెుక్క కోర్కెలు నెరవేర్చుటకై రెండు చేతులు ఉపయోగించుచున్నాము. కాబట్టి యేసుప్రభువుయొక్క రెండు చేతులలో మేకులు కొట్టిరిగాని అవి మానవులమైన మన పాపపు చేతులలో కొట్టవలసినది. ప్రభువు మనకు బదిలీగా వచ్చినారు గనుక మనశిక్షను ఆయన పొందెను.


క్రిందటి బుధవారము శిరస్సుయొక్క దోషములను వివరించితిని. ప్రభువు శిరస్సుమీద పొందిన ఆ శిక్షను మనము పొందవలసినది. కాని ఆయనే పొందెను. ఆలాగుననే చేతులలోకూడా ఆయనే పొందెను. ఈ రెండు అవయవములలో మన నిమిత్తమై ఆయన శ్రమ పొందెను. గనుక ఈ కాలములో మనము అది తలంచుకొని వందనములర్పించవలెను. శిరస్సునుండి కారు రక్తము దేహము, కాళ్ళు, చేతులకు ప్రవహించును. అట్లే శిరస్సు, శిరస్సులోపుట్టిన చెడ్డ తలంపులు శరీరమంతటిలోకి వ్యాపించును. ఆ సంగతి మన ఇతర అవయవములు చెయుచున్న దుష్కార్యములనుబట్టీ తెలియవచ్చును. చేతులతో మరియొక పని; చేయుచున్నాము. ఇతరులకు చెడ్డ ఉత్తరాలు వ్రాయుచున్నాము. చేతులదేకాదు ఆ పని శిరస్సు పనికూడాయై ఉన్నది. చేతులతో ఇంకొక దుష్కార్యము చేయుచున్నాము. ఇతరులకు, బీదలకు చేయవలసిన ధర్మము చేయక బిగపట్టుచున్నాము. అది ఒక దోషము. అదియు శిరస్సుయొక్క దోషమే. మానవులు ఇతరుల ఆస్తివైపు చేతులుచాపి దొంగతనములు చేయుచున్నారు. ఇది మరియొక దోషమే. ఈ ప్రకారముగా మన చేతులద్వారా జరుగుచున్న దోషమంతటికి ఆయన చేతులలో శిక్ష పొందెను. గనుక ఆయనకు వందనములు ఆచరింపవలయును.


శిరస్సులోని రక్తము ఇతర అవయవములన్నిటికి శరీరముయొక్క చివరివరకు వ్యాపించుచున్నట్లు మనిషియొక్క జీవితాంతమువరకు ఈ చెడుకూడా వ్యాపించుచున్నది. ఆ గొప్ప శిక్షను ప్రభువు అనుభవించినాడు గనుక ఆయనకు స్తోత్రములు చెల్లించుటకై ఈ శ్రమకాల ధ్యాన దినములు ఏర్పాటు చేయబడినవి. మొదట స్తుతించుటకుకాదుగానీ నా పాపముల నిమిత్తమై శ్రమపొందినావని పాపములు ఒప్పుకొని ఆ తరువాత స్తుతించవలెను. పాపములు లోపట పెట్టి స్తుతిచేసినందువల్ల దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించుట అనుగొప్ప నేరమగును. గాన తల, చేతులద్వారా చేసిన పాపములను ఒప్పుకొని, రెండు ఒప్పుదలలో రెండు స్తుతులు చేయవలెను. చేతులలో ఆయన మేకులు పొందినట్లు ఒక కీర్తన ఉన్నది. 22వ కీర్తన 16 వ వచనము.


ప్రార్ధన:- యేసుప్రభువా! నీ శిరస్సులో మేకులు దిగగొట్టినప్పుడు నీ మనుష్య శరీరమునకు ఎంతబాధ! ఆ మేకులు మా తలలోనే గ్రుచ్చుకొంటే ఎంత బాధో మాకు తెలుస్తున్నది. అయితే ప్రభువా! మా తలలో పాపపు తలంపులు పుట్టినప్పుడు మేకుల వలన కలిగిన బాధకంటే ఎక్కువ బాధ మాకు ఉండవలసినది. అప్పుడు ఆ పాపపు తలంపు ఉండదు. మాలో చెడ్డ తలంపులు కలిగినప్పుడెల్లా అట్టి బాధ మాకు కలిగిస్తే మాకెంతో మేలు. అట్లే మా చేతులు, తలయొక్క తలంపులు నెరవేర్చినప్పుడు అట్లే బాధ కలిగి ఉండవలెను. అట్టి బాధ మాకు అవసరము. శరీరమునకు కలిగే బాధకంటే మనసునకు కలిగే బాధ అవసరము. కాబట్టి ప్రభువా! నీ సిలువధ్యానము బాగుగా చేసేటట్లు ప్రేరేపణ కలిగంచుము. అంతరార్థములతో ధ్యానము చేసేటట్లు ప్రేరేపించుము. ఈ మనవులు పరలోకపు తండ్రిని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.