సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

శిరోరక్తధార



కీర్తన. 116:1; యోహా. 12:1; 1కొరింథి. 6:14


ప్రార్ధన:- పైనుంచి వచ్చిన మా తండ్రీ! క్రింద భూమిమీద కొంతకాలము శ్రమ పడిన ప్రభువా! ఆ శ్రమలనుగూర్చి మా జీవితకాలమంతయు ధ్యానించుటకు సమయము ఇచ్చిన ప్రభువా! నీ శ్రమలను ధ్యానించుట మాకు శ్రమకాదుగాని, సంతోషమే. కాబట్టి నీకనేక వందనములు. ఈవేళకూడ ఆలాగు ధ్యానించుటకు మమ్ములను ప్రేరేపించుమని సిలువమీదనున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్.


ప్రియులారా! ధ్యానపరులారా! మనలను తన సిలువ ధ్యానములోనుంచిన ప్రభువు జీవిత చరిత్ర ధ్యానించుటకు నేడు మనకు కృప కలిగియున్నది. గనుక ధ్యానము చేయుదము. పైనుండి వచ్చిన యేసుప్రభువుయొక్కసిలువ చరిత్ర పైనుండియే ధ్యానించుదము. సిలువవైపు మనము చూస్తు ఉండగా కొన్ని రక్త ధారలు, మనకు కనబడుచున్నవి. మొదటి రక్తధార శిరో రక్తధార, రెండవది హస్త రక్తధార, మూడవది పాద రక్తధార, నాలుగవది ఉదర రక్తధార.


1. శిరో రక్తధార:- మనము ఈ 4 రక్తధారలను గురించి ధ్యానించుదము. శిరో రక్తధార అనగా ఆయన తలలోనుండి ప్రవహించిన రక్తధార. నేను మీకు ఉపదేశమును చేయు నిమిత్తము ఇక్కడ ఒక సజ్జనుని చూపించుచున్నాను. ఆ ప్రక్కను ఒక దుర్జనుని చూపించుచున్నాను. మధ్యను యేసుప్రభువును చూపించుచున్నాను. ఈ సజ్జనుడు తన సజ్జనత్వమును కనబర్చినందుకు కఠినమైన శ్రమ ఈలోకములో పొందుచున్నాడు. అక్కడ దర్జనుడు ఉన్నాడు. అతడుకూడా శ్రమపడుచున్నాడు. ఇతడు తన సజ్జనత్వమువలన శ్రమపడుచున్నందుకు సంతోషించుచున్నాడు. ఆ దుర్జనునికి ఆ సంతోషములేదు. తన దుష్టత్వము, చెడుగు మాత్రమే జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఈ సజ్జనుడు మంచి తలంపే తలంచేవాడు. ఇతరులను గురించి మేలు ఎక్కువగా కోరేవాడు. తన చూపువల్ల ఇతరులమీద తనకు జాలి ఉన్నదని కనబర్చేవాడు. ఈ సంగతులు విన్నందువల్ల ఇతడు ఇతరులయెడల జాలి గలవాడనియు, దుర్జనుడు ఇతరులతో కలసి కలహించువాడనియు కనబడుచున్నాడు. ఈ సజ్జనుడు అందరితోను మాట్లాడునప్పుడు మంచి మాటలేగాని అపవిత్రమైన మాటలు మాటలాడువాడు కాడు. అతని శిరస్సు మంచిది, క్షేమకరమైన తలంపులుగలది, జాలి గల చూపు గలది, మొర ఆలకించే చెవి గలది. అందరితో బాగా మాట్లాడే మాట్లాడగల నాలుక గలవాడు. కాబట్టి అందరు మెచ్చుకొంటారు. ఇతడు తన తలకు కిరీటము ధరించుట తగినవాడు. ఆ చివరిలో నున్నవాడు ఇవి లేనివాడు. క్షేమము కోరే తలంపులు, చూపులు, మాటలు ఇతరులయెడల దయచూపే చూపు, ఇతరుల మొర్రను జాలితో ఆలకించే చెవి, మంచిమాటలు పలికే నాలుక కలవాడు కాడు. ఇతని ఐదు అవయవములకు మంచిచేయు శక్తిలేదు.


యేసుప్రభువు నీతిపరుడైన మనుష్యుడు, దేవుడు. ఈ సజ్జనునికి రావలసిన మెప్పుకంటే ఈయనకు ఎక్కువ మెప్పు రావలసి ఉన్నది. ఆలాగున రాక ఆయనకు కిరీటము వచ్చినది. ఆ కిరీటము మెప్పు కలిగించే రాజ కిరీటముకాదుగాని రక్తము కార్చే ముండ్లకిరీటము. ఆ ముండ్ల కిరీటము మన నిమిత్తము పొందినాడు గాని తన నిమిత్తమై కాదు. ముండ్ల కిరీటమనగా తుమ్మ ముండ్లు, ఈత ముండ్లు కావు. మేకులతో చేయబడిన ముండ్లు. ఆలాగున ఆయన శిరస్సునుండి రక్త ప్రవాహము స్రవించినది.


విశ్వాసికి ఆ శిరో రక్తమువలన మంచి తలంపులు, మంచి చూపు, మంచి వినికిడి, మంచి మాటలు వచ్చును. ఎందుకంటే ఆయనకు అది శ్రమ కలిగించే రక్తముగాని మనకు శుద్ధిచేసి, శాంతిని కలిగించే రక్తము. కాబట్టి ఇప్పుడు మనము ధ్యానించవలసినది ఏమనగా రక్తము కార్చిన తండ్రీ! మా తలంపులను, చూపును, మాటను, వినికిడిని, శుద్ధిచేయుము. నీకు వందనములు. అట్లు తలంచి మనము వందనములు చేయుట తండ్రికి చాలా ఇష్టము. ఇప్పుడు ఈ శిరో రక్తధార గురించి విన్నారు. గనుక కొన్ని నిమిషములు ధ్యానించుకొందము.


కండ్లు మూసికొని శిరస్సు మీద నున్న కిరీటమును తలంచుకొని నా వినికిడి, తలంపు, చూపు, మాటను మార్చుటకు రక్తము చిందించిన యేసుప్రభువా! నీకు స్తోత్రము అని ధ్యానించండి. అట్టి ధ్యానమువల్ల సంతోషము రావలెనుగాని, దుఃఖము రావలదు. సిలువవైపు చూస్తు శిరో రక్తధారవైపు చూస్తు, ధ్యానించండి, స్తుతించండి.


పాట: మనసా యేసు మరణబాధ॥ 4వ చరణం ముండ్లతోడ నొక కిరీటమల్లి ॥మనసా॥