సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ఆమేన్



“ఆమేన్”యై యున్న తండ్రీ! నీకు వందనములు. అనాదికాలమందు ఆలోచించినట్లు ఆదిని సృష్టిని కలుగజేసి పూర్తిచేసినావు. అప్పుడును ఆమేన్ అయి ఉన్నావు. ప్రార్ధన పూర్తియైనప్పుడు ఆమేన్ అన్నట్లు ప్రార్ధన నెరవేర్పు అయినప్పుడును ఆమేన్ అనవలెను. సృష్టిపూర్తి అయినందున ఆమేన్ అనవలెను. సువార్త ప్రకటనలో రక్షణ వాగ్ధానము పెట్టి ఇచ్చినావు, నెరవేర్చినావు గనుక ఆమేన్ అయినావు.


సృష్టిని ఇచ్చి ఆమేన్ అయినావు రక్షణ వాగ్ధానము ఇచ్చి నెరవేర్చిన నీవు ఆమేన్ అయియున్నావు. లవొదికయ సంఘమునకు ఆమేన్ అయి ఉన్నావు. అంతకుముందే ఆమేన్ అయినావు. నీవు లేకుండ ఏమియు కలుగలేదు. యోహాను 1వ అధ్యా॥లో "నీవు లేకుండ సృష్టి కలుగలేదు" అని ఉన్నది. నీవు ఆమేన్ అయి ఉన్నావు. నీవు లేకుండా ఏ సంగతి కలుగలేదు. నీవు తెలియపర్చకపోయిన ఏ సంగతి బయలుపడదు గనుక నీవు ఆమేన్ అయి ఉన్నావు.


పాతనిబంధనలో ఆమేన్ అయి ఉన్నావు. సంఘ నావ కట్టకముందు చెక్క నావ కట్టి, రక్షితులను బైటికి తీసికొని వచ్చినావు. అక్కడ రక్షణ నెరవేరినది అది ఆమేన్. అక్కడనే అది నెరవేరినది. నీవు ఒక జనాంగమును ఏర్పాటు చేసికొని, నీవలన వాగ్దానము నెరవేర్చుదునని చెప్పి, నీ వాగ్ధానము నెరవేర్చిన నీవు అప్పుడు ఆమేన్ అయియున్నావు. 4వేల సం॥ల క్రితము కనిపెట్టిన వారికి నీ నెరవేర్పు తెలియదు. వాగ్ధాన నెరవేర్పుగా ఒకరోజు తొట్టెలో పండుకొన్నావు. తొట్టిలో పండుకొన్నావు గనుక అక్కడ ఆమేన్. సిలువలో నీవు సమాప్తము అన్నావు. అంతయు సమాప్తము. రక్షణ కార్యము సంపూర్తియైనది. సృష్టి సమాప్తమైనది, అన్నట్లు అక్కడ నీవు సమాప్తి చేసినావు. అది ఒక ఆమేన్ అయి ఉన్నది.


నా రాజ్యము వచ్చువరకు మాలో కొందరు చావరన్నావు. ఆలాగే ఆత్మ కుమ్మరింపు అయినది. సంఘము స్థాపించినావు. నిన్నుబట్టి సంఘస్థాపన కుమ్మరింపు జరిగినది గాన నీవు ఆమేన్ అయినావు. 20వందల కాలములో ఎన్నో ప్రార్ధనలు చేయగా వారు భూలోకములో “ఆమేన్” అన్నారు. నిజమేగాని నీవు పరలోకములో ఆమేన్ అనకపోతే ఇక్కడ భక్తులన్న ఆమేన్ వల్ల ప్రయోజనములేదు. ప్రయోజనముకరమైన ప్రార్ధనలు అన్నియూ, "ఆమేన్" అని నెరవేర్చిన నీకు వందనములు.


ఆదినుండి సంఘకాలము మొదలుకొని, లవొదికయ కాలము వరకు భక్తుల ప్రార్ధనలు నెరవేర్చుచున్నావు. అన్నిటికి నెరవేర్పు అయియున్నా “ఆమేన్”. అయియున్న నీ ద్వారానే వేడుకొనుచున్నాము. ఇక్కడ నేర్చుకొనే పాఠములకు ఆమేన్ అనుకొనకపోతే లాభములేదు. నీవు ఇక్కడ నిలువబడి మా ప్రార్ధనలన్ని ఆమేన్ గా మార్చుచున్నావు వందనములు. రాకడ కాలములో మేఘముమీదకు వెళ్ళగలిగితే అక్కడకు వెళ్ళి మా ప్రార్థనలన్నిటికి ఆమేన్ అందుము. అందరికి రేప్చర్ సిద్ధపర్చబడియున్నది గాని ఎవరు సిద్ధపడగలరో వారిని సిద్ధపర్చుము.


రేప్చర్ కు వెళ్ళలేని వారిని మరణముద్వారా సిద్ధపర్చుము. నీ కృప రెండు గుంపులకు అనుగ్రహించుము. ఇక్కడ ఉన్నవారిలో సజీవుల గుంపు ఎవరో, మరణముద్వారా సిద్ధపడు మృతుల గుంపు ఎవరో నీకు తెలుసు. గనుక సిద్ధము చేయగలవు. ఆదినుండి ప్రకటన వరకు నెరవేరిన సంగతులన్ని మా బైబిలులో ఆమేన్ అని వ్రాసికొనవలెను. మాకు ఆమేన్ అర్ధము తెలియకపోయినా, నీవు "ఆమేన్" అని ప్రార్థించినావు ఆలాగే "ఆమేన్" అర్ధము. ఇప్పుడు తెలిపినావు. మా ముఖ్యప్రార్ధనయైన రేప్చర్ లో మాకు ఆమేన్ గా నుందువనియు; అందు మేము "ఆమేన్" అగునట్లుగా దీవించుమని వేడుకొనుచున్నాము. సైతాను, పాపము, నైజ శ్రమలు, మరణము మొ॥వాటిని జయించినావు. ఆ విధముగనే చెడుగును విడుచుటలో మాకు ఆశ కలిగించి, వాటినన్నిటిని జయించుటకు మాకు ఆమేన్ అయియున్నావు.


చిన్న పాపముంటే రాకడలోనికి వెళ్ళలేము, మంచి మరణము పొందలేము గాన చిన్నలోపమైన లేకుండ చేయుము. ఇట్టి విషయములలో ఆమేన్ అయియుండుము. ఇక్కడ మా ప్రార్ధన నెరవేర్పు ఎప్పుడు సఫలమగునో అప్పుడు నిజముగా ఆమేన్ అయినదని సంతోషించగలము. వాగ్ధానములో నేరవేర్పు ఉన్నది.


వాగ్ధానములు జూడుడీ - దేవుని గ్రంథ...వాగ్ధానములే జరుగవలసిన కార్యముల్ - వాగ్ధానములు నమ్ముడీ.. బహుగా॥


నెరవేరకముందే నెరవేరినవని నమ్మినయెడల నెరవేరునని నీ వజ్రవాక్యమందు వ్రాసినావు. లోకములో ఉన్న గొప్ప దుష్టుడు సహితము, నేను లోకములో ఈ దుష్టత్వము మానలేను, గాని ఈ వాగ్ధానమును బట్టి మానగలనని అనుకొంటే అతడు రక్షణలోనికి రాగలడు. అన్ని వాగ్ధానములు ఈ వాగ్ధానములోనే నున్నవి. నేను ఎన్ని చేసిన నెరవేరలేదు గాని అన్ని ఒక్కసారే నెరవేరును అని చెంగు ముట్టుకున్న స్త్రీ బాగుపడినది. అట్లు ఇక్కడ నిలువబడి అనుకొన్న అన్నియు నెరవేరును. నాకు పెండ్లికుమార్తె సంఘస్థితి లేదు గాని ప్రభువు నాకు పాపముపై జయమిచ్చినారు గనుక రాకడకు సిద్ధపర్చునని అనుకొన్న నెరవేరును. విశ్వాసులు యోహాను. 14:14 ప్రకారము ఆయన నామమున ఏమి అడిగిన నెరవేరును. మార్కు 11:24ను బట్టి ఏ దుర్మార్గులను రక్షించినావో వారి నిమిత్తము స్తోత్రము. యోహాను 14:14బట్టి ఎందరి ప్రార్థనలు నెరవేరినవో అట్టివారి విషయమై వందనములు. పరలోకములో మేము అనుభవించే మహిమలో అడిగిన దానికన్న ఎక్కువ ఇస్తానన్నావు (ఎఫెస్ 3:21). ఆ ఎక్కువ మాకు తెలియదు. ఆ ఎక్కువకు నీవే ఆమేన్ అయినావు.


నిన్నుబట్టి సృష్టి వాగ్ధానము; నిన్నుబట్టి రక్షణ; నిన్ను బట్టి రేప్చర్ కలిగినది. నిన్నుబట్టి అన్ని కలిగినవి.
పాట: ఇమ్ముగ యేసుని బట్టి....నేడు నమ్మిన సర్వాంగ పుష్టి
ఆమేన్ అనగా ఇక జరుగబోయే పనులకు ఆమేన్. “ఆమేన్ అయి ఉన్న యేసు నామమున వందించి వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


రక్షణాపేక్ష పరులైన విశ్వాసులారా! రక్షణ పూర్తి చేసికొనవలెనని ఆశించుచున్నవారలారా! ఆమేన్ అయి ఉన్న తండ్రిని ధ్యానించుటకు వచ్చిన వారలారా! "ఆమేన్" అయి ఉన్న తండ్రి, తన ఆమేన్ రూపమును నేడు మనకు ప్రత్యక్షపర్చునుగాక! ఆమేన్.


ఆదికాండము మొదలు ప్రకటన వరకు ప్రతి కథ చివర ఆమేన్! ప్రకటన చివర ఆమేన్. అన్నిటిలో ఆమేన్. ఎక్కడ చూచినా ఇశ్రాయేలీయుల చరిత్రలో, ప్రకటనలో బైబిలంతా, ఆమేన్. గనుక మన పనులకు, మన ప్రార్ధనలకు, స్తుతులకు, మన తలంపులకు, మన తలంపులో లేనివానికి ఆమేన్ అని వ్రాసికొనవలెను.


ఉదా:- అయ్యగారిని భోజనమునకు ఒకరు పిలిచెను. ప్రార్థింపగా ప్రతిమాటకు ఆమేన్ అనెను. నీరు త్రాగిన ప్రతిసారీ ఆమేన్ అనవలెను. ప్రతి వాక్యమునకు ఆమేన్ అనవలసినదే. ప్రతి విలాపమునకు, ప్రతీ ఆలోచనకు "ఆమేన్" అనవలసినదే, ఆమేన్ లేకపోతే బ్రతుకులేదు.


వినండి, ఆలోచించండి, మనోనిదానము కలిగియుండండి. అందుకొనే శక్తితో కూర్చొనండి. ఏమి అందుకొనుట? స్వస్థతా? అన్నమా? బట్టా (వస్త్రము)? జీతమా? ఉద్యోగమా? ఇవి అన్ని అయిపోయినవి. ఇది వరకు ప్రార్ధనలో ఇవి అన్ని వచ్చినవి.


ప్రార్ధనలు వేరు, కనిపెట్టుట వేరు. ఏదైనా ఒక మీటింగులో ప్రార్ధనలు అయిన తరువాత జరిగేది ఏదనగా, అందరూ ఎవరి ఇంటికి వారి దారిన వారు వెళ్ళిపోవుట జరుగును. కాని ప్రార్ధన అయిన తరువాత ప్రభువు ఏమి చెపుతారో అని జవాబుకొరకు ఎదురు చూచుటే కనిపెట్టుట.


ఇంటికి వెళ్ళి ప్రార్ధన చేసినపుడెల్ల కనిపెట్టుచున్నారా? కనిపెట్టండి. ప్రొద్దుట నుండి “నాకొరకు కనిపెట్టితిరి. వచ్చితినిగదా! ప్రభువు కొరకు కనిపెట్టుట వల్ల కనబడాలా? వద్దా? రావాలా? వద్దా? కనబడవద్దా! మాటలాడవద్దా! ప్రశ్నలు వేయండి. అన్ని ప్రశ్నలు వేయలా! వద్దా! ప్రశ్నలు వేసిన తరువాత జవాబు చెప్పాలా! వద్దా?


కొందరు ధర్మగుణము కలవారు ఉన్నారు. చందా ధర్మముగా ఇచ్చేవారున్నారు. పేదలకు చందా ఇచ్చేవారు. సంఘమునకు సొమ్ము ధర్మము చేసేవారు ఉన్నారు. ఇంకొక ధర్మము చేసేవారు ఉన్నారు. అదేమిటంటే ఇక్కడ నేను చేసిన బోధలు అన్నీ నాకు ఇచ్చి వెళ్ళిపోతారు. వారికి అంత ధర్మగుణము ఉన్నది.


ధర్మాత్ములు, ఖర్మాత్ములు, పుణ్యాత్ములను నమ్మకూడదు. ఒకవేళ ట్రైనులో సామాను పోయినట్లు నా బోధ కూడ పోవచ్చును గనుక జాగ్రత్త రాకడబోధ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చెప్పుచున్నారు. రెండువేల సం॥ల నుండి చెప్పుచున్నారు. ఇంకా రాలేదు, వస్తారు. ఆయన బోధ వచ్చినది గనుక ఆయన వస్తారు. నా బోధ ఉదయము నుండి వచ్చినది, నేను వచ్చితిని. ప్రభువు వస్తానని ప్రవక్తలద్వారా అపోస్తలులద్వారా పలికించినట్లు, ఆయన వచ్చి తీర్తారు. ముందు ఆయన వాక్యము, తరువాత ఆయన వస్తారు. ఆయనకు చాలా బిరుదులు ఉన్నవి. బెబిలులో ఒక బిరుదు చెప్పండి.


జవాబు: వాక్యము.


వాక్యము: వాక్యము ఏమిటి? వాక్యమనే బిరుదుతో బెళ్లేహేములోనికి వచ్చెను. యోహాను 1:14, వాక్యము శరీరధారిగా వచ్చెను. ఇది మొదటి రాకడ వాక్యము. వాక్యము దేవుడైయుండెను. ఆయన వల్ల సమస్తము కలిగెను. ఆయన లేకుండ ఏమి కలుగలేదు. ఆ వాక్యం లేకుండ ఏమి కలుగలేదు (నాల్గింటికి "వాక్కు" అని చెప్పండి) ఆకాశమునకు భూమి ఎంతదూరమో; అక్కడున్న ఆ వాక్యము ఇప్పుడు లోకమునకు వచ్చిన తరువాత ప్రవక్తలు ఏ వాక్యము ప్రకటించిరో ఆ వాక్య పురుషుడు దిగివచ్చి వాక్యము బోధించెను. కొండపైనైతేనేమి, బేతనియలోనైతేనేమి, యెరూషలేములోనైతేనేమి, ఎఫ్రాయీము అడవిలోనైతేనేమి, గలిలయ సముద్రములో అయితేనేమి; స్మశానభూమిలో అయితేనేమి; జబ్బుపడిన వారివద్దకు, చనిపోయిన అమ్మాయి వద్దకు, గదిలో మోయబడుచున్న శవముయొద్దకు, సమాధియొద్దకు, శవము యొద్దకు వెళ్ళిన ఎక్కడకు వెళ్ళిన ఆయన వాక్యమైయున్నాడని చాల బుజువుపరచియున్నాడు. భూతములను వెళ్ళగొట్టేటప్పుడు, చిన్నపిల్లలను దీవించేటప్పుడు, పండితుల ప్రశ్నలకు జవాబులు చెప్పేటప్పుడు, కొంతమందిని మత్తయి 13లో గద్దించేటప్పుడు ఆయన వాక్యమే అయి ఉన్నాడని బుజువుపరచుకొన్నాడు. మత్తయి 18:20 ఇద్దరు ముగ్గురు ఉన్న వారియొద్దకు వస్తాను అన్నారు. లోకములోని భక్తులందరు ఆయన తలంపులో ఉన్నారు. ఆ వాక్కు వినేటప్పుడైతేనేమి ఆయన అందరికీ వాక్యమైయున్నాడు.


ముఖ్య అంశము విడిచితిని చెప్పండి ఆశీర్వాదము. అది ఇచ్చుటకు ఇప్పుడు వచ్చితిని అందుకే చిన్న ప్రసంగము చేసితిని. ఆశీర్వాదము పొందుటకు ఇష్టమున్నవారు మోకరించండి. దీవెన పొందే శిరస్సుపై చేతులు వేయుమంటే నా అలవాటులో ఏమిలేదు. ఆయన దీవించుటలోనే అంతయు ఉన్నది.


దీవెన అంటే అర్ధము ఏమిటి? అంటే మనము ఈ మూడు దినముల నుండి చేస్తున్నాము. పాడుతూ వింటూ, వ్రాసికొంటూ ఉన్న అన్ని పనులు సఫలము కావడము అదే దీవెన. ఎక్కడ అయినా అంతే. అన్ని పనులు అయిన తరువాత దీవెన. ఎందుకంటే అన్నీ నెరవేరుటకు. బైబిలులో ఒకచోట దీవించినట్లు ఉన్నది. ఆరురోజులు అయిన తరువాత దేవుడు దీవించెను. ఆది. 1:28 అది మొదటి దీవెన. చివరి దీవెన. ఆరోహణము అప్పుడు ఇచ్చిన దీవెన. ఆలాగు దీవించి దీవిస్తూ-దీవిస్తూ-దీవిస్తు సింహాసనముపై కూర్చుని నేటివరకు దీవిస్తూనే యున్నాడు. ఇవి ఎప్పుడైనా విన్నారా! ప్రతిరోజు అందుకొంటే దీవిస్తాడు.


ఆదివారము గుడిలో ఆఖరున పాదిరిగారు నిలువబడి అందరిని ఒక్కసారే దీవిస్తారు. నేను ఈ వేళ నా సొంత పద్దతి ఒకటి చేస్తాను. దీవెన సమయములో వేరే తలంపు ఉంటే దీవెన అందుకోలేరు. నేను ప్రార్ధన, దీవెన కలిపి చేస్తాను.


దీవెన ప్రార్ధన:- యేసుప్రభువా! నీవు చిన్న పిల్లలను దీవించినట్లును, కొండమీద 11మందిమీద దీవించినట్లును ఈ మీటింగులకు వచ్చిన చిన్న పిల్లలను, పెద్దవారిని దీవించుము. నీవు దీవించేటప్పుడు, పాదుర్లకు ఆర్టినేషన్ ఇచ్చే సమయమప్పుడు ఇద్దరు ముగ్గురు పాదుర్లు విద్యార్థి శిరస్సుపై చేతులు వేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి వారిపై మీ చేతులు వేయుము, దీవించుము.


ఎవ్వరిని విడిచిపెట్టవద్దు. ఆర్టినేషను దినమున అధమపక్షము ప్రతి ఒక్కరి శిరస్సుపైన చేతులువేస్తారు. ఆలాగే వీరందరిమీద నీవు చేతులువేస్తే, నా ఆత్మయొక్క చేతులు చాపి అందరిమీదకాదు ఒక్కొక్కరిమీద చేతులువేసి దీవిస్తాను గనుక వీరు దేవునిదీవెన, దేవుని సేవకుని దీవెన కూడా పొందగలరు. ఎందుకంటే భూమిమీద ఉన్నప్పుడు నీవు అన్నావు. మీరు వారిని దీవించండి; అపుడు నేనును దీవిస్తాను అని. ఒక స్థలములో నీవు అన్నప్పటికిని, “దీవించండి” అన్నావు గనుక అదె నా అధారిటీ (Authority). ఆ హక్కును బట్టి వీరిలోని ఒక్కొక్కరిమీద చేతులువేసి దీవిస్తాను గనుక నీవునూ దీవించుము.