సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

గర్భాలయము



దా॥కీర్తనలు 103:1; మత్తయి. 28:16-20; 1కొరింథి. 11:23-31.


యేసుప్రభువా! నీవు నీ సంఘమునకు భూలోకములో అనుగ్రహించిన గొప్ప విందు వర్తమానము ఇప్పుడును అనుగ్రహించుమని వేడుకొనుచు వందనములు చెప్పుచున్నాను. ఆమేన్.


లోకములో ఎవరైనా పుట్టుట ఒక్కసారే. మనమును అనేకసార్లు పుట్టము. కాని భోజనము చేయుట అనేకసార్లు. బాప్తిస్మము పుట్టుకతో సమానము. శరీర రక్తములు తీసికొనుట భోజనముతో సమానము. అన్యులు, బాప్తిస్మము ద్వారా పుట్టి, క్రైస్తవులుగా మార్చబడుచున్నారు. ముసలివాడైన నీకొదేము తల్లిగర్భములో తిరిగిపుట్టితే మనముకూడా తిరిగి బాప్తిస్మము రెండవ సారి పొందవచ్చును.


బిడ్డ పుట్టకముందు తల్లిలోని ఆహారము, రక్తము, ఊపిరి, గుణములు, ప్రాణము అందుకొంటున్నది. తల్లిలోని రక్తము, గుణము, రూపము, శరీరము అందుకొంటున్నది. తల్లికి ప్రసవము రాగనే బిడ్డను శుభ్రముచేసి పరుండబెట్టి; అచ్చట తల్లి, తండ్రి రూపముతోనే బిడ్డ ఉన్నదని చెప్పుకొందురు. ఆలాగే ప్రభువు భోజనములో రొట్టె, శరీరము, ద్రాక్షారసము, రక్తము ఈ రెండు అందుకొన్నప్పుడు ఆయన గుణాలు, పరిశుద్దత, మంచితనము, దైవత్వము అందుకొంటాము. తల్లిగర్భములోనే బిడ్డ అందుకొన్నట్లు మనమును ఇక్కడను అందుకొంటున్నాము. బిడ్డ ఎదుగునప్పుడు తల్లి అంత పొడవుగా ఎదుగుచున్నది. మనమును ప్రభువువలెనే ఎదగవలెను. శరీర రక్తములు అందుకొన్నట్లు మనకు తెలియదు. గర్భములోని బిడ్డ ఆహారము అందుకొన్నట్లు ఆలాగే రొట్టె, ద్రాక్షారసముతో ఇవి కూడా అందుకొంటున్నాము. గర్భములో అందుకొన్నట్లు బిడ్డకు తెలియకపోయినా అందుకొన్నది. తెలియడము వేరు, అందుకొనడము వేరు. అట్లే తెలియకపోయినా సంస్కార విందులో శరీరము, రొట్టె అందుకొంటున్నాము. రక్తము, ద్రాక్షారసము అందుకొంటున్నాము. బిడ్డ తల్లినే అందుకొన్నది. మనము ప్రభువునే విందులో అందుకొంటున్నాము. ఏనాడో అదృష్టము చేసికొన్నందువలన మనకు ఆయన శరీర రక్తములు దొరుకుచున్నవి. గనుక వద్దనకూడదు. ప్రభువు వడ్దించువాడు. ఇది బియ్యముతో భోజనము తయారుచేసి, వడ్డించులాంటిది కాదు. ఇది ప్రభువు అన్నీ తనలోనున్నవే తీసి తానే వడ్డించియున్నాడు. భోజనశాలనుండిగాని హోటల్ నుండిగాని తెచ్చినదికాదు. వంటగది భోజనము, ఇంటిలోని భోజనముకాదు. దేవాలయములో ప్రభువే తానే ఇచ్చే భోజనము.


పాదిరిగారు ఇచ్చేది రొట్టె, ద్రాక్షారసము కాదుగాని దానితో ప్రభువు శరీరము, రక్తము ఇస్తున్నారు. కనబడే రొట్టె, ద్రాక్షరసమును మొదటిసారిగా ప్రభువు ఇచ్చేటప్పుడు; శిష్యులకు ఇవి కనబడని తన శరీర రక్తములు అని ఉచ్చరించెను. శిష్యులేమనుకున్నారో తెలియదు. తాను వచ్చు పర్యంతము భోధకులను ఈ క్రమమునే ఆచరించుమనెను. బిడ్డ తొమ్మిది నెలలు గర్భములోనున్నపుడును, ఆ పిదప జన్మించిన తరువాతను తల్లే కావలెననును. అన్నములో పడినా, తల్లే తినిపించెను. అట్లే ప్రభువును తననే ఆహారముగా తినిపించెను. గురువారము 11మంది శిష్యులకు ప్రభువు తన్ను తినిపించెను. భోధ ఏమి చేయలేదు. అన్యులు, సంస్కారమునుగూర్చి "ఆయనను ఏలాగు తిన్నారు"? అది వట్టిమాట అని అన్నట్లయితే, మనము వారితో నీవు ఏలాగు తల్లి గర్భములో ఉండి, తల్లి రక్తము త్రాగినావని అనవలెను. “ప్రయాసపడి భారము... నాయొద్దకు రండి” విందు చేయించిన రాజుగారు అంతా సిద్ధముగా ఉన్నది సందులలో, గొందులలో ఉన్నవారలారా! రండి! అని పిలిచెను. అట్లే ప్రభువు సమస్తము సిద్ధముగా ఉన్నది. నేను మీలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాను. రండి, అని సంస్కార విందులో పిలుచు చున్నారు.


అలాగే తల్లి బిడ్డలోనికి రావడానికి సిద్ధమైననూ, బిడ్డ ఆహారము తింటున్ననూ కొన్నిమార్లు చిక్కిపోతుండును. వెంటనే వైద్యునికి చెప్పి ఏదో ఇవ్వాలి. ఆలాగే సంస్కారము పుచ్చుకొన్న మనము చిక్కకూడదుగాని మనుష్యులముగాన చిక్కిపోతాము. గనుక మరలా మరలా పుచ్చకొనవలెను. ఈ చిన్న వర్తమానము “చిన్నరొట్టె, కొంచెము ద్రాక్షారసము” వలె పుచ్చుకొని అనుభవించి బలముపొందండి.


ప్రభువు మిమ్ములను వాక్యము, శరీరము, రక్తములద్వారా దీవించి బలపరచునుగాక! ఆమేన్.