సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
శోధన, సాధన, బోధన
కీర్తన. 92:1-5; లూకా. 9:7-9; ఫిలిప్పీ. 2:14-15. ప్రసంగ పాఠము: 1సమూ. 21:10-15, దా.కీర్తనలు. 34.
శ్రమకాల విశ్వాసులారా! మనము శ్రమ కాలములో ఉన్నాము. లోక, దేశ, సంఘకాలములు చూడగా శ్రమకాలములోనే ఉన్నాము. ప్రభువు ఈ కాలములో వచ్చునని చెప్పెను. శ్రమకాలము వచ్చును, పోవును. ఆది సంఘకాలములో మధ్య యుగకాలములో శ్రమలు వచ్చినవి, పోయినవి. మన కాలములో శ్రమలు వచ్చును, పోవును.
ఈవేళ పాటములో దావీదు శ్రమకాలములో ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడైయున్నాడని తెలుసుకొనవలసినది. పోయినవారము పాఠములో ఒక ఒక చోటినుండి మరియొక చోటకు పారిపోయిన దావీదు ఈవేళ కత్తి తీసికొని పారిపోయెను. దావీదు మనస్సులో భయము, భీతియు ఉన్నది. సౌలు తన సైన్యము వచ్చుచున్నారు గనుక సౌలు అసూయ, సౌలు సైన్యమును పంపుట ఇవి దావీదు భయమునకు కారణములు. అయితే, భయపడుటకు కారణములున్నప్పుడు భయపడవచ్చునా? కీర్తన. 34:1 దేవదూతల కావలి ఉండునని ఉన్నది. భయము ఎందుకనగా
- 1.అనుమానమును బట్టి
- 2. నిజమైన కారణమునుబట్టి భయము.
దేవుని వాక్యములో ఈ రెంటిని బట్టి భయము ఉండకూడదు అని ఉన్నది. అయినను విశ్వాసులందరకు ఈ రెండు భయములున్నవి. దావీదు శ్రమ కాలములో, భయపడే కాలములో ఉన్నాడు. గనుక పారిపోవు చున్నాడు. దావీదు పారిపోయే స్థలములు కీడు ఉన్న రెండు స్థలములు. సౌలు ఉన్న రాజ్యములో ఉంటే దావీదుకు హాని. యాజకునివద్ద రొట్టెలడిగి ఊరుకూడ సౌలు రాజు చేతిలో ఉన్న పట్టణమే గనుక ఇదీ హానియే. సౌలు రాజు సరిహద్దులు దాటి శత్రువుల రాజ్యములో గాతు పట్టణమునకు పోవలెను.
ఈ రెండు హానికరములైన స్థలములలోబడి పోవలెను. గాతు పట్టణమునకు వెళ్లెను. హానికరమైన స్థలమునకు వెళ్లెను. తక్కువ హానికరమైన స్థలముదాటి, హానికరముమైన స్థలమునకు వెళ్లుచున్నాడని తలంచిన చరిత్రకారులు దావీదు పని తెలివి తక్కువ పని అని వ్రాసిరి ఇట్లు దావీదు వెళ్లుటకు కారణము భయమే.
ఈ విధమైన పరిస్థితిని దేవుడు కల్పించుటకు కారణమేమనగా, దావీదు
- 1. మంచిలోనికి వచ్చుటకు, కీడు విడుచుటకు
- 2. మంచివాడైనను, క్రీస్తు సజ్జనత్వములోనికి వచ్చుటకు.
శ్రమలు విశ్వాసులకు వచ్చును. ప్రభువు ప్రార్ధనలోని ఆరవ మనవి. "మమ్ములను శోధనలోనికి నడిపించవద్దు" అని ఇంగ్లీషులో ఉండగా, "శోధనలోనికి తేకుము" అని తెలుగులో ఉన్నది.
శోధన ఉన్నది. దేవుడు శోధనలోనికి నడిపింపకూడదు గాని విశ్వాసులను శోధన వద్దకు నడిపించును. దాని అర్ధము శోధన వద్దకు నడిపించును. మరిఒకటి శోధనలోనికి నడిపిస్తాడు. గనుక శోధనలోకి తేకుమని ప్రార్థించుమనెను. శోధన ఎటువంటిదో తెలియవలెను.
- 1) శోధన కనబడకపోతే తెలియదు.
- 2) శోధన జయించే పద్ధతి రాదు.
- 3) జయించే పద్ధతి రాకపోతే క్రైస్తవ అనుభవము ఎట్లు వచ్చును. దేవుడు శోధన వద్దకు నడిపించును. ఎప్పుడనగా మనుష్యుడు దుర్మార్గత విడువక, దేవునిమాట విననప్పుడు దేవుడు శోధనలోకి నడిపించును.
సైతాను శోధించే పని ఇది భయంకరమైన పని. దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుడు ఊరుకుంటాడు, ఊరుకుంటాడు తుదకు శోధనకు విడిచిపెట్టును. గొర్రె వెళ్లుచున్నది. అదలించినా మాట వినకపోయెను గనుక కాపరి విడిచెను. గొర్రె గుంటలో పడెను ఇదే దేవుడు శోధనలోనికి నడిపించుట అని అర్ధము.
దావీదును నడువనిచ్చెను. ఇది దేవుని ఉద్దేశముకాదు, దావీదు ఉద్దేశము. సౌలు పట్టణము నుండి శత్రువుల పట్టణమునకు వెళ్లుట; ఇట్లు నడువనిచ్చుట దేవునికి ఇష్టముకాదు. భయము విడిచిపెట్టి అడవిలోగాని, ఇంకా ఎక్కడికి వెళ్లినా దేవునికే ఇష్టము ఇది దేవుని మార్గము. అయితే దావీదు ఉద్దేశము మంచిదికాదు, దావీదు గాతుకు వెళ్లినాడు. గాతు గొల్యాతు పట్టణము. అక్కడ శత్రువులు చంపుదురుగాన వెళ్లకూడదు. సౌలు శత్రుత్వము నన్ను వెంటాడుచున్నది గాని గాతువారి శత్రుత్వము చల్లారినదని ఉద్దేశపడెను.
దేవుడు సౌలు పట్టణము, గాతు పట్టణము వెళ్లనిచ్చెను. అయినను దావీదును దేవుడు చూస్తు, కాపాడి శోధనలోనికి వెళ్లనివ్వక కాపాడెను. ఆకీషురాజు దావీదు ఆ దేశపు రాజుకాడా! స్త్రీలు పాటలు పాడిన దావీదు ఇతనుకాడా? ఈ దావీదును బంగ్లాలోనికి రానిచ్చినారనగా దావీదునకు భయము కలిగినది. వెర్రివానివలె నటించెను.
- 1) భయము
- 2) తన ఇష్టము వచ్చినట్లు వెళ్ళుట
- 3) శత్రువుల యొద్దకు వెళ్లు
- 4) వెర్రివానివలె నటించుట.
ఇవన్నీ బలహీన మానవుని మార్గములు. కానీ దేవుని అడిగి వెళ్లవలసినది గానీ దేవునిని అడిగి వెళ్ళనందున గందరగోళములో పడెను (ఎందుకంటే దేవుడు కనబడి, నీవు భయపడనక్కరలేదు అని అనలేదు గనుక ఇంకా గందరగోళము). మనిషిని దేవుడు తన ఇష్టానుసారముగా పోనిస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు సహాయము చేస్తాడు. అప్పటివరకు దేవుడు ఊరుకుంటాడు. భయము పోయేవరకు ఊరుకుంటాడు.
గాతు పట్టణములో తాను పన్నిన మాయోపాయముల వల్ల, తప్పించుకున్నాడని కనబడుచున్నది గానీ దావీదు అభిపిక్తుడు గనుక దేవుడు కాపాడి తప్పించెను. అపాయము తప్పించుకొనుట దావీదు పని (అభిషిక్తుడు గనుక) దావీదు తప్పించుకొనవలెనని ప్రయత్నించిననూ, దేవుని సహాయము ఉండుట వలన శోధనలోనికి వెళ్లినను తప్పించుకొన్నాడు. ఒకవేళ దావీదు తప్పించుకున్నను తప్పక దేవుని సహాయము తప్పించును. దావీదు తప్పించుకొనుటకు ప్రయత్నించుట మంచిదేగాని దేవుని మార్గము విడిచెను. దా.కీర్తన. 34వ అధ్యా. దావీదులో దేవునియెడల భక్తి తాత్పర్యములున్నవి గాని బలహీనతనుబట్టి పారిపోయెను.
దావీదుచేతిలో గొల్యాతు కత్తి ఉన్నది. అది తీసికొని గాతువారు చంపవలసినది. గానీ దేవుడు కాపాడినాడు దేవుడు కాపాడినాడు గనుక కాపాడబడ్డాడు. కానీ తన కాపుదల వలనకాదు, వెర్రితనము వలె నటించుటవలనకాదు. రాజువద్దకు కత్తిచేత పట్టుకొని వెళ్లుట ఇది వెర్రితనము. దావీదును రాజు, ఈసికొని వెళ్లమనగా వెళ్ళిపోయెను. విశ్వాసులు దావీదువలె భయపడి పారిపోవుచున్నారు, దావీదువలె సొంత పద్ధతిని నడుచుచున్నారు.
- 1) స్వంత భయము,
- 2) స్వంత మార్గము,
- 3) స్వంత పద్ధతి;
ఇవి మంచివికావు. విశ్వాసులకు దేవుడు సహాయము చేసిన ఆ పద్ధతి మంచిది. గనుక దేవుడే వారిని తప్పించినాడని అనుకొందురు. దావీదు తప్పు పద్ధతి ప్రకారము నడిచినందున (వెర్రి వేషము) దేవుడు తప్పించలేదు గాని దేవుని కృప, నడిపింపునుబట్టి తప్పించెను. శోధనలు వచ్చును గనుక తప్పు పద్ధతి ఉపయోగపరచవద్దు. దేవుడు నీకు సహాయము చేసినాడంటే నీ స్వంత పద్ధతినిబట్టికాదు; కృపనుబట్టి; గనుక, ఏ కార్యమైనా, నీ పద్ధతి ప్రకారము ఊహించి జరుపుకొనుట మంచిదికాదు.
- 1. దేవుని చిత్తము,
- 2. దేవుని మార్గము,
- 3. దేవుని పద్ధతి ఇట్లు నడిపించును.
దేవుడు తన చిత్త, మార్గ, పద్ధతి ప్రకారము నడిపించునని మనము అవి చదువుకొని నేర్చుకొనుటకు వ్రాయించెను. దావీదును తన స్వంత చిత్తము మార్గము పద్ధతి ప్రకారము నడువనిచ్చి కాపాడెను.
ప్రభువు 40 దినములు శోధింపబడినప్పుడు సాతాను ఒక వాక్యవెత్తెను. "నీవు దుమికిన దూతలు నిన్ను ఎత్తిపట్టుకొందురు" అను వాక్యము ఎత్తుకొనెను దా.కీర్తన. 90:11-12. ఇక్కడ అర్ధము ఏమనగా
- 1. దావీదు స్వంత మార్గము
- 2. దేవుని ఏర్పాటు మార్గము.
మనిషి తాను నడిచే మార్గము విడిచి, దేవుని మార్గము వెంబడించవలెను. దేవుడు వేసిన మార్గము మనుష్యుడు నడిచెను. మనుషుల స్వంత మార్గములలోకాక, దేవుని మార్గములలో నడిచిన అపాయములు వచ్చినప్పుడు దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకొందురు.
మత్త. 4వ అధ్యాయములో సైతాను ఈమాట ఎత్తినప్పుడు దేవుని మార్గము విడచిపెట్టుటకు చూపించెను. సగము విడచిపెట్టుటకు ప్రయత్నించెను. దేవుని మార్గములో మనిషి నడిచినప్పుడు దేవుడు తప్పించునని ఉన్నది. ఇది దాచి, అపవాది దుముకుము అన్నది. అది సైతాను మార్గము. ఇది మనిషి మార్గముకూడాను. సైతాను మార్గమేనని అనుకొనే మనిషి మార్గము. దేవుని మార్గములో నడిచేవారిని పడినా దేవుడు పట్టుకొనును. కాలికి రాయి తగులకుండ ఎత్తి పట్టుకొనును. సైతాను మాయబోధ చేసెను. ప్రభువు దానిని గుర్తించెను. దేవుడు దావీదును కాపాడకూడదు. కారణము తన స్వంత మార్గము ఉపయోగించెను. అయినను కృపనుబట్టి కాపాడెను.
ఆలాగుననే సువార్తికులు దేవుని చిత్త ప్రకారము ప్రార్థించి వెళ్లినపుడు, అపాయము వచ్చినా కాపాడును. వారి స్వంత మార్గము ప్రకారము నడచినా నడువనిచ్చును. అపుడు పడినా, ఊరుకొనును. అడ్డము పెట్టడు. ప్రార్థించినా తప్పించును. దేవుని మార్గమెక్కినాడు గనుక సౌలు గ్రామములో ఉండుట నష్టమా? గాతులో ఉండుట నష్టమా? గాతులోనే నష్టము. ఇది పులి నోట తప్పించుకొన్న మనిషి ఎలుగుబంటి నోటిలో పడినట్లున్నది. పులిని జడిపించినప్పుడు అది పారిపోవును గాని ఎలుగుబంటి తొలగదు. అయితే, దావీదును దేవుడే తప్పించెను. ఆయన కృపను బట్టి తప్పించెను. అయితే, స్వంత మార్గములో ఉన్న తప్పించడు.
మనము వెళ్లేటప్పుడు కాలి దారి ఉన్నది. ముందుకు వెళ్లగా మూడు దారులు ఉన్నవి.
- 1) ఊరు దారి
- 2) అడవిదారి
- 3) పొలముదారి.
గనుక ఆగి ఎవరినైన అడుగవలెను. అట్లే మనము దేవుని అడిగి, దేవుని మార్గము ప్రకారము నడువవలెను. సౌలువద్దనే అపాయము గాతు పట్టణములో అపాయములేదు అని దావీదు తలంచెను. దావీదు పారిపోయి వచ్చినాడు గనుక సౌలును చంపినయెడల ఇశ్రాయేలు రాజ్యము తమకు వచ్చును అని ఆ కీషు సైన్యమనియుందురు. నీవు అప్పుడు శత్రుత్వమును బట్టి గొల్యాతును చంపినావు. నీవు ఇప్పుడు సౌలును, మాతో కలిసి చంపినా మనకు స్నేహము ఉండునని అనియుందురు.
ఉదా:- బంతి ఆడువారు బంతిని కొట్టుకుంటూ మరియొక స్థలమునకు వెళ్ళెను. వారితోకూడ అవతలి జట్టులోని బంతిని కొట్టువారుకూడ వెళ్లిరి, అట్లే దేవుడు దావీదును నడిపించెను. దావీదు వెళ్లుట నిజమే, ప్రభువు నడిపించుట నిజమే. దేవుడు తన శత్రువులయొద్దకు నడిపించినా ఇది మరీ గొప్పది. శత్రువుల వద్దకు రాకుండా కాపాడుటకంటె. దగ్గరకు రానిచ్చి తప్పించుట మరి గొప్ప పని. దావీదును శత్రువులయొద్దకు వెళ్లనిచ్చి కాపాడెను. ఇదిగొప్ప పని.
మత్త. 4వ అధ్యాయములో ప్రభువు ఆత్మవలన, అపవాదిచేత శోధింపబడుటకు వెళ్లెను. ఇది దైవమార్గము. ఈ అధ్యాయములో మనిషి, విశ్వాసి ఎవరనగా, ప్రభువే. ప్రభువు శోధనవద్దకు వెళ్లెను. శోధింపబడగా ప్రభువు జయించెను. ఆలాగే ప్రభువు శోధనలయొద్దకు మనలను నడిపించి, తప్పించి జయమిచ్చును. మరికొన్నిసార్లు శోధనలోనికి పోనీయడు దావీదు గాతు వెళ్లుటవలన గాతువారికి రెండు సంగతులు జ్ఞాపకము తెచ్చెను.
- 1) గాతు వారి అపజయము (గొల్యాతును చంపినందున),
- 2) దావీదు జయము కనబడినది.
నా అభిషిక్తునివల్ల మీరు అపజయము పొందినారు. నా అభిషిక్తుడే జయించెను. ఇట్లు అపవాదికి దేవుడు తెలియజేయును. ఇవన్ని ఇదివరకు జయించెను. ఇప్పుడు నీవద్దకే నడిపించుచున్నాను. అది నీకు జయముకాదు, నా బిడ్డలకే జయమని తెలియజేయుటకు దేవుడు శత్రువుల వద్దకు నడిపించును.
ప్రభువు ఈ కొద్ది మాటలు మీ మనస్సులలో ముద్రించి, మీకు సహాయము చేయునుగాక! ఆమేన్.