సందేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
రక్షణాహ్వాన పాఠము-1
బైబిలులోని 4 చిన్న గ్రంథములు: మత్తయి, మార్కు లూకా, యోహాను. ఈ 4 చిన్న పుస్తకములకు కొన్ని భాగములు గలవు. ప్రభువుయొక్క జన్మ, ఉద్యోగ, మరణ, పునరుత్థాన భాగములు గలవు.
యేసుప్రభువుయొక్క ఉద్యోగ ధర్మము. యేసుప్రభువు యొక్క ఉద్యోగము నాకంటికి ఏరీతిగా కనబడుచున్నదో, అది చెప్పెదను. మనము కూర్చున్న పర్ణశాలకు ఎదురుగానున్న రాజవీధిలో యేసుప్రభువు ఉద్యోగ వస్త్రములు ధరించుకొని నిలువబడియున్నారు. మరియు ఆయనే మన పర్ణశాల ద్వారముయొద్ద నిలువబడియున్నారు. పర్ణశాల ముఖద్వారమున ఆయన కూర్చునియున్నారు. పర్ణశాల వెనుకకూడా ఆయన కూర్చునియున్నారు. ఆకాశము, నక్షత్రములలోకము దాటిచూస్తే మహిమలోకములో సింహాసనముమీద కూర్చునియున్నారు.
- 1. రాజవీధిలో,
- 2. ద్వారముదగ్గర,
- 3. పర్ణశాల లోపల,
- 4. పర్ణశాల వెనుక,
- 5. మహిమ లోకములో. ఆ ఐదు స్థలములలో ఆయన ఉద్యోగ ధర్మము జరిగించుచున్నారు.
రాజవీధిలో ఒక వాక్యమున్నది. ఆహ్వానవాక్యము:
- 1. “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా! నాయొద్దకు రండి. మత్తయి 11:28.
- 2. ద్వారముదగ్గర ఒక వాక్యమున్నది - “నాయొద్దకు వచ్చువానిని నేను ఎంతమాత్రమును బయటికి త్రోసివేయను”. యోహాను 6:37.
- 3. పర్ణశాల లోపట- "నాయొద్ద నేర్చుకొనుడి". మత్తయి 11:29.
- 4 పర్ణశాల వెనుక- "నా కాడి ఎత్తుకొనుడి". మత్తయి 11:29.
- 5. మహిమ లోకములో - "నేను మీయందున్నాను. మీరు నాయందు ఉండుడి". యోహాను 14:20.
1) ఆయన రాజవీధిలో పిలుచువాక్యము కొందరికి వినబడవచ్చును. కొందరికి వినబడకపోవచ్చును. కొందరికి త్వరగా వినిపించును. అయిననూ, కొందరికి ఆలస్యముగా వినిపించును. ఆయన పిలుస్తూ ఉన్న సంగతి అందరికి వినబడవలెనని, ఆయన పిలుచుచునే ఉన్నాడు. ఎవరైనా వెనుకనుండి పిలిస్తే వెనుకకు చూడక మానరు. అట్లే ఆయన పిలుపు విన్నవారు ఆయనవైపు చూడకమానరు. ఆయన పిలుపు అంగీకరించక మానరు. సమస్తమైన వారంటే కొందరికి కాదు. అందరికినీ. అన్ని రాష్టముల వారికొరకును. రాజమండ్రి పట్టణములోనేకాదు, ఒక్క ఇండియా దేశమునేకాదు, గుడిసెలలో, నగరములో, ఇండ్లలో అందరిని పిలుస్తున్నారు. ఏ ప్రకారముగా పిలుస్తున్నారు? అందరికి వినబడేటట్లు. కొందరికి ఆలస్యముగా, మరికొందరికి మరీఆలస్యముగా వినబడుచున్ననూ, అందరికి వినబడేటట్లుగానే పిలుస్తున్నారు. కొందరికే వినబడవలెనని ఆయన పిలువలేదు. అందరికి వినబడవలెనని ఆయన పిలుస్తున్నారు. పిలుపు ప్రకారము చేసిననూ, చేయకపోయిననూ, పిలుస్తున్నారు.
ఆయన పిలువక మానరు; ప్రజలు చూడకమానరు, ఆయన మాట ప్రకారము చేయకమానరు.
జన సమూహముల ఎదుట నిలువబడి పిలిచినప్పుడు ఆయన ఎవరిని పిలుస్తున్నారు అనగా సమస్తమైన వారలారా! సమస్తము అంటే కొందరుకాదు, ఒక తెగ కాదు, దేశముకాదు, జనాంగముకాదు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరు అని అర్ధము. ఏ మాత్రమును ఇష్టములేనివారినికూడ అని అర్ధము. ఏ దేశముగాని, గ్రామాదులుగాని "ఆయన మమ్మును పిలువలేదు" అని పిర్యాదు చేయవీలుకాదు. ఈ పిలుపుయొక్క పరిమితి ఎంత గొప్పదో చూడండి. 5 ఖండములను పిలిస్తే మహావిశాలమైన పరిమితిగల ఆహ్వానము! భూగోళమును చుట్టివేసికొని వస్తే ఇంకా ఎంత గొప్పదో! అంత గొప్ప పరిమితిగల ఆహ్వానమును అందరు వినవలెను. అందరు అంగీకరించవలసినదే. ప్రయాసపడి భారము మోసికొనువారు మాత్రమే గాదు, సమస్తమైన వారలారా! అని పిలుస్తూ ఉన్నారు. మాకెందుకు అని అనవలసిన ఆహ్వానముకాదు. అంగీకరించవలసినది. శాంతివర్తమానము, చేరదీసే వర్తమానము. ఆయన స్వరూపము ఏవిధముగా ఉన్నది! రెండు చేతులు చాచి "నాయొద్దకు రండి" అని పిలుస్తూ ఉన్న గాయములు కనబడుచున్నవి. రెండుచేతులు విశాలముగాచాపి, పిలుస్తూ ఉన్నారు. భూగోళముయొక్క ఒకప్రక్కన ఒకచేయి, రెండవ ప్రక్కన మరొకచేయి చాపి పిలుస్తుఉన్నారు. ఎంతమంది వచ్చినా సరే చేర్చుకొనగలిగిన విశాల బాహుబలమునుబట్టి పిలుస్తూ ఉన్నారు. ఎటువంటివారిని పిలుస్తు ఉన్నారు? "ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నాయొద్దకు రండి" అని భారభరితులైన అందరినీ పిలుస్తున్నారు.
ప్రయాసపడి భారమును మోయుట అంటే ఏమి?
దృష్టాంతరము: భారమును భరించే ప్రభువు నాకు అక్కరలేదయ్యా! నేను
మోసికొంటాను అనువారు లేరు. తెలియనప్పుడు అంటారుగాని తెలిసినప్పుడు ఆలాగు చేయరు. అన్ని భారములు దించివేయుట అను మాటలో
విశేషములు రెండు కలవు. ఎక్కువ బరువైనది ఏది? రాయి, ఉక్కు కొండ. కొండకంటే బరువైనది నక్షత్రాలు. పాపము ఇంకా బరువైనది.
పాపము
అన్నిటికంటే బరువైనది. అన్ని దుష్టశక్తులకంటె బరువైనది పాపము. ఈ భారము ఎవరు దించగలరు? సృష్టికర్త మాత్రమే దీనిని
దించివేయగలరు. ఇది ప్రకటన వాక్యము. శుభవర్తమాన వాక్యము, భూగోళవాక్యము, యేసుక్రీస్తువాక్యము. ఇది చల్లని పఠనము. మానవులకు
ఆదరణకరమైనది. గనుక అందరు అంతరంగముగా ఆయనయొద్దకు రావలెను.
కొందరికి శరీరములో
- 1. బాధ ఉన్నది.
- 2. మనోవేదన,
చింతాక్రాంతులైనవారు ఇక్కడ లేరనుకున్నారా? పైకి చెప్పకపోయినా ఇక్కడ మనోవేదన గలవారున్నారు. గనుక వారు ప్రభువా!
- 1) నా ప్రియుడవు నీవే,
- 2) నా రక్షకుడవు నీవే, అని ప్రభువు యొద్దకు రావెలను.
శరీర వ్యాధులనుబట్టి, కష్టములనుబట్టి ఇన్నాళ్లనుండి పోరాడుచున్నాను. ఈ పాపమును విసర్జించలేకపోవుచున్నాననే చింతగలవారు; చిక్కులను విడగొట్టలేకపోవుచున్నాను; వ్యాధులను పోగొట్టుకొనలేక పోవుచున్నాననే వారికి ఈ భారమునకు ఫలాని స్థలమునకు వెళ్లండి అని చెప్పలేదుగాని "నాయొద్దకు రండి" అని చెప్పినారు. దగ్గరకు వచ్చి పిలుస్తూన్నారు. ఎక్కడ పనిపాటులు చేసుకుంటున్నారో, అక్కడకు వెళ్ళి, రండని పిలుస్తూ ఉన్నారు. గనుక ఎంత గొప్ప దయగల తండ్రి! కొందరి దగ్గరికి వెళ్లలేమండి అంటారు. గనుక ద్వందార్థములుగల మాటలు చెప్పలేదు. స్పష్టముగానే చెప్పెను.
విచిత్రమైన సంగతి: ప్రయాసపడి భారము మోయుచున్న సమన్తమైన వారలారా! ఇంకొక చిన్నమాట - నాయొద్ద ఉంటే మీకు బాగుండునని వినువారికి చెప్పుచున్నారు. అందులో, వినండి అనేదిలేదు. ఎందుకంటే, ఆయన వినేటట్టు చెప్పితే వినకపోవడము లేనేలేదు. గనుక నాయొద్దకు రండి అని చెప్పినాడు. ప్రయాసపడి అనేమాటలో ఈ సంగతి ఉన్నది సమస్తమైన వారలారా నాయొద్దకు రండి అనే హౌస్ అడ్రస్ (విలాసము) యొద్దకే రావలెను. “రండిలో అన్నీ ఉన్నవి. ప్రయాసపడి, సమస్తమైన వారలారా!, నాయొద్దకురండి, వినండి, చివరకు ఆయన న్యాయ సింహాసనములో కూర్చున్నప్పుడు, వినలేదని ఎవరైనా చెప్పితే వారికి జవాబు బుజువులతో చెప్పును. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే వినలేదా? అని అడుగును. అపుడు ఎవరును వినలేదని చెప్పలేరు. “ఇంతటి అన్యాయ బుద్ధి ఉంటే ఎట్లా రక్షింపబడగలను” అని ఎవరు నిరాశపడనక్కరలేదు. ఆయన పిలుపులోనే ఆ రక్షించే నైజమున్నది. ఎవరు చిక్కులలో ఉందురో వారికి వినబడును. చెవిటివారికి వినబడును. చెవిగలవారు "వినను" అని చెవులలో వ్రేలు పెట్టికొనేవారికి సహితము వినబడును. ఈ పిలుపుయొక్క ఫలితము ఒక్కటే “రావడము”. ఇంకా ఫలితము రావడము కారణము, లేదు. అందరు రావడములేదు. కొంతమంది మాత్రమే వస్తే సమస్తమైన వారలారా అను పిలుపుయొక్క ఫలితముయొక్క ఫలితము నెరవేరదు. "రాలేమండి" అంటే పొరపాటు వారిదే.
యేసుప్రభువు రాజవీధిలో ఏ రాజవీధిలో గుంటూరుయొక్క రాజవీధిలో ప్రపంచముయొక్క రాజవీధిలో - అందరినీ అనగా ప్రయాసపడి భారము మోసికొనుచున్న వారినందరినీ. నాయొద్దకు రండి! రండి! రండి! అని పిలుస్తున్నారు గానీ భారము మోసికొనుచున్న మానవులలో విచారము, బిడియము, రెండు ఉన్నవి.
గనుక వారు దేవుని ముఖము చూడలేరు గాని వృక్షముఖము చూడగలరు. వృక్షమా వారిని దాచేది? ప్రభువా! ఇద్దరిని కలుగజేసిన ఆయన రెండు చేతులు చాపి బిడియ పడేవారిని, విచారపడేవారిని రక్షించడానికి ఎక్కడా? అని పిలుస్తున్నారు. రాజవీధిలో, సువార్త కూటములలో ఆయన నిలిచి పిలుస్తున్నారు. "సమస్తమైన వారలారా" అంటే ప్రభువు కాలములోనివారు, నవీన కాలములోనివారును, సమస్తమైనవారును అని అర్ధము. ఇంకొక పర్యాయము ఆయన రెండు చేతులు చాపియున్నారు. ఎందుకనగా, విచారములో, పాపములో, చిక్కులలో మరలా చిక్కుకొనకండి. ఇంకొక చిన్న సంగతి. ఒక కుంటివానిని చూచి "నాయొద్దకు రా" అని పిలిచినారు. ఎంత సబబుగా ఉన్నది? కుంటివారు రాగలరా? హేళనగా ఉన్నది. గానీ కుంటుతూ వచ్చేవారికి ఆయన పిలుపు నత్తువ కలిగించు శక్తియై ఉన్నది. నీ పరుపెత్తుకొని నడువమన్నారు. అతడు నడువలేననన్నాడా? నడిచాడా? లేదా? ఆయన మాటలోనుండి శక్తి వచ్చినది. గనుక నడిచినాడు. పిలుపుతోపాటు ఆయన శక్తి పంపుతారు. భూదిగంతముల వరకు ఆయన శక్తి వెళ్లుచున్నది. శక్తి సప్లయి చేస్తారు. అన్నిటిలోను యేసుప్రభువు తీసికొని రాగలరు. పొదలో చిక్కుకొన్న పొట్టేలును విడిపించిన ప్రకారము ప్రభువు వచ్చి వాటిని తీసివేయగలరు. చిక్కులలో ఉన్నవారిని విడిపించువారైయున్నారు. ఈ శుభ వర్తమానము వల్ల అందరికి మేలు కలుగునుగాక! ఆమేన్.